రాబోయే సువర్ణ యుగంలో ఈ భూతాన్ని తరిమేస్తాం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాబోయే సువర్ణ యుగంలో ఈ భూతాన్ని తరిమేస్తాం

రాబోయే సువర్ణ యుగంలో ఈ భూతాన్ని తరిమేస్తాం

Written By ysrcongress on Tuesday, January 24, 2012 | 1/24/2012

* మైలవరం తాండాల్లో కల్తీసారా తాగి 20 మంది మరణించారు
* గుంటూరు ఓదార్పులో వైఎస్ జగన్ ఉద్ఘాటన
ఓదార్పు యాత్ర నుంచి న్యూస్‌లైన్ ప్రత్యేక ప్రతినిధి: ‘‘పచ్చని పల్లెల్లో సారా, బ్రాందీ భూతం చిచ్చు పెడుతోంది. మన పిల్లలను బ్రాందీ దుకాణాలకు దూరంగా పెడదాం.. వారిని బడికి పంపి బంగారు భవిష్యత్తు ఇద్దాం..’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. రాబోయే సువర్ణయుగంలో సారా, బ్రాందీలను గ్రామాల నుంచి దూరంగా తరిమేస్తామని మహిళలకు హామీ ఇచ్చారు. కృష్ణా జిల్లా మైలవరం తాండాల్లో కల్తీసారా తాగి 20 మంది మరణించిన ఘటన తన మనసును తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లాలో 55వ రోజు ఓదార్పు యాత్రలో భాగంగా సోమవారం జగన్ గురజాల నియోజకవర్గం, దాచేపల్లి మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. ఆయన వెంట మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే సుచరిత ఉన్నారు. ఈ సందర్భంగా ఎనిమిది వైఎస్సార్ విగ్రహాలను జగన్ ఆవిష్కరించారు. పలు గ్రామాల్లో ప్రసంగించారు. ఈ ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే...

పిల్లల చదువులు మేం చూసుకుంటాం
ఈ మధ్య కాలంలోనే కృష్ణా జిల్లా మైలవరం గిరిజన తాండాలకు వెళ్లాను. ఆ తాండాల్లో సారా తాగి 20 మంది చనిపోయారు. ఇది నా మనసుకు కష్టం అనిపించిన సంఘటన. ఎలా జరిగిందమ్మా.. అని అక్కడి అక్కాచెల్లెమ్మలను అడిగాను. వారు నాతో.. ‘‘అన్నా..! మా కళ్ల ముందే బ్రాందీ షాపు పెట్టారు.. బెల్టు దుకాణం తెరిచారు.. అదీ చాలదన్నట్లుగా బట్టీలు పెట్టి సారా డిపో కూడా నడిపిస్తున్నారన్నా’’ అని చెప్పినప్పుడు బాధనిపించింది. నేను వాళ్లను.. ‘అమ్మా.. ఒళ్లంతా విషం పాకుతుంటే 108 వాహనానికి ఫోన్ చేయ్యలేదా? తల్లీ’ అని అడిగితే.. ‘‘అన్నా ఫోన్ చేసినా మూడు గంటల వరకు కూడా అం బులెన్స్ రాలేదన్నా.... అది వచ్చే వరకే మా వాళ్లు ప్రాణాలు విడిచి వెళ్లిపోయారన్నా’’ అని చెప్పినప్పుడు గుండె పగిలేంత బాధనిపించింది. 

పల్లెలు బాగుపడాలంటే పిల్లలు చదువుకోవాలి. మన పిల్లలను సారా, బ్రాందీ దుకాణానికి దూరంగా పెడదాం. వాటికి దూరంగా ఉండాలంటే పిల్లలను చదివిం చాలి. అక్కాచెల్లెమ్మలకు ఒక్క మాట చెప్తున్నా. పిల్లలను మీరు బడికి పంపించండి మీ అకౌంటులో నెలనెలా డబ్బులు వేసే బాధ్యత మేం చూసుకుంటాం. గ్రామంలోకి బ్రాందీ రాకుండా, సారా లేకుండా అదే గ్రామానికి చెందిన పది మంది మహిళా పోలీసులను తయారు చేసి కాపలా పెడతాం.

ఈ ప్రభుత్వాన్ని కాపాడుతోంది బాబే..
ఇవాళ ఏ పేద విద్యార్థిని అడిగినా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడెప్పుడు కూలిపోతుందా? అని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నాడు. ప్రతి రైతు ఈ చేతగాని ప్రభుత్వం ఎప్పుడు పోతుంది దేవుడా.. అని ఆకాశం వైపు చూసి ఆ దేవున్ని మొక్కుతున్నారు. ఇల్లు కట్టుకుంటున్న పేదలు, అవ్వాతాతలు, వైద్యం అందని ప్రతి పేదవాడు, రైతు కూలీలు ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడెప్పుడు పోతుందా? అని చూస్తున్నారు. కానీ ఢిల్లీ పెద్దలతో కుమ్మక్కైన చంద్రబాబునాయుడే ఈ ప్రభుత్వాన్ని కాపాడుతున్నారు. చంద్రబాబుది జీవి తాంతం వంచనే. అధికారం కోసం ఎందాకైనా వెళ్లడానికి వెనుకాడని మనిషి ఆయన. తుదకు అధికారం కోసం సొంత కూతురునిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. కళ్లార్పకుండా చెప్పిన అబద్ధాన్నే.. చెప్పీ..చెప్పీ 101 సారికైనా దాన్ని నిజం చేసే నేర్పరి ఆయన.

ధీమా వచ్చాకే అవిశ్వాస డ్రామా..
ఈ మధ్యకాలంలోనే అసెంబ్లీలో అవిశ్వాస డ్రామా ఆడారు. పూర్తిగా చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలో విలీనమయ్యారూ.. ఇక కాంగ్రెస్ పార్టీ ఎలాంటి పరిస్థితుల్లో పడిపోదు. ఇక మీరు కానివ్వండని చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పెద్దలకు కనుసైగ చేశారు. చంద్రబాబు ఏ రాజకీయ ఉద్దేశాలతో అవిశ్వాసం పెట్టినా... మీరు మాత్రం రైతుల కోసం నిలబడాలని, ఈ కుళ్లు రాజకీయ వ్యవస్థలో తులసి మొక్కలా బతకాలని మా ఎమ్మెల్యేలకు చెప్పా. డిస్‌క్వాలిఫై అవుతానని తెలిసినప్పటికీ.. రైతు కోసం నిలబడ్డారు. రైతుకూలీల కోసం మీ ఎమ్మెల్యేలు నిలబడ్డారు అని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను.
Share this article :

0 comments: