వింటే సరి.. లేదంటే పాత కేసులు తిరగదోడే కుట్ర - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వింటే సరి.. లేదంటే పాత కేసులు తిరగదోడే కుట్ర

వింటే సరి.. లేదంటే పాత కేసులు తిరగదోడే కుట్ర

Written By news on Sunday, May 13, 2012 | 5/13/2012

సామ, దాన, భేద, దండోపాయాలతో దారికి తెచ్చుకునేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి యత్నాలు
వింటే సరి.. లేదంటే పాత కేసులు తిరగదోడే కుట్ర 
చానల్స్ మానిటరింగ్ సెల్ ఏర్పాటు
నెగటివ్ వార్తలు వస్తే వెంటనే మేనేజ్‌మెంట్‌తో మాట్లాడి ఆపాలి
రాష్ట్రస్థాయిలోనైతే నేనే మేనేజ్ చేస్తా..
జిల్లాల్లో వ్యతిరేక వార్తలు రాకుండా మీరు చూడండి
మంత్రి, కమిషనర్‌కు హుకుం జారీచేసిన సీఎం 
వెంటనే జిల్లా ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి, కమిషనర్
వ్యతిరేక వార్తలకు డీపీఆర్వోలు బాధ్యత తీసుకోవాలని మంత్రి స్పష్టీకరణ

హైదరాబాద్, న్యూస్‌లైన్: అటు ప్రభుత్వాన్ని, ఇటు సొంత పార్టీని మేనేజ్ చేయడంలో ఘోరంగా విఫలమైన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఇప్పుడు మీడియాను ‘మేనేజ్’ చేసేందుకు కసరత్తు ప్రారంభించారు. ఇందుకోసం ప్రత్యేకంగా మూడు రోజుల క్రితం సమాచార శాఖ మంత్రి డి.కె.అరుణ, కమిషనర్ చంద్రవదన్‌తో మీడియా మేనేజ్‌మెంట్‌పై సీఎం గంటపాటు చర్చలు జరిపారు. రాష్ట్ర స్థాయిలో మీడియా మేనేజ్‌మెంట్‌ను తాను చూసుకుంటానని, జిల్లాస్థాయిల్లో మాత్రం బాధ్యతను మీరు తీసుకోవాలని మంత్రి, కమిషనర్‌కు.. ముఖ్యమంత్రి కిరణ్ స్పష్టం చేసినట్లు తెలిసింది. 

వింటే సరి.. లేదంటే సామ, దాన, భేద, దండోపాయాలతో మీడియాను నియంత్రించేందుకు పలు మార్గాలను సీఎం ఎంచుకున్నారు. దారికి రాని మీడియాపై పాత కేసులను వెలికి తీస్తున్నట్లు వార్తలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని వారికి సూచించారు. తద్వారా ఆ మీడియా దారికిరాక తప్పదని, ఇటీవల ఒక చానల్ విషయంలో ఇదే జరిగిందని కూడా ముఖ్యమంత్రి ఆ భేటీలో అభిప్రాయపడినట్లు తెలిసింది. మీడియా మేనేజ్‌మెంట్‌పై ప్రత్యేకంగా ఒక పుస్తకాన్ని కూడా సీఎం అధ్యయనం చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పలు అంశాలపై రాత్రి పొద్దుపోయాక నేరుగా మీడియా ప్రతినిధులతో ఫోన్‌లో మాట్లాడుతూ వార్తలపై సూచనలు చేస్తున్న సీఎం ఇకనుంచి రోజులో ఎక్కువ సమయం మీడియా మేనేజ్‌మెంట్‌కే వెచ్చించాలని నిర్ణయించారు. ఇందుకోసం ప్రత్యేకంగా చానల్స్ మానిటరింగ్ సెల్‌ను ఏర్పాటు చేస్తున్నారు. 

ఈ సెల్ అన్ని చానళ్లలో వస్తున్న వార్తలను పర్యవేక్షిస్తుంది. ఏ చానల్లోనైనా నెగటివ్ వార్త వస్తే వెంటనే మేనేజ్‌మెంట్‌తో మాట్లాడి మరుసటి బులిటెన్‌లో అది రాకుండా నిలువరించే చర్యలను చేపట్టేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రి, కమిషనర్‌ను సీఎం ఆదేశించారు. రాష్ట్ర స్థాయితో పాటు జిల్లాల్లో కూడా ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, లేదంటే స్థానికంగా ఆ వార్తలు చాలా ప్రభావం చూపుతాయని మంత్రి, కమిషనర్‌కు సీఎం స్పష్టం చేశారు. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిల్లో ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విసృ్తతంగా తీసుకు వెళ్లేందుకు, వ్యతిరేక వార్తలు రాకుండా చూసేందుకు అన్ని రకాల చర్యలను చేపట్టాల్సిందిగా వారిని ఆదేశించారు. దీంతో ఆమరుసటి రోజునే మంత్రి అరుణ, కమిషనర్ చంద్రవదన్ ఉప ఎన్నికలు జరగని 11 జిల్లాలకు చెందిన ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌కు మూడు జిల్లాల కలెక్టర్లు హాజరు కాగా మిగతా జిల్లాల నుంచి జాయింట్ కలెక్టర్లు, జిల్లా పౌరసంబంధాల అధికారులు (డీపీఆర్వో) వచ్చారు. 

జిల్లాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాకుండా చూడాల్సిన బాధ్యతను డీపీఆర్వోలు తీసుకోవాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. వ్యతిరేక వార్తలు వస్తే వెంటనే సంబంధిత ఉన్నతాధికారుల నుంచి వివరణలు ఇప్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి వరకు విలేకరులతో డీపీఆర్వోలు ఇకనుంచి సత్సంబంధాలను ఏర్పాటు చేసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. కలెక్టర్లు కూడా జిల్లా స్థాయిలో ప్రభుత్వానికి అనుకూలంగా వార్తలు వచ్చేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని కూడా మంత్రి సూచించినట్లు అధికారవర్గాల ద్వారా తెలిసింది
Share this article :

0 comments: