బలహీన వర్గాలకు జగన్ న్యాయం చేశారు: అప్పారావు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బలహీన వర్గాలకు జగన్ న్యాయం చేశారు: అప్పారావు

బలహీన వర్గాలకు జగన్ న్యాయం చేశారు: అప్పారావు

Written By news on Thursday, March 7, 2013 | 3/07/2013

రాష్ట్ర శాసనసభ నుంచి శాసనమండలికి జరిగే ద్వైవార్షిక ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఆదిరెడ్డి అప్పారావును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిగా ప్రకటించింది. బుధవారం సాయంత్రం పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అధ్యక్షతన జరిగిన పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సమావేశానంతరం ఆదిరెడ్డి అభ్యర్థిత్వాన్ని అసెంబ్లీలో పార్టీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి మీడియా ముందు ప్రకటించారు. అప్పారావు అభ్యర్థిత్వాన్ని తమ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఖరారు చేశారని, ఆ మేరకు ఎమ్మెల్యేలమంతా బలపరిచామని తెలి పారు. 9న అప్పారావు నామినేషన్ దాఖలు చేస్తారని, ఆయన తప్పకుండా ఘనవిజయం సాధిస్తారని బాలినేని పేర్కొన్నారు.

తొలిసారిగా కొప్పుల వెలమకు ప్రాతినిధ్యం
తూర్పు గోదావరి జిల్లాలో కొప్పుల వెలమ కులస్తులు గణనీయమైన సంఖ్యలో ఉన్నప్పటికీ అక్కడి నుంచి చట్ట సభకు తొలిసారిగా ఆ కులానికి చెందిన వ్యక్తికి అవకాశం కల్పించింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయేనని పార్టీ సీనియర్ నేత పిల్లి సుభాష్‌చంద్రబోస్ అన్నారు. తాను 2004 ఎన్నికల్లో ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటికీ బీసీలకు ఎక్కువ ప్రాతినిధ్యం ఇవ్వాలనే ఉద్దేశంతో దివంగత వైఎస్ తనకు మంత్రి పదవి ఇచ్చి ఆదరించారని ఆయన గుర్తుచేసుకున్నారు.

జగన్ కూడా బీసీలకు ప్రాధాన్యమిచ్చి.. తాను వారి పక్షానే ఉన్నానని మరోసారి నిరూపించారని అన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లో కొప్పుల వెలమ కులస్తులు ఎక్కువగా ఉన్నప్పటికీ తూర్పు గోదావరి జిల్లా నుంచి వారెప్పుడూ చట్ట సభల ముఖం చూసి ఎరుగరని బోస్ అన్నారు. అప్పారావును ఎమ్మెల్సీగా ఎంపిక చేయడంతో ఆ లోటు భర్తీ అయిందన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిని నిర్ణయించడానికి జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేలు మేకతోటి సుచరిత, కాపు రామచంద్రారెడ్డి, ధర్మాన కృష్ణదాస్, కొరుముట్ల శ్రీనివాసులు, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, బి.గురునాథరెడ్డి, గొల్ల బాబూరావు సహా పలువురు పాల్గొన్నారు. అప్పారావు దివంగత టీడీపీ నేత కె.ఎర్రన్నాయుడికి వియ్యంకుడు కూడా.

బలహీన వర్గాలకు జగన్ న్యాయం చేశారు: అప్పారావు
జగన్ బలహీన వర్గాలకు న్యాయం చేశారని అభ్యర్థిగా ఎంపికైన ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. తనను ఎంపిక చేయడం ఆనందంగా ఉందన్నారు. బీసీలకు, బలహీనవర్గాలకు చాలా చేశామని పలు పార్టీలు చెప్పుకుంటూ ఉంటాయని, కానీ ఆచరణలో బీసీల పక్షాన నిలబడింది ఒక్క జగన్ మాత్రమేనని ఆయన అభిప్రాయపడ్డారు. దివంగత రాజశేఖరరెడ్డి ఆశయాల సాధనకు, ప్రజా సంక్షేమానికి తాను కృషి చేస్తానని ఆయన అన్నారు.
Share this article :

0 comments: