లక్ష్మీనారాయణకు నిజాయతీయే లేదు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » లక్ష్మీనారాయణకు నిజాయతీయే లేదు

లక్ష్మీనారాయణకు నిజాయతీయే లేదు

Written By ysrcongress on Wednesday, January 25, 2012 | 1/25/2012


* ఎమ్మార్ కుంభకోణం సూత్రధారి చంద్రబాబు
* ఆయనను విచారించరెందుకు?
* రోశయ్య, బొత్స, గీతారెడ్డిలను ప్రశ్నించడం లేదెందుకు?
* వాటాల తగ్గింపులోనూ చంద్రబాబుది పక్షపాతమే
* వైఎస్ కుటుంబంపై రుద్దేందుకు సీబీఐ ఉత్సాహం
* లక్ష్మీనారాయణకు నిజాయతీయే లేదు
* కాంగ్రెస్-టీడీపీల చేతిలో కరపత్రంగా సీబీఐ

హైదరాబాద్, న్యూస్‌లైన్: ‘‘ఎమ్మార్‌లో రూ.900 కోట్లు కొల్లగొట్టిన చంద్రబాబు వైపు సీబీఐ కన్నెత్తి చూడట్లేదెందుకు? ఎల్లోసిండికేట్ డైరెక్షన్‌లో పనిచేయడమే సీబీఐ ముఖ్య ఉద్దేశమా? ఎల్లోమీడియా-సీబీఐ-టీడీపీ మధ్య కుదిరిన ఒప్పందమేంటి? సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ ఎవరి ఆదేశాల మేరకు పనిచేస్తున్నారు? ఆయన ఏం ఆశించి వైఎస్ కుటుంబాన్ని వేధింపులకు గురిచేస్తున్నారు?’’ అని సీబీఐ తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలని చూస్తే ప్రజలు తిరగబడతారని హెచ్చరించింది. పార్టీ కేంద్ర కార్యాలయంలో అధికార ప్రతినిధులు బాజిరెడ్డి గోవర్ధన్, గట్టు రామచంద్రరావులు మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీబీఐ జేడీ లక్ష్మీనారాయణకు నిజాయితీ ఎక్కుడుందని బాజిరెడ్డి ప్రశ్నించారు. 

‘‘ఎమ్మార్‌కు భూకేటాయింపులు చేసింది చంద్రబాబు. 2003లో బిడ్డింగ్ సమయంలో ఐదు కంపెనీలు ఉంటే రెండింటిని తప్పించి తన జేబు సంస్థలు ఉండేట్లుగా చేసింది చంద్రబాబు కాదా? ఎవరికీ అనుమానం రాకుండా మరో రెండు కంపెనీలను తప్పించి బిడ్ ఎమ్మార్‌కే దక్కేలా చేసింది బాబే కదా! రూ.900 కోట్ల కుంభకోణానికి ముఖ్య కారకుడైన చంద్రబాబును ఎందుకు తప్పిస్తున్నారు? ఆధారాలన్నీ కనబడుతున్నా చంద్రబాబు వైపు సీబీఐ కన్నెత్తి కూడా చూడట్లేదెందుకు?’’ అని నిలదీశారు. ఎమ్మార్‌లో ప్రభుత్వవాటాను వైఎస్ తగ్గించారని ఒక వర్గం మీడియా చేస్తున్న ప్రచారంలో కుట్ర దాగుందన్నారు. 

‘‘నిజానికి దాంతో వైఎస్‌కు ఎలాంటి సంబంధం లేదు. ప్రాజెక్టులో ఎమ్మార్‌కు, ఏపీఐఐసీలకు కేటాయించిన వాటాలను క్షుణ్ణంగా పరిశీలిస్తే అందులోనూ చంద్రబాబు మోసం బయటపడుతుంది. ఒక ప్రాజెక్టును రెండు భాగాలు చేసిన చంద్రబాబు, ఎక్కువ లాభం వచ్చే దానిలో ఎమ్మార్‌కు అధిక వాటా ఇచ్చి, లాభం రాని వాటిలో ప్రభుత్వ సంస్థ ఏపీఐఐసీకి కేటాయించారు. అందుకే దీనిపై అధ్యయనం చేసేందుకు వైఎస్ మంత్రివర్గ ఉప సంఘాన్ని వేశారు. రోశయ్య నేతృత్వంలోని మంత్రివర్గం కూడా చంద్రబాబు మోసాన్ని బట్టబయలు చేసింది. ప్రభుత్వానికి నష్టం చేకూరనుందని భావించి వాటాను తగ్గించుకోవాలని రోశయ్య సూచించిన మేరకే వైఎస్ ఆమోదించారు’’ అని వివరించారు. అప్పటి మంత్రివర్గ సభ్యులైన కె.రోశయ్య, బొత్స సత్యనారాయణ, గీతారెడ్డిలను సీబీఐ ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. వాస్తవాలను పక్కదారి పట్టించి దీన్ని కేవలం వైఎస్ కుటుంబంపై రుద్దేందుకు సీబీఐ ఎందుకు ఉత్సాహపడుతోందని విమర్శించారు. 

వత్తాసు పలకడమే మీ నిజాయతీనా?
కాంగ్రెస్-టీడీపీలకు వత్తాసు పలకడమే సీబీఐ జేడీ నిజాయితీనా? అని గోవర్ధన్ ప్రశ్నించారు. ‘‘ఎమ్మార్‌లో చంద్రబాబు హస్తం స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ కనీసం సాక్షిగా కూడా పిలవలేదు. నిజాయితీ అధికారివనే ఎల్లో మీడియా పొగడ్తలకు పొంగిపోయి వైఎస్ కుటుంబాన్ని వేధింపులకు గురిచేస్తావా? కేంద్రం ఆడించే ఆటలో నీవొక తోలు బొమ్మవి. ఓఎంసీ కేసులో కూడా జగన్‌ను ఇరికించాలని చూశావు! పథకం పారకపోయేసరికి ఎమ్మార్‌లో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే సీబీఐపై రాష్ట్ర ప్రజలకు నమ్మకం కూడా పోయింది’’ అని దుయ్యబట్టారు. 

ఎల్లోమీడియా-సీబీఐ-టీడీపీల ఒప్పందమేంటి?
ఎల్లోమీడియా, సీబీఐ, టీడీపీల మధ్య కుదిరిన ఒప్పందాన్ని బయటపెట్టాలని గట్టు రామచంద్రరావు డిమాండ్ చేశారు. ‘‘ఎల్లో మీడియాలో రకరకాల కథనాలు రావడం, ఆ మరుసటి రోజే సీబీఐ ప్రశ్నించడం, ఆ తర్వాత టీడీపీ నేతలు ప్రెస్‌మీట్‌లో మాట్లాడటం. ఈ తంతు చూస్తున్న రాష్ట్ర ప్రజలకు అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ముగ్గురి మధ్య కుదిరిన ఒప్పందమేంటో స్పష్టం చేయాలి’’ అని డిమాండ్ చేశారు. 

‘‘సునీల్‌రెడ్డిని సీబీఐ అదుపులోకి తీసుకోగానే టీడీపీ నేతలు విలేకరుల సమావేశంపెట్టి... రూ.8వేల జీతగాడికి కోట్ల రూపాయల ఆస్తులెక్కడివని ప్రశ్నిస్తున్నారు. అదే మాదిరిగా రూ.8 వేలకే పనిచేసిన మామూలు రిపోర్టర్, ఒక మీడియా సంస్థ మూతపడి పునఃప్రారంభమయ్యే సరికి యజమాని ఎలా కాగలిగారు? రెండెకరాల నుంచి చంద్రబాబు వేలకోట్లు ఎలా సంపాదించారు? అని కూడా ఆ నేతలు నిలదీసుంటే వాటికి కాస్త విలువ ఉండేది’’అని ఎద్దేవా చేశారు. నిజాయితీగా ఉండాల్సిన సీబీఐ... కాంగ్రెస్-టీడీపీల చేతిలో కరపత్రంగా మారడం దురదృష్టకరమన్నారు. జగన్‌ఒక్కర్నే టార్గెట్ చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా విచారణ చేస్తామంటే ప్రజలు తిరగబడతారని గట్టు హెచ్చరించారు. 

ఆయన మరో విజయరామారావు
‘‘గతంలో సీబీఐ డైరెక్టర్‌గా పనిచేసి పదవి విరమణ చేసిన విజయరామారావు మాదిరిగానే లక్ష్మీనారాయణ పనిచేస్తున్నారు. విజయరామారావు కూడా ఎన్టీఆర్‌ను అనేక ఇబ్బందులకు గురిచేశారు. రిటైర్ అయిన వెంటనే చంద్రబాబు పక్కన కూర్చోవడం, టీడీపీలో చేరగానే ఎన్నికల బరిలో నిలబడడం, ఆ వెంటనే మంత్రి కావడం చకచకా జరిగిపోయాయి. ఇప్పుడు లక్ష్మీనారాయణ కూడా అదే పంథాలో ముందుకెళ్తున్నారు’’ అని గట్టు దుయ్యబట్టారు. తెరచాటున ఉన్న టీడీపీ నేత విజయరామారావు, ఢిల్లీ పెద్దలకు లక్ష్మీనారాయణకు మధ్యవర్తిత్వం చేస్తున్నారని, అందుకే చంద్రబాబు వైపు సీబీఐ కన్నెత్తి కూడా చూడటంలేదని ఆరోపించారు. ఇంత విచిత్రమైన, దౌర్భాగ్యమైన దర్యాప్తు దేశ చరిత్రలో మరెక్కడా జరగలేదని దుయ్యబట్టారు.
Share this article :

0 comments: