‘వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండుసార్లు అవిశ్వాసం ఎందుకు పెట్టినట్టు? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ‘వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండుసార్లు అవిశ్వాసం ఎందుకు పెట్టినట్టు?

‘వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండుసార్లు అవిశ్వాసం ఎందుకు పెట్టినట్టు?

Written By news on Saturday, March 9, 2013 | 3/09/2013

కేసుల భయంతోనే అవిశ్వాసానికి చంద్రబాబు వెనకడుగు
వదలకుండా వెంటాడుతున్న ఐఎంజీ, ఎమ్మార్ వంటి కేసులు
అందుకే కాంగ్రెస్‌తో మ్యాచ్ ఫిక్సింగ్.. 
ఆ మేరకే టీడీఎల్పీలో హైడ్రామా..కుంటిసాకులు
ఒకవేళ వేరే పార్టీ ఏదైనా అవిశ్వాసం పెడితే గైర్హాజరు!
ఎలాగైనా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడటమే ఎజెండా
బాబు వైఖరిపై తెలుగుదేశం నేతల్లోనే చర్చలు
వైఎస్ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టినప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడెందుకనే సందేహం
అవిశ్వాసంలో ఒకవేళ వైఎస్సార్‌సీపీ సర్కారుకు మద్దతు పలికితే ఆ పార్టీని ఎండగట్టడానికి టీడీపీకి చాన్స్ దొరికేదనేఅభిప్రాయం

అవిశ్వాసం అనివార్యమైతే బాబు రెండు ప్రయోజనాలు ఆశిస్తున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
ఒకటి.. సర్కారు పడిపోకుండా చూడటం.. 

రెండోది.. ఎవరైనా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రజల పక్షాన నిలిచి అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేస్తే వారిని అనర్హతకు గురిచేయడం

సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేకుండా కాపాడతామన్న భరోసా ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ నుంచి లభించింది. తమకు తాముగా అవిశ్వాస తీర్మానం పెట్టబోమని తేల్చిచెప్పడమే కాకుండా ఒకవేళ వేరే పార్టీ ఏదైనా అవిశ్వాసం ప్రతిపాదించినా వ్యూహాత్మకంగా వ్యవహరించి సర్కారును కాపాడుతామన్న హామీ కాంగ్రెస్‌కు లభించింది. ఈ ప్రభుత్వానికి ఒక్క క్షణం కూడా అధికారంలో కొనసాగే హక్కు లేదని మీకోసం యాత్రలో పదేపదే చెప్పిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి రక్షణ కవచమయ్యారు. గురువారం జరిగిన తెలుగుదేశం శాసనసభా పక్షం (టీడీఎల్పీ) సమావేశంలో ప్రభుత్వంపై అవిశ్వాసం విషయమై హైడ్రామా నడిపించిన చంద్రబాబు అంతకుముందే కాంగ్రెస్‌కు స్పష్టమైన సంకేతాలు పంపించారని తెలుస్తోంది. తాజా పరిణామాలతో చంద్రబాబు ఇప్పుడు పూర్తిగా కాంగ్రెస్‌కు సరెండర్ అయ్యారన్న అంశంపై టీడీపీలో తీవ్రస్థాయి చర్చ సాగుతోంది. అవిశ్వాసంపై టీడీఎల్పీ సమావేశంలో ఆయన చెప్పినవన్నీ కాంగ్రెస్‌తో మ్యాచ్‌ఫిక్సింగ్ చేసుకున్నారన్న అపనింద రాకుండా ఉండేందుకు వెతుక్కున్న కుంటి సాకులు మాత్రమేనని ఆ పార్టీ ఎమ్మెల్యేలే అంగీకరిస్తున్నారు. టీడీఎల్పీ సమావేశానికి 48 మంది ఎమ్మెల్యేలు హాజరుకాగా 30 మందికిపైగా గైర్హాజరయ్యారు. వీరంతా సమావేశంలో ఏం జరిగిందన్న విషయాన్ని ఆరా తీయడంతో పాటు అధ్యక్షుడి వ్యవహార శైలిపై ఇతర నేతలతో చర్చల్లో మునిగిపోయారు. గత మూడేళ్లుగా అనేక విషయాల్లో కాంగ్రెస్‌కు అండగా నిలుస్తున్న చంద్రబాబు త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించే వ్యూహంపై తన కోటరీలోని సన్నిహితులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం ద్వారా టీడీఎల్పీలో హైడ్రామా నడిపించారని వారు నిర్ధారణకు వచ్చారు. 

ఈ నెల 13 నుంచి ప్రారంభమవుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అవిశ్వాస తీర్మానమే కీలకంగా మారుతుందని భావిస్తున్న సమయంలో చంద్రబాబు ఒక్కసారిగా వ్యూహం మార్చి వెనకడుగు వేయడం టీడీపీ ఎమ్మెల్యేలు కొందరికి మింగుడు పడటం లేదు. ఐఎంజీ, ఎమ్మార్ లాంటి కేసులు వెంటాడుతున్న కారణంగానే గత కొన్నేళ్లుగా చంద్రబాబు పూర్తిగా కాంగ్రెస్ కనుసన్నల్లో పనిచేస్తున్నారన్న అభిప్రాయం పార్టీలో బలంగా వినిపిస్తోంది. రాష్ట్రంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రస్తుత సమయంలో కాంగ్రెసేతర రాజకీయ పార్టీలన్నీ అవకాశాన్ని వినియోగించుకోవాలని, అవిశ్వాస తీర్మానం ద్వారా ప్రభుత్వం మెడలు వంచాలని డిమాండ్ చేస్తున్నాయి. శాసనసభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగాలన్నా, దానిపై ఓటింగ్ జరగాలన్నా కనీసం 30 మంది శాసనసభ్యుల బలం అవసరం. శాసనసభలో ఇప్పుడున్న పార్టీల్లో ఒక్క టీడీపీకి మాత్రమే ఆ బలముంది. అలాంటప్పుడు అవిశ్వాస తీర్మానం పెట్టి మిగతా పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని నిలదీయకుండా, అన్ని రంగాల్లో విఫలమైన ప్రభుత్వాన్ని అవకాశం చిక్కితే పడగొట్టకుండా చంద్రబాబు వెనకడుగు వేయడంలోని ఆంతర్యమేమిటో పార్టీ నేతలకు అంతు చిక్కడం లేదు. 

వేరే పార్టీ అవిశ్వాసం పెడితే మద్దతిస్తామని చెప్పడమంటే రాష్ట్రంలో ప్రజలకు ఎలాంటి కష్టాలు లేవని టీడీపీ భావిస్తున్నట్టా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ‘ప్రధాన ప్రతిపక్షం అవిశ్వాసం పెట్టకపోవడానికి ప్రత్యేక కారణం అంటూ ఉండాలి. అలాంటివేమీ లేవు. ఇతర పార్టీలు లాభపడతాయని కాంగ్రెస్‌కు అండగా నిలుస్తామా? టీడీపీ చరిత్రలో ఇంతటి దరిద్రమైన పరిస్థితి ఇంతకు ముందెప్పుడూ లేదు. అవిశ్వాసం పెట్టడం వల్ల నిజంగానే వైఎస్సార్ కాంగ్రెస్ లాంటి పార్టీ ప్రయోజనం పొందుతుందని అనుకుంటే ఆ తర్వాత ఆ పార్టీని ఎండగట్టడానికి అవకాశం ఉంది కదా? అలా చేయనప్పుడు కచ్చితంగా కాంగ్రెస్‌కు సాగిలపడిపోవడంగానే భావిస్తారు..’ అని ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే విశ్లేషించారు. ‘పార్టీకి 46 మంది ఎమ్మెల్యేలున్నప్పుడు కూడా స్పీకర్‌పై అవిశ్వాసం పెట్టాం. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని పడగొట్టలేమని తెలిసీ చంద్రబాబు అవిశ్వాస తీర్మానం పెట్టారు.

నిజానికి అవిశ్వాస తీర్మానం పెట్టడానికి ఇప్పుడు తగిన వాతావరణం ఉంది. ఒకవైపు ఎంఐఎం తన మద్దతును ఉపసంహరించుకుంది. ప్రభుత్వం మైనారిటీలో పడింది. మరోవైపు టీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఎం, వైఎస్సార్‌సీపీ వంటి పార్టీలన్నీ అవిశ్వాసం పెట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అందివచ్చిన అవకాశాన్ని చంద్రబాబు ఉపయోగించుకోక పోవడమే కాకుండా కాంగ్రెస్‌కు అండగా నిలబడటమంటే కచ్చితంగా తెరవెనుక బలమైన కారణాలే ఉండొచ్చు..’ అని టీడీఎల్పీ సమావేశానికి హాజరుకాని సీనియర్ ఎమ్మెల్యే ఒకరు వ్యాఖ్యానించారు. ‘బాబ్లీ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం విఫలమైందని వెళ్లిన ప్రతిచోటా చెబుతున్నాం. చంద్రబాబు దానికోసం గట్టిగా పోరాటం చేసిండంటున్నం. అలాంటప్పుడు సర్కారును పడగొట్టడానికి ఏమాత్రం సంకోచించవద్దు. కానీ మా నాయకుడి ఆలోచనేంటో అర్థం కావడం లేదు..’ అని తెలంగాణ ఎమ్మెల్యే ఒకరు అన్నారు. 

వెంటాడుతున్న కేసులే కారణం: గడిచిన కొన్నేళ్లుగా కాంగ్రెస్‌కు ఎన్నో రకాలుగా చంద్రబాబు సహకరిస్తుండటం వెనుక బలమైన కారణాలున్నాయని ప్రైవేటు సంభాషణల్లో పార్టీ నేతలే చెబుతున్నారు. ముఖ్యంగా ఐఎంజీ, ఎమ్మార్ కేసుల విషయంలో చంద్రబాబులో ఇప్పటికీ ఆందోళన ఉందని, ఆ కారణంగానే వాటి నుంచి బయటపడటానికి ఆయన కాంగ్రెస్‌తో సన్నిహితంగా ఉంటున్నారన్న వాదన పార్టీలో బలంగా ఉంది. ఈ కారణంగానే ఆయన కాంగ్రెస్‌లోని ఢిల్లీ నేతలనూ నేరుగా సంప్రదిస్తున్నారని అంటున్నారు.

‘ ఆయన కాంగ్రెస్ అగ్రనేతలతో సంప్రదింపులు జరపకపోతే రాజ్యసభలో ఎఫ్‌డీఐలపై ఓటింగ్ జరిగినప్పుడు మా పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలు గైర్హాజరయ్యేవారే కాదు..’ అని ఒక నాయకుడు అన్నారు. ‘టీడీపీ ఎఫ్‌డీఐలకు వ్యతిరేకమని ప్రకటించి తీరా ఆ అంశంపై ఓటింగ్ జరిగితే వ్యతిరేకంగా ఓటు వేయకుండా సభ నుంచి బయటకు వచ్చి మాపార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలు పరోక్షంగా కాంగ్రెస్‌కు మద్దతునిచ్చారంటే కచ్చితంగా చంద్రబాబు ఆదేశాల మేరకే అలా జరిగింది. లేదంటే వారెవ్వరూ గీత దాటే వారే కాదు. బాబు ఆదేశాల మేరకు నడుచుకున్నారు కాబట్టే వారిపై పార్టీ ఎలాంటి చర్య తీసుకోలేదన్న విషయం గుర్తుంచుకోవాలి..’ అని మాజీ ఎంపీ ఒకరు వ్యాఖ్యానించారు. 

వైఎస్సార్ సీపీని ఎండగట్టడానికి అవకాశం చిక్కేది: ఒకవైపు కాంగ్రెస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తూ దాన్ని మరో పార్టీకి అంటగట్టడం రాజకీయంగా తప్పుడు వ్యూహమని పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు అభిప్రాయపడుతున్నారు. అవిశ్వాసం పెడితే వైఎస్సార్ సీపీ దాన్ని తనకు అనుకూలంగా మలచుకుంటుందని టీడీఎల్పీ సమావేశంలో చంద్రబాబు చెప్పడాన్ని ఒక ఎమ్మెల్యే తప్పుబట్టారు. టీడీపీ అవిశ్వాసం పెట్టినప్పుడు ఒకవేళ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి అనుకూలంగా నిలిచినపక్షంలో ఆ పార్టీని ఎండగట్టడానికి అవకాశం ఉండేదని, ఇంతకాలం మనం చేస్తున్న విమర్శలకు బలం చేకూరేదని ఆయన అన్నారు. 

కాంగ్రెస్‌ను కాపాడటమే లక్ష్యం: ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడటమే చంద్రబాబు ఏకైక లక్ష్యంగా కనబడుతోందన్న అభిప్రాయాన్ని పలువురు సొంత పార్టీ నేతలతో పాటు కాంగ్రెసేతర పార్టీల నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ టీడీపీ అవిశ్వాసం పెట్టినా, లేదా వైఎస్సార్‌సీపీలాంటి మరో పార్టీ ప్రతిపాదించినా చంద్రబాబు వల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదన్న వాదన గట్టిగా వినిపిస్తోంది. ఆ మేరకు చంద్రబాబు ఇప్పటికే ఒక వ్యూహం రచించారని తెలుస్తోంది. ‘మరోపార్టీ ఏదైనా అవిశ్వాస తీర్మానం నోటీసిస్తే అది చర్చకు వచ్చేలా సభలో టీడీపీ మద్దతు ప్రకటిస్తుంది. తద్వారా అవిశ్వాసానికి మద్దతునిచ్చినట్టుగా పైకి కనబడుతుంది. ఆ తర్వాత చర్చ పూర్తయి ఓటింగ్‌కు వచ్చేసరికి తనదైన శైలిలో ముందే రచించిన వ్యూహాన్ని అమలు చేస్తుంది..’ అని అంటున్నారు. 

ఓటింగ్ కనుక జరిగితే కాంగ్రెస్‌కు కావలసిన మెజారిటీ చూపించుకునే స్థాయిలో సభ నుంచి గైర్హాజరు కావడమే టీడీపీ వ్యూహంగా తెలుస్తోంది. ఏ రాజకీయ పార్టీ ప్రతిపాదించినా సరే అవిశ్వాసంపై మద్దతునిచ్చినట్టు పైకి కనిపించి లోపల మాత్రం సభ్యులను సభకు రాకుండా చేసి కాంగ్రెస్‌కు అండగా నిలుస్తారని చెబుతున్నారు. ఈ విషయంలో చంద్రబాబు కాంగ్రెస్ అధిష్టానానికి ఇప్పటికే సంకేతాలు పంపారని కూడా విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి. ఆ రకంగా చేయడం ద్వారా చంద్రబాబు రెండు ప్రయోజనాలను ఆశిస్తున్నట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో ఒకటి కాంగ్రెస్ సర్కారు కూలిపోకుండా చూడటం కాగా.. రెండోది అవిశ్వాసంపై చర్చ జరిగి ఓటింగ్ సందర్భంలో ఎవరైనా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రజల పక్షాన నిలిచి అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేస్తే వారిని అనర్హులను చేసే వ్యూహం..’ గా పేర్కొంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. 

అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడేమిటి?: ఎన్టీఆర్ హయాం లోనూ ఆ తర్వాత చంద్రబాబు ప్రభుత్వంపైనా కాంగ్రెస్ ఏనాడూ అవిశ్వాసం పెట్టలేదని, అలాంటప్పుడు కాంగ్రెస్‌పైన మనమెందుకు పెట్టాలని టీడీఎల్పీ భేటీలో బాబు చెప్పడం పట్ల నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 

‘వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండుసార్లు అవిశ్వాసం ఎందుకు పెట్టినట్టు? అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడెందుకు వచ్చింది? పైగా అప్పుడు ఇంతటి స్థాయిలో కరెంటు కోతలు లేవు... రైతులకు ఇంతటి దుర్భరమైన పరిస్థితులు లేవు... ఇప్పుడు అన్ని రంగాల్లో పరిస్థితులు దయనీయంగా మారాయి. సామాన్యులను పట్టించుకునే పరిస్థితే లేదు. నిజానికి అవిశ్వాసం పెట్టడానికి ఇంతకన్నా ఇంకా ఏం కావాలి? అవిశ్వాసం పెట్టి ఒకవేళ ప్రభుత్వం పడిపోతే వచ్చే ఎన్నికల్లో ఎలాగూ గెలవలేమన్న కారణమైనా అయిఉండాలి... లేదా కేసుల భయమైనా కావొచ్చు... అందుకే మా నాయకుడు వెనకడుగు వేసినట్టు ఉన్నారు..’ అంటూ తెలంగాణకు చెందిన ఒక ఎమ్మెల్యే ఆఫ్ ది రికార్డుగా విశ్లేషించారు. ‘రాజకీయ పార్టీగా అందులోనూ ప్రధాన ప్రతిపక్షంగా పార్టీకి ఒక వ్యూహం ఉండాలి. అలా కాకుండా మరో పార్టీ బలపడుతుందనో, లేదా కేసులు మోపుతారనో భయపడి కాంగ్రెస్‌కు సరెండర్ కావడం వ్యక్తిగతంగా చంద్రబాబుకు ప్రయోజనం చేకూర్చవచ్చు కానీ మూడు దశాబ్దాల చరిత్ర కలిగిన టీడీపీకి ఏమాత్రం ప్రయోజనకరం కాదు..’ అని మాజీ మంత్రి ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు.
Share this article :

0 comments: