‘కొన్ని రకాల వస్తువులపై పన్నులను పెంచుతాం. ఆందోళనలు చేయకుండా సహకరించండి’ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ‘కొన్ని రకాల వస్తువులపై పన్నులను పెంచుతాం. ఆందోళనలు చేయకుండా సహకరించండి’

‘కొన్ని రకాల వస్తువులపై పన్నులను పెంచుతాం. ఆందోళనలు చేయకుండా సహకరించండి’

Written By ysrcongress on Tuesday, February 28, 2012 | 2/28/2012

సహకరించండి... విపక్షాలకు సీఎం విజ్ఞప్తి
‘ఇందిర జలప్రభ’ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు పెడతామని వెల్లడి

హైదరాబాద్, న్యూస్‌లైన్: పన్నుల మోత మోగించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ‘కొన్ని రకాల వస్తువులపై పన్నులను పెంచుతాం. ఆందోళనలు చేయకుండా సహకరించండి’ అంటూముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి విపక్షాలకు విజ్ఞప్తి చేశారు. ఇందిర జలప్రభ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు బిగించనున్నట్లు తెలిపారు. ఇలాంటి విషయాలను రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలని సూచించారు. రాష్ర్టంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించాలంటే...నిధులు కావాలి...అందుకోసం పన్నులు పెంచక తప్పదని సీఎం అన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మండలిలో జరిగిన చర్చకు సీఎం సోమవారం సమాధానమిచ్చారు. రాష్ట్రంలో అమల్లో ఉన్న జలయజ్ఞం, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉచిత కరెంట్, కిలో రూపాయి బియ్యం వంటి పలు కార్యక్రమాలను ప్రస్తావించారు. వీటిని ముందుకు తీసుకెళ్లాలంటే నిధులు కావాలని, అందుకోసం కొన్ని వస్తువులపై పన్నులను పెంచక తప్పని పరిస్థితి ఉందని చెప్పారు. 

మద్యం, వస్త్రాలు, సిగరెట్లు తదితర వస్తువులపై పన్నులు పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు సహకరించాలని, ఎలాంటి ఆందోళనలకు దిగరాదని కోరారు. రాష్ర్టంలో 29 లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయని, వీటికి మీటర్లను బిగించడం ద్వారా ఎంత మేర విద్యుత్ వృథా అవుతుందో తెలుసుకుందామనుకుంటే.. ప్రభుత్వం ఉచిత విద్యుత్‌ను ఎత్తివేయనుందంటూ ప్రచారం చేశారన్నారు. ప్రస్తుతం విద్యుత్ డిమాండ్‌కు సరఫరాకు మధ్య తేడా ఉందని, అదనపు విద్యుత్ ఉత్పత్తిని చేయడానికి సర్కారు ప్రయత్నిస్తోందన్నారు. నగరాల్లో విద్యుత్ ఆదాకు సంబంధించిన పరికరాలను ఏర్పాటు చేస్తేనే భవన నిర్మాణాలకు అనుమతులిచ్చే ప్రతిపాదనను అమలు చేయనున్నట్లు సీఎం తెలిపారు. ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వస్తే...మీడియా, ప్రతిపక్షాలతో ఇబ్బంది ఎదురవుతోందంటూ.. ఇలాంటి విషయాల్లో అన్ని పార్టీలు రాజకీయాలను పక్కన పెట్టి ఆలోచించాలని కోరారు.
Share this article :

0 comments: