జీవన్‌రెడ్డికి షోకాజ్ నోటీస్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జీవన్‌రెడ్డికి షోకాజ్ నోటీస్

జీవన్‌రెడ్డికి షోకాజ్ నోటీస్

Written By news on Friday, May 18, 2012 | 5/18/2012

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డికి పార్టీ క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. చైర్మన్ కంతేటి సత్యనారాయణ రాజు అధ్యక్షతన గురువారం ఇక్కడ గాంధీభవన్లో సంఘం సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. మే 24న కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వాలని జీవన్‌రెడ్డిని ఆదేశించింది. ఆయన పార్టీ అగ్రనేతలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నందున చర్యలు తీసుకోవాలని కరీంనగర్ జిల్లాకు చెందిన పీసీసీ అధికార ప్రతినిధి మృత్యుంజయం ఇచ్చిన ఫిర్యాదును కమిటీ పరిశీలించింది. పత్రికల వార్తల క్లిప్పింగులను పరిశీలించి, ఆయన వివరణ తీసుకోవాలని నిర్ణయించింది. విజయవాడకు చెందిన మరో నేత శివాజీపై వచ్చిన ఫిర్యాదులనూ పరిశీలించింది. అయితే పార్టీ విధానాలకు కట్టుబడి ఉంటానని, తనపై చర్యలు తీసుకోరాదని కోరుతూ కమిటీకి శివాజీ లేఖ సమర్పించారు. దాన్ని పరిగణనలోకి తీసుకుని, ఆయనపై ఫిర్యాదుల పరిశీలనను అంతటితో ముగించారు. భేటీలో సంఘం సభ్యులు పి.కిష్టారెడ్డి, బొమ్మా వెంకటేశ్వర్లు, సుల్తాన్ అహ్మద్, రెహ్మాన్ భేటీలో పాల్గొన్నారు.

ఫిర్యాదులొస్తేనే పరిశీలన!

జీవన్‌రెడ్డికి నోటీసులివ్వడంపై పీసీసీ నేతల్లో సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. దీని వెనుక పెద్ద మతలబే ఉందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. దివంగత వైఎస్ విషయంలో కాంగ్రెస్ నోటితో పొగిడి నొసటితో వెక్కిరించే విధానాన్ని అనుసరిస్తుండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. వైఎస్ తమ నాయకుడేనని పైకి చెబుతున్నా, వాస్తవంలో మాత్రం ఆయన్ను అవినీతిపరునిగా చిత్రీకరించేందుకు పార్టీ శతవిధాలా యత్నిస్తోంది. వైఎస్‌కు అనుకూలంగా మాట్లాడరాదంటూ నేతలందరికీ ఇప్పటికే మౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయి. అలా మాట్లాడే వారిని ఉపేక్షించరాదని, అవసరమైతే పార్టీ నుంచి పంపేందుకూ వెనుకాడరాదని భావిస్తున్నారు. 

పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలనే సాకు చూపినా, వైఎస్‌ను అభిమానించినందుకే జీవన్‌కు నోటీసులిచ్చారని పీసీసీ నేతలే చెప్పుకుంటున్నారు. వైఎస్ విధానాలను సమర్థించడమంటే సీబీఐ విచారణను తప్పుపట్టడమే అవుతుందన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్తున్నాయనే భయంతోనే కాంగ్రెస్ పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నారని సీమాంధ్రకు చెందిన మాజీ మంత్రి ఒకరన్నారు. వైఎస్‌ను అభిమానించే ప్రజలంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే మద్దతు పలుకుతుండటంతో వైఎస్‌ను ఇమేజీనే దెబ్బ తీసే పనిలో పడ్డారని వ్యాఖ్యానించారు. ఇటీవలి కాలంలో కాంగ్రెస్‌పైనా, ప్రభుత్వంపైనా, ప్రధాని, సీఎం, పీసీసీ చీఫ్‌లపైనా తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్న వారికి పార్టీలో కొదవే లేదు. డీఎల్ రవీంద్రారెడ్డి వంటి మంత్రులు, శంకర్రావు లాంటి సీనియర్ నేతలు సీఎంపైనే తీవ్ర విమర్శలు చేశారు. డీఎల్ అయితే కిరణ్‌ను జగన్ కోవర్టని ఆరోపించారు. హైకమాండ్‌కు సూట్‌కేసులు మోసి సీఎం అయ్యారనీ విమర్శించారు. ఇంతకంటే పార్టీ ధిక్కారం మరొకటేముంటుంది! శంకర్రావు కూడా సీఎంను అవినీతిపరుడు అనడమే గాక ఆయనపై ఏకంగా హైకోర్టులో కేసే వేశారు. సీఎంను గద్దె దించేదాకా తన పోరాటం ఆగదని మరో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా పలుమార్లు ప్రకటించారు. ఇక తెలంగాణ ఎంపీలైతే సీఎంపై పలుమార్లు తీవ్రమైన ఆరోపణలు చేశారు. ప్రధాని మన్మోహన్‌నే పనికిరాని వ్యక్తి అని పాలడుగు వెంకట్రావు వంటి నేతలు పార్టీ వేదికల నుంచే విమర్శించారు. వారిపై చర్యలు దేవుడెరుగు, కనీసం నోటీసులిచ్చేందుకూ కాంగ్రెస్ పెద్దలు సాహసించలేదు. క్రమశిక్షణ సంఘమూ వీటిని పరిగణనలోకే తీసుకోవడం లేదు. 

దీనిపై కంతేటిని మీడియా ప్రశ్నిస్తే, పీసీసీ నుంచి వచ్చిన ఫిర్యాదుల పరిశీలన వరకే తమకు అధికారముంది తప్ప అంతకుమించి ముందుకు వెళ్లలేమన్నారు. ‘‘అగ్ర నేతలపైనా, ప్రభుత్వంపైనా చాలామంది తీవ్రారోపణలు, విమర్శలు చేస్తుండడం నిజమే. కానీ వాటిపై పీసీసీకి ఫిర్యాదులు రానిదే మేమేమీ చేయలేం. సోనియా, కిరణ్, బొత్సలను జీవన్‌రెడ్డి విమర్శిస్తున్నట్టు, జగన్‌కు అనుకూలంగా మాట్లాడుతున్నట్టు మా దృష్టికి వచ్చింది’’ అన్నారు. కానీ జీవన్‌రెడ్డి వైఎస్సార్ కార్యక్రమాలను పేర్కొన్నారే తప్ప జగన్ గురించి కాదని, వైఎస్ పేరెత్తే వారందరికీ ఇలాగే నోటీసులిస్తారా అని అడిగితే కంతేటి స్పష్టంగా బదులివ్వలేదు. ‘వాటిని వదిలేయండి. సోనియా, కిరణ్‌లపై జీవన్ చేసిన విమర్శలకే మేం నోటీసులిస్తున్నాం’’ అని చెప్పుకొచ్చారు. ఇతర నేతల ఆరోపణలు, విమర్శలపై పీసీసీ, ఏఐసీసీలకు నివేదికలు పంపుతామన్నారు.
Share this article :

0 comments: