ప్రాజెక్టులను పట్టించుకునేవారే లేరు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రాజెక్టులను పట్టించుకునేవారే లేరు

ప్రాజెక్టులను పట్టించుకునేవారే లేరు

Written By news on Thursday, August 1, 2013 | 8/01/2013

ప్రాజెక్టులను పట్టించుకునేవారే లేరు: షర్మిల
శ్రీకాకుళం :  ‘‘వైఎస్సార్ మరణం తరువాత రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాజెక్టూ ముందుకు సాగడం లేదు. వాటిని పూర్తి చేయాలనే చిత్తశుద్ధి ఈ ప్రభుత్వంలో కనిపించడం లేదు. వైఎస్సార్ గిరిజనులకు సాగు నీరు, తాగునీరు అందించాలని తపించిపోయారు. గిరిజనులకు పోడు వ్యవసాయంతో దిగుబడి రావడం లేదని, వారితో స్థిర వ్యవసాయం చేయించడం ద్వారా అధిక దిగుబడులు సాధించాలని వైఎస్సార్ సంకల్పించారు. ఇందుకోసమే మహేంద్ర తనయ నది మీద రిజర్వాయర్ కట్టి, ఈ ప్రాంతంలో వరద ముప్పును నివారించడంతోపాటు పంటలకు సాగు నీరు అందించాలని వైఎస్సార్ సంకల్పించారు. కానీ ఆయన మన మధ్య నుంచి వెళ్లిపోయాక ఈ ప్రాజెక్టుల గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యాడు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల విమర్శించారు. ప్రజాసమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానితో అంటకాగుతున్న చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర బుధవారం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం, పలాస నియోజకవర్గాల్లోని గిరిజన గూడేల్లో సాగింది. ఈ ప్రాంతానికి చెందిన గిరిజన గూడేలకు సాగు నీరు, తాగునీరు అందించడం కోసం వైఎస్సార్ 2008లో మహేంద్ర తనయ నదిపై రేగులపాడు వద్ద ఆఫ్‌షోర్ రిజర్వాయర్ నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. దీనికి రూ.127 కోట్లు కేటాయించారు. దాదాపు 180 గ్రామాల్లో 24,600 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో జలయజ్ఞం పథకం కింద ఈ రిజర్వాయర్‌కు శంకుస్థాపన చేశారు. అయితే వైఎస్సార్ మరణంతో ఈ ప్రాజెక్టు నిలిచిపోయింది. బుధవారం పాదయాత్రలో ఇదే దారి మీదుగా వెళ్తున్న షర్మిలకు గిరిజనులు శంకుస్థాపన శిలాఫలకాన్ని చూపించారు. ‘‘అమ్మా.. చెరవు దిబ్బైపోయింది. మాకు బక్కలకు(పశువులకు) నీళ్లు లేవు, మొక్కలకు లేవు, పొలాలు పోతున్నాయి. ఆ కొండ కిందున్న టెక్కలిపట్నం వెళ్లి బిందెలతో నీళ్లు తెచ్చుకుంటున్నాం’’ అని దరి గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేసిన సందర్భంలో షర్మిల పైవిధంగా స్పందించారు.
 
 వైఎస్ 21 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చారు
 ‘‘వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ల కాలంలో 12 సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి 21 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించారు. ఇవి కాకుండా మరో 21 ప్రాజెక్టుల నిర్మాణ పనులు చివరి దశ వరకు పూర్తయి పాక్షికంగా మిగిలిపోయాయి. వైఎస్సార్ బతికే ఉంటే ఈ ప్రాజెక్టులు కూడా ఎప్పుడో పూర్తయి ఈపాటికి రైతన్న పంట పొలాల్లో నీళ్లు పారేవి. కేవలం రూ.850 కోట్లు ఖర్చు చేస్తే ఇందులో దాదాపు 16 ప్రాజెక్టులు పూర్తైయి 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందేది. కానీ ఈ కాంగ్రెస్ సర్కారుకు ఇవేం పట్టవు. ఎందుకంటే వీళ్లకు వ్యవసాయం అంటేనే చిన్నచూపు. ఇదే జిల్లాలో నాగావళి నదిపై తోటపల్లి రిజర్వాయర్ కోసం వైఎస్సార్ అధికారంలోకి వచ్చాక రూ.450 కోట్లు కేటాయించారు. 80 శాతం నిర్మాణ పనులు పూర్తి అయ్యాయి. కాల్వల తవ్వకాలు కూడా పూర్తయ్యాయి. ఇక మిగిలింది 20 శాతం పనులు మాత్రమే. కానీ వైఎస్సార్ మరణం తరువాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేక తోటపల్లి ప్రాజెక్టు నిర్మాణ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి’’ అని షర్మిల విమర్శించారు.
 
 18.6 కిలోమీటర్ల మేర యాత్ర..
 ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర 226వ రోజు బుధవారం షర్మిల శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం జాడుపల్లి గ్రామం నుంచి నడక ప్రారంభించారు. అక్కడి నుంచి తుమ్ముకొండ, పెద్దమాడి, హీరాపురం, చీపురపల్లి, మోదుగులపుట్టి గ్రామాల మీదుగా యాత్ర సాగింది. వీరభద్రపురం గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి షర్మిల రాత్రి 7.00 గంటలకు చేరుకున్నారు. బుధవారం మొత్తం 18.6 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు మొత్తం 3,049.8 కిలోమీటర్ల యాత్ర పూర్తయ్యింది. షర్మిల వెంట నడిచిన వారిలో నర్సన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాసు, మాజీ ఎంపీ డాక్టర్ కణితి విశ్వనాథం, మాజీ ఎమ్మెల్యే బగ్గు లక్ష్మణరావు, పాతపట్నం కో ఆర్డినేటర్ కల్మట వెంకటరమణ, వజ్జ బాబూరావు, స్థానిక నాయకులు కిమిడి జానకి, దుప్పల రవీంద్ర, హన్మంతు కిరణ్‌కుమార్, ధవళ వెంకటగిరిబాబుఉన్నారు. ప్రతిరోజూ షర్మిల వెన్నంటే ఉంటున్న వారిలో తలశిల రఘురాం, వాసిరెడ్డి పద్మ, ఆర్కే, కాపు భారతి, డాక్టర్ హరికృష్ణ తదితరులు ఉన్నారు.
 
‘బతకడమే కష్టంగా ఉంది తల్లీ’
 ‘‘పొందర కులానికి చెందిన మాబోటి పేదోళ్ల కష్టాలను మీ నాయన గుర్తించినారు. ఓసీలుగా ఉన్న మమ్మల్ని బీసీల్లో చేర్చినారు. ఆ మహానుభావుడు పోయాక మమ్మల్ని పట్టించుకునేటోళ్లే లేరు. ఇప్పుడు కూరగాయాలు పండించుకొని బతుకుతున్నాం. ఏమీ గిట్టుబాటు కావడం లేదు. పంట పండించేందుకు నీరు లేదు. పంటలు పీడల బారిన పడి చత్తున్నాయి. ఏం సేయాలో పాలుపోడం లేదు’’ అని పొందర అప్పన తదితర రైతులు షర్మిలకు తమ కష్టాలు చెప్పుకొన్నారు. బుధవారం శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం జాడుపల్లిలో షర్మిలను కలిసిన వారు మాట్లాడుతూ ‘‘పండించిన పంటలు అమ్మేందుకు బజారు లేదు. నానా ఇబ్బందులు పడుతున్నాం. మావోళ్లు పని లేక వలసలు పోతున్నారు. ముసలోల్లమే గ్రామాల్లో ఉండిపోతున్నాం. బతకడం కట్టంగా ఉంది తల్లీ’’ అని మొర పెట్టుకున్నారు. తాము పండించిన కూరగాయలతో పాటు పురుగుపట్టి పాడైన వంగ మొక్కలను చూపించి కన్నీటి పర్యంతమయ్యారు. షర్మిల వారికి ధైర్యం చెబుతూ ‘‘భయపడకండి.. మంచి రోజులు వస్తాయి. రైతులకు అన్న న్యాయం చేస్తారు’’ అని చెప్పి ముందుకు సాగారు.
 
 4న ఇచ్ఛాపురంలో భారీ బహిరంగ సభ..
 ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర తుది అంకానికి చేరుకుందని, ఈ నెల 4న శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగింపు సభ ఉంటుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం తెలిపారు. ప్రస్తుతం పాదయాత్ర గమ్యానికి 62 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉందని, మరో నాలుగు రోజుల్లో షర్మిల ఇచ్ఛాపురం చేరుకుంటారని చెప్పారు. నిజానికి యాత్ర ఇప్పటికే ముగియాల్సి ఉందని, అయితే అడవిలో ఆదివాసీలను కలవాలని, వాళ్ల కన్నీళ్లు తుడవాలని, వారికి భరోసా ఇవ్వాలని షర్మిల పట్టుబట్టడంతో యాత్ర మార్గాన్ని మార్చాల్చి వచ్చిందని రఘురాం శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో విలేకరులకు తెలిపారు. వైఎస్సార్ చేసిన ప్రజాప్రస్థానం పాదయాత్రకు చిహ్నంగా ఇచ్ఛాపురంలో నిర్మించిన విజయవాటిక వద్దకు షర్మిల ఆగస్టు 4వ తేదీ మధ్యాహ్నం చేరుకుంటారన్నారు. ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర ముగింపు చిహ్నంగా ఇక్కడే నిర్మించిన ‘విజయ ప్రస్థానం’ చిహ్నాన్ని ఆమె ఆవిష్కరించి పాదయాత్రను ముగిస్తారని తెలిపారు. ముగింపు సందర్భంగా ఇచ్ఛాపురంలోనే మధ్యాహ్నం ఒంటి గంటకు భారీ బహిరంగ సభ ఉంటుందని, పార్టీ నేతలు, కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులు సభకు తరలిరావాలని కోరారు.
Share this article :

0 comments: