50 ఎకరాలు కలిసి వచ్చినందుకు గనక రాంకీ సంస్థ జగన్ కంపెనీల్లో రూ.10 కోట్లు పెట్టుబడి పెట్టి ఉంటే... 2,100 ఎకరాలు కేటాయించినందుకు చంద్రబాబుకు ఏమిచ్చి ఉండాలి? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 50 ఎకరాలు కలిసి వచ్చినందుకు గనక రాంకీ సంస్థ జగన్ కంపెనీల్లో రూ.10 కోట్లు పెట్టుబడి పెట్టి ఉంటే... 2,100 ఎకరాలు కేటాయించినందుకు చంద్రబాబుకు ఏమిచ్చి ఉండాలి?

50 ఎకరాలు కలిసి వచ్చినందుకు గనక రాంకీ సంస్థ జగన్ కంపెనీల్లో రూ.10 కోట్లు పెట్టుబడి పెట్టి ఉంటే... 2,100 ఎకరాలు కేటాయించినందుకు చంద్రబాబుకు ఏమిచ్చి ఉండాలి?

Written By news on Wednesday, May 9, 2012 | 5/09/2012


* ప్రైవేటు సంస్థల్లో పెట్టుబడులు కూడదు
* ఇన్వెస్టర్లకు బయటపడే మార్గాలుండాలి
* ఒకదానికొకటి పొంతనలేని సీబీఐ వాదనలు
* ఎఫ్‌ఐఆర్‌లోని ఆరోపణలే చార్జిషీట్లో కూడా
* ‘ఈనాడు‘పై ముందుకే కదలని దర్యాప్తు సంస్థ

హైదరాబాద్, న్యూస్‌లైన్: వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించి దర్యాప్తు చేస్తున్న సీబీఐ... ఇప్పటికి మూడు చార్జిషీట్లు దాఖలు చేసింది. తొలి చార్జిషీట్లో అది చేసిన వాదనేంటంటే... హెటెరో, అరబిందో వంటి సంస్థలు వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో భూముల కేటాయింపులు పొందాయని, వాటిని తక్కువ రేట్లకు కట్టబెట్టడం వల్ల వాటికి రూ.16 కోట్ల మేర లబ్ధి చేకూరిందని, అందుకు ప్రతిఫలంగా అవి రూ.30 కోట్లు ‘సాక్షి’లో పెట్టుబడులు పెట్టాయని.. అప్పుడే అంకెలు నేర్చుకునే చిన్నపిల్లాడు సైతం నవ్విపోయే వాదన ఇది. రూ.16 కోట్ల లబ్ధికి రూ.30 కోట్ల ప్రతిఫలమనేది ఊహల్లో కూడా సాధ్యం కాని సంగతి. కానీ సీబీఐ నిరూపించింది ఇదే.

రెండో చార్జిషీట్లో...
రెండో చార్జిషీటు చూస్తే మరీ చిత్రమైన వాదన. దీన్లో అది ఇన్వెస్టర్లకేదో అన్యాయం జరిగిపోతున్నట్లు వారి తరఫున వకాల్తా పుచ్చుకుంది. వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న జగతి పబ్లికేషన్స్ సంస్థ బయటి వ్యక్తుల్ని ఆకర్షించి, కంపెనీల చట్టంలోని సెక్షన్ 3 (1)(సి)ని ఉల్లంఘించిందని, ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ ఇలా పెట్టుబడుల్ని స్వీకరించటం సరికాదని పేర్కొంది. ఇది కంపెనీ ఏఓఏ(ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్)కు కూడా ఇది వ్యతిరేకమని తెలిపింది. పెపైచ్చు అన్‌లిస్టెడ్ కంపెనీలో ఇన్వెస్టర్లు పెట్టుబడి పెడితే.. లిస్టెడ్ కంపెనీల మాదిరిగా మార్కెట్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు షేర్లు విక్రయించుకోలేరు కనక వారికి బయటపడే మార్గం (ఎగ్జిట్ రూట్) ఉండాలన్నది సీబీఐ వాదన.

పెపైచ్చు డెలాయిట్‌కు మౌఖికంగా కంపెనీ గురించి చెప్పి ఎక్కువ విలువ కట్టించుకున్నారని, దాని ఆధారంగా పెట్టుబడులు తెచ్చుకున్నారని, ఇది ఇన్వెస్టర్లను మోసం చేయటమేనని పేర్కొంది. ఒకవైపేమో రాజశేఖరరెడ్డి హయాంలో ప్రయోజనాలు పొందినందుకే వారు ‘సాక్షి’లో పెట్టుబడులు పెట్టారని వాదిస్తున్న సీబీఐ... మరోవంక ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారమివ్వటం ద్వారా వారిని మోసగించారని పేర్కొనటంలో ఔచిత్యమేంటన్నది ఎవ్వరికీ అర్థం కాదు. అసలు ఈ పరస్పర విరుద్ధ వాదనలు ఎక్కడ అతుకుతాయన్నది ఎంత బుర్ర బద్దలుగొట్టుకున్నా అవగతం కాదు కూడా.

ఈ వాదన ‘ఈనాడు’కు వర్తించదా?
వై.ఎస్.విజయమ్మ పిటిషన్ వేయటంతో.. దానిపై హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించటంతో రామోజీ పెట్టుబడుల వ్యవహారాన్ని శోధించే అవకాశం కూడా సీబీఐకి వచ్చింది. దాదాపు నెల తరవాత చంద్రబాబు కుట్రలు, కుతంత్రాల ఫలితంగా ఆ విచారణ ఆగిపోవటం వేరే విషయం. అయితే దర్యాప్తు చేయటానికి దొరికిన నెలరోజుల్లో సీబీఐ ముందుకు కదిలే ప్రయత్నం ఎంతమాత్రం చేయలేదు. పోనీ విజయమ్మ దాఖలు చేసిన పిటిషన్‌ను చూసినా... రామోజీకి సంబంధించిన పూర్తి వ్యవహారం ఆధారాలతో సహా తెలిసి ఉండేది.

ఇక్కడ ‘సాక్షి’ విషయంలో సీబీఐ చేసిన వాదనను ‘ఈనాడు’కు వర్తింపజేస్తే... రామోజీకి చెందిన ఉషోదయా ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో... బోలెడన్ని గొట్టం కంపెనీల ద్వారా రిలయన్స్ పెట్టుబడులు పెట్టింది. ఉషోదయ కూడా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీయే. ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఇతర వ్యక్తులు పెట్టుబడి పెట్టడమే నేరమని వాదిస్తున్న సీబీఐ... గొట్టం కంపెనీలు పెట్టుబడి పెట్టడాన్ని ఎందుకు నేరమనుకోలేదు? ‘సాక్షి’ కొత్త సంస్థ. మూడు నాలుగేళ్లు గడిస్తే లాభాల్లోకి వస్తుందనే అంచనాలు ప్రమోటర్లకు ఉన్నాయి. కానీ రామోజీ సంస్థ 30 ఏళ్లుగా భారీ నష్టాల్ని మూటగట్టుకుంటూనే ఉంది.

మరి దాన్లో ఇన్వెస్టర్లు ఏం ఆశించి పెట్టుబడి పెట్టారు? ఇది సీబీఐకి నేరమనిపించలేదా? ‘సాక్షి’ షేరు రూ.350 ప్రీమియానికి అమ్మటమే నేరమైతే... రామోజీ ఒక్కో షేరును రూ.5,28,630కి విక్రయించటం ఘోరమనిపించలేదా? తనకున్న ఫిల్మ్ హక్కులు, పాత చెత్త సీరియళ్ల రీళ్లు తదితరాల్ని చూపించి... వాటినే అమూల్యమైన ఆస్తులుగా ఎర్నెస్ట్ అండ్ యంగ్ ద్వారా వాల్యుయేషన్ చేయించిన రామోజీ... వాటి ఆధారంగా రూ.2,600 కోట్ల పెట్టుబడులు గొట్టం కంపెనీల ద్వారా తెచ్చుకోవటం అక్రమమనిపించలేదా?

సీబీఐ జాయింట్ డెరైక్టరు లక్ష్మీనారాయణ నేతృత్వంలోని బృందం ఇలా రెండు రకాల దర్యాప్తులకు ఎందుకు మొగ్గు చూపుతోంది? అసలు దీన్ని దర్యాప్తు సంస్థ అనొచ్చా? దర్యాప్తు సంస్థ అంటే నిజానిజాల్ని నిష్పాక్షికంగా నిర్ధరించే సంస్థ కదా? అసలు హైకోర్టు ఆదేశించాక నెలరోజుల పాటు రామోజీపై దర్యాప్తు కోసం ఎందుకు ముందుకు కదల్లేదు? సాక్షి మాదిరిగా ‘ఈనాడు’ ఖాతాల్ని ఎందుకు సీజ్ చెయ్యలేదు? ఎక్కడ ఎవరు ఏ స్విచ్ నొక్కారు? ఇవన్నీ ప్రశ్నలే. సీబీఐ మాత్రమే జవాబు చెప్పగలిగే ప్రశ్నలివి.

‘మార్గదర్శి’ పేరుతో 2,500 కోట్లు వసూలు చేసినా..
హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్‌యూఎఫ్) పేరుతో రిజర్వు బ్యాంక్ నిబంధనలు తుంగలో తొక్కి మార్గదర్శి ఫైనాన్షియర్స్ పేరుతో ప్రజల నుంచి రూ.2500 కోట్లు వసూలు చేసిన రామోజీరావుపై ఈ రాష్ట్ర ప్రభుత్వం నామమాత్ర చర్యలు తీసుకోలేదు. అక్రమ వ్యాపారం చేసి డిపాజిట్‌దారులకు శఠగోపం పెట్టే ప్రయత్నం చేశారంటూ రాజమండ్రి కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఫిర్యాదుపై ప్రభుత్వం ఇప్పటిదాకా స్పందించలేదు. అక్రమంగా డిపాజిట్లను సేకరించినందున రూ.2500 కోట్లు జరిమానా చెల్లించాలంటూ ఆదాయపన్ను శాఖ జారీ చేసిన నోటీసులపై రామోజీరావు హైకోర్టు నుంచి స్టే తెచ్చుకుంటే కేంద్ర ప్రభుత్వం ఈనాటి వరకూ దానిని వెకేట్ చేసేందుకు ప్రయత్నం చేసిన పాపాన పోలేదు.

మూడవ చార్జిషీట్లోనూ అంతే...
తాజాగా సీబీఐ దాఖలు చేసిన మూడో చార్జిషీట్లోనూ అదే తీరు. విశాఖలోని పరవాడ ఫార్మా సెజ్‌లో... 2,100 ఎకరాలు కేటాయించిన చంద్రబాబు నాయుడిని పట్టించుకోనే లేదు. ఆ సెజ్‌లో గ్రీన్‌బెల్ట్‌ను తగ్గించడానికి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం అనుమతించటం వల్ల రాంకీ సంస్థకు 50 ఎకరాల మేర ప్రయోజనం చేకూరిందని... అందుకోసం అది జగతి సంస్థల్లో రూ.10 కోట్లు పెట్టుబడి పెట్టిందనేది సీబీఐ వాదన. మరి 50 ఎకరాలు కలిసి వచ్చినందుకు గనక రాంకీ సంస్థ జగన్ కంపెనీల్లో రూ.10 కోట్లు పెట్టుబడి పెట్టి ఉంటే... 2,100 ఎకరాలు కేటాయించినందుకు చంద్రబాబుకు ఏమిచ్చి ఉండాలి? ఇవన్నీ సీబీఐకి పట్టవా? వైఎస్‌ను టార్గెట్ చేయటమేనా దాని లక్ష్యం? ఇంకెన్నాళ్లు ఈ దిగజారుడుతనం?

Share this article :

0 comments: