గిరిజనుల కన్నీళ్లు పట్టవా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » గిరిజనుల కన్నీళ్లు పట్టవా?

గిరిజనుల కన్నీళ్లు పట్టవా?

Written By news on Wednesday, July 31, 2013 | 7/31/2013

గిరిజనుల కన్నీళ్లు పట్టవా: షర్మిల
శ్రీకాకుళం :  ‘‘ఈ కాంగ్రెస్ ప్రభుత్వం డీజిల్ ధరలు.. గ్యాస్ ధరలు.. బస్సు చార్జీలు.. కరెంటు చార్జీలు ప్రతీదీ పెంచింది. చేతి వృత్తుల మీదనే ఆధారపడి బతుకుతున్న అల్పాదాయం కలిగిన దళిత గిరిజనుల మీద ధరల పెరుగుదల ఎంతటి తీవ్ర ప్రభావం చూపిస్తుందో ఈ సర్కారు ఎప్పుడైనా ఆలోచన చేసిందా? వ్యవసాయం కూలిపోయి చేతి వృత్తులకు డిమాండ్ లేక ఆకలికి అలమటిస్తున్న గిరిజనుల బతుకులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి పడతాయా?’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ప్రశ్నించారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానితో అంటకాగుతున్న చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర మంగళవారం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలోని ఏజెన్సీ గ్రామాల్లో సాగింది. ‘‘అమ్మా...! అడవినే నమ్ముకొని బతికేటోళ్లం. కుటుంబమంతా కష్టపడి వెదురు కర్రలు తెచ్చి, బుట్టలు అల్లితే రోజుకు రూ.150 వత్తాయమ్మా. ఇవి తిండికి కూడా సరిపోవు. మగోళ్లు సారాకు అలవాటు పడితే ఇక పిల్లలు పస్తులు ఉండాల్సిందే. ఇండ్లు లేవు, కరెంటు ఉండదు. ఇప్పుడు ఉప్పు, పప్పు, బియ్యం ఏ ధర ముట్టుకున్నా మండిపోతోంది’’ అని మెళియాపుట్టి గిరిజనులు గోడు వెళ్లబోసుకున్న సందర్భంలో షర్మిల పై విధంగా స్పందించారు.
 గిరిజనులకు భూములిచ్చిన ఘనత వైఎస్సార్‌దే..
 పాదయాత్రలో దారి వెంట పలువురు గిరిజనులు షర్మిలను కలిసి తమ సమస్యలు చెప్పుకొన్నారు. వారితో షర్మిల మాట్లాడుతూ...‘‘వైఎస్సార్‌కు చిత్తశుద్ధి ఉంది కనుక ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేకించి ఏ చట్టం లేకపోయినా వారి గురించి ఎంతగానో ఆలోచించారు. గిరిజనులు అంటే వైఎస్సార్‌కు చాలా ప్రేమ. అందుకే 20.60 లక్షల ఎకరాలను రాజశేఖరరెడ్డి గిరిజనులకు పంపిణీ చేశారు. ఇందులో 3.30 లక్షల ఎకరాలను ఒకే రోజు పంపిణీ చేసిన గొప్ప ముఖ్యమంత్రిగా వైఎస్సార్ చరిత్రలో నిలిచిపోయారు. దీనితో పాటు మరో 9 లక్షల ఎకరాల అటవీ భూమి మీద గిరిజనులకు హక్కు కల్పించిన ఘనత కూడా వైఎస్సార్‌దే. కేవలం భూములు ఇచ్చి వైఎస్సార్ చేతులు దులుపుకోలేదు. పంచిన భూమిని సాగుకు అనుకూలంగా మార్చడం కోసం ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేసి రోజుకు రూ.150 కూలి కట్టిచ్చారు. ఈ భూముల్లో పని దినాలను 100 రోజుల నుంచి 150 రోజులకు పెంచారు’’ అని షర్మిల గుర్తుచేశారు.మరో ప్రజాప్రస్థానం 30-07-2013
 ఎస్సీ, ఎస్టీలకు ఈ ప్రభుత్వం ఏం చేసింది?
 ‘‘ఎస్సీ, ఎస్టీలకు ప్లాన్ ఉండాలని మొట్టమొదటి సారిగా తీర్మానం చేసిన వ్యక్తి వైఎస్సార్. ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లకు 5,000 మంది విద్యా వాలంటీర్లను ఏర్పాటు చేశారు. మూడు సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు ఎంత సహాయం చేసిందని అడుగుతున్నాను. మీరు వాళ్లకేమైనా కొత్త ఇళ్లు కట్టిచ్చారా? ఈ మూడేళ్ల కాలంలో దళితులు, గిరిజనుల కోసం ఎంత భూమి పంపిణీ చేశారు. పంపిణీ చేసిన భూమిని సాగులోకి తేవడానికి ఏమైనా ప్రయత్నాలు చేశారా? సంక్షేమ హాస్టళ్లలో ఎంత మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్లు తింటున్నారా? లేదా? అని ఒక్కసారైనా చూసుకున్న పాపాన పోలేదు. దళిత, గిరిజన  విద్యార్థులు ఉద్యోగాలు చేయడం కోసం.. వాళ్లు పరిశ్రమలు పెట్టుకోవడం కోసం ఈ ప్రభుత్వం ఏమైనా ప్రోత్సాహం కల్పిస్తోందా అని అడుగుతున్నా. ఏమీ చేయలేదు. వైఎస్సార్ ఎస్టీలకు ఉపాధి హామీ కింద రోజుకు రూ.150 ఇస్తే ఈ పాలకులు వాళ్ల శ్రమను దోపిడీ చేస్తున్నారు. కేవలం రూ.30 నుంచి రూ.40కు రోజంతా కష్టం చేయించుకుంటున్నారని అక్కాచెల్లెమ్మలు చెప్తున్నారు’’ అని షర్మిల ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ‘‘వైఎస్సార్ ప్రవేశపెట్టిన ప్రతి పథకానికీ తూట్లు పొడుస్తోంది ఈ ప్రభుత్వం. అన్నం పెట్టే రైతన్నను కన్నీళ్లు పెట్టిస్తోంది. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయి తల్లిదండ్రులు పిల్లలను బడికి పంపించ లేక పనులకు పంపిస్తున్నారు. ప్రజలు ఇంత ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రభుత్వ కాలర్ పట్టుకొని నిలదీయాల్సిన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు దేశంలోనే ఎక్కడా లేని విధంగా ప్రభుత్వంతో కుమ్మక్కయ్యారు’’ అని షర్మిల విమర్శించారు.
 3,031.2 కిలోమీటర్లు పూర్తి..
మరో ప్రజాప్రస్థానం 30-07-2013

 ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర 225వ రోజు మంగళవారం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలోని సూర్యనారాయణపురం నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి తెడ్డలి, సుందరాడ, సిరియాకండి, పెద్దపద్మాపురం, మెళియాపుట్టి, చాపర, పట్టుపురం గ్రామం మీదుగా యాత్ర సాగింది. పట్టుపురం గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి షర్మిల రాత్రి 7.00 గంటలకు చేరుకున్నారు. మంగళవారం మొత్తం 18.2 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు 3,031.2 కిలోమీటర్ల మేర యాత్ర పూర్తయ్యింది. షర్మిల వెంట నడిచిన వారిలో జిల్లా పార్టీ కన్వీనర్ ధర్మాన పద్మప్రియ, మాజీ ఎంపీ డాక్టర్ కణితి విశ్వనాథం, పాతపట్నం కో ఆర్డినేటర్ కల్మట వెంకటరమణ, మాజీ ఎమ్మెల్యేలు కల్మటి మోహన్‌రావు, కుంభా రవిబాబు, వివిధ నియోజకవర్గాల సమన్వయకర్తలు గొర్లె కిరణ్, వజ్జ బాబూరావు, స్థానిక నాయకులు కొయ్య ప్రసాదరెడ్డి,బొడ్డేపల్లి పద్మజ, దుప్పల రవీంద్ర, ప్రతిరోజూ షర్మిల వెన్నంటే ఉంటున్న వారిలో తలశిల రఘురాం, వాసిరెడ్డి పద్మ, ఆర్కే, కాపు భారతి, డాక్టర్ హరికృష్ణ తదితరులు ఉన్నారు.
ధర్మసాగరంపై దయ చూపండి: రైతులు
‘‘వైఎస్‌ఆర్ సీఎంగా ఉన్నప్పుడు చెరువు బాగుకు కోటి రూపాయలు ఇచ్చారు. అధికారులు ఆ డబ్బులు సరిగ్గా ఖర్చుపెట్టలేదు. ఇప్పుడున్న పెబుత్వమూ పట్టించుకోడంలేదు. మా పొలాలకు నీల్లు రాక సానా ఇబ్బంది పడుతున్నాం’’ అని ధర్మసాగరం చెరువు ఆయకట్టు రైతులు షర్మిలకు తమ కష్టాలు వివరించారు. ‘మరో ప్రజాప్రస్థానం’లో భాగంగా మంగళవారం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం బగంతర గ్రామంలో పర్యటించిన సందర్భంగా ఆయకట్టు రైతులు షర్మిలను కలిశారు. ఇక్కడి చెరువుపైనే ఏడు గ్రామాల రైతులు ఆధారపడుతున్నారని, వెయ్యి ఎకరాలు సాగు చేస్తున్నారని వివరించారు. రైతులు కొల్లి రామయ్య, సిరిపురపు నైరయ్య మాట్లాడుతూ.. ‘‘నీరు అందక మేం పడుతున్న కష్టాల గుర్తించి గతంలో రాజశేఖరరెడ్డి బాబు కోటి రూపాయలు ఇస్తే.. అధికారులు ఉపాధి హామీ పనులతో చెరువు గర్భంలో గుంతలు తీసి వొగ్గేశారు. కాలువల్లో గడ్డి, గాబుమొక్కలు పుట్టి నీరు రానియ్యడంలేదు’’ అని చెప్పుకొచ్చారు. ‘‘ఎన్నోసార్లు ఊరొచ్చిన అధికారులకి, పెద్దబాబులకి చెప్పినాం. చేత్తామని చెప్పి ఎల్లిపొతున్నారుగాని చెరువు సమస్య పట్టించుకోనేదు. నీరు రాకపోతే పంటలు పండవు.. మేమంతా ఎలా బతకాల’’ని కన్నీటి పర్యంతమయ్యారు. అన్నదాతల కన్నీరు చూసి చలించిన షర్మిల త్వరలోనే మంచి రోజులు వస్తాయని, రైతులకు జగనన్న ప్రత్యేక స్థానం కల్పిస్తారని అభయమిచ్చి ముందుకు సాగారు.
ఏ ప్లానూ లేనప్పుడే బాగున్నాం: గిరిజనులు
‘‘సబ్‌ప్లాన్ పేరుతో పెబుత్వం పెచారం సేసుకుంటన్నాది గానీ.. మాకు అందవలసిన పతకాలు, నిధులను దళారులు, అధికారులే  బుక్కేత్తున్నారు’’ అని శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం గొడ్డ గ్రామానికి చెందిన గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్రలో ఆదివాసీ మహిళలు పులిబంద కల్యాణి, పాలక సావిత్రి తదితరులు షర్మిలను కలిశారు. వారు మాట్లాడుతూ ‘‘అమ్మా... మీ నాయన ఉన్నప్పుడు ఏ పేనూ(ప్లాన్) లేకపోయినా మాబోటి గిరిజనులను అన్ని రకాలుగా ఆదుకున్నాడు. ఇప్పుడు పెబుత్వం అదేదో సబ్‌పేను పేరుతో మమ్ములను మోసం సేత్తునాదే తప్ప నాయం సేయడం లేదు’’ అని బాధపడ్డారు. ‘‘మాకు నాయం జరిగేలా సూడు తల్లీ. గిరిజన గూడేలకు రోడ్లు లేవు, రోగమొత్తే ఆసుపత్రికి ఎల్లలేకపోతున్నాం. మా పాంతాల్లో గొడ్డ నుండి అనంతగిరి, బింగువాడ, రింపి, ఆంపురం వరకు 6 కిలోమీటర్లు రోడ్లు లేవు. మా ఊళ్లో ఆసుపత్రిలు కట్టడం లేదు. నానా బాధలు పడుతున్నాం. మా బాధలు ఎవరికి సెప్పుకోవాలి?’’ అంటూ కన్నీరు పెట్టుకున్నారు. ‘‘త్వరలోనే జగనన్న వస్తారు, మీ కష్టాలు తీరుతాయి’’ అని షర్మిల వారికి భరోసా ఇచ్చారు.
కరెంటు బిల్లు రూ. 4,800 వచ్చింది..
‘‘అమ్మా...! మేం వడ్రంగివాళ్లం. నాగలి, పార, గునపం, కొడవళ్లు, పలుగులు, పనిముట్లు తయారు చేస్తాం. మేం చేసే పనిముట్లను.. చుట్టూ మూడు మండలాల రైతులు వచ్చి కొనుక్కొని పోతారు. రైతు బాగుంటే మేం బాగుంటాం. రైతు చెడిపోతే మా బతుకులు మాడిపోతాయమ్మా. వైఎస్సార్ ఉన్నపుడు కరెంటు బిల్లు రూ. 900 వచ్చేది, ఇప్పుడు కరెంటు సరిగా లేదు, ఎన్నికలు కాబట్టి ఈ వారం రోజుల నుంచి తొమ్మిది, పది గంటల పాటు ఇస్తున్నారు. పోయిన నెల బిల్లు చూడమ్మా రూ.4,800 వచ్చింది’’ అని మెళియాపుట్టి మండల కేంద్రానికి చెందిన మోహన్‌రావు అనే వడ్రంగి షర్మిల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘వైఎస్సార్ ఉన్నప్పుడు మా అమ్మకు ఆరోగ్యం బాగాలేకపోతే విశాఖ పట్టణం ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ కింద రూ.2.30 లక్షల వైద్యం ఉచితంగా చేయించుకున్నాం. ఇప్పుడు మా వదినకు బాగాలేకపోతే అదే ఆసుపత్రిలో రూ.లక్ష సొంత డబ్బులు పెట్టి వైద్యం చేయించుకోవాల్సి వచ్చిందమ్మా’’ అని ఆయన అన్నారు. అధైర్యపడొద్దని, త్వరలోనే అన్ని సమస్యలూ పరిష్కారమవుతాయని షర్మిల వారికి ధైర్యం చెప్పారు.
Share this article :

0 comments: