వైఎస్సార్ ప్రభుత్వం కాదిది! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్ ప్రభుత్వం కాదిది!

వైఎస్సార్ ప్రభుత్వం కాదిది!

Written By news on Friday, August 2, 2013 | 8/02/2013

మరో ప్రజాప్రస్థానం 01-08-2013
‘‘వైఎస్సార్ స్వతహాగా డాక్టర్ కావడంతో పేదలకు అందాల్సిన ఆరోగ్యం గురించి ఆలోచన చేశారు. తాను అనారోగ్యం పాలైనప్పుడు ఏ విధంగానైతే కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకుంటానో, అలాగే పేదవాడు అనారోగ్యం పాలైనప్పుడు ధైర్యంగా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి తన మంచం పక్కనే అతను కూడా మంచం వేయించుకొని లక్షల రూపాయల విలువైన వైద్యాన్ని ఉచితంగానే చేయించుకోవాలనే గొప్ప ఆలోచనతో వైఎస్ ఆరోగ్యశ్రీకి జీవం పోశారు. ఆసుపత్రికి సకాలంలో రాలేక ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోకూడదనే గొప్ప మనసుతో 108-అంబులెన్స్‌లు తెచ్చారు. కానీ మనుసు లేని ఈ పాలకుల ఏలుబడిలో 108 కనుమరుగైపోయింది, 104 సర్వీసు కనపడకుండా పోయింది. ఆరోగ్య శాఖ మంత్రి సొంత జిల్లాలోనే అంబులెన్స్‌లు ఇలా నెలల తరబడి షెడ్డులో పడి ఉన్నాయంటే మిగిలిన జిల్లాల్లో 108 అంబులెన్స్‌ల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానితో అంటకాగుతున్న చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర గురువారం శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో సాగింది. ఆరోగ్య శాఖ మంత్రి కొండ్రు మురళి సొంత జిల్లా శ్రీకాకుళంలోని పలాస నియోజకవర్గంలో మొత్తం నాలుగు 108 అంబులెన్స్‌లు ఉండగా వాటిలో మూడు అంబులెన్స్‌లు పూర్తిగా చెడిపోయి చినబాడాం గ్రామం వద్ద రోడ్డు పక్కన షెడ్డులో పడి ఉన్నాయి. ఇదే దారి మీదుగా వెళ్తున్న షర్మిల వాటిని గమనించి పరిశీలించారు. ‘‘ఏడాది కాలంగా ఇవి షెడ్డులోనే పడి ఉన్నాయమ్మా, ఇప్పటి వరకు వీటిని పట్టించుకునేవారే లేరు.. మంత్రి ఈ జిల్లా వారే అయినప్పటికీ మాకు ఎలాంటి ఉపకారం లేదమ్మా’’ అని స్థానికులు చెప్పిన సందర్భంలో షర్మిల పై విధంగా స్పందించారు.
సమ్మె చేస్తుంటే కేసులు పెడుతున్నారు..
 ‘‘అమ్మా.. నెలల తరబడి మాకు జీతాలు లేవు. ఉద్యోగ భద్రత లేదు. మాతో రోజుకు 14 నుంచి 16 గంటల వరకు పని చేయించుకుంటున్నారు. మాకు నెల నెలా జీతాలు అందించాలని, 8 గంటల పని విధానం అమలు చేయాలని కోరుతూ గత నెల 18 నుంచి సమ్మె  చేస్తున్నాం. సమ్మెకు ముందే మా సమస్యలు పభుత్వానికి చెప్పాం. జిల్లాలో మొత్తం క్షేత్రస్థాయి సిబ్బంది 150 మంది సమ్మె చేస్తున్నాం. ఆరోగ్యశాఖ మంత్రి ఈ జిల్లాకు చెందిన వాడయినప్పటికీ కనీసం పట్టించుకోవడం లేదు. ఎందుకు సమ్మె చేస్తున్నారు, మీ సమస్యలు ఏమిటని కూడా అడగలేదు’’ అని 108 సిబ్బంది ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ డి.శ్రీనివాసరావు, పైలట్ (డ్రైవరు) బి.శ్రీనివాసరావు తదితరులు షర్మిలతో చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలు పట్టించుకోకపోగా.. సమ్మెచేస్తున్నందుకు కక్షగట్టి 27 మందిపై కేసులు పెట్టి జైల్లో పెట్టిందని దుయ్యబట్టారు.
అపర సంజీవని 108..మరో ప్రజాప్రస్థానం 01-08-2013
108 సిబ్బందితో షర్మిల మాట్లాడుతూ ‘‘ఆపదలో ఉన్నవారు ఎవరైనా ఫోన్ చేస్తే 20 నిమిషాల్లో కుయ్...కుయ్..కుయ్ అనుకుంటూ వచ్చి వారిని తీసుకొని పోయి పెద్దాసుపత్రిలో వైద్యం చేయించి తిరిగి వారిని పూర్తి ఆరోగ్యంతో ఇంటి  దగ్గర దించే ‘అపర సంజీవని’ 108 అంబులెన్స్‌ను ఇలా నిర్జీవంగా చూస్తుంటే మనసుకు చాలా బాధనిపిస్తుంది. అంబులెన్స్‌ల పరిస్థితి ఇలా ఉంటే మరోపక్క 108  ఉద్యోగులు మాకు జీతాలు లేవు అని నెలల తరబడి దీక్షలు చేస్తున్నా ఈ పాలకులకు కనీసం పట్టడం లేదు. ఇందుకోసమేనా వైఎస్సార్ తన రెక్కలు ముక్కలు చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆధికారంలోకి తెచ్చారా అని బాధనిపిస్తోంది’’ అని ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘ఇది వైఎస్సార్ అధికారంలోకి తెచ్చిన ప్రభుత్వమే కాని వైఎస్సార్ ప్రభుత్వం కాదు. అందుకే ఈ పాలకులు వైఎస్సార్ ఆశయాలకు, సిద్ధాంతాలకు భిన్నంగా పనిచేస్తున్నారు. ఆరోగ్యశ్రీ నుంచి ఈ ప్రభుత్వం 133 వ్యాధులను, 97 ఆసుపత్రులను తొలగించింది. పేద వాడికి జబ్బు చేస్తే మళ్లీ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లమని ఈ నాయకులు చెప్తున్నారు’’ అని విమర్శించారు.
ఫీజుల పథకాన్నీ కుదించారు..
కాశీబుగ్గలో తనను కలిసి సమస్యలు చెప్పుకున్న విద్యార్థులనుద్దేశించి షర్మిల మాట్లాడుతూ ‘‘పేదలకు ఉన్నత విద్య అందించాలని వైఎస్సార్ ఆకాంక్షించారు. ఫీజు రీయింబర్స్‌మెంటు పథకాన్ని అమల్లోకి తెచ్చారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని ట్రిపుల్ ఐటీలను నెలకొల్పారు. ఈ ట్రిపుల్ ఐటీల ద్వారా ఇవాళ అనేక మంది విద్యార్థులు సాంకేతిక విద్యను అభ్యసిస్తున్నారు. ఈ పథకం వల్ల లబ్ధిపొందిన అనేక మంది విద్యార్థులు ఇప్పుడు ఉన్నత ఉద్యోగాలు చేస్తూ గుర్తింపు పొందారు. ప్రస్తుత ప్రభుత్వం రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను తుంగలో తొక్కుతోంది. ఫీజు రీయింబర్స్‌మెంటు పథకాన్ని కుదించారు. ఏవేవో ఆంక్షలుపెట్టి క్రమంగా ఈ పథకాన్ని విద్యార్థులకు దూరం చేయాలని ఈ పాలకులు ప్రయత్నిస్తున్నారు. ‘ఈ ప్రభుత్వం ట్రిపుల్ ఐటీలో సరైన సౌకర్యాలు కల్పించలేకపోతోందమ్మా’ అని కొందరు విద్యార్థులు చెప్తున్నప్పుడు బాధనిపిస్తుంది’’ అని షర్మిల అన్నారు.
‘‘మీరు భయపడవద్దు. కొద్దిగా ఓపిక పట్టండి. త్వరలోనే జగనన్న బయటికి వస్తారు, రాజన్న రాజ్యం తెస్తారు. జగనన్న ముఖ్యమంత్రి అయిన తరువాత ఆరోగ్యశ్రీకి, అపర సంజీవనికి జీవం పోస్తారు. అక్కాచెల్లెళ్లు వాళ్ల పిల్లలను చదివించేటట్లు ప్రోత్సహించడం కోసం ఇద్దరు పిల్లలకు పదోతరగతి వరకు ఒక్కొక్కరికి రూ.500 చొప్పున ఏడాదికి రూ.6 వేలు అమ్మ అకౌంట్లోనే పడుతుంది. ఇంటర్మీడియట్ చదివితే రూ.8,400, డిగ్రీ చదివితే రూ 12,000 అమ్మ అకౌంట్లోనే పడుతాయి. అంతకంటే పెద్ద చదువులు చదివే వారికి ఫీజు రీయింబర్స్‌మెంటు పథకం ఎలాగూ ఉండనే ఉంది’’ అని భరోసా ఇచ్చారు.
19.2 కిలోమీటర్ల మేర పాదయాత్ర
పాదయాత్ర 227వ రోజు గురువారం శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం గరుడఖండి గ్రామం నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి గరుడఖండి, చినబాడాం, కాశీబుగ్గ, రామకృష్ణాపురం, కొబ్బరి ఊరు గ్రామాల మీదుగా యాత్ర సాగింది. కొబ్బరి ఊరు గ్రామ శివారులో ఏర్పాటు చేసిన  బస కేంద్రానికి షర్మిల రాత్రి 7.00 గంటలకు చేరుకున్నారు. మొత్తం 19.2 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు మొత్తం 3,069 కిలోమీటర్ల యాత్ర పూర్తయ్యింది. షర్మిల వెంట నడిచిన వారిలో నర్సన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాసు, జిల్లా పార్టీ కన్వీనర్ ధర్మాన పద్మప్రియ, తాజా మాజీ ఎమ్మెల్యేలు సుజయ కృష్ణ రంగారావు, పి.సాయిరాజు, మాజీ ఎంపీ డాక్టర్ కణితి విశ్వనాథం, మాజీ ఎమ్మెల్యే బగ్గు లక్ష్మణరావు, కుంభా రవిబాబు, పలాస కో ఆర్డినేటర్ వజ్జ బాబూరావు, వివిధ నియోజకవర్గాల కో-ఆర్డినేటర్లు కల్మట వెంకటరమణ, వరదు కళ్యాణి, గొర్లె కిరణ్, దువ్వాడ శ్రీనివాసు, స్థానిక నాయకులు కొయ్య ప్రసాదరెడ్డి, దుప్పల రవీంద్ర, హన్మంతు కిరణ్‌కుమార్, కిమిడి జానకి, ధవళ వెంకట గిరిబాబుఉన్నారు. ప్రతిరోజు షర్మిల వెన్నంటే ఉంటున్న వారిలో తలశిల రఘురాం, వాసిరెడ్డి పద్మ, ఆర్కే, కాపు భారతి, డాక్టర్ హరికృష్ణ తదితరులు ఉన్నారు.
చదువులు ఆగిపోతున్నాయి
‘‘రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ప్రవేశపెట్టి నిరపేద విద్యార్థులకు విద్యాదానం చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకానికి తూట్లు పొడుస్తోంది. దీంతో మాబోటి మధ్యతరగతి విద్యార్థులు ఉన్నత చదువులకు వెళ్లలేకపోతున్నారు’’ అని పలువురు బీఈడీ విద్యార్థులు షర్మిల వద్ద వాపోయారు. గురువారం శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలోని చినబాడాం సమీపంలోగల ‘అమర్ బీఈడీ ఎడ్యుకేషన్ ఆఫ్ కాలేజెస్’ విద్యార్థులు షర్మిలను కలిశారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు సక్రమంగా విడుదల చేయకపోవడంతో తాము పడుతున్న కష్టాలను వివరించారు.
షర్మిల రాక సందర్భంగా వారంతా రోడ్డుపైకి వచ్చి బారులు తీరారు. దీంతో ఆమె వారిని పిలిచి సమస్యలు చెప్పాలని సూచించారు. కె.ఈశ్వరరావు, ఎ.మురళీకృష్ణ, జీవిత, సుజాత తదితర విద్యార్థులు మాట్లాడుతూ బీఈడీ పూర్తిచేసే వారికి సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్జీటీ) పోస్టుకు అవకాశం కల్పించేలా చూడాలని కోరారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ సొమ్ము సక్రమంగా అందడంలేదని, దీని వల్ల తమ చదువులు మధ్యలోనే ఆగిపోతున్నాయని వివరించారు. దీనికి షర్మిల స్పందిస్తూ త్వరలోనే జగనన్న వస్తారు.. విద్యార్థుల సమస్యలన్నీ పరిష్కరిస్తారని భరోసా ఇచ్చారు.
Share this article :

0 comments: