ప్రజల రుణం తీర్చుకోవాలనిపించడం లేదా ? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రజల రుణం తీర్చుకోవాలనిపించడం లేదా ?

ప్రజల రుణం తీర్చుకోవాలనిపించడం లేదా ?

Written By news on Sunday, July 21, 2013 | 7/21/2013

- ‘మరో ప్రజాప్రస్థానం’లో షర్మిల ధ్వజం
- చనిపోయిన వ్యక్తిపైనా విమర్శలు చేస్తున్నారు
- వైఎస్ మరణం తర్వాత ప్రజలు నష్టపోయినా బొత్స మాత్రమే లబ్ధి పొందారు
- ఆయనకున్నన్ని అక్రమ వ్యాపారాలు మరెవరికీ లేవని ఇక్కడికొచ్చాకే తెలిసింది
- నేటి నుంచి శ్రీకాకుళం జిల్లాలో షర్మిల యాత్ర 

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రతినిధి: ‘‘నేను ఈ జిల్లాకు(విజయనగరం) రాకముందు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ.. ఒక మద్యం మాఫియా డాన్ అని మాత్రమే విన్నాను. అయితే ఆయనకున్నన్ని అక్రమ వ్యాపారాలు వేరెవరికీ లేవని ఇక్కడికొచ్చాకే తెలిసింది. గ్రానైట్ క్వారీలు, కాంట్రాక్టులు అన్నీ ఆయనకే ఉన్నాయి. ఆయనకు తన వ్యాపారాలే ముఖ్యం.. ప్రజలు ఏమైపోతున్నా పట్టదు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తరువాత రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఏదో విధంగా నష్టం కలిగింది. కానీ సత్తిబాబు కుటుంబం మాత్రమే లాభపడింది. ఆయన కోసం.. మద్యం సిండికేట్‌పై విచారణ జరుపుతున్న అధికారులను సైతం బదిలీ చేశారు. అసలు ప్రభుత్వం ఉన్నది ప్రజల కోసమా? ఇలాంటి నాయకుల కోసమా?’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల నిప్పులు చెరిగారు. ‘‘మేం ఏనాడూ ఎవర్నీ వ్యక్తిగతంగా విమర్శించలేదు. 

అది మా సంస్కారం. కానీ బొత్స మాత్రం చనిపోయిన వైఎస్‌పైనా పసలేని ఆరోపణలు చేస్తున్నారు. అయినా కొత్తనాయకుల కోసం పాతనాయకులను తూలనాడడం బొత్స, ఆనం బ్రదర్స్, ఉండవల్లి అరుణ్‌కుమార్ లాంటి భజన బ్యాచ్‌కు అలవాటే’’ అని ఆమె ఘాటుగా విమర్శించారు. ప్రజలను గాలికి వదిలేసిన రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి, దానితో కుమ్మక్కైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర శనివారం పార్వతీపురం నియోజకవర్గంలో సాగింది. ఈ సందర్భంగా పార్వతీపురంలో పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు.

ప్రజల రుణం తీర్చుకోవాలనిపించడం లేదా సత్తిబాబూ?
‘‘విజయనగరం జిల్లాలో 1.8 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకుగాను వైఎస్ హయాంలో తోటపల్లి ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేశారు. అప్పట్లో రూ.450 కోట్లతో పనులు ప్రారంభించారు. ఇందులో సగం పనులు పూర్తయ్యాయి. ఇప్పుడు ఆ ప్రాజెక్టును ప్రభుత్వం పట్టించుకోలేదు. అంతేకాకుండా దాని కాలువను సత్తిబాబు తన సొంత భూముల కోసం గజపతినగరం తరలించారు. మహానేత చేపట్టిన జంఝావతి ప్రాజెక్టును ఇప్పుడు పాలకులు మధ్యలోనే వదిలేశారు. ఉత్తరాంధ్రలో 8 లక్షల ఎకరాలకు, విజయనగరం జిల్లాలో 3.9 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఉద్దేశించిన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును సర్కారు పక్కనబడేసినా సత్తిబాబుకు పట్టలేదు. మిమ్మల్ని ఇంతటి వాణ్ని చేసిన ప్రజల రుణం తీర్చుకోవాలని మీకు అనిపించలేదా సత్తిబాబూ?’’ అని షర్మిల ప్రశ్నించారు.

16.6 కిలోమీటర్ల మేర యాత్ర..
పాదయాత్ర 215వ రోజు శనివారం పార్వతీపురం నియోజకవర్గం నర్సిపురంలో ప్రారంభమైంది. పార్వతీపురం, కొత్తవలస, ఉల్లిభద్ర మీదుగా నడిచిన షర్మిల రాత్రి ఏడున్నరకు పాత సంతోషపురం వద్ద ఏర్పాటు చేసిన బస కేంద్రానికి చేరుకున్నారు. దీనికి ముందు షర్మిల తోటపల్లి కుడి ప్రధాన కాలువను పరిశీలించారు. అక్కడి రైతులతో మాట్లాడి వారి సమస్యలు విన్నారు. జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక రాజన్న రాజ్యం వస్తుందని వారికి భరోసా ఇచ్చి ముందుకు కదిలారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త సుజయ్ కృష్ణ రంగారావు, నాయకులు కొయ్య ప్రసాదరెడ్డి, ప్రసాదరాజు, కొయ్యాన శ్రీవాణి, జమ్మాన ప్రసన్న కుమార్, ఉదయభాను, భూపతిరాజు శ్రీనివాసరాజు, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

నేటి నుంచి శ్రీకాకుళం జిల్లాలో షర్మిల యాత్ర
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ఆదివారం శ్రీకాకుళం జిల్లాలోకి ప్రవేశించనుంది. ప్రస్తుతం విజయనగరం జిల్లాలో జరుగుతున్న ఈ యాత్ర ఆదివారం సాయంత్రం 4 గంటలకు వీరఘట్టం మండలం కడకెల్ల గ్రామం వద్ద శ్రీకాకుళం జిల్లాలోకి ప్రవేశిస్తుంది. జిల్లాలోని ఏడు నియోజకవర్గాలు, 4 మునిసిపాలిటీలు, 16 మండలాల మీదుగా సుమారు 190 కిలోమీటర్ల మేర యాత్ర సాగే అవకాశం ఉందని పార్టీ రాష్ట్ర ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, పార్టీ జిల్లా కన్వీనర్ ధర్మాన పద్మప్రియ పేర్కొన్నారు.
Share this article :

0 comments: