సాక్షిని మూసేయించాలనే కుట్ర - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సాక్షిని మూసేయించాలనే కుట్ర

సాక్షిని మూసేయించాలనే కుట్ర

Written By news on Friday, May 18, 2012 | 5/18/2012



కాంగ్రెస్, చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ9పై వైఎస్ జగన్ ధ్వజం

రైల్వేకోడూరు(వైఎస్‌ఆర్ జిల్లా), న్యూస్‌లైన్: ‘ఈ రోజు కాంగ్రెస్ పెద్దలు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ9.. అందరూ కలిసి సాక్షి పత్రిక, సాక్షి టీవీని మూసేయించాలని కుట్ర పన్నుతున్నారు. ‘సాక్షి’ని మూసేయిస్తే మరో మాట జనానికి వినపడదు.. కనపడదు. అప్పుడు ఈనాడు రాసిందే రాత.. ఆంధ్రజ్యోతి రాసిందే గీత.. టీవీ9 చూపించిందే నిజమని జనాన్ని నమ్మించాలని చూస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీ చేయాలని చూస్తున్నారు’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. అధికారపక్షం, ప్రతిపక్షం కలిసి రాష్ట్రంలో ప్రజల సమస్యలన్నీ గాలికి వదిలేశాయని, చనిపోయిన వైఎస్ రాజశేఖర రెడ్డిని ఎలా అప్రతిష్టపాలు చేయాలన్న ఆలోచనతో మాత్రమే పనిచేస్తున్నాయని ఆయన నిప్పులు చెరిగారు. వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి కె. శ్రీనివాసులు తరఫున జగన్ గురువారం ప్రచారం నిర్వహించారు. పెనగలూరు, చిట్వేలి మండలాల్లో ఆయన రోడ్‌షోలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలుచోట్ల ఆయన ప్రసంగించారు. ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే..

మిర్చి పంటను తగులబెట్టుకుంటున్నారు..

వైఎస్ మన మధ్య నుంచి వెళ్లిపోయాక రాష్ట్రంలో రైతు పరిస్థితి అధ్వానంగా తయారైంది. మొన్న కర్నూలు జిల్లాలో ఉన్నప్పుడు పేపర్లో చదివా.. మిర్చి పంటకు గిట్టుబాటు ధర రాక.. రైతులు మిర్చిని తగులబెట్టుకుంటున్న పరిస్థితి చూసి చాలా బాధనిపించింది. వైఎస్‌ఆర్ జిల్లాలో రెండు నెలల క్రితం పర్యటించినపుడు రైతన్నలను పరామర్శించా... ఉల్లి ధర కేజీ రెండు రూపాయలు పలకడంతో చేలోనే వదిలేసిన పరిస్థితులు చూశా. ధరలేక టమాటాను నడిరోడ్డుపైనే రైతన్న పారవేసినా ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు.

పభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ధర్నాలు చేశాం.. దీక్షలు చేశాం.. అయినా ప్రభుత్వ పనితీరు మారలేదు.. దున్నపోతుమీద వర్షం కురిసినట్లుగా ప్రభుత్వ వైఖరి ఉంది. ఈ రోజు వ్యవసాయం చేయడం కంటే ఉరి వేసుకోవడం మేలనే మాట ప్రతి రైతు నోటా వినపడుతోంది. ఇక కూలి పనులు చేసుకునే అక్కచెల్లెమ్మల పరిస్థితి మరీ దయనీయం. వాళ్లకు కనీస కూలీ కూడా ఇవ్వలేని పరిస్థితిలో రైతన్నలున్నారు. కనీస వేతనం రూ.137 ఇవ్వాలని ఓ వైపు ప్రభుత్వమే చెప్తోంది.. మరోవైపు అదే ప్రభుత్వం క్యూబిక్ మీటర్ చొప్పున కాంట్రాక్ట్ ఇచ్చి రూ.60 నుంచి రూ.70 కూడా కూలిగా ఇవ్వడం లేదు. దీంతో కర్నూలు, మహబూబ్‌నగర్, నల్లగొండ, శ్రీకాకుళం జిల్లాల నుంచి అక్కాచెల్లెమ్మలు.. పిల్లా పాపలతో కలిసి గుంటూరు జిల్లాకు వలసపోయి పొలాల్లో పని చేస్తుంటే నేను ప్రత్యక్షంగా చూశాను. వారిని ఎందుకమ్మా ఇంత దూరం వచ్చారని అడిగితే... ‘వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయాక మా పరిస్థితి ఘోరంగా మారిందన్నా. క్యూబిక్ మీటరుకు ఇంత పని అని చేయించుకుంటున్నారు.. దీంతో 60-70 వరకు కూడా గిట్టడం లేదన్నా. ఆ డబ్బు కూడా రెండు, మూడు నెలల్లోపు వస్తే మా అదృష్టమన్నా’ అని చెప్తుంటే చాలా బాధనిపించింది.

ప్రభుత్వం ఫీజు కడుతుందో కట్టదో..

ప్రతి ఇంటి నుంచీ కనీసం ఒక్కరైనా ఇంజినీరో, డాక్టరో అవ్వాలని, కలెక్టర్ వంటి పెద్ద పెద్ద చదువులు చదవాలని.. అప్పుడే ఆ ఇంటి నుంచి పేదరికం పోతుందని వైఎస్ ఓ స్వప్నాన్ని చూశారు. ఫీజు రీయింబర్స్‌మెంటు పథకం ప్రవేశపెట్టారు. ఇవాళ చదువుకునే ఏ పిల్లాడిని అడిగినా.. ‘అన్నా నేను కాలేజీకైతే పోతున్నాను కానీ.. ఈ ప్రభుత్వం ఫీజు(ఫీజు రీయింబర్స్‌మెంట్) కడుతుందో కట్టదో అన్న భయంతోనే చదువుతున్నానన్నా’ అని అంటున్నాడు. నిరుటి స్కాలర్‌షిప్ డబ్బులే రాలేదంటున్నాడు. ఇక వైఎస్ ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ పథకాన్ని చూస్తే.. దాన్ని ఓ పథకం ప్రకారం నాశనం చేస్తోందీ ప్రభుత్వం.

108 వాహనాలు సగానికి సగం మూలనపడ్డాయి. ఫోన్ చేస్తే సిబ్బంది సమ్మెలో ఉన్నారనో.. వాహనాలు రిపేరు షెడ్లలో ఉన్నాయనో.. మాకు జీతాలు రావట్లేదనో చెప్తున్నారు. మూగ, చెవుడు ఉన్న పిల్లలకు సంజీవని లాంటి కాక్లియర్ ఇంప్లాంటేషన్ ఆపరేషన్‌ను వైఎస్ హయాంలో 12 ఏళ్ల వయసు వరకు ఉచితంగా చేయిస్తే ప్రస్తుత ప్రభుత్వం దాన్ని రెండేళ్లలోపు పిల్లలకు మాత్రమే వర్తింపజేస్తోంది. రెండేళ్లలోపు తమ పిల్లలకు చెవుడు, మూగ ఉన్నట్లు తల్లిదండ్రులు గుర్తించకపోతే ఆ చిన్నారులు జీవితాంతం దుర్భర జీవితం గడపాల్సిందేనా? వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం రాష్ట్రంలో పేదల కోసం కొత్తగా ఒక్క ఇల్లు కూడా కట్టించలేదీ ప్రభుత్వం.

ఇద్దరూ కుమ్మక్కై జనాన్ని గాలికొదిలేశారు..

అధికారపక్షం పట్టించుకోవట్లేదు.. పోనీ ప్రతిపక్షమైనా మన తరఫున పోరాటం చేస్తుందని ప్రజలు అటువైపు చూస్తే చంద్రబాబు దేశ చరిత్రలో ముందెన్నడూ లేని రీతిలో కాంగ్రెస్‌తో కుమ్మక్కైపోయారు. కుమ్మక్కై ప్రజల్ని గాలికొదిలేసి.. వైఎస్‌ను అప్రదిష్టపాలు చేయాలని చూస్తున్నారు. ఇద్దరూ కలిసి కోర్టుకు వెళతారు... వైఎస్‌ను అప్రదిష్టపాలు చేసేందుకు తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో లోపాయికారీ ఒప్పందాలు పెట్టుకుని పోటీలు చేస్తున్నారు. ఆర్‌టీఐ కమిషనర్ పదవులను చెరిసగం పంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబును ప్రసన్నం చేసుకోవడానికి కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఆయనకు సన్నిహితుడైన జీఎన్ నాయుడు అనే వ్యక్తికి హైదరాబాద్ నడిబొడ్డున అమీర్‌పేటలో ఐదెకరాల భూమిని ధారాదత్తం చేశారు. 18 స్థానాలకు జరుగుతున్నఉప ఎన్నికలు ఈ పాలకులకు గుణపాఠం నేర్పి రాబోయే మహాసంగ్రామానికి నాంది పలకబోతున్నాయి.

వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి మాజీ ఎమ్మెల్యే గుంటి ప్రసాద్

రైల్వేకోడూరు మాజీ ఎమ్మెల్యే గుంటి వెంకటేశ్వర ప్రసాద్ కాంగ్రెస్ పార్టీని వీడి గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ అధినేత జగన్ సమక్షంలో వందలాది మంది కార్యకర్తలతో ఆయన చేరారు. ఆయన రైల్వేకోడూరు నియోజకవర్గానికి 2004 నుంచి 2009 వరకు ప్రాతినిధ్యం వహించారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ వైఎస్‌పైనున్న అభిమానంతోనే పార్టీలో చేరానన్నారు. ఆయన పథకాలు తిరిగి అమలు కావాలంటే ఆయన తనయుడు వైఎస్ జగన్ సీఎం కావాల్సిందేనని ఆకాంక్షించారు. ఈయనతోపాటు పోలోపల్లె, టీడీపీ మాజీ సర్పంచ్ హరినారాయణరాజు పార్టీలో చేరారు. అలాగే వైఎస్ జగన్ సమక్షంలో తిరుపతికి చెందిన టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు ఓవీ రమణ కూడా వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ తిరుపతి అభ్యర్థి కరుణాకర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా జగన్ రోడ్‌షోలో నియోజకవర్గ సమన్వయ కర్తలు ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, రూపానందరెడ్డి, వైఎస్ కొండారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు బ్రహ్మనందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: