ప్రధాని ఎవరన్నది నిర్ణయించేది కూడా జగనే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రధాని ఎవరన్నది నిర్ణయించేది కూడా జగనే

ప్రధాని ఎవరన్నది నిర్ణయించేది కూడా జగనే

Written By news on Sunday, February 3, 2013 | 2/03/2013


ఎన్నికలెప్పుడొచ్చినా వైఎస్సార్‌సీపీదే విజయం
ప్రధాని ఎవరన్నది నిర్ణయించేది కూడా జగనే
ఎక్కువగా కొత్తవారిని బరిలోకి దించే యోచన

 ప్రస్తుత నంబర్ గేమ్‌లో రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీలో ఉన్నప్పటికీ... ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబు నాయుడున్నంతవరకు ప్రభుత్వ మనుగడకు ఎలాంటి ఢోకా లేదని లోక్‌సభ సభ్యుడు సబ్బం హరి చెప్పారు. అవిశ్వాసం పెట్టినా తన పార్టీకే చెందిన 10-15 మందిని కాంగ్రెస్‌కు మద్దతుగా ఓటేయించినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఎద్దేవా చేశారు. ఆయన విశాఖపట్నంలోని తన నివాసంలో శనివారం విలేకరులతో మాట్లాడుతూ... అధికారంలో ఉన్నపుడు చంద్రబాబు వైఖరిని చూసిన ప్రజలు... ప్రస్తుతం ఆయన ఇస్తున్న హామీల్ని నమ్మబోరని తేల్చిచెప్పారు. తొమ్మిదిమంది ఎమ్మెల్యేలను బహిష్కరించామని చెప్తున్న పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ వారి పేర్లు ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. అయినా ఎప్పుడో రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలను ఇప్పుడు బహిష్కరించడమేమిటని నిలదీశారు. సహకార ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరఫున ఎక్కడా అధికారికంగా పోటీ చేయట్లేదని పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ ఎప్పుడో ప్రకటించారని, దీన్ని అధికారపక్షం గెలుపనుకుంటే మరికొన్నాళ్లు భ్రమల్లో ఉండాల్సిందేనని ఆయన చెప్పారు.

కాబోయే సీఎం జగన్

‘‘మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి బతికున్నన్నాళ్లూ ఇందిర కుటుంబానికిచ్చిన గౌరవం అందరికీ తెలిసిందే. ఆయన ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ కార్యక్రమానికీ వారి పేర్లే పెట్టారు. ఈ ప్రక్రియలో ఆయన ఎన్నో హేళనలకు గురయ్యారు. కొందరు ఆయన ఇంటి పేరునే మార్చుకోమన్నారు. అలాంటి నేత మరణం తర్వాత ఆయన కుటుంబాన్ని ఏ స్థానంలో ఉంచారో ప్రజలంతా గమనిస్తున్నారు’’ అని హరి ఆవేదన వ్యక్తంచేశారు. భారత రాజ్యాంగం పరిధిలో పనిచేయాల్సిన సీబీఐ, చట్టం, న్యాయం వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి విషయంలో ప్రభుత్వ పరిధిలో పనిచేస్తూ కక్ష సాధిస్తున్నాయని చెప్పారు. అయితే ప్రజలంతా కాంగ్రెస్‌పై కక్షతో ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో జగన్‌ను సీఎంగా చూడాలని ఆకాంక్షిస్తున్నారని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కూడా వైఎస్సార్‌సీపీకే అత్యధిక స్థానాలు దక్కుతాయని చెప్పారు. ఎవరితోనూ పొత్తు లేకుండానే 200కు పైగా అసెంబ్లీ స్థానాలు, 32 నుంచి 35 వరకు లోక్‌సభ స్థానాలను వైఎస్సార్‌సీపీ గెల్చుకుంటుందని, కేంద్రంలో ప్రధాని ఎవరన్నది జగనే నిర్ణయిస్తారని ధీమా వ్యక్తం చేశారు. జగన్‌తో తనకు మూడేళ్లుగా పరిచయం ఉందని, ఆయన కాంగ్రెస్‌లో చేరిపోతారనే ఆలోచనల్ని ప్రత్యర్థులు మానుకుంటే మేలని హితవు పలికారు.

వేరేవారితో లింకు పెట్టి రాయొద్దు

తనపై ఏ విధంగా వార్తలు రాసుకున్నా ఫర్వాలేదుగానీ, తనతో వేరే వ్యక్తుల్ని కలిపి, వారిని నొప్పించవద్దని సబ్బం హరి మీడియాను కోరారు. కేవీపీ పూర్తిగా కాంగ్రెస్ మనిషేనని, జగన్‌కు ఆయనకు మధ్య పూడ్చలేని అగాధం ఏర్పడిందని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో సాధ్యమైనంతవరకు మంచివాళ్లను, యువకులు, మహిళలు, ఎక్కువగా కొత్తవారిని తన పార్టీ తరఫున బరిలో దించేందుకు జగన్ ఆలోచిస్తున్నారని తెలిపారు. ఇతర పార్టీ నేత ల్ని తన పార్టీలోకి తీసుకురావాలని ఆయన అనుకుంటే ఊహకందని సంఖ్యలో నేతలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. సమావేశంలో సబ్బం హరి వెంట వైఎస్సార్ సీపీ నేతలు కోలా గురువులు, విళ్లా శ్రీనివాసరావు, బులుసు జగదీష్ ఉన్నారు.
Share this article :

0 comments: