అపవిత్ర పొత్తులతో నష్టపోయిన కాంగ్రెస్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అపవిత్ర పొత్తులతో నష్టపోయిన కాంగ్రెస్

అపవిత్ర పొత్తులతో నష్టపోయిన కాంగ్రెస్

Written By news on Monday, July 29, 2013 | 7/29/2013

http://andhrabhoomi.net/content/congress-20

ఒంగోలు, జూలై 28: అధికార కాంగ్రెస్ పార్టీ వ్యూహం బెడిసి కొట్టింది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలనే లక్ష్యంతో పలుచోట్ల తెలుగుదేశం పార్టీతో కుదుర్చుకున్న అపవిత్ర పొత్తుతో కాంగ్రెస్ పార్టీ నష్టపోయిందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. జిల్లాలో రెండు విడతలుగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఘనవిజయం సాధించారు. జిల్లాపార్టీ నాయకులు ఊహించిన దానికంటే ఎక్కువ పంచాయతీలను సాధించటంతో ఆ పార్టీనేతల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. ఇప్పటివరకు రెండు విడతల్లో 821 పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా తెలుగుదేశం పార్టీకి 310, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి 233, కాంగ్రెస్ పార్టీకి 168, సిపిఎం ఒకటి, ఇతరులు 109 పంచాయతీల్లో గెలుపొందారు. ఒంగోలు డివిజన్‌లో మొదట విడత జరిగిన 346 పంచాయతీల్లో తెలుగుదేశంకు 145, వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు 93, కాంగ్రెస్‌కు 58, ఇతరులకు 50 పంచాయతీలు వచ్చాయి. మలివిడత జరిగిన 475 పంచాయతీల్లో తెలుగుదేశంకు 165, వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు 140, కాంగ్రెస్‌కు 110, సిపిఎం ఒకటి, ఇతరులు 59 పంచాయతీలను కైవశం చేసుకున్నారు. జిల్లాలో రెండు విడతలుగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య నువ్వానేనా అన్న రీతిలో పోరు సాగగా, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మాత్రం దయనీయంగా మారింది. ముఖ్యమంత్రి ఎన్ కిరణ్‌కుమార్‌రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలు జిల్లాలోని పంచాయతీలపై దృష్టిపెట్టండని పదేపదే శాసనసభ్యులకు, ఇన్‌చార్జులకు ఆదేశాలు జారీచేసినప్పటికీ మెరుగైన ఫలితాలు రాకపోవటం గమనార్హం. జిల్లాలోని శాసనసభ్యుల పనితీరుపట్ల గ్రామీణప్రాంతాల ప్రజలు విశ్వాసం కోల్పోయినట్లుగా ఈ ఎన్నికలు రుజువు చేస్తున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా తాను కూర్చున్న కొమ్మను తానే నరక్కున్న చందంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికి తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థులకు కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది. ప్రధానంగా ఈ రెండు పార్టీలు శత్రువులుగా ఉండాల్సిందిపోయి మిత్రులుగా మారి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలనే లక్ష్యంగానే పనిచేశారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో కొన్ని పంచాయతీలు కాంగ్రెస్ పార్టీ కోల్పోవాల్సి వచ్చింది. కొత్తపట్నం మండలంలోని గుండమాల, మడనూరు పంచాయతీలే ఇందుకు ఉదాహరణ. కనీసం కొన్ని గ్రామాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ఎన్నికల బరిలో నిలబెట్టలేని దుస్థితిలో కాంగ్రెస్‌పార్టీ ఉండటం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. మొత్తంమీద తెలుగుదేశం పార్టీ ఈ రెండు విడతల్లో జరిగిన ఎన్నికల్లో ఘనవిజయం సాధించటం పట్ల ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం నెలకొంది. ఇదిలాఉండగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలోని నేతలు కూడా సమన్వయంగా వ్యవహరించటం లేదన్న విమర్శలు ఉన్నాయి. దీంతో కొన్ని పంచాయతీలు చేజారయన్న వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తంమీద పంచాయతీ ఎన్నికల్లో అధికారంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్‌కు ప్రతికూల ఫలితాలే వచ్చాయి.


Share this article :

0 comments: