సువర్ణయుగంలో సారాలేని పల్లెలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సువర్ణయుగంలో సారాలేని పల్లెలు

సువర్ణయుగంలో సారాలేని పల్లెలు

Written By ysrcongress on Monday, February 27, 2012 | 2/27/2012

గుంటూరు ఓదార్పులో మహిళలకు జగన్‌మోహన్‌రెడ్డి హామీ
మద్యంపై అసెంబ్లీలో ఒకరినొకరు తిట్టుకుంటున్నారు
మీ వాళ్లే మద్యం అమ్ముతున్నారని ఒకరంటే.. 
మీ కొడుకే దొరికిపోయాడని ఇంకొకరంటున్నారు
నిజానికి ఆ రెండు పార్టీలవారూ బెల్టు దుకాణాలు పెట్టి మరీ అమ్ముతున్నారు
అందులో 20 మంది మంత్రులు కూడా ఉన్నారు
నేను వీళ్లలా డ్రామాలు చేయలేను.. ప్రజలను వంచించలేను
సువర్ణయుగంలో సారా, బ్రాందీలు లేని పల్లెలను తయారుచేద్దాం
పిల్లలను గొప్ప చదువులు చదివిద్దాం..

ఓదార్పు యాత్ర నుంచి న్యూస్‌లైన్ ప్రత్యేక ప్రతినిధి
‘‘నా తమ్ముడు అధికారంలో ఉండగా.. నాకింకా ఏమి అవసరం లేదు అని ప్రతి అక్కాచెల్లెమ్మ చెప్పుకునే సువర్ణయుగం త్వరలోనే వస్తుంది. ఆ దేవుడు మీద ఉన్న నమ్మకం, విశ్వాసంతో నేను చెప్తున్నా. ఆ సువర్ణయుగంలో సారా, బ్రాందీలేని పల్లెలే ఉంటాయి..’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మహిళలకు హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లాలో 67వ రోజు ఓదార్పు యాత్రలో భాగంగా ఆదివారం ఆయన వినుకొండ, నూజెండ్ల మండలాల్లోని పలు గ్రామాల్లో పర్యటించారు. కొత్త త్రిపురాపురంలో కంభంపాటి అచ్చమ్మ కుటుంబాన్ని ఓదార్చారు. గంగులపాలెం మాజీ సర్పంచ్ రావూరి నారాయణ కొడుకు నాగేశ్వర్‌రావు, అల్లుడు వెంకట్రావు శనివారం రాత్రి రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఆసుపత్రి మార్చురీలో ఉన్న వారి మృతదేహాలను జగన్ సందర్శించారు. రావూరి నారాయణను పరామర్శించారు. వినుకొండ బాలాజీ ఎస్టేట్‌లో ఏర్పాటు చేసిన వైఎస్సార్ ధ్యాన మందిరంతోపాటు 14 వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించారు. పలు గ్రామాల్లో ప్రసంగించారు. ఈ ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే..


మన పిల్లలు పెద్దపెద్ద చదువులు చదవాలి..

ఇవాళ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్లకు, నారా చంద్రబాబునాయుడు పార్టీకి చెందిన వాళ్లకు వాగ్వాదం జరుగుతోంది. ఒకరంటారూ.. మీ వాళ్లతోనే మద్యం అమ్మిస్తున్నారని! రెండో వాళ్లు అంటారూ.. నీ కొడుకే మద్యం అమ్మిస్తున్నాడు, మద్యంతో దొరికిపోయాడని! రకరకాల తిట్లు తిట్టుకుంటున్నారు. కానీ వాస్తవం ఏమిటంటే.. చంద్రబాబునాయుడు పార్టీకి చెందినవాళ్లు, కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్లు చివరకు మంత్రులతో సహా దాదాపు 60 మంది శాసన సభ్యులు, 20 మంది మంత్రులు బెల్టు దుకాణాలు పెట్టి మందు అమ్మిస్తున్నారు. సారా అమ్ముతున్నారు. ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న ఒకాయన అంటారూ.. మద్యంను ఈ నెలకంటే వచ్చేనెల కనీసం 15 శాతం ఎక్కువ మందికి తాగించాలీ అని... ప్రతిపక్ష నాయకుడేమో.. కాదు.. కాదు మద్యం చాలా ఎక్కువ రేటుకు అమ్ముతున్నారు.. నేను అధికారంలోకి వస్తే సరసమైన ధరలకే ప్రతి ఇంటికీ మద్యం అందుబాబులోకి తెస్తాను అని చెబుతున్నారు. మన ఖర్మ ఏమిటంటే.. ఇలాంటి నాయకులు ఒకరు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు. ఇంకొకరేమో ప్రతిపక్షంలో ఉన్నారు. 

నేను ప్రతి అక్కకూ, ప్రతి చెల్లెమ్మకూ చెబుతున్నా. వాళ్ల మాదిరిగా నేను అసెంబ్లీలో డ్రామాలు చేయలేను. వాళ్ల మాదిరిగా కుమ్మక్కైన రాజకీయాలు చేస్తూ ప్రజలను మోసం చేయడం నాకు చేత కాదు. వాళ్లలా కుట్రలు, కుతంత్రాలతో కనికట్లు చేస్తూ ప్రజలను వంచించే ఆలోచన చేయలేను. కానీ ఒక్కమాటైతే కచ్చితంగా చెబుతున్నాను. త్వరలోనే ఒక సువర్ణయుగం వస్తుంది. ఆ సువర్ణ యుగంలో వెయ్యి మంది నివాసం ఉండే ప్రతి గ్రామంలో పది మంది అక్కాచెల్లెమ్మలను ఆడపోలీసులుగా తయారు చేస్తాను. మన ఊరిలో బ్రాందీ దుకాణం ఉండకూడదు. మన పల్లెల్లో సారా బట్టీలు ఉండకూడదు. మన పిల్లలు బ్రాందీకి, సారాకు దూరంగా ఉండాలి. మన పిల్లలు గొప్ప గొప్ప చదువులు చదవాలి. ఇంజనీర్లు కావాలి.. డాక్టర్.. కలెక్టర్ కావాలి.. పెద్దపెద్ద చదువులు చదవాలి. వాళ్లను అలా చదివించగలిగితేనే మనం పేదరికం నుంచి బయటపడతాం.
నాయకుడు అంటే ఎలా ఉండాలో తెలుసుకోండి..

ఒక నాయకుడు బతికి ఉన్నప్పుడేగాకుండా చనిపోయిన తరువాత కూడా ఆయన చేసినా మంచి పనులను ప్రజలు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఆయన చనిపోయిన తరువాత కూడా ఇవాళ ఆ నాయకుడు ఎక్కడ ఉన్నాడని అడిగితే.. గుండెలు చూపించి, గర్వంగా మా గుండెలోతుల్లో బతికే ఉన్నాడని చెప్పుకునే పరిస్థితి ఉంది. నాయకుడు అంటే.. మనిషంటే ఆ మాదిరిగా ఉండాలని చంద్రబాబునాయుడు, కాంగ్రెస్ పార్టీ పెద్దలు తెలుసుకుంటే మంచిదని చెబుతున్నా.

అన్నా.. ఆ ప్రాజెక్టు నాన్నే కట్టించారు!

సాగునీటికి పెద్దపీట వేస్తూ రైతన్నల సంక్షేమమే ధ్యేయంగా దివంగత వైఎస్ చేపట్టిన ప్రాజెక్టుల్లో ఉప్పలపాడు ఎత్తిపోతల ఒకటి. ఈ ప్రాజెక్టు ఇప్పుడు 1,040 ఎకరాలకు నీళ్లు అందిస్తోంది. ఓదార్పు యాత్రలో భాగంగా ఆదివారం జగన్ ఈ గ్రామానికి వెళ్లినప్పుడు అక్కడి రైతన్నలు ఆయనతో మాట్లాడారు. ‘‘అన్నా...! అదిగో ఎదురుగా కనిపిస్తున్న కొండల మధ్య ఉప్పలపాడు లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టు ఉంది. నాన్నగారే రూ.5 కోట్లు పెట్టి కట్టించాడు. ఇప్పుడు 1,040 ఎకరాలకు నీళ్లు పారుతున్నాయన్నా’’ అని చెప్పారు. అందుకు జగన్ స్పందిస్తూ... ‘‘వైఎస్సార్ కంటే ముందు చాలా మంది ముఖ్యమంత్రులు వచ్చారు. కానీ ఏ ఒక్కరు కూడా ఆ ప్రాజెక్టును కట్టించాలని అనుకోలేదు. ఒక్క దివంగత నేత మాత్రమే ఈ ప్రాజెక్టును కట్టించారు. ఇవాళ ఉప్పలపాడు లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టు నుంచి గలగల నీళ్లు పారుతున్నప్పుడు... రైతన్నలు, వ్యవసాయ కూలీల ముఖంపై విరిసే ప్రతి చిరునవ్వులో వైఎస్సార్ కనిపిస్తూనే ఉంటారు’’ అని అన్నారు.
Share this article :

0 comments: