అవిశ్వాసంపై దొంగాట ! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అవిశ్వాసంపై దొంగాట !

అవిశ్వాసంపై దొంగాట !

Written By news on Thursday, March 7, 2013 | 3/07/2013

- ఎటూ తేల్చని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ 
- ఎప్పుడు పెట్టాలో తెలుసంటున్న చంద్రబాబు 
- ఎదుర్కొనేందుకు సిద్ధమన్న సీఎం కిరణ్
- ఇద్దరివీ కుమ్మక్కు మాటలంటున్న టీడీపీ శ్రేణులు
- నేడు కైకలూరులో టీడీఎల్పీ భేటీ 

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టే విషయంలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీలో అదే ఊగిసలాట. అన్ని ప్రతిపక్షాలూ డిమాండ్ చేస్తున్నా టీడీపీలో కదలిక లేదు. త్వరలో ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కృష్ణా జిల్లా కైకలూరులో తెలుగుదేశం శాసనసభాపక్ష సమావేశం గురువారం జరగనుంది. ఈ సమావేశంలో అవిశ్వాస తీర్మానంపై చర్చ ఉంటుందో లేదో స్పష్టం కావడం లేదు. ఎట్టిపరిస్థితుల్లోనూ కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం పడిపోకుండా జాగ్రత్త పడుతూనే.. మరోవైపు కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడానికి వీలుగా అవిశ్వాస తీర్మానాన్ని ఒక ఆయుధంలా ఉపయోగించుకోవాలన్నదే ఆ పార్టీ వ్యూహంగా పలువురు ఎమ్మెల్యేలు చెబుతున్నారు.

ఇదివరకు కిరణ్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు ప్రజా సమస్యలను పరిష్కరించలేని ప్రభుత్వాన్ని నిలదీయడంకన్నా.. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డిని, ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పించిన తరహాలోనే ఈసారి కూడా అవిశ్వాస తీర్మానం పెట్టాలన్న ఆలోచనతోనే ఉన్నామని, అయితే సర్కారు పడిపోకుండా ఏం చేయగలమన్నదే తమకిప్పుడు అత్యంత ప్రధాన అంశంగా మారిందని ఒక సీనియర్ ఎమ్మెల్యే వివరించారు. ముందుముందు ఏం జరుగుతుందో చెప్పలేంకానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం నేతల్లో కనిపించకపోవడమే అందుకు కారణమని ఆఫ్ ది రికార్డుగా ఆ ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. టీడీఎల్పీ సమావేశంలో ఆ అంశం ప్రస్తావనకు కూడా రాకపోవచ్చని మరో నేత వ్యాఖ్యానించారు. నాలుగు రోజుల కిందట ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడినప్పుడు.. ఎవరు అవిశ్వాస తీర్మానం పెట్టినా స్వాగతిస్తామని, ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పిన విషయాన్ని గుర్తుచేస్తూ.. అది యాదృచ్ఛికంగా చెప్పిన మాట కాదని టీడీపీ నేతలే అంటున్నారు. 

అవసరమైతే అవిశ్వాస తీర్మానం పెడతామని పాదయాత్రలో చంద్రబాబు.. అదే సమయంలో అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొంటామని ముఖ్యమంత్రి.. ఇలా ఇద్దరూ ఒకేసారి చెప్పడంలోనే ఆంతర్యాన్ని అర్థం చేసుకోవాలని అంటున్నారు. పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీ నుంచి బయటకు రావడం, పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న తరుణంలో ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ వైఖరే కీలకం. ‘‘అన్ని రంగాల్లో విఫలమైన ఈ ప్రభుత్వానికి ఒక్క క్షణం కూడా కొనసాగే హక్కు లేదని ‘మీకోసం యాత్ర’లో పదేపదే చెబుతున్నప్పుడు కచ్చితంగా అవిశ్వాస తీర్మానంతో ప్రభుత్వాన్ని పడగొట్టాలి. అందుకు తగిన వాతావరణం ఉంది.

ఒకవైపు ఎంఐఎం తన మద్దతును ఉపసంహరించుకుంది. ప్రభుత్వం మైనారిటీలో పడింది. మరోవైపు వైఎస్సార్‌సీపీ, టీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఎం వంటి పార్టీలన్నీ డిమాండ్ చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అందివచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోకుండా చంద్రబాబు దోబూచులాడుతున్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎలాగైనా రక్షించాలన్న ఆలోచనతో ఉన్నట్టు స్పష్టంగా కనబడుతోంది’’ అని ముఖ్యమంత్రిపై అసంతృప్తితో ఉన్న ఓ మాజీ మంత్రి పరిస్థితిని విశ్లేషించారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయకముందు కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలో ఉంది. అప్పుడు కూడా ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని పలు విపక్ష పార్టీలు టీడీపీని డిమాండ్ చేశాయి. అయినా పట్టించుకోని చంద్రబాబు పీఆర్‌పీని చిరంజీవి కాంగ్రెస్‌లో విలీనం చేశాక.. కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ బలం ఉందని నిర్ధారణకు వచ్చాక అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ప్రభుత్వం పడిపోకుండా చూస్తానని చంద్రబాబు అప్పట్లో ఢిల్లీ వెళ్లినప్పుడు ఏఐసీసీ సీనియర్ నేత ఒకరికి ఫోన్ చేసి భరోసా ఇచ్చినట్టు వార్తలొచ్చాయి.

మీ నాయకుడు రహస్యంగా తనను కలిశారని సాక్షాత్తూ కేంద్ర మంత్రి చిదంబరం లోక్‌సభలోనే ఆ పార్టీ ఎంపీలను ఉద్దేశించి చెప్పారు. ఎమ్మార్‌తో పాటు పలు కేసుల కారణంగానే కాంగ్రెస్‌పై పోరాటం చేయడానికి తమ నాయకుడు వెనకడుగు వేస్తున్నారని పార్టీ నేతలు తమ అంతర్గత చర్చల్లో అంగీకరిస్తున్నారు. కాంగ్రెస్‌కు సహకరించడంలేదని అటుతిప్పి ఇటుతిప్పి ఎన్ని మాటలు చెప్పినా ఆయా సందర్భాలు ప్రత్యక్షంగా కనబడుతున్నాయని, 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడే లక్ష్యంతోనే చంద్రబాబు వెళ్తారు తప్ప మరో ఆలోచన చేయరన్న వాదన కూడా ఆ పార్టీలో వినిపిస్తోంది.

కె.రోశయ్య సీఎంగా ఉన్న సమయంలో సమాచారహక్కు చట్టం (ఆర్టీఐ) ప్రధాన కమిషనర్ ఎంపికకు సమావేశం ఏర్పాటు చేసి జన్నత్‌హుస్సేన్ పేరు ప్రతిపాదిస్తే ఆయన దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పేషీలో ముఖ్య కార్యదర్శిగా పనిచే శారనే ఒకే ఒక్క కారణంతో తిరస్కరించారు. తరువాత కొద్ది రోజులకు కడప ఎంపీ జగన్‌మోహన్‌రెడ్డి సంస్థల్లో పెట్టుబడుల వ్యవహారంలో సీబీఐ విచారణకు ఆదేశించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నిసార్ అహ్మద్ కక్రూ పదవీ విరమణ చేసిన తర్వాత ఆయనను రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్‌గా నియమించేందుకు జరిగిన సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు ఫైలుపై ఆమోదముద్ర వేశారు. ఈయన మైనారిటీ కాబట్టే ఆమోదముద్ర వేశానని తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. 

గత పార్లమెంటు సమావే శాల్లో ఎఫ్‌డీఐల బిల్లు ఆమోదం విషయంలో కూడా చంద్రబాబు యూపీఏ సర్కారుకు వెన్నుదన్నుగా నిలిచారు. ప్రతిపక్షాలన్నీ ఏకమై బిల్లును అడ్డుకోవాలని నిర్ణయించాయి. చంద్రబాబు కూడా దేశంలోని కోట్లాది మంది చిల్లర వర్తకులను రోడ్డుపాలు చేసే బిల్లును ఆమోదించనిచ్చేది లేదని, ఈ విషయంలో రాజీలేని పోరాటం చేస్తామని చెప్పారు. బిల్లు ఆమోదించే సమయానికి కాంగ్రెస్‌తో రాజీపడి రాజ్యసభలో ఓటింగ్ సందర్భంగా ముగ్గురు సభ్యులు గైర్హాజరై.. కాంగ్రెస్‌కు ప్రయోజనం కలిగేలా స్కెచ్ గీసి దాన్ని చక్కగా అమలు చేశారు. ఆ తరువాత వారిపై ఉత్తుత్తి ఆగ్రహం వ్యక్తం చేసి.. వివరణ కోరామంటూ తనదైన శైలిలో హడావుడి చేసి ఆ ముగ్గురు ఎంపీల అంశాన్ని పక్కనపెట్టారు. 

పెడతాం.. కాపాడతాం
త్వరలో ప్రారంభమయ్యే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కూడా ఇలాంటి వ్యూహంతోనే వెళతామని ఓ టీడీపీ నాయకుడు తెలిపారు. అవిశ్వాసంపై చర్చ జరిగాక.. ఓటింగ్ సమయంలో తమ సభ్యులు కొందరు ఏదో ఒక కారణంతో సభ నుంచి బయటకు వెళ్లడమో, గైర్హాజరు కావడమో జరుగుతుందని, ఆ రకంగా ప్రభుత్వం బయటపడుతుందన్న వాదన టీడీపీలో వినిపిస్తోంది. ‘రాజ్యసభలో ముగ్గురు ఎంపీలు గైర్హాజరు అయితే వారిని ఏమీ చేయలేకపోయారు. ఒకవేళ అసెంబ్లీలో అలా వ్యవహరించిన ఎమ్మెల్యేలపై చర్య తీసుకుంటే అధినేతను చాలా మంది నిలదీస్తారు. అయినా వ్యవహారం అంతదాకా రాదు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడేందుకు మా అధ్యక్షుడు కంకణం కట్టుకున్నారు కాబట్టి’ అని రాయలసీమ జిల్లాలకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే ఒకరు వ్యాఖ్యానించారు.
Share this article :

0 comments: