ఆ వైపు చూడని సీబీ‘ఐ’ (must read) - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆ వైపు చూడని సీబీ‘ఐ’ (must read)

ఆ వైపు చూడని సీబీ‘ఐ’ (must read)

Written By news on Saturday, May 19, 2012 | 5/19/2012

రెండెకరాల నుంచి రూ.లక్షన్నర కోట్లకు బాబు ఎలా ఎదిగారు?
ప్రజాహితం లేకపోయినా వేల ఎకరాల సంతర్పణ
పచ్చి దోపిడీ ధ్యేయంగా భూముల కేటాయింపు
ఉపాధి ఊసు లేకుండా ఆశ్రీతులకు అందినంత ‘చేయూత’
వైఎస్ హయాంకు, బాబు జమానాకు మధ్య తేడా ఇదే..


పరిశ్రమల స్థాపన కోసం భూములివ్వడం, రాయితీలు కల్పించడం నేరమేమీ కాదు. అయితే భూములు, రాయితీలు నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా... అవి పొందిన సంస్థలు పరిశ్రమలను స్థాపించాయా... ఉపాధి కల్పనకు దోహదపడ్డాయా అన్నదే ప్రధానమైన ప్రశ్న. పారిశ్రామిక విధానం ప్రకారం ఆయా పరిశ్రమలకు ఇస్తున్న భూములు సద్వినియోగం కాకపోతే వెనక్కి తీసుకునే హక్కు రాష్ర్ట ప్రభుత్వానికి ఎప్పుడూ ఉంటుంది. రాజకీయ దురుద్దేశంతో కూడుకున్న జగన్ ఆస్తుల కేసులో పదినెలలుగా సాగుతున్న సీబీఐ విచారణ ఈ మౌలిక అంశాలను పట్టించుకోవడం లేదు. సంస్కరణలు ఉధృతంగా అమలు చేసిన తొమ్మిదేళ్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ప్రపంచబ్యాంకుకు ప్రయోగశాలగా మార్చారు. 

తనను తాను రాష్ట్ర సీఈవోగా అభివర్ణించుకున్న ఆయన.. కన్వెన్షన్ సెంటర్లు, గోల్ఫ్‌క్లబ్బులపై కేంద్రీకరించినంతగా పరిశ్రమల స్థాపన, సామాన్యుల ఉపాధి అవకాశాలపై దృష్టిపెట్టలేదు. ఆయన హయాంలో జరిగిన భూ కేటాయింపులు, చోటు చేసుకున్న కుంభకోణాలు ఇందుకు నిదర్శనం. నిబంధనలకు విరుద్ధంగా నామినేషన్ పద్ధతిన వందలాది ప్రాజెక్టులు కట్టబెట్టారు. వేల ఎకరాలు ధారాదత్తం చేశారు. 

వివిధ సంస్థలకు, సెజ్‌లకు, పోర్టులకు, ఫార్మా కంపెనీలకు చంద్రబాబు కేటాయించిన భూముల విలువ నాటి లెక్కలను బట్టి చూసినా 1.60 లక్షల కోట్లకు పైమాటే. ముఖ్యమంత్రే సొంత ట్రస్టుకు భూమి కేటాయించుకున్న ఉదంతం చంద్రబాబు హయాంలో తప్ప మరెక్కడా కనిపించదు. అనేక పరిమితులున్నా సంక్షేమ రథాన్ని పరుగులు పెట్టించిన వైఎస్‌కు, దోపిడీయే ధ్యేయంగా పాలన సాగించిన చంద్రబాబుకు మధ్య తేడా తెలియాలంటే 1995 నుంచి జరిగిన భూ కేటాయింపులన్నిటిపైనా దర్యాప్తు జరగాలి. అప్పుడే మౌలికమైన చిక్కుముడులన్నీ విడిపోతాయి. ప్రజాహితానికి, పచ్చిదోపిడీకి మధ్య తేడా తెలుస్తుంది. చంద్రబాబు ఏలుబడిలో జరిగిన భూ కేటాయింపుల తీరును పరిశీలించేందుకు కొన్ని ఉదాహరణలు చూద్దాం...

బాబు - బిల్లీ బాగోతం

హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో క్రీడాప్రాంగణాల ఏర్పాటు పేరుతో ఐఎంజీ అకాడమీస్ భారత అనే బోగస్ సంస్థకు కోట్ల విలువైన 850 ఎకరాల భూములను 2003లో నాటి సీఎం చంద్రబాబు కట్టబెట్టారు. ఐఎంజీ సంస్థను ఏర్పాటు చేసిన అహోబలరావు (బిల్లీరావు), ప్రభాకరరావు (పేటరావు) బాబుకు అత్యంత సన్నిహితులు. ఈ ఇద్దరికీ చెందిన బీహెచ్‌సీ ఆగ్రో సంస్థకు కుప్పంలో ఇజ్రాయెల్ టెక్నాలజీ అమలు చేసే ప్రాజెక్టును చంద్రబాబు అంతకుముందు అప్పగించారు.

2003 ఆగస్టు 5న లక్షరూపాయల క్యాపిటల్‌తో బిల్లీరావు, పేటరావు ఐఎంజీ సంస్థను ఏర్పాటు చేశారు. కనీసం కార్యాలయం కూడా లేని ఈ సంస్థకు సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాలు, మామిడిపల్లి గ్రామం సమీపంలోని 450 ఎకరాలను కేటాయిస్తూ రూపొందించిన 40 పేజీల అవగాహనా ఒప్పందానికి ఆగస్టు 6న బాబు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. అంటే కంపెనీ ఏర్పాటైన ఒక్క రోజులోనే ఒప్పందం రూపకల్పనతో పాటు ఆమోదం లభించిందన్నమాట. 9న సంతకాలు జరిగాయి. దాంతోపాటు ఆ సంస్థకు రకరకాల రాయితీలు, ప్రోత్సాహకాలు ఇస్తూ బాబు జీవోలు విడుదల చేశారు. 

2004 ఫిబ్రవరిలో తాను ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండగానే ఐఎంజీకి 400 ఎకరాల భూమిని చంద్రబాబు రిజిస్టర్ చేయించారు. అక్కడ మార్కెట్‌విలువ ఎకరం రూ. 5 కోట్లు ఉండగా బాబు ఆ సంస్థకు ఎకరం రూ. 50 వేలకే విక్రయించారు. మామిడిపల్లిలో 450 ఎకరాలను ఎకరం రూ.50 వేలకే (రిజిస్ట్రేషన్ సమయంలో రూ.25 వేలు మాత్రమే చెల్లించేలా) విక్రయించేందుకు నిర్ణయించారు. వాస్తవానికి అక్కడ ఎకరం విలువ రూ. కోటి ఉంది. 

అదే ఒప్పందం కింద హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల్లోని అన్ని స్టేడియాలనూ చంద్రబాబు ఐఎంజీకి 45 ఏళ్లపాటు లీజుకివ్వాలని నిర్ణయించారు. ఉద్యోగుల జీతభత్యాలకు, నిర్వహణ ఖర్చులకు ఏటా రూ.2.5 కోట్ల ప్రజాధనాన్ని ఇవ్వజూపారు. 45 ఏళ్ల తర్వాత ఆ స్టేడియాలను కొనుగోలు చేసుకునే అవకాశం కూడా ఐఎంజీకి కల్పించారు. 

సంస్థ ఏర్పాటు తేదీల నుంచి ఒప్పందంలోని క్లాజుల వరకు అన్ని విషయాల్లోనూ అక్రమాలు స్పష్టంగా కనిపిస్తున్నా సీబీఐ ఎందుకు పట్టించుకోవడం లేదు? 

కంపెనీ ఏర్పడిన మూడు రోజుల్లో.. అదీ సరిగ్గా ఆఫీసు కూడా లేని సంస్థకు 850 ఎకరాలు కట్టబెట్టిన ఉదంతం ఎక్కడైనా ఉందా? ఇందులో ఏ గూడుపుఠాణీ లేదంటారా?

హైదరాబాద్ నడిబొడ్డున ఎకరా భూమి మార్కెట్ ధర రూ.5 కోట్లుగా ఉన్నపుడు 850 ఎకరాలను ఎకరా కేవలం రూ.50వేల ధరకే కట్టబెట్టాలని చంద్రబాబుకు ఏ ధరల కమిటీ నిర్ణయించి చెప్పింది? సీబీఐకి ఇది తప్పుగా కనిపించడం లేదా? ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండగా ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చే కీలక నిర్ణయాలు తీసుకోవడం తప్పని సీబీఐ ఎందుకు భావించడం లేదు?

ఎల్ అండ్ టీపై ఎంత ప్రేమ

బాబుకు ఈ కంపెనీతో ఉన్న సాన్నిహిత్యం గురించి అందరికీ తెలుసు. బాబు జమానాలో ఈ సంస్థ ఏది కోరితే అది క్షణాల్లో సమకూరేది. 

పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు 1995 సెప్టెంబర్ 1న సీఎం పదవి చేపట్టారు. 4 రోజుల్లోనే ఎల్‌అండ్‌టీకి హైదరాబాద్‌లోని అత్యంత విలువైన ప్రాంతమైన మాదాపూర్‌లో 148 ఎకరాలు ధారాదత్తం చేశారు. ఏడాది వ్యవధిలో మరో 18 ఎకరాలు దానికి దక్కాయి. 

హైటెక్ సిటీ నిర్మాణానికి గ్లోబల్ టెండర్లు లేకుండానే అప్పనంగా కాంట్రాక్టూ అప్పగించారు. కారుచౌకగా మాదాపూర్‌లోనే మరో 78 ఎకరాలను ఇచ్చారు. అప్పట్లో అక్కడ చదరపు గజం రూ.3 వేల నుంచి రూ.5 వేలు పలుకుతుండగా కారుచౌకగా రూ.1,282 లెక్కన ఖరీదు కట్టారు. దీనివల్ల ఖజానాకు రూ.120 కోట్లు నష్టం వాటిల్లింది.

చదరపు అడుగుకు రూ.2,200 చొప్పున నిర్మించి ఇస్తామని గ్లోబల్ టెక్నో ఇండస్ట్రియల్‌పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ ముందుకొచ్చినా వద్దని రూ.2,700 లెక్కన ఎల్ అండ్ టీకే అప్పజెప్పారు. 

సచివాలయంలోని డీ బ్లాక్ నిర్మాణమూ ఈ కోవలోనిదే. విశాఖ లోని హైటెక్ సిటీ నిర్మాణంలోనూ బా బు ప్రేమ ఈ కంపెనీపైనే. ఇలాంటివి బోలెడు. వీటికి ప్రతిగానే ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌ను ఎల్‌అండ్‌టీ ఉచితంగా కట్టించి ఇచ్చిందని ఆరోపణలు వచ్చాయి.

సీఎం పదవి చేపట్టిన నాలుగురోజుల్లోనే ఎల్ అండ్ టీకి భూములప్పగించడం చూస్తే చంద్రబాబు ఆతృత కనిపించడం లేదా?

తక్కువకే నిర్మిస్తామన్న కంపెనీని వద్దని ఎల్‌అండ్‌టీకే హైటెక్ సిటీ కాంట్రాక్టు ఇవ్వడంలో సీబీఐకి ఏ లొసుగూ కనబడడం లేదని అనుకోవాలా?

బాబు సేవలకు ప్రతిఫలంగా హైదరాబాద్‌లోని టీడీపీ కార్యాలయాన్ని ఎల్‌అండ్‌టీ సంస్థ ఉచితంగా నిర్మించి ఇవ్వడం ‘క్విడ్ ప్రో కో’ కిందకు రాదా? ఆ విషయం సీబీఐకి పట్టదా?

శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు 5,500 ఎకరాలు

వేల కోట్ల విలువైన శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టుకు చంద్రబాబు 5,500 ఎకరాలు కేటాయించారు. ఎయిర్‌పోర్టు అనుమతుల కోసమే కాదు. జీఎంఆర్‌కు వివిధ రకాల రాయితీలు ఇప్పించేందుకూ చంద్రబాబు తనకున్న పలుకుబడిని ఉపయోగించారు. నాటి ఎన్డీయే ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. ఈ ప్రాజెక్టులో భారీగా డబ్బులు చేతులు మారాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎయిర్‌పోర్టు పరిసరాల్లో బినామీ పేర్లతో బాబు, ఆయన అనుయాయులు భూములు కొనుగోలు చేశారు. వాస్తవానికి రామోజీ ఫిల్మ్ సిటీ పేరిట ఈనాడు గ్రూపు కొనుగోలు చేసిన వేల ఎకరాల వివాదాస్పద భూములకూ రియల్ ఎస్టేట్ విలువ పెరగడానికి వీలుగా ఆ ఫిల్మ్ సిటీ వైపే విమానాశ్రయం నెలకొల్పేందుకువిశ్వప్రయత్నం చేశారు. కానీ రక్షణశాఖ అంగీకరించలేదు. శంషాబాద్ సమీపంలో రామోజీకి 431 ఎకరాలు ఉండడం వల్లనే చివరకు ఆ ప్రాంతాన్ని చంద్రబాబు ఖరారు కానిచ్చారు. అయితే ఎల్‌అండ్‌టీ భాగస్వామ్యంతోనే ఎయిర్‌పోర్టును నిర్మించాలని బాబు జీఎంఆర్‌పై ఒత్తిడి తెచ్చారు. 

ప్రపంచంలో ఎక్కడా అంతర్జాతీయ విమానాశ్రయానికి వెయ్యి నుంచి రెండువేల ఎకరాలకు మించి కేటాయించడమే లేదు. అటువంటిది బాబు ఏకంగా 5,500 ఎకరాలు ఎందుకు కేటాయించినట్లు?

శంషాబాద్ దగ్గర విమానాశ్రయం ప్రాజెక్టు రావడానికి ముందు ఆ ప్రాంతంలో బినామీ పేర్లతో రామోజీరావు భూములు కొనుగోలు చేయడం నిజం కాదా? అంటే ఎయిర్‌పోర్టు విషయం రామోజీకి ముందుగా తెలిసిందన్న ఆరోపణకు బలం చేకూరడం లేదా?ఇది సీబీఐకి పట్టవా?

సెజ్‌లకు ఆదిపురుషుడు బాబే కదా!

చంద్రబాబు అధికారంలో ఉండగా 1996లో 295 ఎకరాల్లో కాకినాడ సెజ్‌కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. 1999 చివర్లో భూసేకరణ కోసం ఎకరాకు రూ.3 లక్షలు చెల్లించాలని అప్పటి జిల్లా యంత్రాంగం సూచించింది. అయితే ఎకరాకు రూ.1.25 లక్షలకు మించి చెల్లించాల్సిన అవసరం లేదని చంద్రబాబు ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. 

విశాఖలో రాంకీ సంస్థకు ఫార్మా సెజ్‌ను కేటాయించింది చంద్రబాబు ప్రభుత్వమే. విశాఖలోని పరవాడ ఫార్మా సెజ్‌లో 2,100 ఎకరాలు కేటాయించిన చంద్రబాబునాయుడును సీబీఐ పట్టించుకోనేలేదు. 

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లి, ముదిరెడ్డిపల్లి, గుండ్లగడ్డ తండాల పరిధిలో సుమారు వెయ్యి ఎకరాల భూమిని చంద్రబాబు ప్రభుత్వం పోలేపల్లి సెజ్‌కోసం 2002లో సేకరించింది. మొత్తం 320 మంది నిరాశ్రయులయ్యారు. ఎకరాకు రూ.60 వేల నుంచి లక్ష వరకూ పరిహారమిచ్చారు. అసైన్డ్ భూములకు ఎకరాకు రూ.18 వేలే చెల్లించారు. 

రాంకీ విషయంలోనూ సీబీఐది అదే ధోరణి. ఎమ్మార్‌లో అనుసరించిన వైఖరే! విశాఖ ఫార్మా సెజ్‌ను కేటాయించిన చంద్రబాబు హయాంలోకి తొంగి చూసేందుకు అది ఎందుకు సిద్ధపడడం లేదు?

విశాఖ సెజ్‌లో గ్రీన్‌బెల్ట్‌ను తగ్గించడానికి వైఎస్ ప్రభుత్వం అనుమతించడం వల్ల రాంకీ సంస్థకు 150 ఎకరాల మేర ప్రయోజనం చేకూరిందని, అందువల్ల అది జగతి సంస్థల్లో రూ.10 కోట్ల పెట్టుబడి పెట్టిందని సీబీఐ వాదిస్తోంది. 150 ఎకరాలు కలసి వచ్చినందుకు రాంకీ సంస్థ రూ.10 కోట్లు పెట్టుబడి పెట్టి ఉంటే మరి 2,100 ఎకరాలు కేటాయించినందుకు చంద్రబాబుకు ఏమిచ్చి ఉండాలి? ఇవన్నీ సీబీఐకి పట్టవా?

బినామీలకు ‘హైటెక్’ సాయం

హైదరాబాద్ శివార్లలో ఐటీ/సాఫ్ట్‌వేర్ కేంద్రంగా హైటెక్‌సిటీ నిర్మాణం గురించి అధికారికంగా ప్రకటించకముందే నాటి సీఎం చంద్రబాబు బినామీగా ఆయన మిత్రుడు, సినీ నటుడు మురళీమోహన్ అక్కడ భూముల కొనుగోళ్లు మొదలుపెట్టారు. 1996లో గచ్చిబౌలిలో రు.10 లక్షలు చెల్లించి 2.34 ఎకరాల భూమిని ఆయన కొన్నారు. కొద్ది కాలానికే కొండాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్‌లలో హైటెక్‌సిటీ ప్రాజెక్టును చంద్రబాబు ప్రకటించారు. తక్షణం ఆ గ్రామాల్లోని భూముల ధరలు నాటకీయంగా పెరిగిపోయాయి. మురళీమోహన్ ఈ గ్రామాల్లో పలు డెవలప్‌మెంట్ ప్రాజెక్టుల ఒప్పందాలు కుదుర్చుకున్నారు.

ఐటీ, సాఫ్ట్‌వేర్ సంస్థల కోసం అంటూ బాబు కేటాయించిన భూముల్లో చాలా వరకూ ఆయన తన బినామీ సంస్థలకు కేటాయించారు. ఉదాహరణకు వల్లూరిపల్లి ఆగ్రోటెక్, అర్జున్ కంప్యూటర్స్ వంటి సంస్థలు ప్రభుత్వం నుంచి నామమాత్రపు ధరలకు భూములు సంపాదించుకున్నాయి. కానీ ఆ తర్వాత ఎలాంటి సంస్థలనూ స్థాపించకుండా వాటిని మురళీమోహన్‌కు, ఆయన గ్రూపు కంపెనీలకు బదిలీ చేశాయి. 

సైబరాబాద్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటు చేసి చుట్టుపక్కల గ్రామాలన్నిటినీ దాని పరిధిలోకి తెచ్చిన బాబు మధ్యలో ఉన్న కొండాపూర్‌ను మినహాయించారు. తద్వారా అక్కడి మురళీమోహన్ భూములకు చార్జీల భారాన్ని తప్పించి ఖజానాకు గండికొట్టారనే ఆరోపణలున్నాయి. 

ఐటీ పార్క్ డెవలప్‌మెంట్ కోసం రహేజాకు హైదరాబాద్‌లోని మాదాపూర్ సమీపంలో అత్యంత విలువైన 110 ఎకరాల భూములు అప్పగించారు. వాటి విలువ ఆనాడే రూ.1,100 కోట్లు. అంతేకాదు.. ఏపీఐఐసీకి 11 శాతం వాటాను మిగిల్చి 89% వాటాను రహేజాకు కట్టబెట్టారు.

నగరం మధ్య తమ స్థలాన్ని ఎవరైనా డెవలప్‌మెంట్‌కి ఇస్తే కనీసం 35 నుంచి 40%వరకూ వాటా సొంతదార్లకు ఉండడం ఆనవాయితీ. కానీ రహేజాకు 89% వాటా ఇచ్చి ఏపీఐఐసీ వాటాను 11 శాతానికే ఎందుకు పరిమితం చేసినట్లు? 
అదే సమయంలో ఏపీఐఐసీ వాటా మిగిలిన సంస్థల్లో 49% వరకు నిర్ణయిస్తున్నపుడు రహేజాలకు ఇచ్చిన భూముల్లో ఏపీఐఐసీ వాటాను చంద్రబాబు ప్రభుత్వం ఏమాశించి 11 శాతానికి తగ్గించుకుంది? ఇలాంటి కుంభకోణాలను సీబీఐ పట్టించుకోదా?

సైబరాబాద్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటు చేస్తూ కొండాపూర్‌ను మినహాయించడం మురళీమోహన్‌కు లబ్ధిచేకూర్చడం కోసం కాదా?

గనుల ఘనుడు

విజయనగరం జిల్లా గరివిడి మండలంలో గడబవ వలస, ఐతం వలస, బగువలస గ్రామాల పరిధిలో మాంగనీసు నిల్వలు ఉన్న 223.84 ఎకరాల భూమిని 2001 ఫిబ్రవరి 20వ తేదీన ఒకేరోజు మూడు జీవోల ద్వారా ఎస్.కె.స్వరాగి అండ్ కంపెనీకి చంద్రబాబు లీజుకిచ్చారు. విశేషమేమంటే ఈ భూమిని ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఏపీ ఎండీసీకి 1999లోనే కేటాయించారు. ఏపీఎండీసీకి 2019 వరకూ లీజు అగ్రిమెంటు ఉంది. ప్రభుత్వ రంగ సంస్థకు ఉన్న ఈ అగ్రిమెంటును రద్దు చేస్తూ అదే భూమిని ఓ ప్రైవేట్ సంస్థకు కేటాయించే సమయానికి ఆ భూమిలో దొరికే మాంగనీసు ఖరీదు టన్ను అక్షరాలా రూ.40వేలు. ప్రభుత్వానికి ప్రైవేట్ కంపెనీ చెల్లించే రాయల్టీ నామమాత్రం. గనుల గోల్‌మాల్‌లలో ఇదొక ఉదాహరణ మాత్రమే. అలాంటి చంద్రబాబు నిర్వాకాలపై సీబీఐ విచారణ జరగాలంటారా లేదా?

‘ఏలేరు’ దోపిడీ

ఏలేరు కుంభకోణం బయటపడి 15 ఏళ్లు కావస్తోంది. ఏలేరు కాల్వ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారాన్ని పెంచి చెల్లిస్తామన్న పేరుతో నేతలు, ఉన్నతాధికారులు కోట్లు మింగేశారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి వ్యవస్థల్ని నాశనం చేసిన ఈ వ్యవహారంపై ఆది నుంచీ సాంకేతికాంశాల ఆధారంగానే చంద్రబాబు తప్పించుకుంటూ వస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు పీలా పోతినాయుడు తూర్పు గోదావరి జిల్లా వెల్లలోని వైశ్యా బ్యాంకులో 1996లో జాయింట్ అకౌంట్ తెరిచి అందులో రూ.2 కోట్లు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారు. రైతులకు నష్టపరిహారం పేరుతో నాటి బాబు సర్కారు రూ.6.5 కోట్లు విడుదల చేసిన వెంటనే ఆయన ఈ ఖాతా తెరిచారు. ఫిక్స్‌డ్ డిపాజిట్‌కు రెండు పేర్లు ఇవ్వాల్సి ఉండగా రెండో బెనిఫిషియరీగా పోతినాయుడు పేరు పెట్టారు. మొదటి బెనిఫిషియరీ పేరును ఖాళీగా ఉంచారు. దీన్ని నాటి సీఎం బాబు కోసం ఖాళీగా వదిలారని ఆరోపణలొచ్చాయి. ఈ కుంభకోణంపై ఏర్పాటైన జస్టిస్ సోమశేఖర కమిషన్ నియామకాన్ని హైకోర్టు సాంకేతిక అంశాల ఆధారంగా కొట్టేసింది. ప్రజాప్రయోజనాలను, రాష్ర్ట ఖజానాకు జరిగిన నష్టాన్ని పట్టించుకోలేదు. సుప్రీంకోర్టు కూడా హైకోర్టు వ్యవహార శైలిపై ఇదే అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ కేసులో ఇంతవరకూ ఓ సబ్‌జడ్జి మాత్రం డిస్మిస్ అయ్యారు. అసలు సూత్రధారులు మాత్రం తప్పించుకు తిరుగుతున్నారు. 

పోర్టులన్నీ ప్రైవేట్‌కు ధారాదత్తం...

ప్రైవేట్ సంస్థలకు పోర్టులను అప్పగించడంలో చంద్రబాబు కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. బాబు హయాంలో కాకినాడ ఓడరేవు కాంట్రాక్టును సింగపూర్ కేంద్రంగా పనిచేసే ఇంటర్నేషనల్ సీ పోర్ట్స్ ప్రయివేట్ లిమిటెడ్ అనే ప్రైవేట్‌సంస్థకు అప్పగించారు. ఈ సంస్థ అప్పటి మలేసియా ప్రధాని మహతీర్ మహ్మద్ కొడుకు ఫర్జాన్ అహ్మద్ బినామీ సంస్థ అనే ప్రచారం ఉంది. 
కృష్ణపట్నం పోర్టును అభివృద్ధి చేసేందుకు ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని 1997లో బాబు నిర్ణయించారు. నాట్కో సంస్థకు ఆ బాధ్యతను అప్పగించారు. 

గంగవరం పోర్టును 2003 ఆగస్ట్‌లో చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటీకరించింది. ఈ పోర్టును డీవీఎస్ రాజు కన్సార్షియానికి అప్పగించారు.

ఇపుడు వాన్‌పిక్‌గా సీబీఐ దర్యాప్తు చేస్తోన్న ‘వాడరేవు నిజాంపట్నం పోర్ట్ అండ్ ఇండస్ట్రియల్ కారిడార్’ (వాన్‌పిక్) పునాదులు తవ్వింది చంద్రబాబే. ప్రకాశం జిల్లాలోని వాడరేవు పోర్టు నిర్మాణ పనులను ఇండియన్ బెరైటీస్ అండ్ కెమికల్స్, వామ్‌మేనేజ్‌మెంట్‌సర్వీసెస్, షిప్ స్టీల్‌ఇండియా ఆధ్వర్యంలోని కన్సార్షియానికి బాబు అప్పగించారు. వారు గిట్టుబాటు కాదని చేతులెత్తేశారు. నిజాంపట్నం పోర్టుదీ ఇలాంటి నేపథ్యమే. చెకొస్లోవేకియాకు చెందిన స్కోడా ఎక్స్‌పోర్ట్ కంపెనీకి అప్పగించాలని 2003లోనే చంద్రబాబు నిర్ణయించారు. అదీ ముందుకు సాగలేదు. వాడరేవు, నిజాంపట్నం కాంట్రాక్టర్లిద్దరూ చేతులెత్తేయడంతో రెండింటినీ కలిపి సమీకృతంగా అభివృద్ధి చేయాలని వైఎస్ ప్రభుత్వం తలపెట్టింది. పోర్టులను మాత్రమే అభివృద్ధి చేస్తే లాభదాయకం కాదని బాబు ప్రభుత్వమే ఆమోదించిన నివేదికల నేపథ్యంలో పోర్టులతో పాటు ఆ ప్రాంతంలో పారిశ్రామిక కారిడార్‌నూ అభివృద్ధి చేయాలని వైఎస్ ప్రభుత్వం సంకల్పించింది. జీటూజీ (గవర్నమెంట్ టు గవర్నమెంట్) పద్ధతిలో రాష్ర్ట సర్కారు, రస్ అల్ ఖైమా ప్రభుత్వాల మధ్య వాన్‌పిక్ ఒప్పందం కుదిరింది. బాక్సైట్ తవ్వకాల కోసం గతంలో రస్ అల్ ఖైమాను మన రాష్ట్రానికి తీసుకువచ్చింది చంద్రబాబు సన్నిహితుడైన కోనేరు ప్రసాదే. వాన్‌పిక్‌లో స్థానికంగా భాగస్వామిని తీసుకునే యోచనతో నిమ్మగడ్డ ప్రసాద్‌కి చెందిన ‘మ్యాట్రిక్స్ ఎక్స్‌పోర్టు’ సంస్థతో రస్ అల్‌ఖైమా ప్రభుత్వం జతకట్టింది. వైఎస్ ప్రభుత్వం నేరుగా నిమ్మగడ్డ ప్రసాద్‌కు భూములిచ్చిందే లేదు. 

వాన్‌పిక్‌పై సీబీఐ ఎందుకు అడ్డగోలు వాదనలు చేస్తున్నట్లు? ఈ ప్రాజెక్టులోని వాడరేవు, నిజాంపట్నం పోర్టులను ప్రైవేట్ కన్సార్షియాలకు అప్పగించింది చంద్రబాబు కాదా?

ఈ ప్రాజెక్టులో రాష్ర్ట ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నది రస్ అల్‌ఖైమా ప్రభుత్వం. రస్ అల్‌ఖైమాను బాక్సైట్ తవ్వకాల కోసం రాష్ట్రానికి తీసుకువచ్చింది చంద్రబాబే కదా?

నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి, ప్రభుత్వానికి మధ్య కుదిరిన వాన్‌పిక్ ఒప్పందంలో తొలుత నిమ్మగడ్డ లేనే లేరు. రస్ అల్‌ఖైమాలో ఆ తర్వాత భాగస్వామిగా చేరారు. నిమ్మగడ్డకు వైఎస్ ప్రభుత్వం భూములిచ్చిందెక్కడ?


ఇది క్విడ్ ప్రో కో కాదా?

చంద్రబాబు సీఎంగా ఉండగా జరిగిన లాలూచీ వ్యవహారాలు సీబీఐకి క్విడ్ ప్రో కోగా కనిపించవు. రిలయన్స్ వంటి పేరు మోసిన సంస్థలకు చంద్రబాబు కుప్పలు తెప్పలుగా రాయితీలు ఇచ్చారు.. అదే రిలయన్స్ సంస్థ.. నష్టాల్లో ఉన్న ఈనాడుకు ఆపన్నహస్తం అందించింది. 100 రూపాయలున్న షేరును 5,28,000 రూపాయలు పోసి కొనుగోలు చేసింది.. అలా ఈనాడుకు అవసరమైనప్పుడల్లా కోట్ల కొద్దీ పెట్టుబడులు ప్రవహించాయి. ఇందుకు ప్రతిగానే ఈనాడు పత్రికలోనూ, చానెల్ లోనూ చంద్రబాబును ఆకాశానికెత్తుతూ వరుస కథనాలు వస్తుంటాయి. చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన క్విడ్ ప్రో కోకు ఇదొక ఉదాహరణ మాత్రమే... మార్గదర్శి ఫైనాన్షియర్స్‌లో అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు వందల కోట్ల రూపాయలు ఉన్నాయని రామోజీరావే స్వయంగా ఒప్పుకున్నారు. ఆ డబ్బులన్నీ చంద్రబాబే బినామీ పేర్లతో మార్గదర్శిలో పెట్టారన్న ఆరోపణలకు ఇప్పటివరకూ అటు రామోజీరావుగానీ, చంద్రబాబు గానీ జవాబివ్వలేకపోయారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రయోజనం పొందిన అనేకమంది పారిశ్రామిక వేత్తలు బినామీ పేర్లతో ఇలా మార్గదర్శికి నిధులు ప్రవహింపజేశారన్న ఆరోపణలూ ఉన్నాయి. 

బాబు బండారంపై ‘సెస్’

చంద్రబాబు హయాంలో సెజ్‌ల పేరిట పెట్టుబడులను ఆకర్షించే దిశగా పన్ను రాయితీలు, చౌకగా భూములు కట్టబెట్టడం వెనక ఉన్న అసలు రహస్యాన్ని ‘సెంటర్ ఫర్ ఎకనమిక్స్ అండ్ సోషల్ స్టడీస్’(సెస్) విశ్లేషిస్తూ రూపొందించిన మోనోగ్రాఫ్ (ఏక విషయక నివేదిక)ను ఇటీవల విడుదల చేసింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు రూపొందించిన పారిశ్రామిక, సెజ్ విధానాలు ప్రైవేట్ వ్యక్తులు ఆస్తులు సమకూర్చుకోవడానికి ఉపయోగపడ్డాయే తప్ప పారిశ్రామిక ప్రగతికి దోహదపడలేదని ‘సెస్’ విశ్లేషించింది. 1995లో చంద్రబాబు ముఖ్యమంత్రి కావడాన్ని.. టీడీపీలో జరిగిన సాధారణ మార్పుగా మాత్రమే చూడటానికి లేదని సెస్ నివేదిక తేల్చింది. 

తెలుగుదేశంలోని సంక్షోభాన్ని తారస్థాయికి చేర్చడంలో పెట్టుబడిదారీవర్గం విజయం సాధించిందని పేర్కొంది. ఈ వర్గంలో రామోజీరావు ప్రధాన పాత్ర పోషించారు. ‘‘పెట్టుబడిదారీవర్గం అండతో చంద్రబాబు అధికారంలోకి రావడంతో.. పెట్టుబడిదారుల అనుకూల రాష్ట్రంగా పేరు తీసుకురావడంలోనూ ఈ వర్గం తమదైన పాత్ర పోషించింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే.. సీఎం కార్యాలయం పని తీరునే మార్చేశారు. పెట్టుబడిదారులతో ముఖ్యమంత్రి నేరుగా, ముఖాముఖి మాట్లాడానికి సీఎంవో వేదికైంది’ అని నివేదిక వెల్లడించింది. 

‘తమ వల్ల అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందో చూపించడానికి ఒక మోడల్ స్టేట్, ఒక రోల్ మోడల్ సీఎం కావాలని ప్రపంచబ్యాంకు, డీఎఫ్‌ఐడీ లాంటి అంతర్జాతీయ సంస్థలు వెతుకుతున్న రోజుల్లో.. పెట్టుబడిదారీ అనుకూల విధానాలు, పారిశ్రామికవేత్తలతో భేటీల కోసం ముఖ్యమంత్రిగా చంద్రబాబు చూపిస్తున్న అత్యుత్సాహం.. ప్రపంచబ్యాంక్ ‘పోస్టర్ బాయ్’కి అతికినట్టు సరిపోయాయి. దీంతో అంతర్జాతీయ సంస్థలు సంస్కరణవాదిగా చంద్రబాబుకు పాశ్చాత్య మీడియాలో అత్యంత ప్రచారం కల్పించాయి. సెజ్‌లతో సహా తమ ఆలోచనలను ఆచరణలోకి తీసుకురావడానికి ఆయన్ను వినియోగించుకున్నాయి’’ అని వివరించింది. 

దర్యాప్తు సంస్థలు ఇవెందుకు చేయవు?

రాజకీయ నాయకులు, పార్టీల ఆరోపణలు.. సరే... సెస్ వంటి ఉన్నత ప్రమాణాలుగలిగిన సామాజిక సంస్థలు నిగ్గు తేల్చిన నిజాలను కూడా దర్యాప్తు సంస్థలు పట్టించుకోవా?

చంద్రబాబు హయాంలో భూముల కేటాయింపులు ఏ తీరు సాగాయో... అవి ఎవరికి ఉపయోగపడ్డాయో సెస్ నివేదిక సోదాహరణంగా బట్టబయలు చేసినా ఆవైపు ఎందుకు దృష్టి సారించడం లేదు?

స్వతంత్రంగా వ్యవహరించాల్సిన సీబీఐ వంటి అత్యున్నత దర్యాప్తు సంస్థలు కళ్లెదురుగా అక్రమాలు జరిగినా పట్టించుకోకుండా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీల డెరైక్షన్‌లోనే నడవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?

ఏది తప్పు? 

శ్రీమంతులు గోల్ఫ్ ఆట ఆడుకోవడానికి, విలాసవంతమైన విల్లాలు - ఫైవ్ స్టార్ హోటళ్లు కట్టుకోవడానికి హైదరాబాద్ నడిబొడ్డున చంద్రబాబు ఎమ్మార్ సంస్థకు 535 ఎకరాలను ధారాదత్తం చేశారు. ఎకరం రూ.4 కోట్ల విలువైన భూమిని రూ.29 లక్షలకే కట్టబెట్టారు. దీనివల్ల పేదలకు ఎటువంటి ఉపయోగమూ లేదు. ఉపాధికీ ఉపయోగపడే అవకాశమూ లేదు. అయినా అదెవరికీ తప్పుగా కనిపించడం లేదు.

వెనకబడిన మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల్లో పరిశ్రమల స్థాపన కోసం రెండు సంస్థలకు 75 ఎకరాల చొప్పున వైఎస్ కేటాయించారు. వాస్తవానికి ఆ భూములను ఫార్మాసెజ్ కోసం చంద్రబాబు హయాంలోనే సేకరించారు. అవి చాలాకాలం ఖాళీగా పడి ఉన్నాయి కూడా. ఎకరం రూ.15 లక్షల విలువైన భూమిని రూ.8 లక్షలకు వైఎస్ హయాంలో ఇచ్చారు. నాటి పారిశ్రామిక విధానం ప్రకారం ఇచ్చిన ఈ రాయితీ వల్ల పరిశ్రమలునెలకొల్పుకోగలుగుతామన్న విషయాన్ని, వేలాది మందికి ఉపాధి దొరుకుతుందన్న అంశాన్ని విస్మరిస్తున్నారు. దీనినే తప్పుగా చూస్తున్నారు.

ఈ రెండు ఉదంతాలలో ఏది తప్పు.. ఏది ఒప్పు..? దీనిని తేల్చాల్సిన సీబీఐ ఒకవైపే ఎందుకు చూస్తున్నది? రెండోవైపు ఎందుకు చూడడం లేదు?
Share this article :

0 comments: