‘‘ఏం సర్కారమ్మా ఇది..! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ‘‘ఏం సర్కారమ్మా ఇది..!

‘‘ఏం సర్కారమ్మా ఇది..!

Written By news on Sunday, May 19, 2013 | 5/19/2013

* పాలించేవాని హస్తవాసే బాగోలేదు: షర్మిల వద్ద మామిడి రైతు ఆవేదన
* మంగు తెగులు సోకి నష్టాల పాలవుతున్నా సాయం లేదు
* వైఎస్ ఉన్నప్పుడు ఎకరాకు రూ. 10 వేల నష్టపరిహారమిచ్చారు
* తెగులు సోకిన కాయకు రేటు రావట్లేదు.. అప్పులెలా తీర్చాలో!
* రైతుల రక్తం పిండుకొని తాగే ప్రభుత్వమిది: షర్మిల
* ధైర్యం కోల్పోవద్దు.. త్వరలోనే రాజన్న రాజ్యం వస్తుంది
* అవకాశం వచ్చినప్పుడు ఈ కాంగ్రెస్, టీడీపీలకు గట్టిగా బుద్ధి చెప్పండి

‘‘ఏం సర్కారమ్మా ఇది..! రాజు మంచోడైతే రాజ్యం బాగుండేది. పాలించేవాని హస్తవాసే మంచిది కాదమ్మా.. మాయకాలం కాకపోతే కురవాల్సిన సమయంలో చుక్క చినుకు రాలలేదమ్మా... తీరా మామిడి కాయ పిందెపట్టిన తరువాత ఫిబ్రవరిలో వర్షం కురిసింది. మామిడి కాయలకు మంగు తెగులు సోకింది. వైఎస్సార్ ఉన్నప్పుడు మంగు రాకుండా సబ్సిడీ మీద మందులు ఇచ్చారమ్మా... బాగా నష్టపోయిన రైతుకు ఎకరాకు రూ.10 వేల చొప్పున నష్ట పరిహారం కూడా ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఏ సాయం లేదమ్మా.

ఈ మంగు సోకిన కాయను కోసుకొని మార్కెట్‌కు పోతే టన్నుకు రూ.2,000 రూ.3,000 మించి ధర పడటం లేదమ్మా. ఈ డబ్బు తెచ్చి అప్పు ఎలా కట్టాలమ్మా’’ అని పశ్చిమ గోదావరి జిల్లా రాళ్లకుంటకు చెందిన మామిడి రైతు వెంకట్రావు.. షర్మిల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. అంతకు ముందు దొండకాయ రైతు సింధనీడి రంగారావు మాట్లాడుతూ.. ‘‘సాగు చేసి అప్పుల పాలయ్యాను, ప్రభుత్వం మా మొఖం కూడా చూడటం లేదమ్మా’’ అని గోడు చెప్పుకొన్నారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. ‘‘ఇది రాబందుల రాజ్యం.. రైతుల రక్తం పిండుకొని తాగే ప్రభుత్వం. వీళ్లకు మానవత్వం లేదు.. రైతులు కష్టాల్లో ఉంటే కనీసం పలకరించడానికి కూడా మనుసు లేని ఈ నాయకులు అసలు మనుషులేనా? అమ్మా...! అయ్యా..! గుండె ధైర్యం కోల్పోవద్దు.

కొద్దిగా ఓపిక పట్టండి. త్వరలోనే జగనన్న నాయకత్వంలో మళ్లీ రాజన్న రాజ్యం వస్తుంది’’ అని రైతులకు, పేదలకు భరోసా ఇచ్చారు. ‘‘అవకాశం వచ్చినప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, దానికి అండగా నిలబడిన టీడీపీకి గట్టిగా బుద్ధి చెప్పండి’’ అని ఆమె పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానితో కుమ్మక్కైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తరఫున సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర శనివారం పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలోని పల్లెల మీదుగా సాగింది. మార్గమధ్యంలో రైతులు, మహిళలు, విద్యార్థులు, కూలీలతో షర్మిల మాట్లాడారు.

ఇది చంద్రబాబు పాలన రెండో భాగం
యాత్రలో పలు సందర్భాల్లో షర్మిల మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు నాయుడు తొమ్మిదేళ్ల పాలనలో రైతులను పురుగులను చూసినట్లు చూశారు. వ్యవసాయం దండగన్నారు. ప్రాజెక్టులు కడితే నష్టం వస్తుందని పిచ్చి లెక్కలు వేసి చెప్పారు.. రూ. వేలకు వేలు కరెంటు బిల్లులు వేసి రైతులను, పల్లెలను పీల్చి పిప్పిచేశారు.. ఇప్పుడు ఈ కిరణ్‌కుమార్‌రెడ్డి పాలన కూడా చంద్రబాబు పాలన మాదిరిగానే సాగుతోంది. ఇది చంద్రబాబు పాలన రెండో భాగం.

ఈ ప్రభుత్వం మీద ప్రతిపక్షాలు పెట్టిన అవిశ్వాసానికి చంద్రబాబు నాయుడు మద్దతు ఇచ్చి ఉంటే ప్రభుత్వం కూలిపోయి, ప్రజల మీద కరెంటు భారం పడకుండా ఉండేది. కానీ అలా చేయలేదు. ప్రభుత్వానికి రక్షణగా నిలబడి కాపాడారు. కరెంటు భారం ప్రజలపై మోపిన పాపంలో కిరణ్‌కుమార్‌రెడ్డితో పాటు చంద్రబాబుకు కూడా భాగం ఉంది. అమ్మా... అక్కా... సమయం వచ్చినప్పుడు ఈ కాంగ్రెస్, టీడీపీలకు గట్టిగా బుద్ధిచెప్పి జగనన్నను ఆశీర్వదించిన రోజున మళ్లీ రాజన్న రాజ్యం వస్తుంది. రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తరువాత వైఎస్సార్ ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకాలన్నీ జగనన్న కొనసాగిస్తారు’’ అని అన్నారు.

శ్రీనివాసుడిని దర్శించుకున్న షర్మిల
చిన్న తిరుపతిగా ప్రసిద్ధికెక్కిన ద్వారకాతిరుమలలో షర్మిల శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. తొలిమెట్టు వద్ద వేంకటేశ్వరస్వామికి దండం పెట్టుకొని 42 మెట్లెక్కి దక్షిణ గోపురం ద్వారా షర్మిల సామాన్య భక్తురాలిగానే ఆలయంలోకి ప్రవేశించారు. అప్పటికే పాదయాత్ర సమన్వయకర్త తలశిల రఘురాం శీఘ్రదర్శనం టిక్కెట్లు కొని సిద్ధంగా ఉంచారు. శీఘ్రదర్శనం క్యూలో కూడా జనం ఉండటంతో ఆమె కూడా సాధారణ భక్తురాలిగానే క్యూలో నుంచి ఆలయ గర్భగుడిలోకి వెళ్లారు. వేదపండితులు గోత్రనామాలతో అర్చన చేశారు. ఆలయ ప్రాశస్తిని షర్మిలకు వివరించారు. తీర్థప్రసాదాలను స్వీకరించిన ఆమె ఉత్తర గోపురం ద్వారా ఆలయం నుంచి బయటికి వచ్చారు.

12.2 కిలోమీటర్ల మేర నడక..
షర్మిల పాదయాత్ర 152వ రోజు శనివారం పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలోని ద్వారకా తిరుమల నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి రాళ్లకుంట, అయ్యవరం గ్రామాల మీదుగా నడచుకుంటూ షర్మిల కొత్తగూడెం చేరుకొని వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇక్కడ ప్రజలను ఉద్దేశించి కొద్దిసేపు మాట్లాడారు. ఇదే గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8.10 గంటలకు చేరుకున్నారు. శనివారం మొత్తం 12.2 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు మొత్తం 2,026.1 కిలోమీటర్ల యాత్ర పూర్తయింది.

పాదయాత్రలో పాల్గొన్న నేతల్లో జిల్లా పార్టీ కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, ఎమ్మెల్యేలు తానేటి వనిత, ఆళ్ల నాని, జోగి రమేశ్, ఎమ్మెల్సీలు మేకా శేషుబాబు, బొడ్డు భాస్కర రామారావు, నేతలు కాపు భారతి, వైఎస్ కొండారెడ్డి, డాక్టర్ హరికృష్ణ, బొడ్డు వెంకట రమణ చౌదరి, మొవ్వ ఆనంద శ్రీనివాసు, స్థానిక నాయకులు తలారి వెంకట్రావు, డి.సువర్ణరాజు, పాశం రామకృష్ణ తదితరులు ఉన్నారు.
Share this article :

0 comments: