104లో 1200 మంది తొలగింపు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 104లో 1200 మంది తొలగింపు

104లో 1200 మంది తొలగింపు

Written By ysrcongress on Tuesday, February 28, 2012 | 2/28/2012

తొలగించినవారికి రాజీవ్ యువ కిరణాల కింద ఉద్యోగాలిస్తామని వెల్లడి
విధిలేని పరిస్థితుల్లో ఒప్పుకున్న సిబ్బంది

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఉద్యోగులందరికీ భద్రత కల్పించాలని, జీవో నం.3 ప్రకారం వేతనాలు చెల్లించాలని మూడున్నర నెలలుగా సమ్మె చేస్తున్న 104 ఉద్యోగులకు ప్రభుత్వం చావుకబురు చల్లగా చెప్పింది. 104 ఎఫ్‌డీహెచ్‌ఎస్ (ఫిక్స్‌డ్ డే హెల్త్ సర్వీసెస్) సేవల నుంచి 1,200 మందిని తొలగించక తప్పదని స్పష్టంచేసింది. సోమవారం 104 ఉద్యోగుల తరఫున సీపీఎం ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సర్కారు తరఫున మంత్రులు కొండ్రుమురళి, శైలజానాథ్, డిప్యూటీ స్పీకర్ భట్టి విక్రమార్కలు సచివాలయంలో చర్చలు జరిపారు. 

ఈ సందర్భంగా మంత్రి కొండ్రు మురళి.. కమిటీ నివేదిక ఆధారంగా 1,200 మంది ఉద్యోగులను తొలగించక తప్పదని కుండబద్దలు కొట్టారు. 2,274 మందిని మాత్రమే తిరిగి విధుల్లోకి తీసుకుంటామని, వారికి జీవో నెం.3 ప్రకారం వేతనాలు చెల్లిస్తామన్నారు. సమ్మె కాలానికి జీతాలు ఇవ్వలేమని కూడా స్పష్టంచేశారు. వారం రోజుల్లో 1,200 మందిని తొలగించే ప్రక్రియ పూర్తవుతుందని, మిగతా వారు ఆరోజు నుంచి విధుల్లోకి రావాలని సూచించారు. తొలగించిన వారికి రాజీవ్ యువకిరణాల్లో ఉద్యోగం కల్పించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. 104 పథకం ఉద్యోగ ప్రక్రియలో వీలైనంత వరకూ ‘రూల్ ఆఫ్ రిజర్వేషన్’ కూడా పాటిస్తామని పేర్కొన్నారు. ఉద్యోగుల తొలగింపుపై సర్కారు మెట్టు దిగకపోవడంతో ఉద్యోగులు విధిలేని పరిస్థితుల్లో ఒప్పుకోవాల్సి వచ్చింది. అయితే ఎవరిని తొలగిస్తారు, ఎవరిని విధుల్లోకి తీసుకుంటారోనని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. రాజీవ్ యువకిరణాల పథకమే అనుమానాస్పదంగా ఉండటంతో తొలగించిన వారికి ఉద్యోగం కల్పిస్తారో లేదోనన్న భయంతో ఉన్నారు. చర్చల్లో వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సుధీర్, ప్రత్యేకాధికారి అప్పారావు తదితరులున్నారు.
Share this article :

0 comments: