ప్రజాస్వామ్యానికి ప్రతిరూపం పత్రికా స్వేచ్ఛ! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రజాస్వామ్యానికి ప్రతిరూపం పత్రికా స్వేచ్ఛ!

ప్రజాస్వామ్యానికి ప్రతిరూపం పత్రికా స్వేచ్ఛ!

Written By news on Friday, May 11, 2012 | 5/11/2012


‘‘ స్వేచ్ఛాయుతమైన రాజకీయ చర్చ, ప్రజలను చైతన్యవంతులను చేయడం ప్రజాస్వామ్యంలో అత్యంత ఆవశ్యకం. అవి లేకుండా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాల పాలనా ప్రక్రియలు సక్రమంగా పనిచేయడం అసాధ్యం. అందుకే వాక్, పత్రికా స్వాతంత్య్రమే ప్రజాస్వామిక వ్యవస్థలన్నిటికీ పునాది’’.


‘‘వార్తా పత్రికలు లేని ప్రభుత్వం ఉండాలా లేక ప్రభుత్వం లేకపోయినా పత్రికలు ఉండాలా అని తేల్చుకోవాల్సివస్తే, క్షణమైనా తటపటాయించక ప్రభుత్వం లేకపోయినా పత్రికలు ఉండాలని కోరుకుంటాను’’ అని అమెరికా రాజ్యాంగకర్తలలో ఒకరైన జేమ్స్ మాడిసన్ అన్న మాటలు సమాజంలో మీడియాకు ఉన్న స్థానానికి అద్దంపడతాయి. ప్రభుత్వం కంటే ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇచ్చి మాడిసన్ మీడియాపై ఎనలేని గౌరవాన్ని ప్రదర్శించారు.

కాబట్టి హక్కులను, స్వేచ్ఛలను పదిలపరిచి, పరిరక్షించే నేపథ్యంలో మీడియా నిర్వహించే పాత్ర అపారమైనది. ప్రజాభిప్రాయాన్ని వెల్లడిచేసే ప్రధాన సాధనం అదే కావచ్చు. ప్రజల మనోభావనలను జాతీయ, అంతర్జాతీయస్థాయిలలో వ్యక్తం చేయగలిగేది మీడియా మాత్రమే. సమష్టిగా ప్రజల బాధలను, కొందరు వ్యక్తుల లేదా సమూహాల దయనీయ దుస్థితిని మీడియా వెలుగులోకి తెస్తుంది. ప్రభుత్వ విధానాలకు సంబంధించి విషయావగాహనగల ముఖ్య విమర్శకునిగా అది పనిచేస్తుంది. తద్వారా జీవితంలోని సకల రంగాలకు చెందిన తక్షణ సమస్యలపైకి మేధావుల దృష్టిని మళ్లిస్తుంది. ప్రజాస్వామ్యంలో అది అత్యంత ఆవశ్యకం. న్యాయ ప్రక్రియలో అతి గోప్యత అవాంఛనీయం.

అందువలన, మీడియాకు తగినంత సమాచారం అందడానికి వీలు కల్పించే వ్యవస్థకు హామీని ఇవ్వడం తక్షణ అవసరం. మీడియా ఆ సమాచారాన్ని దుర్వినియోగం కాకుండా జాగ్రత్త వహిస్తూ, బాధ్యతాయుతంగా ఉపయోగించుకుంటుందన్న హామీ కూడా ఉండాలి. అంటే మీడియా, ప్రజాస్వామిక హక్కులను పరిరక్షించే సంస్థ. తక్షణమే దృష్టిని కేంద్రీకరించవలసిన సమస్యలుగా ముందుకొచ్చిన పలు సామాజిక చెడుగులకు, సమస్యలకు వ్యతిరేకంగా దేశాన్ని ఐక్యం చేసే విషయంలో మీడియా ప్రధాన పాత్రను నిర్వహించిన ఉదంతాలు ప్రపంచవ్యాప్తంగా అనేకం ఉన్నాయి. ఇండియన్ ఎక్స్‌ప్రెస్, యూనియన్ ఆఫ్ ఇండియాల మధ్య న్యాయ వివాదంలో సుప్రీంకోర్టు ఇలా ప్రకటించింది: ‘నేటి స్వేచ్ఛా ప్రపంచంలో సామాజిక, రాజకీయ సంబంధాలకు గుండెకాయ పత్రికా స్వేచ్ఛే... వాస్తవాలను, అభిప్రాయాలను తెలుసుకోకుండా ప్రజాస్వామిక ఓటర్లు బాధ్యతాయుతమైన నిర్ణయాలను తీసుకోలేరు. వాటిని ప్రచురించడం ద్వారా ప్రజా ప్రయోజనాలను పెంపొందింపజేయడమే పత్రికల లక్ష్యం.’ అంతటి నమ్మకాన్ని ఉంచిన ఏ సంస్థకయినా గురుతరమైన బాధ్యత, జవాబుదారీతనాలు కూడా ఉంటాయి. ఆ ఆదర్శాలే దాని ప్రతి పనికీ ప్రాతిపదికగా ఉండాల్సి ఉంటుంది.

భారత రాజ్యాంగం, పౌరులందరి భావప్రకటనా స్వాతంత్య్రానికి హామీని ఇచ్చింది. ప్రత్యేకించి మీడి యాకు (ప్రింట్, ఎలక్ట్రానిక్) ఆ హామీని కల్పించింది. ప్రజాస్వామ్యం సంతృప్తికరంగా పనిచేస్తుందనడానికి సంకేతంగా నిలిచేది ఈ స్వేచ్ఛే. కోర్టులు అనేకసార్లు ఈ స్వేచ్ఛను పరిరక్షించాయి. రమేష్ థాపర్, స్టేట్ ఆఫ్ మద్రాస్‌ల మధ్య వివాదంలో సుప్రీంకోర్టు భావప్రకటనా స్వేచ్ఛను పరిరక్షించాల్సిన అవసరాన్ని ఇలా పేర్కొంది: ‘‘స్వేచ్ఛాయుతమైన రాజకీయ చర్చ, ప్రజలను చైతన్యవంతులను చేయడం ప్రజాస్వామ్యంలో అత్యంత ఆవశ్యకం. అవి లేకుండా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాల పాలనా ప్రక్రియలు సక్రమంగా పనిచేయడం అసాధ్యం. అందుకే వాక్, పత్రికా స్వాతంత్య్రమే ప్రజాస్వామిక వ్యవస్థలన్నిటికీ పునాది’’.

కోర్టులకు సంబంధించిన ముఖ్య ప్రక్రియలను, వ్యవహారాలను నివేదించే హక్కు మీడియాకుంది. తెలుసుకోవడానికి, చైతన్యవంతులు కావడానికి, సత్యం గురించి చైతన్యాన్ని పొందడానికి పౌరులకు ఉన్న హక్కు నుంచే మీడియాకు ఆ హక్కు సంక్రమిస్తుంది. అయితే, సమాచారాన్ని నిజాయతీగా, వాస్తవికంగా, కచ్చితంగా నివేదించాలన్న గురుతర బాధ్యతను కూడా రాజ్యాంగం మీడియాపై ఉంచింది. హక్కులకు, బాధ్యతలకు మధ్య ఈ సమతూకం రాజ్యాంగంలోనే అవ్యక్తంగా ఉంది. ఈ హక్కులు, బాధ్యతల మధ్య ఘర్షణ తలెత్తిన ప్రతిసారీ, ప్రజాప్రయోజనాల కోసం నిలుస్తున్నామని చెప్పే ఇద్దరు పోటీదారుల మధ్య సమతూకాన్ని సాధించడానికి కోర్టులు ప్రయత్నిస్తాయి.

మీడియా భావప్రకటనా స్వాతంత్య్రాన్ని న్యాయవ్యవస్థ పరిరక్షిస్తుంది. ప్రభుత్వంలోని ఇతర విభాగాలు ఆ హక్కుపై దాడి చేసిన ప్రతి సందర్భం లోనూ పత్రికా స్వేచ్ఛను కాపాడడానికి తీవ్రంగా కృషిచేస్తుంటుంది. అలాగే, న్యాయవ్యవస్థ తన విధులను సక్రమంగా నెరవేర్చడాన్ని మీడియా అనుమతించాలి. న్యాయ వ్యవస్థ అన్ని కేసులలోనూ బహిర్గత ప్రభావాలకు అతీతంగా న్యాయాన్ని అందించడానికి వీలుకల్పించాలి. కోర్టు వ్యవహారాల విషయంలో మీడియాకు ఉన్న ఈ స్వేచ్ఛ ప్రాథమిక హక్కుల నుంచి సంక్రమించిన హక్కే. అయినాగానీ, కక్షిదార్లు, సాక్షులు, కేసుతో సంబంధమున్న ఇతరుల ప్రయోజనాలను, ప్రైవసీని పరిరక్షించడమూ తప్పనిసరే. ప్రతి స్వేచ్ఛా సమాజమూ ప్రాథమిక హక్కులకు, స్వేచ్ఛలకు మధ్య ఈ సమతూకాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిందే.

ఏదైనా న్యాయ వ్యవహారంపైనో లేదా న్యాయాన్ని అందించే క్రమంపైనో పాత్రికేయులు ప్రచురించే అంశాలు దురభిప్రాయాన్ని కలుగజేసేవిగా, జోక్యం చేసుకునేవిగా ఉన్నా లేదా ఆ ధోరణిని కలిగినవిగా ఉన్నా అది ధిక్కారం అవుతుందని గ్రహించాలి. ఏది ఏమైనా మీడియా, న్యాయవ్యవస్థ స్వయం నియంత్రణను గౌరవించడమనేదే ఈ ఘర్షణకు దీర్ఘకాలిక పరిష్కారమవుతుంది.

(‘రాజ్యాంగం-మీడియా-కోర్టులు’ అనే అంశంపై సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కొచ్చిలో 2008, ఆగస్టు 9న చేసిన ప్రసంగం నుంచి...)

Share this article :

0 comments: