రామోజీ సాగించిన కబ్జాకాండ బయటపడుతోంది - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రామోజీ సాగించిన కబ్జాకాండ బయటపడుతోంది

రామోజీ సాగించిన కబ్జాకాండ బయటపడుతోంది

Written By ysrcongress on Thursday, March 1, 2012 | 3/01/2012

అమ్మకపోతే ఇబ్బందులు తప్పవంటూ బెదిరించారు
ఎకరానికి రూ. 5 వేలు చెల్లించి సంతకాలు తీసుకున్నారు
మా భూములు మాకు తిరిగిస్తే మళ్లీ సాగు చేసుకుంటాం
రంగారెడ్డి జిల్లా అనాజ్‌పూర్ గ్రామస్తుల ఆవేదన

హైదరాబాద్, న్యూస్‌లైన్: భూ దాహంతో... చట్టాలన్నిటికీ పాతరేసి... నిబంధనలన్నిటినీ కాలరాసి రామోజీరావు నిర్మించిన ఫిలిం సిటీలో... బయటకు రాకుండా దాక్కున్న అసైన్డ్ భూముల బాగోతాలు మెల్లగా వెలుగు చూస్తున్నాయి. భూములు అమ్మాల్సిందేనంటూ పేద రైతుల్ని, తనవైపు కన్నెత్తి కూడా చూడటానికి వీల్లేదంటూ అధికారుల్ని... బెదిరించి మరీ నిర్నిరోధంగా రామోజీ సాగించిన కబ్జాకాండ బయటపడుతోంది. అనాజ్‌పూర్ గ్రామంలో ఎస్సీ, బీసీల కోసం ప్రభుత్వమిచ్చిన అసైన్డ్ భూములను ఎకరా రూ.5 వేల చొప్పున కారుచౌకగా తన ఖాతాలో వేసేసుకున్నారు రామోజీ. కాకపోతే శంషాబాద్ విమానాశ్రయం పక్కన పాల్మాకుల గ్రామంలో 350 ఎకరాల్ని సొంతం చేసుకున్న రీతిలోనే.. తన చేతులకు నేరుగా మట్టి అంటకుండా ఫిలిం సిటీలోని అసైన్డ్ భూముల్ని కూడా తొలుత తన బినామీల ద్వారా కొనిపించటం, తరవాత ఇతరుల పేర్ల మీదికి బదలాయించటం ఇక్కడ అన్నిటికన్నా విశేషం. అలా రెండు మూడు పేర్ల మీద మారిన తరవాత చివరిగా తన కుటుంబీకుల పేర్లమీదికో, తన కంపెనీల పేర్లమీదికో బదలాయించారు రామోజీ. అనాజ్‌పూర్‌లోని సర్వే నెం 275, 281ల్లోని మిగులు భూమిని గ్రామంలోని సుమారు 120 మందికి ఒక్కొక్కరికి ఎకరం చొప్పున ప్రభుత్వం కేటాయించగా.. దాన్ని రామోజీ ఎకరా రూ.5 వేలకే కొనుగోలు చేశారు. అమ్మబోమని చెప్పిన వారిని బెదిరించారని, అందుకోసం ప్రత్యేకంగా మనుషుల్ని పెట్టారని స్థానికులు వాపోయారు. ఈ భూముల బాగోతంపై సోమవారం ‘సాక్షి’లో కథనం వెలువడిన నేపథ్యంలో వారు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ప్రభుత్వమిచ్చిన భూమిని రామోజీ తీసుకోవడంతో తామంతా కూలి పనులు చేసుకుంటున్నామని వాపోయారు. తమ భూములు తమకు తిరిగిస్తే సాగు చేసుకుంటామన్నారు. ఇంకా వారేమన్నారంటే...


అమ్మకుంటే ఇబ్బందులకు గురిచేశారు...

సర్వే నంబర్ 281లో నాకు ఎకరం భూమి ఉండేది. దాన్ని కొనేందుకు ఫిలిం సిటీ సిబ్బంది ఎంతో ప్రయత్నం చేశారు. భూమి అమ్మేందుకు నిరాకరిస్తే వారి భూమిలోంచి వెళ్లనివ్వకుండా అడ్డంగా గొయ్యి తీసి ఇబ్బంది పెట్టారు. భూమి అమ్మని వారిని ఫిలిం సిటీ యాజమాన్యం ఇబ్బందులకు గురిచేయడంతో రైతులు చేసేదిలేక భూమిని అమ్ముకోవాల్సి వచ్చింది.

- రాగిని వీరయ్య, అనాజ్‌పూర్

మా భూములు మాక్కావాలి..

అప్పట్లో మాకు భూమి విలువ తెలియదు. రూ.5 వేలకే ఎకరా చొప్పున ఫిలిం సిటీకి ఇచ్చేశాం. మా దగ్గరున్న పట్టా సర్టిఫికెట్లు తీసుకుని డబ్బులు చేతిలో పెట్టారు. అప్పటి నుంచి భూమి వద్దకు వెళ్లలేదు. భూమి లేకపోవడంతో గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికునిగా పని చేస్తున్నాను. అధికారులు స్పందించి మేం కోల్పోయిన భూములను మాకు తిరిగి ఇప్పించాలి.

- ఏర్పుల బాలయ్య, అనాజ్‌పూర్

భూములు తిరిగిస్తే సాగు చేసుకుంటాం...

ప్రభుత్వమిచ్చిన భూమిని ఫిలిం సిటీ యాజమాన్యం నామమాత్రంగా డబ్బులిచ్చి లాక్కోవడంతో ఉపాధిని కోల్పోయాం. కూలీ చేసుకు జీవిస్తున్నాం. అధికారులు స్పందించి భూమి తిరిగిప్పిస్తే సాగు చేసుకుంటాం.

-కట్ట చిన్న కిష్టమ్మ, అనాజ్‌పూర్

అమాయకులను చేసి రూ.5వేలకు ఎకరం 

భూమి అమ్మాలంటూ దళారులు మభ్యపెట్టారు. రూ.5 వేలకే అమ్ముకోవాల్సి వచ్చింది. ఎవరికి అమ్ముతున్నారో కూడా చెప్పకుండా దళారులు పట్టా సర్టిఫికెట్లు తీసుకుని రామోజీరావుకు ఇచ్చేశారు. మా పిల్లలు ఉపాధి లేక జీతాలు చేస్తున్నారు. నేను కూడా గ్రామ పంచాయతీలో స్వీపర్‌గా పని చేస్తున్నాను. తిరిగి మాకు భూములిప్పిస్తే పిల్లలతో కలిసి వ్యవసాయం చేసుకుంటాం.

-కట్ట పెద్ద యాదమ్మ, అనాజ్‌పూర్

ఫిలింసిటీలో ప్రభుత్వ భూమి ఉంది...

రామోజీ ఫిలిం సిటీ యాజమాన్యం అనేక మంది నుంచి అసైన్డ్ భూములను కొనుగోలు చేసింది. అవేగాకుండా ప్రభుత్వ భూమి కూడా ఫిలిం సిటీ అధీనంలో ఉంది. నేను కూడా రూ.6 వేలకు ఎకరం భూమిని 15 ఏళ్ల క్రితం ఫిలిం సిటీకి చెందిన సూపర్‌వైజర్ వెంకటరత్నానికి ఇచ్చేశా. ప్రస్తుతం ఉపాధి హామీ పథకంలో కూలి పని చేస్తున్నాను.

- ఏర్పుల శివయ్య, అనాజ్‌పూర్

పట్టా ఇచ్చినా దళారులే అమ్ముకున్నారు...

ప్రభుత్వం నా పేరుతో పట్టా సర్టిఫికెట్ ఇచ్చినా కొందరు దళారులు దాన్ని నాకివ్వలేదు. నా సంతకం లేకుండానే ఫిలిం సిటీ యాజమాన్యానికి అమ్మేశారు. గ్రామ పెద్దలను అడిగినా పట్టించుకోలేదు. ఇప్పటికైనా అధికారులు అప్పట్లో ఇచ్చిన లబ్ధిదారులందరికి తిరిగి భూమిని కేటాయించి పాస్ పుస్తకాలు అందజేయాలి.

- సిలివేరు సుశీల, అనాజ్‌పూర్
Share this article :

0 comments: