ఈ చేష్టలన్నిటికీ తెరవెనక సూత్రధారి సోనియాగాంధీ దీన్ని గుర్తుంచుకోవాలి. ఇది ఒక సంస్థపై దాడి మాత్రమే కాదు, రాజ్యాంగంపైనే దాడి. దీన్ని ఎవరూ చూస్తూ ఊరుకోలేరు. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఈ చేష్టలన్నిటికీ తెరవెనక సూత్రధారి సోనియాగాంధీ దీన్ని గుర్తుంచుకోవాలి. ఇది ఒక సంస్థపై దాడి మాత్రమే కాదు, రాజ్యాంగంపైనే దాడి. దీన్ని ఎవరూ చూస్తూ ఊరుకోలేరు.

ఈ చేష్టలన్నిటికీ తెరవెనక సూత్రధారి సోనియాగాంధీ దీన్ని గుర్తుంచుకోవాలి. ఇది ఒక సంస్థపై దాడి మాత్రమే కాదు, రాజ్యాంగంపైనే దాడి. దీన్ని ఎవరూ చూస్తూ ఊరుకోలేరు.

Written By news on Saturday, May 12, 2012 | 5/12/2012

వివేక భ్రష్టులైనవారి వరసెలా ఉంటుందో నీతి శతకంలో భర్తృహరి చక్కగా చెప్పాడు. ఆకాశంనుంచి బయల్దేరిన గంగ... శివుడి శిరస్సును చేరి అక్కడినుంచి క్రమేపీ కిందకు దిగుతూ చివరాఖరికి సముద్రం అట్టడుగునున్న పాతాళానికి చేరడాన్ని ఉదహరిస్తూ ‘... పెక్కుభంగుల్ వివేకభ్రష్టసంపాతముల్’ అని ఆయన అంటాడు. వివేకాన్ని కోల్పోయినవారు ఎంతకి దిగజారుతారో సవివరంగా ఆయన తెలిపాడు. ‘సాక్షి’పై ప్రారంభించిన ముప్పేట దాడి వెనక తమ పాత్ర లేదని, కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ వ్యవహరిస్తున్నదని ఇన్నాళ్లూ పాలకులు చెప్పుకున్నారు. జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్, జనని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేటు లిమిటెడ్‌ల ఖాతాలను స్తంభింపజేయడంపై కూడా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ తరహాలోనే మాట్లాడారు. సీబీఐ చట్టపరిధిలో తన బాధ్యతను తాను నిర్వర్తిస్తోందని ప్రవచించారు. 

24 గంటలు తిరగకుండానే ‘సాక్షి’ మీడియాకు ప్రభుత్వ ప్రకటనలు నిలిపేస్తూ జీవో జారీచేసి తన అసలు రూపాన్ని బయటపెట్టుకున్నారు. ఇప్పుడిక ముసుగులు తొలగిపోయాయి. అటు పాలక పక్షం, ఇటు ప్రధాన ప్రతిపక్షం రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి ‘సాక్షి’కి వ్యతిరేకంగా యుగళగీతం పాడుతున్నారు. ఇద్దరూ ఏకమై నిప్పులు చెరుగుతున్నారు. తమ నిజరూపాల్ని బహిర్గతం చేస్తున్న... తమ అక్రమాలను, చీకటి బంధాలను వెలుగులోకి తెస్తున్న ‘సాక్షి’ మీడియా కనబడకూడదన్నదే వీరి ఉమ్మడి లక్ష్యం. అది సాధించుకోవడానికి వీరు ఎంతకైనా తెగించడానికి, దిగజారడానికి సిద్ధంగా ఉన్నారు. వివేకభ్రష్టత్వం స్వభావమే అంత. చీకటి పనులు చేసేవారు ఎల్లకాలమూ అలా మర్యాదస్తుల్లా బతకడం సాధ్యం కాదు. 

అందుకే ఉప ఎన్నికల నగారా మోగి, కోడ్ అమలవుతున్న వేళ వెనకా ముందూ ఆలోచించకుండా, కొన్ని వేల కుటుంబాలు రోడ్డున పడతాయన్న ఇంగితం కూడా లేకుండా ‘సాక్షి’ గొంతు నులమడానికి వీరు చేస్తున్న ప్రయత్నాలపై రాష్ట్రవ్యాప్తంగానే కాదు... దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబుకు తున్నాయి. అయినప్పటికీ సాక్షి మీడియాకు ప్రభుత్వ ప్రకటనలు ఆపేయాలన్న జీవోను తీసుకురావడం వారి తెంపరితనానికి నిదర్శనం. ఒక టైం టేబిల్ వేసుకుని, పద్ధతి ప్రకారం ఈ చర్యలన్నిటికీ పాల్పడుతున్నట్టు తెలుస్తూనే ఉంది. ‘సాక్షి’కి ప్రకటనలు ఆపేస్తూ జీవో తీసుకురాబోతున్నారని వారంరోజుల నాడే మీడియాలో కథనం వచ్చింది. సీబీఐ ఆ తర్వాత బ్యాంకు ఖాతాలను స్తంభింప జేసింది. వాస్తవాలు ఇలావుండగా, నల్ల జీవో సీబీఐ చర్య పర్యవసానమన్నట్టు చెప్పడమంటే నయవంచన తప్ప మరేం కాదు. ఇంతకూ మీడియాకు ప్రభుత్వ ప్రకటనలివ్వడం పాలకుల ఔదార్యం కాదు. స్వీయ విచక్షణతో ఇచ్చేది అంతకన్నా కాదు. వారి చిత్తభ్రమల ఆధారంగా ఇవ్వడం, ఇవ్వకపోవడం లాంటి నిర్ణయాలు తీసుకుంటామంటే ప్రజాస్వామ్యంలో చెల్లదు. అక్కడ సోనియా అయినా, ఇక్కడ కిరణ్‌కుమార్ రెడ్డి అయినా ఈ సంగతిని గుర్తుంచుకోవాలి. ‘సాక్షి’ ఏదో సాధారణ పత్రిక కాదు. 14.5 లక్షల సర్క్యులేషన్‌తో, 1.46 కోట్ల మంది పాఠకులతో దేశంలోనే 8వ స్థానాన్ని కైవసం చేసుకున్న తెలుగువారి మనస్సాక్షి అది. 

‘సాక్షి టీవీ’ చానెల్‌కు రోజూ నాలుగు కోట్లమంది వీక్షకులున్నారు. ఈ రెండు మాధ్యమాలూ ప్రజాబాహుళ్యంలో ఆదరాభిమానాలను అంతకంతకూ పెంచుకుంటున్నాయి. ఈ రెండింటికీ ప్రభుత్వ ప్రకటనలు ఆపేయడమంటే ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని కోట్లాది మందికి నిరాకరించడమే. ఈ ప్రకటనల ద్వారా మీడియాకు ఆదాయం వస్తుందన్నది వాస్తవమే గానీ, అందుకు ప్రతిఫలంగా ప్రభుత్వానికి ప్రజల్లో ప్రచారం కూడా లభిస్తుంది. అంటే... ఇందులో పరస్పర ప్రయోజనం మాత్రమే కాదు... విశాల ప్రజానీకం ప్రయోజనం కూడా ఇమిడి ఉంది. అందువల్లే మీడియాకు ప్రకటనలు ఆపేయడమంటే సమాచారాన్ని తెలుసుకోవడానికి ప్రజలకున్న ప్రాథమిక హక్కును కాలరాయడమేనని, మీడియాకు ఉండే భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడమేనని ఎన్నో సందర్భాల్లో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒకపక్క దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నదంటూ చార్జిషీట్ల మీద చార్జిషీట్లు వేస్తూనే, ఆరోపణల నిరూపణ పూర్తికాకుండానే ‘సాక్షి’ గొంతు నొక్కడానికి సీబీఐ ప్రయత్నించింది. 

అసలు ఈ కేసులన్నింటికీ మూలం వైఎస్ ప్రభుత్వం జారీచేసిన 26 జీవోల్లో ఉందని ఒకపక్క చెబుతూ... అవి అక్రమమో, సక్రమమో తేల్చడానికి... మంత్రులు, ఐఏఎస్ అధికారులను విచారించడానికి అవసరమైన ప్రాథమిక చర్యలు కూడా తీసుకోకుండా సంస్థ రోజువారీ నిర్వహణకు వినియోగించే కరెంట్ అకౌంట్లపై పడిందంటే సీబీఐ దురుద్దేశం సుస్పష్టమే. ఆ సంస్థకు నిజంగా దురుద్దేశం లేకపోతే కనీసం ఖాతాల స్తంభనకు ముందస్తు నోటీసులు జారీచేసేది. లేదా దర్యాప్తు క్రమంలోనే ఈ చర్య అత్యవసరమంటూ కోర్టును ఒప్పించడానికి ప్రయత్నించేది. సీబీఐ ఈ రెండు మార్గాలనూ వదిలిపెట్టి ఖాతాల స్తంభన చర్యకు పాల్పడిందంటే ప్రాథమిక హక్కులను మాత్రమే కాదు, సహజ న్యాయసూత్రాలను సైతం అది విస్మరించిందన్నది స్పష్టంగానే తెలుస్తోంది.

మూడున్నర దశాబ్దాలక్రితం దేశంలో అత్యవసర పరిస్థితిని విధించిన ఇందిరాగాంధీ సైతం తనకు నచ్చని మీడియాపై ఇంతస్థాయిలో తెగబడలేదు. ఈ చేష్టలన్నిటికీ తెరవెనక సూత్రధారి సోనియాగాంధీ దీన్ని గుర్తుంచుకోవాలి. ఇది ఒక సంస్థపై దాడి మాత్రమే కాదు, రాజ్యాంగంపైనే దాడి. దీన్ని ఎవరూ చూస్తూ ఊరుకోలేరు. అందుకే రాష్ట్రంలోనే కాదు... దేశవ్యాప్తంగానే దీనిపై నిరసన వ్యక్తమవుతున్నది. భిన్నాభిప్రాయాలను గౌరవించలేని ప్రభుత్వాలు బతికిబట్ట కట్టిన దాఖలాలు లేవని, మళ్లీ అధికారం వెలగబెట్టిన జాడలు లేవని మన పాలకులు ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. ఇందుకు సజీవ ఉదాహరణ చంద్రబాబే!
Share this article :

0 comments: