వైఎస్సార్ మహిళా పక్షపాతి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్ మహిళా పక్షపాతి

వైఎస్సార్ మహిళా పక్షపాతి

Written By news on Saturday, March 9, 2013 | 3/09/2013

ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చారు
గ్యాస్ పెంపు నుంచి ఊరట కల్పించారు
ఆయన అడుగుజాడల్లోనే జగన్ నడుస్తారు.. ‘అమ్మ ఒడి’ లాంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తారు
చంద్రబాబు ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం.. రెండూ దొందూ దొందే
మహిళా దినోత్సవం సందర్భంగా వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమాలు

సాక్షి, హైదరాబాద్: సమాజంలో మహిళలకు సమాన హక్కులు అమలుకావడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై లైంగిక దాడులు, భ్రూణ హత్యలు నేటికీ జరుగుతున్నాయన్నారు. ఢిల్లీలో ‘నిర్భయ’ ఘటన మాత్రమే వెలుగులోకి వచ్చిందని, దేశంలో ప్రతి 21 నిమిషాలకు ఒక లైంగిక దాడి, 51 నిమిషాలకు ఒక వరకట్న చావు చోటుచేసుకుంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇవి చాలవన్నట్లు రాష్ట్రంలో మహిళల పట్ల పాలకులే అవమానకరంగా మాట్లాడటం బాధాకరమని వ్యాఖ్యానించారు. అర్ధరాత్రి స్వాతంత్య్రం వచ్చిందని మహిళలు రాత్రి వేళల్లో తిరుగుతారా? అని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. పాలకులే ఇలా మాట్లాడితే మహిళలకు రక్షణ ఎక్కడి దని ప్రశ్నించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పలు కార్యక్రమాలను నిర్వహించారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి విజయమ్మ పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత పలు రంగాల్లో రాణించిన మహిళలను ఘనంగా సన్మానించారు. అనంతరం హాజరైన వారిని ఉద్దేశించి విజయమ్మ ప్రసంగించారు.

మహిళల అభివృద్ధికి కృషి చేసింది వైఎస్సార్..

మహిళాభివృద్ధి కోసం దివంగత రాజశేఖరరెడ్డి ఎంతగానో కృషి చేశారని విజయమ్మ గుర్తు చేశారు. ‘‘గ్రామాల్లో మహిళల సాధికారత కోసం ఐక్యరాజ్యసమితి 2012లో నిర్ణయం తీసుకుంటే రాజశేఖరరెడ్డి మాత్రం ఆయన అధికారంలోకి వచ్చిన నాటి నుంచే సంబంధిత కార్యక్రమాలు అమలు చేశారు. ప్రభుత్వం ఇచ్చే ఇళ్లను మహిళల పేరునే ఎక్కువగా ఇచ్చారు. భూమిలేని వారికి ఇచ్చే పట్టాలు కూడా ఆడవారికే ఇచ్చారు. భూమి సాగుకోసం బడ్జెట్‌లో రూ.500 కోట్లు కేటాయించారు. పావలా వడ్డీకే రుణాలు అందించి మహిళలను ఆర్థికంగా మరింత బలోపేతం చేశారు. టీడీపీ హయాంలో మహిళా సంఘాలకు ప్రభుత్వ రుణాలు రూ.14 వందల కోట్లే ఇచ్చారు. అయితే వైఎస్ అధికారంలోకి వచ్చాక మహిళా సంఘాలను 8 లక్షలకు పెంచి కోటి మంది సభ్యులను చేర్చారు. వారికి పావలా వడ్డీకే రూ.24 వేల కోట్లు అందించారు. అప్పట్లో రాష్ట్రానికి వచ్చిన అమెరికా అధ్యక్షుడు జార్జిబుష్ మహిళా సంఘాల అమలు తీరు చూసి రాజశేఖరరెడ్డిని అభినందించారట. అయితే ప్రస్తుతం సంఘాల పరిస్థితి తలకిందులైంది. పాలకులు వడ్డీలేని రుణాలని చెబుతున్నారేకానీ రుణాలు ఇచ్చిన దాఖలాలే లేవు’ అని వ్యాఖ్యానించారు.

అంగన్‌వాడీలను గుర్రాలతో తొక్కించింది చంద్రబాబే..

చంద్రబాబు హయాంలో మహిళలు పలు అవమానాలు ఎదుర్కొన్నారని విజయమ్మ తెలిపారు. అంగన్‌వాడీలు వారి సమస్యల పరిష్కారం కోసం నిరసన కార్యక్రమాలు చేపడితే మహిళలని కూడా చూడకుండా చంద్రబాబు పోలీసులను ఉపయోగించి గుర్రాల చేత తొక్కించారని గుర్తుచేశారు. అయితే రాజ శేఖరరెడ్డి అధికారంలోకి వచ్చాక వారి జీతభత్యాలు రెట్టింపుచేశారని వివరించారు. బాలికలు పదోతరగతి వరకు కచ్చితంగా చదవాలనే ఆలోచనతో కస్తూర్భా పాఠశాలను ఏర్పరిచి, దాదాపు 300 సంక్షేమ హాస్టళ్లు నిర్మించారని తెలిపారు. గ్యాస్ సిలిండర్ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల చేత కంటనీరు పెట్టిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజశేఖరరెడ్డి హయాంలో సిలిండర్ల ధరను కేంద్రం పెంచినా ఆ భారం తన అక్కా చెల్లెళ్లపై పడకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వమే భరించేలా చర్యలు తీసుకున్నారని గుర్తుచేశారు. 

‘అమ్మ ఒడి’లా జగన్ పాలన: రాజశేఖరరెడ్డి వారసుడిగా ఆయన హామీలన్నింటినీ జగన్‌బాబు నెరవేరుస్తారని విజయమ్మ హామీ ఇచ్చారు. జగన్‌బాబు పాలన అచ్చం అమ్మ ఒడిలా ఉంటుందన్నారు. ‘అమ్మ ఒడి’ పథకం కింద.. పిల్లలను బడికి పంపినందుకు తల్లి బ్యాంకు ఖాతాలో రూ.500 జమ చేస్తారని చెప్పారు. ఒక్కరుంటే రూ.500, ఇద్దరుంటే రూ. వెయ్యి జమచేస్తారని తెలిపారు. ఇవేకాకుండా మహిళలకు వడ్డీలేని రుణాలతో పాటు అన్నింటినీ అందిస్తారని, ప్రతి ఒక్కరూ జగన్‌బాబు నాయకత్వంలో ముందకెళ్లాలని సూచించారు. వైఎస్సార్ కాంగ్రెస్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు కొల్లి నిర్మలాకుమారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విజయమ్మతో పాటు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత, పార్టీ నేతలు ఆర్‌కే రోజా, ధర్మాన పద్మప్రియ, విజయారెడ్డి పాల్గొని ప్రసంగించారు.

మహిళలకు విజయమ్మ సన్మానం

మహిళా దినోత్సవం సందర్భంగా పలు రంగాల్లో రాణిస్తున్న మహిళలను విజయమ్మ సన్మానించారు. అంధురాలైనప్పటికీ రాష్ట్ర హైకోర్టులో ఏజీపీగా విశేష సేవలందిస్తున్న చంద్ర సుప్రియకిరణ్, కుటుంబ భారాన్ని తన భుజస్కంధాలపై మోస్తూ హైదరాబాద్‌లో ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్న జరిజల రేఖ, నిస్వార్థంతో రెండు దశాబ్దాలుగా ప్రభుత్వ సేవకు మాత్రమే పరిమితమైన ప్రముఖ గైనకాలజిస్ట్ రాజ్యలక్ష్మి, రైతుకూలీగా పనిచేసి కాలక్రమంలో పది ఎకరాల ఆసామిగా ఎదిగిన మెదక్ జిల్లా న్యాల్‌కల్ మండలానికి చెందిన నడిమిదొడ్డి అంజమ్మ, యాసిడ్‌దాడికి గురైనా మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతూ ఉద్యోగం చేసి కుటుంబానికి అండగా ఉంటున్న హైదరాబాద్‌కు చెందిన అనూరాధలు ఈ సన్మానం అందుకున్నారు. ఈ సందర్భంగా సుప్రియ మాట్లాడుతూ.. ‘అంధురాలినైన నన్ను దేశంలో మొట్టమొదటిసారిగా ప్రభుత్వ అసిస్టెంట్ ప్లీడర్‌ను చేసిన ఘనత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిగారిదే. అంధురాలినైన నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించారు. అంతేకాదు నాలాంటి అంధులకు ప్రభుత్వ విభాగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని తీర్మానించారు. అంధుడైన నా భర్తకు సచివాలయంలో కాంట్రాక్టు ఉద్యోగం ఇచ్చారు. అయితే ఇప్పుడున్న ప్రభుత్వం నా భర్తను ఉద్యోగం నుంచి తొలగించింది’ అని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో వికలాంగులకు రిజర్వేషన్లు కల్పిస్తే అసెంబ్లీలో తమ హక్కుల కోసం పోరాడే అవకాశం ఉంటుందన్నారు.
Share this article :

0 comments: