ఐఎంజీకి భూ కేటాయింపులపై దర్యాప్తు చేసేలా సీబీఐని ఆదేశించండి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఐఎంజీకి భూ కేటాయింపులపై దర్యాప్తు చేసేలా సీబీఐని ఆదేశించండి

ఐఎంజీకి భూ కేటాయింపులపై దర్యాప్తు చేసేలా సీబీఐని ఆదేశించండి

Written By ysrcongress on Friday, March 2, 2012 | 3/02/2012

వేల కోట్ల విలువైన భూములను బాబు ఐఎంజీకి కట్టబెట్టారు
కేవలం రూ.లక్ష మూలధనమున్న కంపెనీకి 850 ఎకరాలు.. కారుచౌకగా కేవలం రూ.3 కోట్లకే ధారాదత్తం చేశారు
సీబీఐ దర్యాప్తును సీవీసీ పర్యవేక్షించేలా ఆదేశించండి

హైదరాబాద్, న్యూస్‌లైన్: అత్యంత ఖరీదైన 850 ఎకరాల భూమిని ఐఎంజీ భారత అకాడమీస్ (ఐఎంజీబీ)కి చంద్రబాబు ప్రభుత్వం కేవలం రూ.3 కోట్లకే కేటాయించిన వైనంపై దర్యాప్తు చేసేలా సీబీఐని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. సీనియర్ పాత్రికేయుడు ఏబీకే ప్రసాద్, ఆడిటర్ వి.విజయసాయిరెడ్డి దీన్ని దాఖలు చేశారు. కేవలం రూ.లక్ష మూలధనమున్న ఐఎంజీబీకి వేల కోట్ల విలువైన 850 ఎకరాలను చంద్రబాబు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హోదాలో కారుచౌకగా కట్టబెట్టారని అందులో పేర్కొన్నారు. ఐఎంజీబీకి, ప్రభుత్వానికి మధ్య కుదిరిన ఒప్పందాలు, కల్పించిన రాయితీలు తదితరాలపై సీబీఐ దర్యాప్తుకు, దానిపై కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) పర్యవేక్షణకు ఆదేశించాలని కోర్టును కోరారు. ఈ కేసు దర్యాప్తుకు అవసరమైన వనరుల వివరాలను కోర్టు ముందుంచేలా సీబీఐని ఆదేశించాలని కూడా అభ్యర్థించారు. కేంద్ర, రాష్ట్ర హోం శాఖ కార్యదర్శులు, సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ (సీవీసీ), సీబీఐ డైరెక్టర్, ఐఎంజీబీ తదితరులను ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేర్చారు.

కేవలం రూ.3 కోట్లకే 850 ఎకరాలు...

‘‘రంగారెడ్డి జిల్లా, కంచగచ్చబౌలి గ్రామంలో 400 ఎకరాలను ఎకరా రూ.50 వేలు, మామిడిపల్లి గ్రామంలో 450 ఎకరాలను ఎకరా రూ.25 వేల చొప్పున ఐఎంజీబీకి చంద్రబాబు ప్రభుత్వం కేటాయించింది. వాస్తవానికి ఆ ప్రాంతాల్లో అప్పట్లో ఎకరా రూ.3 కోట్లపైనే ఉంది. అయినా వేల కోట్ల విలువ చేసే ఆ భూములను ఐఎంజీబీకి నామమాత్రపు ధరకు కట్టబెట్టారు. ఇందుకు సంబంధించి 2004 ఫిబ్రవరి 10న ఐఎంజీబీతో చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందంలోని ప్రతి అంశాన్నీ ఐఎంజీబీకే లబ్ధి చేకూర్చేలా రూపొందించారు. ఈ ఒప్పందం ద్వారా ఖజానాకు పైసా ఆదాయం రాకపోగా కోట్లలో నష్టం కలిగింది. కోట్లాది రూపాయల ప్రజాధనంతో కట్టిన స్టేడియాలను ఐఎంజీబీకి అప్పనంగా అప్పగించేలా ఒప్పందం చేసుకున్నారు. పైగా వాటి నిర్వహణకు ఏటా రూ.2.5 కోట్లను ఐఎంజీబీకి ఎదురు చెల్లించేలా నిబంధనలు రూపొందించారు! తొందరపాటుతో, పారదర్శకత లేకుండా ఈ మొత్తం ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. 2004లో సాధారణ ఎన్నికలకు ముందు ఈ తతంగమంతా జరిగింది. రాజకీయ ప్రయోజనాల కోసమే చంద్రబాబు ప్రభుత్వం ప్రజాప్రయోజనాలను తాకట్టు పెట్టింది. తద్వారా ఖజానాకు రూ.7,000-8,000 కోట్ల దాకా నష్టం కలిగించింది. ఈ ఒప్పందం కుదుర్చుకునే నాటికి ఐఎంజీబీ మూలధనం కేవలం రూ.లక్ష! ఎలాంటి టెండర్లూ లేకుండా, నోటిఫికేషన్ కూడా జారీ చేయకుండా తమవారికి కావాల్సిన విధంగా బాబు ప్రభుత్వం భూములు కట్టబెట్టింది. ఈ విషయంలో అత్యంత బాధ్యతారాహిత్యంతో వ్యవహరించింది. 2004లో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ ఒప్పందాన్ని రద్దు చేసింది. ఆ మేరకు చట్టం కూడా చేసింది. దాన్ని సవాలు చేస్తూ 2006లో ఐఎంజీబీ హైకోర్టును ఆశ్రయించింది. అప్పటినుంచీ అది హైకోర్టులో పెండింగ్‌లో ఉంది’

జీవో ఇచ్చినా దర్యాప్తు ఊసే లేదు

‘‘వేల కోట్ల విలువైన 850 ఎకరాలను నామమాత్రపు ధరకు కట్టబెట్టడం వెనుక నాటి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాధికారులు నమ్మకద్రోహానికి, కుట్రకు, మోసానికి పాల్పడ్డారనే ఉద్దేశంతో మొత్తం భూ కేటాయింపులపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశిస్తూ 2006 డిసెంబర్ 13న ప్రభుత్వం జీవో 310ను జారీ చేసింది. దాని ప్రకారం ఐఎంజీబీ వ్యవహారంపై దర్యాప్తు ప్రారంభించాల్సిన సీబీఐ, ఇప్పటిదాకా ఆ పని చేయనే లేదు. బాబు అక్రమాస్తులపై సీబీఐ దర్యాప్తు కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వైఎస్ విజయమ్మ, ఐఎంజీబీ విషయంలో సీబీఐ నిర్లక్ష్య వైఖరిని కూడా అందులో ప్రశ్నించారు. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం గానీ, సీబీఐ గానీ ఎలాంటి కౌంటరూ దాఖలు చేయలేదు. విజయమ్మ పిటిషన్ పెండింగ్‌లో ఉండగానే, ఐఎంజీ కేసులో సీబీఐ దర్యాప్తు చేపట్టకపోవడంపై ఓ న్యాయవాది సమాచార హక్కు చట్టం ద్వారా ఆ సంస్థ వివరణ కోరారు. 

తమ వద్ద తగిన వనరులు లేవని, అందుకే దర్యాప్తు చేపట్టడం లేదని సీబీఐ సమాధానమిచ్చింది. ప్రజాప్రతినిధులు, అధికారుల అధికార దుర్వినియోగానికి సంబంధించిన వ్యవహారాల్లో వనరుల కొరత ఉందని చెప్పేందుకు అవకాశం లేదు. సీబీఐకి అవసరమైన వనరులను సమకూర్చాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. ఇలా కావాల్సిన వారి విషయంలో ఒకలా, ఇతరుల విషయంలో మరోలా సీబీఐ వ్యవహరించడం సరికాదు. ఎంపిక చేసుకున్న పద్ధతిలో సంస్థ వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది. దర్యాప్తు చేపట్టకపోవడానికి సీబీఐ చెప్పిన కారణం ఎంత మాత్రం సహేతుకం కాదు. 

ఈ మొత్తం వ్యవహారం వేల కోట్ల రూపాయల ప్రజాధనంతో ముడిపడి ఉంది. రాజకీయ నాయకుల పక్షపాతం, అధికారుల అధికార దుర్వినియోగం ఉన్నాయి. ఐఎంజీ కేసులో తాము దర్యాప్తు చేయలేమనే విషయాన్ని విజయమ్మ పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు దృష్టికి సీబీఐ తీసుకురాలేదు. తద్వారా హైకోర్టును కూడా సంస్థ తప్పుదోవ పట్టించినట్టయింది. అందువల్లే ఈ పిటిషన్ ద్వారా వాస్తవాలను కోర్టు దృష్టికి తీసుకొస్తున్నాం’’ అని వారు వివరించారు. ఈ కేసులో దర్యాప్తు చేపట్టేందుకు సీబీఐకి అవసరమైన వనరులను సమకూరుస్తూ నోటిఫికేషన్ జారీ చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోర్టును కోరారు. జీవో 310 ఆధారంగా దర్యాప్తు చేపట్టేలా ఆదేశించాలని కూడా అభ్యర్థించారు.
Share this article :

0 comments: