పత్తి రైతుకు ఒరిగేదేం లేదు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పత్తి రైతుకు ఒరిగేదేం లేదు

పత్తి రైతుకు ఒరిగేదేం లేదు

Written By news on Tuesday, May 1, 2012 | 5/01/2012

మేలు చేయని నిషేధం ఎత్తివేత
ఎగుమతుల రిజిస్ట్రేషన్లపై సస్పెన్షన్ ఎత్తివేసిన కేంద్రం
వ్యాపారులకే ప్రయోజనమంటున్న రైతు సంఘాలు
రాష్ట్రంలో కేవలం 5 లక్షల బేళ్ల పత్తి మాత్రమే నిల్వ
15 లక్షల బేళ్లు అయినకాడికి అమ్ముకున్న రైతులు
నిషేధం పేరిట దోచుకున్న దళారులు

న్యూఢిల్లీ ‘సాక్షి’ ప్రతినిధి/ గుంటూరు, న్యూస్‌లైన్: పత్తి ఎగుమతులకు అనుమతించాలని కేంద్ర ప్రభుత్వం సోమవారం నిర్ణయించింది. దిగుబడి అంచనాలు పెరగడంతో ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసే 2011-12 వ్యవసాయ సంవత్సరంలో పత్తి ఎగుమతులను అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే పత్తి ఎగుమతులకు సంబంధించి సర్కారు దోబూచులాట వ్యాపారులకే మేలు చేస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విడతల వారీగా తీసుకుంటున్న నిర్ణయాలు వారికే మద్దతుగా నిలుస్తున్నాయని, రాష్ట్ర రైతులకు ఒనగూరే లబ్ధి పెద్దగా లేదనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. ఈ ఏడాది మార్చి 5న పత్తి ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించింది. వాస్తవానికి ఆ తర్వాత కొద్దిరోజులకే నిషేధాన్ని తొలగించినా కొత్తగా ఎగుమతులకు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు ఇవ్వరాదని నిర్ణయించుకుంది. ఇదివరకు జారీ చేసిన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ల మేరకే ఇప్పటివరకు ఎగుమతులను అనుమతిస్తూ వచ్చింది. 

దీనితో పూర్తిస్థాయి ఎగుమతులకు అవకాశం లేకుండా పోయింది. అయితే గుజరాత్ ఎంపీల ఒత్తిళ్లు, వ్యవసాయోత్పత్తుల ఎగుమతులపై ప్రభుత్వ విధానాల పట్ల వ్యవసాయ మంత్రి శరద్‌పవార్ అభ్యంతరాల నేపథ్యంలో.. కేంద్రం పత్తి ఎగుమతులపై ఆంక్షలను పూర్తిగా తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. పత్తి ఎగుమతుల రిజిస్ట్రేషన్‌ను ప్రభుత్వం అనుమతించనున్నట్లు వాణిజ్య, వస్త్ర శాఖల మంత్రి ఆనంద్ శర్మ చెప్పారు. సోమవారం వ్యవసాయ మంత్రి శరద్‌పవార్‌తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పత్తి ఎగుమతుల రిజిస్ట్రేషన్ల కోసం పరిమాణానికి సంబంధించి ఎలాంటి ఆంక్షలూ ఉండబోవని మంత్రి చెప్పారు. అయితే, రెండుమూడు వారాల్లోగా మంత్రుల బృందం మరోమారు పరిస్థితిని సమీక్షిస్తుందని తెలిపారు. మారిన అంచనాల ఆధారంగా పత్తి సలహా మండలి, వ్యవసాయ శాఖ, వాణిజ్య శాఖలు పత్తి ఎగుమతుల రిజిస్ట్రేషన్లపై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. అంతకుముందు పత్తి ఎగుమతుల పరిస్థితిపై ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలోని మంత్రుల బృందం సమీక్ష జరిపింది.

రైతుకు ఒనగూరే లాభం లేదు

ఈ సీజన్‌లో దేశవ్యాప్తంగా 345 లక్షల బేళ్ల పత్తి ఉత్పత్తి కానున్నట్లు తొలుత అంచనా వేసిన పత్తి సలహా మండలి (సీఏబీ), తాజాగా ఈ అంచనాను 347 లక్షల బేళ్లకు పెంచింది. కాగా రాష్ట్రంలో ఈ ఏడాది 55 లక్షల బేళ్ల పత్తి ఉత్పత్తి అయ్యింది. మార్చిలో నిషేధం విధించేనాటికి 35 లక్షల బేళ్ల ఎగుమతి అయిందని అంచనా. నిషేధానంతరం రాష్ర్టంలో మరో 15 లక్షల బేళ్ల కొనుగోళ్లు జరిగాయి. అయితే నిషేధం పేరిట వ్యాపారులు తక్కువ ధర చెల్లించి రైతుల్ని అయినకాడికి దోచుకున్నారు. తీరా నిషేధం ఎత్తివేసే సమయానికి రైతుల వద్ద కేవలం 5 లక్షల బేళ్ల పత్తి మాత్రమే అమ్మకానికి మిగిలింది.

రైతుల వద్ద పంట నిల్వలు పుష్కలంగా ఉన్నప్పుడే ఈ నిర్ణయం తీసుకుని ఉంటే వారికి ఉత్పత్తికి తగ్గ గిట్టుబాటు ధర వచ్చేదని.. ప్రస్తుతం ఎగుమతులపై నిషేధం తొలగించినా రైతుకు పెద్దగా లాభం ఉండదని రైతుసంఘాల నేతలు చెబుతున్నారు. ఏటా 60 నుంచి 70 లక్షల బేళ్లు మాత్రమే ఎగుమతి అవుతుండగా ఈసారి కేంద్రం వ్యాపారులకు అనుకూలంగా నిర్ణయాలు చేపట్టడంతో ఎగుమతులు రెట్టింపయ్యాయి. సీజన్ ప్రారంభం నుంచే కేంద్రం రైతుల పక్షాన ఆలోచించకుండా వ్యాపారులకు మద్ధతుగానే పనిచేస్తోందనే ఆరోపణలు వినిపించాయి. ఎగుమతులపై నిషేధం, ఎత్తివేత యూపీఏ ప్రభుత్వ హైడ్రామాగా విపక్షాలు విమర్శించాయి. ఇక ఎగుమతులు ఉండవనే ఆందోళనలో రైతులు చేతిలోని పంటనంతటిని అందినకాడికి అమ్ముకున్నారు. ఇంత జరుగుతున్నా.. ఎక్కడా కాటన్ కార్పొరేషన్ ఇండియా (సీసీఐ) ఒక శాతం కొనుగోళ్లు కూడా జరపలేదు. ఉత్పత్తికి తగిన గిట్టుబాటు ధరగా సీసీఐ రూ.3,700 సూచించినా.. ఎప్పుడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో ఎగుమతులు జరిగినప్పటికీ.. క్షేత్రస్థాయిలో పత్తిరైతులకు మాత్రం ఏమాత్రం లాభం చేకూరలేదు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రాష్ట్రంలో క్వింటాల్ పత్తి రూ.7వేలు నుంచి రూ.10వేలు పలికింది. కానీ ఈ ఏడాది సీసీఐ ఆధ్వర్యంలో జరిగిన కొనుగోళ్లకూ క్వింటాల్ ధర రూ.3,200 మించ లేదు. తర్వాత నిషేధం పేరిట వ్యాపారులు, దళారులు కుమ్మక్కై గ్రామాల్లో రైతుల వద్దకెళ్లి నేరుగా రూ.2వేలు నుంచి రూ.2.5 వేలుకు క్వింటాల్ చొప్పున చెల్లింపులకూ సిద్దమయ్యారు. ఇప్పటికైనా ఎగుమతులకు అనుమతుల నేపథ్యంలో రైతుల వద్దనున్న అరకొర నిల్వలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు సీసీఐ చొరవ చూపాలని రైతు సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.
Share this article :

0 comments: