జరుగుతున్న అడ్డగోలు దాడిని న్యాయపరంగా ఎదుర్కొంటాం. ప్రజలే అండగా సంస్థను నిలబెట్టుకుంటాం. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జరుగుతున్న అడ్డగోలు దాడిని న్యాయపరంగా ఎదుర్కొంటాం. ప్రజలే అండగా సంస్థను నిలబెట్టుకుంటాం.

జరుగుతున్న అడ్డగోలు దాడిని న్యాయపరంగా ఎదుర్కొంటాం. ప్రజలే అండగా సంస్థను నిలబెట్టుకుంటాం.

Written By news on Wednesday, May 9, 2012 | 5/09/2012



ప్రజాస్వామ్య చరిత్రలో బ్లాక్‌డే ఇది. సాక్షి కరెంటు ఖాతాలను స్తంభింపజేస్తూ సీబీఐ తీసుకున్న చర్య బహుశా స్వాతంత్య్రం తర్వాత ఎమర్జెన్సీతో సహా ఎప్పుడూ దేశంలో ఏ మీడియాపైనా జరిగి ఉండదు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ఏర్పాటైన ఒక ప్రభుత్వ సంస్థే.. ఒక మీడియా సంస్థను లక్ష్యం చేసుకుని, అత్యంత ఆటవికంగా ఇలా బరి తెగించింది. సీబీఐ స్తంభింపజేసిన ఖాతాలు సంస్థ రోజువారీ కార్యకలాపాల తాలూకు ఆదాయమంతా జమయ్యే కరెంట్ ఖాతాలు. సంస్థ అవసరాలకు కూడా వాటినుంచి ఖర్చు పెడుతుంది. ఎలాంటి నోటీసులూ లేకుండా, మా వివరణ కూడా తీసుకోకుండా, ఇంత హడావుడిగా, హఠాత్తుగా, ఈ సమయంలో ఇంత అడ్డగోలుగా ఆ ఖాతాలను ఎందుకు స్తంభింపజేయాల్సి వచ్చిందన్నది మా ప్రశ్న? అసలు సాక్షి ఉనికి ఎవరికి అంత ప్రమాదకరంగా పరిణమించింది? ఇదేమైనా దేశద్రోహ కార్యకలాపాలు జరిపే సంస్థా? చట్ట వ్యతిరేక కార్యకలాపాల కేంద్రమా? రోజూ సుమారు 15 లక్షల ఇళ్లకు ఈ పత్రిక చేరుతుంది.

ఐఆర్‌ఎస్ గణాంకాలు, సర్వేల ప్రకారం సుమారు కోటీ 40 లక్షల మంది పాఠకులు సాక్షి పత్రికను చదువుతున్నారు. ఇక సాక్షి చానల్ కోట్లాది మంది వీక్షకుల ఆదరణతో రాష్ట్రంలోని వార్తా చానళ్లలో రెండు, మూడో స్థానాల్లో కొనసాగుతోంది. ఇన్ని కోట్లమంది పాఠకులు, వీక్షకుల సమాచార హక్కుపై జరిగిన దాడిగానే సీబీఐ చర్యను భావిస్తున్నాం. ఇది కేవలం సాక్షి సంస్థపైనో, ఉద్యోగులపైనో జరిగిన దాడి కాదు. ప్రజాస్వామ్యానికి మూలస్తంభంగా పరిగణించే పత్రికా వ్యవస్థపై దాడి. ఇందుకు తెగబడాల్సిన అవసరం ఎవరికుంది? సంస్థను ప్రధానంగా ప్రమోట్ చేసిన జగన్‌మోహన్‌రెడ్డిని ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేక, ఆయన్ను ఎలాగైనా సరే రాజకీయంగా సమాధి చేయాలనే అధికార పార్టీ, వారితో కుమ్మక్కైన ప్రధాన ప్రతిపక్షం దుష్ట ఆలోచనే దీని వెనకాల నిండుగా ఉంది.

వారితో పాటు.. పాఠకుల కళ్లకు గంతలు కట్టి, తాము చెప్పిందే వార్త, రాసిందే వార్త, చూపిందే వార్త అన్నట్టుగా 30, 35 ఏళ్లుగా ఇష్టారాజ్యంగా పత్రికా నిరంకుశత్వాన్ని చెలాయిస్తున్న ఒక వర్గం మీడియాకు కూడా సాక్షి గొంతు నొక్కాలన్న ఆసక్తి ఉంది. ఈ రాజకీయ, మీడియా శక్తులు రెండూ ఏకమై గత రెండేళ్లుగా జరుపుతున్న దాడికి పరాకాష్టగానే సీబీఐ చర్యను పరిగణిస్తున్నాం. అసలు సాక్షి జోలికి రావాల్సిన అవసరం సీబీఐకి ఏమొచ్చింది? రాజకీయ ప్రయోజనాలతో కొందరు నాయకులు చేసిన ఆరోపణలపై కోర్టు ఆదేశానుసారం దాదాపు 10 నెలలుగా అది చేస్తున్న విచారణ ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. విచారణ జరగడం లేదు. వేధింపులు మొదలయ్యాయి.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఎవరికో ప్రయోజనాలు కలిగిస్తే, అలా లబ్ధి పొందినవారు సాక్షిలో పెట్టుబడులు పెట్టారన్నది ప్రధానారోపణ. అలా జరిగిందో లేదో తేల్చాల్సింది ప్రభుత్వ స్థాయిలో. ఎవరైనా అలాంటి మేళ్లు పొందారని తేలితే, వారి పెట్టుబడులేమైనా సాక్షిలో ఉన్నాయేమో చూడాలి. సుప్రీంకోర్టుతో సహా ప్రతి వేదికపైనా మేం మొదటి నుంచీ ఇదే విషయం చెబుతూనే వస్తున్నాం. దీనిపై సుప్రీంకోర్టు కూడా స్పందించింది. అయాచిత లబ్ధి ఆరోపణలపై సంబంధిత మంత్రులు, ఐఏఎస్‌లకు కోర్టు నోటీసులు కూడా జారీ చేసింది. సీబీఐ ముందుగా దర్యాప్తు జరపాల్సింది వాటిపైన. ఆ తర్వాతే చార్జిషీటు దాఖలు చేయాలి. కానీ అదేమీ లేకుండానే ఇన్వెస్టర్లపై పడింది. వారితో ఒక్క ముక్కయినా చెప్పింది, ఆరోపణలను రుజువు చేసినట్టుగా చూపించి, ఆ వంకన సాక్షి గొంతు నొక్కాలనే ప్రయత్నాన్నే సీబీఐ తొలినుంచీ కొనసాగిస్తూ వస్తోంది.

వారెవరూ తాను కోరినట్లుగా చెప్పకపోవడంతో, నానాటికీ తిరుగులేని ప్రజాదరణతో దూసుకుపోతున్న సాక్షిని ఏ రకంగా అడ్డుకోవాలో ఎటూ దిక్కు తోచక, ఆఖరికి అడ్డగోలుగా బరితెగించి ఇలాంటి చర్యకు పాల్పడ్డారని భావించాల్సి వస్తోంది. న్యాయం విషయాన్ని అలా ఉంచితే, అసలు సీబీఐ చర్య కనీసం చట్టప్రకారంగా అయినా ఉందా? ఆరోపణల్లో నిజానిజాలను నిగ్గుదేల్చాల్సిన ఆ సంస్థ, అందులో ఎలాంటి ముందడుగూ వేసింది లేదు. ఆరోపణలనే యథాతథంగా ఎఫ్‌ఐఆర్‌లో పొందుపరిచింది. వాటినే ముక్కలు ముక్కలుగా చార్జిషీట్ల రూపంలో దాఖలు చేస్తోంది.

జగన్‌మోహన్‌రెడ్డికి కోర్టు సమన్లు జారీ చేసిన నేపథ్యంలో, ఇప్పుడు సీబీఐ చేయాల్సింది.. ఆరోపణలకు కోర్టులో ఆధారాలు చూపడం. కానీ అది ఓ స్వతంత్ర దర్యాప్తు సంస్థగా గాక అధికార పార్టీ చెప్పుచేతుల్లో నడుస్తూ, ఆ పార్టీకి అండగా నిలుస్తున్న శక్తుల ఆదేశానుసారం పని చేస్తుండటమే ప్రస్తుత దౌర్భాగ్య స్థితికి కారణం. కోర్టులో విచారణ పూర్తయ్యేదాకా ఆగితే కొంపలు అంటుకుపోతాయా? సాక్షిపై చేసిన ఆరోపణల్లో పస లేదని అందరికీ తెలుసు. అయినా ఇంత హఠాత్తుగా ఈ బరితెగింపు నిర్ణయం తీసుకోవడంలోనే వారి దురుద్దేశాలు ప్రస్ఫుటంగా బయట పడుతున్నాయి. కానీ ఒక్క విషయం స్పష్టం చేయదలచాం. ఈ కక్షసాధింపులతో ఏమీ చేయలేరన్నది మా నిండు విశ్వాసం. ఎందుకంటే సాక్షి జనం తమ సొంతమని భావిస్తున్న సంస్థ. దీన్ని తమ గుండెల్లో పెట్టుకునే కోట్ల మంది పాఠకులు, వీక్షకులు, అభిమానులున్నారు. ఇది తమ సమాచార హక్కుపై దాడి అని వారు గుర్తిస్తున్నారు. అదే మా ధీమా.

జరుగుతున్న అడ్డగోలు దాడిని న్యాయపరంగా ఎదుర్కొంటాం. ప్రజలే అండగా సంస్థను నిలబెట్టుకుంటాం. ఇందులో ఎలాంటి అనుమానాలకూ తావు లేదు. యాజమాన్యంతో పాటు కింది స్థాయి సిబ్బంది దాకా ప్రతి ఒక్కరూ అందుకు కంకణబద్ధులై ఉన్నారు. ప్రజాస్వామ్య ప్రేమికులంతా మాకు అండగా నిలుస్తారన్న నమ్మకముంది. ఈ దాడి ఒక్క మీడియా సంస్థతో ఆగుతుందని అనుకునేందుకు కూడా వీల్లేదు. కాబట్టి ప్రజలు, మీడియా స్వాతంత్య్రాన్ని గౌరవించే పత్రికలు, చానళ్ల అండతో పోరాటాన్ని చివరిదాకా తీసుకెళ్తాం. విజయం సాధిస్తాం.
Share this article :

0 comments: