త్వరలో మళ్లీ ‘పెట్రో’ మంట - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » త్వరలో మళ్లీ ‘పెట్రో’ మంట

త్వరలో మళ్లీ ‘పెట్రో’ మంట

Written By ysrcongress on Tuesday, February 28, 2012 | 2/28/2012

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత.. 
పెట్రోల్, డీజిల్‌పై రూ. 2-4 భారం

న్యూఢిల్లీ: త్వరలోనే మళ్లీ ‘పెట్రో’ మంట సోకనుంది. ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత చమురు కంపెనీలు వినియోగదారులకు ‘పెట్రో’వాత వడ్డించనున్నాయి. ఇప్పటికే పెట్రోల్ అమ్మకాలపై లీటరుకు రూ. 4 మేరకు నష్టాన్ని చవి చూస్తున్నామని ప్రభుత్వరంగ చమురు కంపెనీలు చెబుతున్న నేపథ్యంలో, పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ. 2 నుంచి రూ. 4 వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. చమురు కంపెనీలు చివరిసారిగా గత డిసెంబర్ 1న పెట్రోలు ధరలను సవరించాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు చమురు పరిశ్రమకు పెట్రోల్ అమ్మకాల ద్వారా రూ.900 కోట్ల మేరకు నష్టం వాటిల్లిందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. 

అంతర్జాతీయ మార్కెట్‌లో గత డిసెంబర్ 1 నాటికి ముడి చమురు బ్యారల్ 109 డాలర్లు (రూ.5,341) ఉండగా, ప్రస్తుతం 125 డాలర్లకు (రూ.6,125) పెరిగిందని, అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక పెట్రోలు ధరలు పెరిగే అవకాశాలు కచ్చితంగా ఉన్నాయని ఇంధన శాఖ అధికారి ఒకరు చెప్పారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు మార్చి 12న ప్రారంభం కానుండగా, అంతకు ముందే డీజిల్ ధరలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నట్లు మరో అధికారి తెలిపారు. మంత్రుల బృందం సమావేశంలో డీజిల్ ధరల పెంపుపై నిర్ణయం తీసుకోవచ్చని చెప్పారు. పెట్రోల్ ధరలపై 2010 జూన్‌లోనే ప్రభుత్వం నియంత్రణను ఎత్తివేసినందున, పెట్రోల్ ధరలను చమురు కంపెనీలు తమంతట తామే పెంచనున్నాయి. కాగా, ప్రభుత్వరంగ చమురు కంపెనీలకు డీజిల్ అమ్మకాలపై లీటరుకు రూ. 12.77, కిరోసిన్‌పై లీటరుకు రూ.30.21, వంటగ్యాస్ సిలిండర్‌పై రూ.378 మేరకు నష్టం వాటిల్లుతోందని అధికారులు చెబుతున్నారు. గత డిసెంబరు 1న పెట్రోల్ ధరలను లీటరుకు 0.78 తగ్గించడంతో ఢిల్లీలో పెట్రోల్ లీటరు ధర ప్రస్తుతం రూ.65.64 కాగా, డీజిల్ ధర లీటరుకు రూ.40.91గా ఉంది.
Share this article :

0 comments: