కర్ణాటకలో నమోదైన ఏఎంసీ కేసులోనూ బెయిల్ వస్తేనే బయటికి... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కర్ణాటకలో నమోదైన ఏఎంసీ కేసులోనూ బెయిల్ వస్తేనే బయటికి...

కర్ణాటకలో నమోదైన ఏఎంసీ కేసులోనూ బెయిల్ వస్తేనే బయటికి...

Written By news on Saturday, May 12, 2012 | 5/12/2012


బళ్లారి వదిలి వెళ్లరాదు.. పాస్‌పోర్టును కోర్టుకు అప్పగించాలి
రూ. 5 లక్షల చొప్పున రెండు పూచీకత్తు బాండ్లు సమర్పించాలి
ఏ రకంగానూ దర్యాప్తును అడ్డుకోరాదు... సాక్షులను బెదిరించరాదు
న్యాయస్థానం అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదు
బెయిల్‌కు షరతులు విధించిన సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం
రెండు రోజులపాటు ఆపాలన్న సీబీఐ విజ్ఞప్తిని తిరస్కరించిన కోర్టు
కర్ణాటకలో నమోదైన ఏఎంసీ కేసులోనూ బెయిల్ వస్తేనే బయటికి...

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ) కేసులో రెండో నిందితునిగా ఉన్న గాలి జనార్దన్‌రెడ్డికి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం శుక్రవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ. 5 లక్షల చొప్పున రెండు పూచీకత్తు బాండ్లు సమర్పించడంతోపాటు బళ్లారి వదిలి వెళ్లరాదని, పాస్‌పోర్టును కోర్టుకు అప్పగించాలని సీబీఐ మొదటి అదనపు ప్రత్యేక జడ్జి పట్టాభి రామారావు బెయిల్ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఏ రకంగానూ దర్యాప్తును అడ్డుకోరాదని, న్యాయస్థానం అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని షరతు విధించారు. బెయిల్ ఉత్తర్వులను రెండు రోజులపాటు నిలిపివేయాలని (అబయన్స్) కోరుతూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి తిరస్కరించారు.

ఇప్పటికి జనార్దన్‌రెడ్డి దాఖలు చేసుకున్న ఐదు బెయిల్ పిటిషన్లను కోర్టు కొట్టివేయగా... ఆరోసారి బెయిల్ లభించింది. బెయిల్ ఉత్తర్వుల సమయంలో గాలి జనార్దన్‌రెడ్డి సోదరుడు, బళ్లారి ఎమ్మెల్యే, కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ చైర్మన్ గాలి సోమశేఖర్‌రెడ్డి కోర్టుకు వచ్చారు. కోర్టు బెయిల్ మంజూరు చేసినట్లు తెలుసుకున్న ఆయన ఉద్వేగానికి లోనయ్యారు. కొద్దిసేపటి తర్వాత తేరుకున్న ఆయన ఆనందంతో కళ్ల నీళ్లు పెట్టుకున్నారు. తొమ్మిది నెలల తర్వాత తమ్మునికి బెయిల్ రావడం ఆనందంగా ఉందని సోమశేఖర్‌రెడ్డి మీడియాతో చెప్పారు. కర్ణాటకలో నమోదైన ఏఎంసీ కేసులోనూ బెయిల్ కోసం ప్రయత్నిస్తామన్నారు. ‘‘దేశంలోనే ప్రతిష్టాత్మక దర్యాప్తు సంస్థగా చెప్పుకునే సీబీఐ... ఓఎంసీపై 2009 డిసెంబర్‌లో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌కు గత ఏడాది డిసెంబర్‌లో కోర్టుకు సమర్పించిన చార్జిషీట్‌కు పొంతన లేకుండా దర్యాప్తు నివేదికను కోర్టుకు సమర్పించింది. ఎఫ్‌ఐఆర్‌లో ఓఎంసీ, బళ్లారి ఐరన్ ఓర్ కంపెనీ (బీఐఓసీ)లను నిందితులుగా పేర్కొన్నా... బీఐఓసీని విస్మరించి సీబీఐ దర్యాప్తు చేసింది. ఎగుమతులతోపాటు ఇనుమ ఖనిజం పరిశ్రమ కోసం (క్యాప్టివ్) లీజులు కేటాయించాలని ఓఎంసీ రాష్ట్ర ప్రభుత్వానికి చేసుకున్న దరఖాస్తులో స్పష్టంగా పేర్కొన్నా సీబీఐ వాటిని పట్టించుకోలేదు. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న దొంగతనం, దురాక్రమణ, ఫోర్జరీ తదితర అభియోగాలతోపాటు ఎంఎండీఆర్ యాక్టు, ఫారెస్ట్ యాక్టు కింద మోపిన అభియోగాలను కూడా చార్జిషీట్ నుంచి తొలగించారు. జనార్దన్‌రెడ్డి మంత్రిగా పనిచేశారని, ప్రస్తుతం శాసనమండలి సభ్యునిగా ఉన్నారని, ఆయన విదేశాలకు పారిపోయే అవకాశం ఉందంటూ సీబీఐ చేస్తున్న వాదనలో వాస్తవం లేదు. ఓఎంసీ కేసులో నిందితునిగానే లేని అలీఖాన్‌ను విచారించాల్సి ఉందని, అందుకే జనార్దన్‌రెడ్డికి బెయిల్ ఇవ్వరాదని సీబీఐ వాదనలు వినిపించడం హాస్యాస్పదం.

మొదటి, రెండవ చార్జిషీట్‌లలో అలీఖాన్‌ను కనీసం నిందితునిగా కూడా పేర్కొనలేదు, అలాంటి వ్యక్తిని విచారించాలనే సాకుతో జనార్దన్‌రెడ్డి బెయిల్‌ను అడ్డుకోవాలని సీబీఐ చూస్తోంది. ఇదే కేసులో నిందితురాలిగా ఉన్న శ్రీలక్ష్మి విచారణకు కేంద్రం ఇంకా అనుమతి మంజూరు చేయలేదు. ఇప్పట్లో తుది విచారణ ప్రారంభం అయ్యే అవకాశం లేదు. అవసరం లేకపోయినా సాక్షులకు రక్షణ కల్పించిన సీబీఐ... వారి భద్రతకు ప్రమాదముందనే సాకుతో బెయిల్‌ను అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. దాదాపు తొమ్మిది నెలలుగా జనార్దన్‌రెడ్డి జైలులో ఉన్నారు...షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయండి’’ అని గాలి న్యాయవాది కోర్టుకు నివేదించారు. ఈ వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి జనార్దన్‌రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం కర్ణాటకలో నమోదు చేసిన ఏఎంసీ కేసులో నిందితునిగా ఉన్న జనార్దన్‌రెడ్డికి అక్కడి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేస్తే తప్ప విడుదలయ్యే అవకాశం లేదు.

Share this article :

0 comments: