నిత్యం సామాన్య ప్రజానీకం కోసం, సగటు మనిషి మనుగడకోసం, వారి జీవనోపాధి కోసం... తపించిన జలయజ్ఞ ప్రదాత డా. వైఎస్ రాజశేఖరరెడ్డి గారి కడుపున పుట్టిన నికార్సైన మానవతావాది జగన్మోహనరెడ్డిగారు. నిరంతరం ప్రజల కష్టసుఖాలలో పాలుపంచుకోవాలనే తాపత్రయం, తపన, సామాన్యుల జీవన మనుగడ సమస్యలను పారద్రోలాలనే ప్రగాఢ తలంపు... జగన్‌గారి జీవిత లక్ష్యం. ప్రజల గుండెల్లో కొలువైన ఆ మహానాయకుడికి తగ్గ తనయుడిగా అడుగులు వేస్తున్న జగన్ నాయకత్వాన్ని అన్నివర్గాల ప్రజలు స్వాగతిస్తున్న తరుణమిది.

వైయస్సార్‌గారు తనువు చాలించటాన్ని జీర్ణించుకోలేక ఆత్మార్పణ కావించుకున్న అభిమానుల కుటుంబాన్ని పరామర్శించటాన్ని నేరంగా పరిగణించిన అధినాయకత్వాన్ని ప్రజల కోసం ధిక్కరించి, తన రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టిన ధీశాలి జగన్‌గారు. రెండున్నర దశాబ్దాలుగా ప్రజా విశ్వాసాన్ని కోల్పోయిన కాంగ్రెస్‌పార్టీకి, తన సుదీర్ఘ పాదయాత్రతో పూర్వవైభవం తీసుకొచ్చి, ఢిల్లీ పీఠాన్ని కూడా నిలబెట్టిన ధీరోదాత్తుడైన జనహృదయనేత డా. వైయస్ రాజశేఖరరెడ్డిగారి కుటుంబాన్ని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేని అధినాయకత్వం, వారి వ్యాపారాలపైన, వ్యక్తిగత ఆస్తులపైన కక్షసాధింపు చర్యలు మొదలుపెట్టింది. ఎంక్వయిరీలు, విచారణల నిమిత్తం సీబీఐ జగన్‌గారిని ిపిలిపించి, బంధించి, 13 నెలలుగా బెయిలు రాకుండా చేస్తున్న తీరు అరాచకం తప్ప మరొకటి కాదు.
అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఒక పార్టీ అధ్యక్షుడిగా, ప్రజలెన్నుకున్న పార్లమెంటు సభ్యుడైన ఒక ప్రజాప్రతినిధి హక్కులను కాంగ్రెస్ పార్టీ అతి ఘోరంగా కాలరాయడమే కాకుండా, ప్రజాస్వామ్య దేశంలో చట్టం ముందు, న్యాయం ముందు, ధర్మం ముందు అందరూ సమానమేనన్న మాట ఒట్టిదేనా అనే సందేహాన్ని ప్రజలకు కలిగించింది. జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే జగన్‌గారికి ఒక న్యాయం, కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసేవాళ్లకు ఒక న్యాయం అని స్పష్టంగా అర్థమౌతోంది. దేవుడున్నాడు. పైనుండి చూస్తున్నాడు. ఒకరోజు వస్తుంది. ఆరోజున తెలుగుజాతి అతి శక్తిమంతమైన ఓటు ద్వారా ఈ కుటిల పాలకులకు బుద్ధి చెబుతుంది.
డా. రాజశేఖరరెడ్డిగారు ప్రవేశపెట్టిన పథకాలను, ఆయన ఆశయాలను, లక్ష్యాలను తెలుగు గడ్డపై శాశ్వతంగా కొనసాగించగల శక్తిమంతుడు ఒక్క జగన్‌గారే. తండ్రి పీఠంపై తనయుడు పాలనా పగ్గాలు చేపట్టాలని ప్రతి తెలుగు పల్లె, అన్నివర్గాల ప్రజానీకంతోపాటు మా కుటుంబం కూడా ఆకాంక్షిస్తోంది. స్వాగతిస్తోంది. మా కుటుంబానికి వెలుగిచ్చిన దీపం, ఆ పెద్దాయన మరణంతో ఆగిపోతే ‘మీ కుటుంబానికి నేనున్నాను, మీ పెద్దన్నగా’ అని ధైర్యం చెప్పిన జగన్‌గారి నాయకత్వం కోసం మేము, మాలాంటి ఎన్నో కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి.
సీబీఐ ఎన్ని ఎంక్వయిరీలు వేసినా, కాంగ్రెస్, టీడీపీ లాంటి స్వార్థపూరిత రాజకీయపార్టీలు ఉమ్మడిగా ఎన్ని ప్రణాళికలు రచించినా, వారి పాచికలు పారవు. దివంగతనేత డా. వై.ఎస్.రాజశేఖరరెడ్డిగారి కుటుంబంపైన ప్రజలకున్న నమ్మకం, విశ్వాసం ముందు రేపు వచ్చే ఎన్నికలలో అన్ని పార్టీలు తలవంచక తప్పదు. అందుకు నిదర్శనమే షర్మిలమ్మ గారి ‘మరోప్రజాప్రస్థాన పాదయాత్ర’కు తండోపతండాలుగా వస్తున్న జనం. ఆ ప్రభంజనం చరిత్రలో సువర్ణాక్షరాలతో రాయదగ్గది. తన అన్న అనుసరించిన పోరుబాటకు రహదారి వేస్తున్న ఈ బహుదూరపు బాటసారికి పల్లెపల్లె నీరాజనం పడుతోంది. అందుకే మాలాంటి కుటుంబాలలో వెలుగులు నింపే జగన్‌గారి నాయకత్వపు సుపరిపాలన ఆంధ్రనాట తథ్యం... తథ్యం. అన్నార్తుల జీవనప్రదాత జగన్‌గారు త్వరలోనే విడుదలవ్వాలని మేమంతా కోరుకుంటున్నాం.
- పి.శ్రీను, వైయస్సార్ అభిమాని
అన్నదేవరపేట గ్రామం, పశ్చిమగోదావరి జిల్లా
0 comments:
Post a Comment