ప్రభుత్వ చీకటి జీవోకు నిరసనగా సమాచార కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించిన పాత్రికేయులు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రభుత్వ చీకటి జీవోకు నిరసనగా సమాచార కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించిన పాత్రికేయులు

ప్రభుత్వ చీకటి జీవోకు నిరసనగా సమాచార కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించిన పాత్రికేయులు

Written By news on Saturday, May 12, 2012 | 5/12/2012

శాంతియుతంగా నిరసన తెలుపుతున్న పాత్రికేయులపై పోలీసుల దౌర్జన్యం
మెట్లపైనుంచి లాగేసి.. వ్యాన్లలోకి తోసివేత
పలువురికి గాయాలు.. అనేక మంది అరెస్టు
సాక్షికి మద్దతుగా మూడోరోజూ నిరసనలు

హైదరాబాద్, న్యూస్‌లైన్: సాక్షి మీడియాపై అణచివేత ధోరణులను నిరసిస్తున్న జర్నలిస్టులపై రాష్ట్రంలోని కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కారు శుక్రవారం దౌర్జన్యానికి దిగింది. హైదరాబాద్‌లోని సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించి, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న పాత్రికేయులపై ఖాకీలను ప్రయోగించింది. ప్రదర్శన జరుపుతున్న పాత్రికేయులను పోలీసులు మెట్లపైనుంచి అత్యంత దారుణంగా ఈడ్చుకెళ్లారు. పోలీసు వాహనాల్లోకి విసిరేశారు. పదిమందికి పైగా జర్నలిస్టులు తీవ్రంగా గాయపడ్డారు. మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. వీరిలో ఓ మహిళా జర్నలిస్టు కూడా ఉన్నారు. సాక్షి మీడియాపై ప్రభుత్వ కుట్రలకు వ్యతిరేకంగా మూడో రోజు కూడా రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టుల నిరసనల హోరు మిన్నంటింది. ‘‘కలం.. గళం.. చూపిస్తాం జర్నలిస్టుల బలం’’ అంటూ జర్నలిస్టులంతా ఐక్యంగా ఉద్యమ బాటపట్టారు. జిల్లా కేంద్రాల్లో పౌర సంబంధాల అధికారుల కార్యాలయాల వద్ద ధర్నాలు చేశారు. పాత్రికేయుల ఉద్యమానికి వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలతోపాటు సామాన్య పౌరుల నుంచి కూడా మద్దతు వస్తోంది. వారంతా కూడా నిరసన ప్రదర్శనలు, ధర్నాలలో పాల్గొంటున్నారు.

హైదరాబాద్‌లో ఐ అండ్ పీఆర్ కార్యాలయం ముట్టడి

సాక్షి దినపత్రిక, టీవీ చానల్‌కు ప్రకటనలు రద్దు చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన 2097 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం హైదరాబాద్‌లోని సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ కార్యాలయాన్ని జర్నలిస్టులు ముట్టడించారు. మహిళా జర్నలిస్టులతోసహా వందలాది మంది విలేకరులు, పత్రికా సిబ్బంది ఉదయం 9 గంటల నుంచే కమిషనర్ కార్యాలయం ద్వారాల వద్ద బైఠాయించారు. ప్రభుత్వం అర్ధరాత్రి ఇచ్చిన నల్ల జీవోను రద్దుచేయాలని డిమాండ్ చేశారు. డప్పు వాద్యాలతో ధూంధాం నిర్వహించారు. ప్రభుత్వ కుట్రపూరిత వైఖరిని ఎండగడుతూ పాటలు పాడి, నృత్యాలు చేశారు. పోలీసులు ఒక్కసారిగా పాత్రికేయులపై విరుచుకుపడి బయటకు తోసివేసేందుకు ప్రయత్నించారు. మెట్లపై నుంచి కిందికి ఈడ్చుకుపోయి, వ్యాన్లలోకి విసిరేశారు. 

పలువురు జర్నలిస్టులను అరెస్టు చేసి గాంధీనగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. పోలీసుల దాడిలో పాత్రికేయులకు గాయాలయ్యాయి. వీరిలో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. అరెస్టు చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సమాచార, పౌర సంబంధాల కమిషనర్ కార్యాలయం ముందు పాత్రికేయులు ర్యాలీ చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు ఆకుల అమరయ్య నేతృత్వంలో ప్రతినిధి బృందం సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్‌కు వినతిపత్రాన్ని సమర్పించేందుకు లోపలికి వెళ్లారు. అయితే, కమిషనర్ లేకపోవడంతో వెనుదిరిగారు.

సాక్షి మీడియాకు ప్రభుత్వ ప్రకటనలు వెంటనే విడుదల చేయాలని కోరుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సమాచార, పౌర సంబంధాల శాఖ కార్యాలయాలు, కలెక్టర్ కార్యాలయాల ఎదుట శుక్రవారంనాడు పాత్రికేయులు నిరసనలు చేపట్టారు. మండల కేంద్రాలు, నగరాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి. సాక్షి మీడియా ఖాతాలను స్తంభింపజేయడం, ప్రకటనలను నిలిపివేయడాన్ని ఖండించారు. జర్నలిస్టు సంఘాలు, ప్రజా సంఘాలు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నాయి. మహబూబ్ నగర్ జిల్లా గద్వాలలోని మంత్రి డీకే అరుణ ఇంటిని పాత్రికేయులు ముట్టడించారు. శ్రీకాకుళంలో డీపీఆర్వో కార్యాలయం సిబ్బందిని బయటకు పంపి, కార్యాలయానికి తాళం వేశారు. విజయనగరంలో కలెక్టరేట్ ప్రాంగణంలో మోకాళ్లపై బైఠాయించారు. కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్, కడప, అనంతపురం, కర్నూలు, చిత్తూరు, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, నిజామాబాద్, నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో డీపీఆర్వో కార్యాలయాలను ముట్టడించారు.
-న్యూస్‌లైన్ నెట్‌వర్క్
Share this article :

0 comments: