స్టే విధించిన హైకోర్టు.. సర్కారుకు షాక్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » స్టే విధించిన హైకోర్టు.. సర్కారుకు షాక్

స్టే విధించిన హైకోర్టు.. సర్కారుకు షాక్

Written By news on Friday, May 18, 2012 | 5/18/2012


‘సాక్షి’కి ప్రకటనలను నిలిపివేస్తూ ఇచ్చిన జీవో తాత్కాలిక నిలుపుదల
జీవో 2097 ప్రభుత్వ మార్గదర్శకాలకు (జీవో 403) విరుద్ధం..
క్రిమినల్ కేసు ఉంటే ప్రకటనలు ఆపాలని మార్గదర్శకాల్లో ఎక్కడా లేదు 
మధ్యంతర ఉత్తర్వుల్లో స్పష్టం చేసిన న్యాయమూర్తి 
చార్జిషీట్ ఆధారంగానే జీవో జారీ చేశామని ప్రభుత్వ వాదన 
చార్జిషీట్‌లో ఇందిరా టెలివిజన్ లేదు కదా?... ప్రకటనలు ఎందుకు ఆపారని ప్రభుత్వానికి న్యాయమూర్తి ప్రశ్నలు 
{పభుత్వం ఒక నిర్ణయానికి వచ్చేసి శిక్షిస్తోందని పిటిషనర్ల ఆవేదన 
ఇది వాక్‌స్వాతంత్య్రాన్ని, పత్రికా స్వేచ్ఛను హరించటమేనని స్పష్టీకరణ 
కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వానికి, సీబీఐకి హైకోర్టు ఆదేశం
పిటిషన్లపై తదుపరి విచారణ జూన్ 16కు వాయిదా

చార్జిషీట్‌లో జగతి పబ్లికేషన్స్‌పై ఎటువంటి ఆరోపణలు లేవు. 
మరి అలాంటప్పుడు జగతి పబ్లికేషన్స్ ఏం నేరం చేసింది? 
దేని ప్రకారం ప్రకటనలు నిలుపుదల చేశారు?

భారీ ప్రీమియంతో జగతి పబ్లికేషన్స్‌లో వాటాలు కొన్నారనే అనుకుందాం. అలా వచ్చిన మొత్తాలన్నీ వైట్ మనీయే కదా. ఆ డబ్బంతా ఎక్కడకు వెళుతుంది.. వాటాదారులకే కదా. అందులో తప్పేముంది. ఈ వ్యవహారంలో జగతి చేసిన నేరమేమిటి..?

జగతిని, జగన్‌మోహన్‌రెడ్డిని వేరుగా చూడాల్సిన అవసరం ఉంది

ప్రకటనలు నిలుపుదల చేస్తే, సంస్థ ఆదాయం తగ్గే అవకాశం ఉంది. 
కాబట్టి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయటం అవసరమని భావిస్తున్నాం. జీవో 2097ను తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నాం 

హైదరాబాద్, న్యూస్‌లైన్: సాక్షి దినపత్రిక, సాక్షి టెలివిజన్‌లకు ప్రభుత్వ ప్రకటనలను నిలుపుదల చేస్తూ చీకటి జీవో జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రకటనలు ఆపేస్తూ ఇచ్చిన జీవో 2097ను హైకోర్టు తాత్కాలికంగా నిలుపుదల చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బి.శేషశయనారెడ్డి గురువారం మధ్యాహ్నం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ప్రకటనల నిలుపుదలకు కొన్ని మార్గదర్శకాలను రూపొందిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 403కు విరుద్ధంగా జీవో 2097 ఉందని న్యాయమూర్తి స్పష్టం చేశారు. అందువల్ల జీవో 2097ను తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు తేల్చి చెప్పారు. క్రిమినల్ కేసు ఉంటే, దాని ఆధారంగా ప్రకటనలు నిలుపుదల చేయవచ్చునని జీవో 403లో ఎక్కడా లేదని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అంతకుముందు వాదనల సమయంలో న్యాయమూర్తి చీకటి జీవోపై ప్రభుత్వాన్ని నిలదీశారు. చార్జిషీట్‌లో జగతి పబ్లికేషన్స్ నిందితుల జాబితాలో ఉన్నప్పటికీ.. ఆ సంస్థపై ఎటువంటి ఆరోపణలు లేకపోవటాన్ని న్యాయమూర్తి ప్రస్తావించారు. ‘పెట్టుబడులకు సంబంధించి పలువురు వ్యక్తులపై ఆరోపణలు ఉన్నాయి. చార్జిషీట్‌లో జగతి పబ్లికేషన్స్‌పై ఎటువంటి ఆరోపణలు లేవు. మరి అలాంటప్పుడు జగతి పబ్లికేషన్స్ ఏం నేరం చేసింది? దేని ప్రకారం ప్రకటనలు నిలుపుదల చేశారు?’ అని ప్రభుత్వాన్ని న్యాయమూర్తి ప్రశ్నించారు. జగతి పబ్లికేషన్స్‌ను, వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని వేరుగా చూడాల్సిన అవసరం ఉందని ప్రభుత్వానికి హితవు పలికారు. జగతి పబ్లికేషన్స్‌లోకి వచ్చిన మొత్తం వైట్ మనీయే (నల్లధనం కాదు) కదా.. అని ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సాక్షి పత్రికకు, టీవీ చానల్‌కు ప్రభుత్వ ప్రకటనలను నిలుపుదల చేస్తూ ఇచ్చిన జీవో 2097ను కొట్టివేయాలని, అలాగే సాక్షికి వెంటనే ప్రకటనలు విడుదల చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ సోమవారం ఇందిరా టెలివిజన్, ఆ సంస్థ డెరైక్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఒక పిటిషన్, జగతి పబ్లికేషన్స్, ఆ సంస్థ ఎడిటోరియల్ డెరైక్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి, ఫైనాన్స్ డెరైక్టర్ వై.ఇ.ప్రసాదరెడ్డి, అడ్వర్‌టైజ్‌మెంట్, మార్కెటింగ్ డెరైక్టర్ కె.ఆర్.పి.రెడ్డి మరో పిటిషన్ దాఖలు చేశారు. ఇదే సమయంలో చీకటి జీవోను కొట్టివేయాలని, ఈ కేసు తేలేంత వరకు జీవో అమలును నిలుపుదల చేయాలంటూ సాక్షి ఎడిటర్ వి.మురళి ఒక పిటిషన్, అసిస్టెంట్ ఎడిటర్లు ఎస్.రాజమహేంద్రారెడ్డి, టి.వేణుగోపాలరావులతో పాటు వివిధ హోదాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు మరో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నాలుగు వ్యాజ్యాలను న్యాయమూర్తి జస్టిస్ శేషశయనారెడ్డి విచారించారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది డి.వి.సీతారామ్మూర్తి, న్యాయవాది శ్రీరామ్‌లు వాదనలు వినిపించగా.. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ కె.జి.కృష్ణమూర్తి వాదనలు వినిపించారు. 

పత్రిక మూతపడితే ప్రజాప్రయోజనమా? 
విచారణ సందర్భంగా పిటిషనర్ల తరఫున మొదట సీనియర్ న్యాయవాది శ్రీరామ్ వాదనలు వినిపించారు. ముఖ్యాంశాలివీ... 
- ప్రకటనలను ఏ ఏ సందర్భాల్లో నిలుపుదల చేయవచ్చో పేర్కొంటూ ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలతో 1992లో జీవో 403 జారీ చేసింది. జాతి వ్యతిరేక, మతతత్వ, దుర్వినియోగం చేసే, సమాజంలోని వివిధ వర్గాల మధ్య స్పర్ధలను రెచ్చగొట్టే, దురుద్దేశంతో తప్పుడు కథనాలు, వ్యక్తి ప్రతిష్ట దెబ్బతిసే కథనాలు, బ్లాక్ మెయిలింగ్, వ్యక్తులపై దాడులు, సాక్ష్యాలు లేకుండా తప్పుడు కథనాలతో బురద చల్లటం, ప్రభుత్వం, దాని పాలకులపై నిందలు వేయటం, దూషించటం వంటి చర్యలకు పాల్పడ్డప్పుడు మాత్రమే ఆయా పత్రికలకు ప్రకటనలను నిలుపుదల చేయవచ్చునని ప్రభుత్వం జీవో 403లో స్పష్టంగా పేర్కొంది. 

- ఈ మార్గదర్శకాలను సాక్షి పత్రిక, సాక్షి టీవీ ఎన్నడూ ఉల్లంఘించలేదు. ఈ మార్గదర్శకాలను మేం ఉల్లంఘించినట్లు ప్రభుత్వమే చెప్పటం లేదు. జగతి పబ్లికేషన్స్‌పై చార్జిషీట్ దాఖలైంది కాబట్టి, ప్రకటనలను నిలుపుదల చేస్తున్నామని ప్రభుత్వం తన జీవోలో పేర్కొంది. కేసులు ఎదుర్కొంటున్న వారు ప్రకటనలకు అనర్హులని ప్రభుత్వ మార్గదర్శకాల్లో ఎక్కడా లేదు. మరి దేని ఆధారంగా ప్రభుత్వం జీవో 2097 జారీ చేసింది? ఏ ప్రాతిపదికన సాక్షికి ప్రకటనలు నిలుపుదల చేసింది? ప్రకటనలు నిలుపుదల చేయాలంటూ జీవో 403కు అనుగుణంగా నడుచుకోవాలి. కాని ప్రభుత్వం ఇక్కడ ఏం చేసింది? జీవో గురించి మాత్రమే ప్రస్తావించి.. చార్జిషీట్ ఉంది కాబట్టి ప్రకటనలు ఇవ్వటం లేదని చెప్పంది. ఇదెక్కడి న్యాయం..? ప్రకటనల నిలుపుదల ప్రజా ప్రయోజనాల కోసం చేసినట్లు ప్రభుత్వం చెప్పుకుంటోంది. ఒక పత్రిక మూతపడితే అది ప్రజా ప్రయోజనమా..? ఆ సంస్థ ఉద్యోగులు రోడ్ల పాలైతే అది ప్రజా ప్రయోజనమా..? ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వం లోతుగా పరిశీలన చేయలేదు. కనీస స్థాయిలో కూడా బుర్ర ఉపయోగించలేదు. 

- 2004-09 మధ్య కాలంలో పలు ప్రభుత్వం పలు కంపెనీలకు, వ్యక్తులు లబ్ధి చేకూర్చిందని, అందుకు ప్రతిగా ఆ కంపెనీలు, వ్యక్తులు జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడులు పెట్టారన్నది ప్రధాన ఆరోపణ. అంటే ప్రభుత్వంపై కూడా ఆరోపణలు ఉన్నట్లే కదా. ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వం, అదే అంశానికి సంబంధించి సాక్షికి ప్రకటనలు ఎలా నిలుపుదల చేస్తుంది? దీనిపై సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్‌లో జగతి పబ్లికేషన్స్‌పై ఎటువంటి ఆరోపణలు లేవు. ఇక ఇందిరా టెలివిజన్ అసలు నిందితుల జాబితాలోనే లేదు. మరి సాక్షి టీవీకి ప్రకటనలు ఎందుకు నిలుపుదల చేసినట్లు? జగతి పబ్లికేషన్స్‌కు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి ఎటువంటి సంబంధం లేదు. ఆయనకు జగతిలో ఎన్నడూ వాటాలు లేవు. 

- ఈ సమయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. జగన్‌కు వాటాలు అసలు లేవా? అంటూ తరచి తరచి ప్రశ్నించారు. ‘కావాలంటే ఈ కోర్టు మేం చెప్పేది రికార్డు చేసుకోవచ్చు. నాడు, నేడు, ఎన్నడూ జగతి పబ్లికేషన్స్‌లో జగన్‌కు ఎటువంటి వాటాలు లేవు. 2011లో ఆయన డెరైక్టర్ పదవి నుంచి తప్పుకున్నారు’ అని శ్రీరామ్ న్యాయమూర్తికి నివేదించారు. 

- ప్రభుత్వం జారీ చేసిన జీవో వాక్ స్వాతంత్య్రం, భావప్రకటన హక్కును హరించేదిగా ఉంది. ప్రకటనల నిలుపుదల జీవో జారీ చేసే ముందు ప్రభుత్వం కనీస స్థాయిలో కూడా పత్రికా స్వేచ్ఛ గురించి ఆలోచించలేదు. ప్రభుత్వ చర్యల ప్రభావం సాక్షిపై ప్రత్యక్షంగా ఉంటుంది. ప్రకటనల నిలుపుదల వల్ల ఆదాయం తగ్గి, ఉద్యోగులు ఇబ్బంది పడతారు. 

- పెట్టుబడల వ్యవహారంపై సీబీఐ ఇంకా దర్యాప్తు చేస్తుండగానే.. రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా ఓ నిర్ణయానికి వచ్చేసి, ప్రకటనల నిలుపుదల రూపంలో మమ్మల్ని శిక్షిస్తోంది. సాక్షి దినపత్రిక అత్యధిక సర్కులేషన్‌తో రాష్ట్రంలో రెండో స్థానంలో ఉంది. సాక్షి, దాని యాజమాన్యాన్ని ఏ విధంగానైనా సాధించాలనే దుగ్ధతో అత్యుత్సాహంగా ప్రభుత్వం జీవో 2097 జారీ చేసింది. 

- సీనియర్ న్యాయవాది డి.వి.సీతారామ్మూర్తి వాదనలు వినిపిస్తూ.. ‘సాక్షి పత్రిక, టీవీలకు ప్రకటనల నిలుపుదల ఖచ్చితంగా వాక్ స్వాతంత్రపు హక్కును హరించటమే. ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టు పలు తీర్పులు వెలువవరించింది. (ఆ తీర్పులను చదివి వినిపించారు.) ప్రభుత్వం ఒక నిర్దిష్ట లక్ష్యంతోనే ప్రకటనలను నిలుపుదల చేసింది. ప్రకటనల నిలుపుదల ప్రభావం పత్రికలపై ప్రత్యక్షంగా ఉంటుందని సుప్రీంకోర్టు ఎన్నడో స్పష్టం చేసింది’ అని వివరించారు. 

ప్రజాప్రయోజనాల కోసమే జీవో: సర్కారు 
తరువాత అదనపు అడ్వొకేట్ జనరల్ కె.జి.కృష్ణమూర్తి వాదనలు వినిపించారు. ఆయన వాదనల్లోని ముఖ్యాంశాలివీ... 

- సాక్షి దినపత్రిక, టీవీలకు ప్రకటనల నిలుపుదలకు సంబంధించి ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరగలేదు. ఆ ప్రశ్నే తలెత్తదు. ప్రభుత్వం నుంచి పొందిన పలు లబ్ధిలకు ప్రతిగా పలు కంపెనీలు, వ్యక్తులు జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడులు పెట్టారు. దీనిపై సీబీఐ చార్జిషీట్ కూడా దాఖలు చేసింది. ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి కాబట్టి.. చార్జిషీట్‌లో జగతి పబ్లికేషన్స్ నిందితుల జాబితాలో ఉంది కాబట్టి.. సాక్షికి ప్రకటనలు నిలుపుదల చేశాం. ఇందులో తప్పేమీ లేదు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం ఈ జీవో జారీ చేసింది. సాక్షికి జీవోల నిలుపుదల తాత్కాలిక చర్య మాత్రమే. ఆరోపణల నుంచి విముక్తి పొందేంత వరకు ప్రకటనలు నిలుపుదల చేస్తున్నామని జీవోలో స్పష్టంగా పేర్కొన్నాం. ఇందులో వాక్ స్వాతంత్రపు హక్కును హరించటం ఏముంది? 

జగతి చేసిన నేరమేమిటి?: న్యాయమూర్తి ప్రశ్న 
ఈ సమయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. ‘మీరు చెప్తున్నట్లే భారీ ప్రీమియంతో జగతి పబ్లికేషన్స్‌లో వాటాలు కొన్నారనే అనుకుందాం. అలా వచ్చిన మొత్తాలన్నీ వైట్ మనీయే కదా. ఆ డబ్బుంతా ఎక్కడకు వెళుతుంది.. వాటాదారులకే కదా. అందులో తప్పేముంది. ఈ మొత్తం వ్యవహారంలో జగతి చేసిన నేరమేమిటి..?’ అని ప్రశ్నించారు. దీనికి కృష్ణమూర్తి స్పందిస్తూ.. చార్జిషీట్ ఆధారంగానే ప్రకటనల నిలుపుదల జీవో జారీ చేశామని తెలిపారు. ప్రభుత్వం నుంచి భూములు పొందిన వారు, జగతిలో పెట్టుబడులు పెట్టారని మరోసారి వివరించారు. ఈ సందర్భంగా ఆయన ఉషోదయ పబ్లికేషన్స్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో పాటు మరికొన్ని తీర్పులను ప్రస్తావించారు. ఈ సమయంలో ఆయన సాక్షి బ్యాంకు ఖాతాల స్తంభన గురించి ప్రస్తావించారు. అయితే న్యాయమూర్తి అందుకు అభ్యంతరం చెప్పారు. ఈ కోర్టు ముందున్నది ప్రకటనలకు సంబంధించిన వ్యవహారం మాత్రమేనని.. వాదనలను దానికి మాత్రమే పరిమితం చేయాలని అదనపు ఏజీకి నిర్దేశించారు. 

నిందితుల జాబితాలో ఇందిరా టెలివిజన్ లేదుకదా? 
‘జగన్‌ను, జగతి పబ్లికేషన్స్‌ను వేరు చేసి చూడాల్సిన అవసరం ఉంది’ అని న్యాయమూర్తి స్పష్టంచేశారు. కంపెనీ తప్పు చేసిందని అనిపిస్తే చట్ట ప్రకారం అందుకు తగిన చర్యలు తీసుకోవచ్చునంటూ, పరోక్షంగా ప్రకటనల నిలుపుదలను తప్పుపట్టారు. ఇదే సమయంలో న్యాయమూర్తి.. చార్జిషీట్‌లో ఇందిరా టెలివిజన్ నిందితుల జాబితాలో లేనప్పుడు, దానికి ఎందుకు ప్రకటనలు నిలుపుదల చేశారని కృష్ణమూర్తిని ప్రశ్నించారు. ఇందిరా టెలివిజన్‌లో జగతి పబ్లికేషన్స్, జనని ఇన్‌ఫ్రాలు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టాయని, అందుకే సాక్షి టీవీకి ప్రకటనలు నిలుపుదల చేశామని కృష్ణమూర్తి వివరించారు. దీనికి శ్రీరామ్ అభ్యంతరం తెలిపారు. ఇందిరా టెలివిజన్‌లో జగతి, జనని ఇన్‌ఫ్రాలు ఎటువంటి పెట్టుబడులు పెట్టలేదని, దీనిని రికార్డు చేసుకోవచ్చునని కోర్టుకు నివేదించారు. 

జీవో 403కు విరుద్ధం: నాయమూర్తి ఆదేశాలు 
ఇరుపక్షాల వాదనల అనంతరం న్యాయమూర్తి కోర్టు హాలులోనే ఉత్తర్వులను వెలువరించారు. ‘ప్రకటనలను నిలుపుదల చేస్తూ జారీ చేసిన జీవో 2097 ప్రకటన నిలుపుదల మార్గదర్శకాల జీవో 403కు అనుగుణంగా ఉందా లేదా అన్నదే ఇక్కడ ప్రధాన అంశం. అందుకు సంబంధించి ఆ మార్గదర్శకాలను ఇక్కడ ప్రస్తావిస్తున్నా. ఈ మార్గదర్శకాలను ఆమూలాగ్రం చదివాను. క్రిమినల్ కేసు ఉంటే, దాని ఆధారంగా ప్రకటనలను ఉపసంహరించవచ్చునని ఆ మార్గదర్శకాల్లో ఎక్కడా లేదు. జగతి పబ్లికేషన్స్ ఓ కంపెనీ. ఇందులో పలువురు వాటాదారులు పెట్టుబడులు పెట్టారు. జీవో 403కు విరుద్ధంగా ప్రకటనలు నిలుపుదల చేస్తూ జారీ చేసిన జీవో 2097 ఉందని ప్రాథమికంగా నేను అభిప్రాయపడుతున్నాను. కాబట్టి పిటిషనర్లు లేవనెత్తిన అంశాలతో ఏకీభవిస్తున్నా. ప్రకటనలు నిలుపుదల చేస్తే, సంస్థ ఆదాయంలో క్షీణత ఉండే అవకాశం ఉంది. కాబట్టి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయటం అవసరమని భావిస్తున్నా. జీవో 2097ను తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నా’ అని జస్టిస్ శేషశయనారెడ్డి తన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. కేసును తదుపరి విచారణ నిమిత్తం వచ్చే నెల 16వ తేదీకి వాయిదా వేశారు. అప్పటికి కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని, సీబీఐని ఆదేశించారు.
Share this article :

0 comments: