అది మామూలు కోడి కాదండయా మరి ఊరంతటినీ నిద్దర్లేపే ఏకైక ఒక్కకోడి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అది మామూలు కోడి కాదండయా మరి ఊరంతటినీ నిద్దర్లేపే ఏకైక ఒక్కకోడి

అది మామూలు కోడి కాదండయా మరి ఊరంతటినీ నిద్దర్లేపే ఏకైక ఒక్కకోడి

Written By news on Thursday, May 17, 2012 | 5/17/2012

కోడి కూసింది. ఇంకేముంది. తెల్లారిపోయింది. జనం హడావిడిగా నిద్దర్లేచి పోయేరు. నిద్దర్లేచిన జనం పనులు మొదలెట్టేరు. పనుల్రానివాళ్లు పాటలు అవీరాని వారు బద్ధకంగా ఒళ్లు విరుచుకోడము మొదలెట్టేరు. మొత్తానికి మరో రోజు రాజుకుంది.

ఏ రోజైనా యింతే. యిలాగే మొదలవ్వాలి. ఫలానా కోడి కూయడం రోజు మొదలవడం అంతే, అన్నట్టు ఫలానా కోడి అనడం ఆట్టే జరూరుకాదు. ఎంచేతంటే ఆవూళ్లో వున్నది ఒకే ఒక్క కోడి. ఒక్కగానొక్క కోడి. అది కూస్తే తప్ప తెల్లారటం వుండదు. ఎందుచేతనంటే ఆవూళ్లో కాలజ్ఞానం తెల్సిన మరో గోడ గడియారం కానీ చేతివాచీ కానీ లేవు గనక లేనేలేవు.

కొన్నేళ్ల కిందట ఎక్కడ్నించి వొచ్చేడో ఓ మనవడు ‘అవ్వ’ కోడిని చంకన పెట్టుకుని వచ్చేడు. అసలప్పటికి జనాలకి ఎప్పటికి తెల్లారుతుందో తెలీని పరిస్థితిని ఆ మనవడు చెప్తేనే తెలిసింది. అవ్వకోడిని చంకన పెట్టుకుని కట్టుబట్టల్తో వచ్చిన మనవడిప్పుడు కోడి పుణ్యమా అని కోట్లకి పడగెత్తేడు. చెట్లూ చేలూ కొండలూ చెర్లూ మింగేసేడు. అయితేనేం గ్రామాధికారులతని వైపు చూడ్డానికే జంకుతారు.

అతగాడి కోడి లేకపోతే ఊరు నిద్దర్లేవదని భయపడ్తారు. అతగాడి వైపు వేలెత్తి చూపితే కూచోను పీటలుండవని కట్టుకోను మూటలుండవని దడదడలాడ్తారు. వాళ్లిట్లా మనవడిని చూసి జడుసుకోడానికి ఆ యొక్క కోడి మాత్రమే కాదు అది పెట్టే గుడ్డు కూడా కారణమే! అరే! కొక్కొరోకో కోడి గుడ్డు పెట్టడవేమిటని వాశ్చర్యపోకండి.

అది మామూలు కోడి కాదండయా మరి ఊరంతటినీ నిద్దర్లేపే ఏకైక ఒక్కకోడి. ఇక దాని గుడ్డు సరే మరి మామూలుగా వుంటుందేమిటి? గుడ్డు లోపల వుండాల్సిన పసుపు రంగు చందమామ కారు నలుపులో వుండటమే కాదు తెలుపురంగులో వుండాల్సిన గుడ్డు రంగు మాత్రం తళతళలాడే తెలుపు కానేకాదు. మిసమిసలాడే పసుపు మిడిసి పడే పసుపు. తిమ్మిని బమ్మిని చేసే పసుపు చికాకుపరిచే పసుపు చీదరపుట్టించే పసుపు. పసుపు గుడ్డు పగిలి అందులోంచి అక్షరాలు వంకర టింకరగా నడుస్తూ అనేక కాకివార్తలు, గాలికబర్లు, చొల్లు ముచ్చట్లు వూరంతా పంచిపెట్టేవి.

మరో అతీగతీ లేకపోవడాన్న జనం ఆ యొక్క ఏకైక కోడి కూతకే నిద్దర్లేచే వారు. ఆ యొక్క వంకర టింకర ఓర్తల నల్లమందునే అలవాటుగా మింగు తుండే వారు. అవ్వకోడి చంకన పెట్టుకునొచ్చిన మనవడు తాతయ్యేడు. అయితేనే తన కోడి కూయందే రోజు మొదలయ్యేదేలేదు. కోడి కూస్తూనే వుంది. తెల్లవారుతూనే వుంది. రోజులు రాజుకుంటూనే వున్నాయి.

ఒకానొక రోజున ఎప్పట్లాగే ఊరికొక్క మొనగాడైన కోడి కూసింది. నిద్దర్లేచిన జనానికి మరో కోడి కూడా కూసిన చప్పుడు వినిపించింది. అబద్ధం అనుకున్నారు. అంతా భ్రమ అనుకున్నారు. ఊరికున్నది ఒక్క కోడే కదా అది రోజుకి ఒక్కసారే కదా కూసేది అనుకున్నారు. మర్నాడు మళ్లీ చెవులు రిక్కించారు. నిజంగానే రెండు కోడికూతలు వినిపించాయి. ఆ మర్నాడు కూడా! జనాలకి తెల్సిపోయింది ఊళ్లో మరో కోడి కూడా కూస్తున్నదని. కాలజ్ఞానం తెల్సిన కోడి మరొకటున్నదని జనానికి తెల్సిపోయింది. తన చంకలోని కోడి కాకుండా మరొక కోడి వుంటం, కూయడం జనాన్ని లేపడం తాతయిన మనవడికి అస్సలు మింగుడు పళ్లేదు. తనకోడి తప్ప మరో కోడి వుంటానికీ, కూయడానికీ వల్లేదన్నాడు.

పసుపురంగు గుడ్డు లోంచి బయటకు తీసిన ఒంకర టింకర అక్షరాల్తో నానా యాగీ చెయ్యసాగేడు. పైగా కొత్తగా కూస్తున్న కోడి గుడ్డు తళతళలాడే తెలుపు రంగులో వుంటమేకాక అందులోంచి బయటికి వచ్చే అక్షరాలు హుందాగా, నిలువెత్తు నిజాలకు సాక్ష్యంగా నిలబడుతూ ఊరంతటికీ నల్లమందు మత్తు వదిలించే ప్రయత్నం చేస్తుండటంతో ఉలిక్కిపడ్డారు గ్రామ పెద్దలు. వార్తలు ఎప్పుడూ ఒక్కలా వుండాలి కాని మరోలా ఉండటానికి వీల్లేదని మరో కోడి వుంటానికి ఒప్పుకోమని మరో కోడి కూయడానికి వీల్లేదని పట్టుబట్టారు. పన్నాగాలు చేశారు. పెద్దలూ, పెద్దరికం వెలగబెట్టే వాళ్లూ శాశ్వతంగా పెద్దలుగానే ఉండిపోవాలనుకునే వాళ్లకు మరో కోడీ దాని తెలుపు మెరుపుల అక్షరాలు ప్రమాదకరం అనిపించాయి.

అంతే! కోడి మీద యుద్ధం ప్రకటించారు. కోడి మెడను కరకరా కోసేయాలనుకున్నారు. కోడి గుడ్డుని తొక్కేయాలనుకున్నారు. అక్షరాలను గొయ్యితీసి కప్పెట్టాలనుకున్నారు. కసినీ ద్వేషాన్ని అక్కసునీ పచ్చి అబద్ధాలనీ సైన్యంలో చేర్చుకున్నారు. గ్రామంలో ఎక్కడైనా అక్షరాలు నిటారుగా నిలబడి కనబడితే చాలు కాల్చేయండన్నారు. ‘షూట్ ఎట్ సైట్’ అన్నారు. కోడిని ఖూనీ చెయ్యడానికి కత్తులూ కటార్లూ, బల్లాలూ బాకులూ గండ్రగొడ్డళ్లు మిషన్ గన్నులు సిద్ధం చేసుకున్నారు. అవసరమయితే ఆటంబాంబులు కూడా ఆర్డరిద్దామనుకున్నారు. రధగజహయ పదాతి దళాలను సమీకరించారు. ఒక్క కోడిని చంపడానికి ఒక్క అక్షరాన్ని పూడ్చి పెట్టడానికి కదంతొక్కేరు.సత్యానికి సాక్ష్యం చెప్పే అక్షరాలను ప్రసవించడానికి యేయే కాలాలలో ఏఏ కలాలు ఎంత తపనపడ్డాయో, అక్షరం స్వేచ్ఛగా వూపిరి పీల్చడానికి ఆయా కాలాలలో ఏఏ ప్రాణాలు ఆత్మత్యాగం చేశాయో కానీ అక్షరం అజరామరం! జనం గుండెల్లో వుండే అక్షరాన్ని హత్య చెయ్యగలిగే ఆయుధాలు లేనేలేవు....(FACEBOOK)
Share this article :

0 comments: