చంద్రబాబు అవినీతి, కిరణ్ చేతగానితనం వల్లే రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్రబాబు అవినీతి, కిరణ్ చేతగానితనం వల్లే రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం

చంద్రబాబు అవినీతి, కిరణ్ చేతగానితనం వల్లే రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం

Written By news on Tuesday, March 5, 2013 | 3/05/2013

1995-96లో గ్యాస్, నాఫ్తా విద్యుత్ ప్రాజెక్టులను చంద్రబాబు తన అనుచరులకు కట్టబెట్టారు
ఇప్పుడు ఆ ప్రాజెక్టులు ఒక్క యూనిట్ విద్యుత్ కూడా ఉత్పత్తి చేయలేకపోతున్నాయి
ఆ ప్రాజెక్టుల మంజూరులో అక్రమాలపై సీబీఐ దర్యాప్తునకు సిద్ధమా చంద్రబాబూ?
బొగ్గు డిమాండ్, జలాశయాల్లో నీటి లభ్యతల గురించి ఈ ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదు
అదనపు విద్యుత్తు కొనుగోలు చేయాలని ట్రాన్స్‌కో కోరినా కిరణ్ సర్కారు వినలేదు
అసాధారణ కోతలు, కరెంటు చార్జీలకు నిరసనగా గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో వైఎస్సార్ సీపీ మహాధర్నా

‘టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 1995-96లో గ్యాస్, నాఫ్తా ఆధారిత స్వల్ప వ్యవధి విద్యుత్తు ప్రాజెక్టులను నిబంధనలకు విరుద్ధంగా తన వారికి కట్టబెట్టారు. 2,000 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేయాల్సిన ఈ మినీ గెస్టేషన్ ప్రాజెక్టులు ఇప్పుడు ఒక్క యూనిట్ కూడా ఉత్పత్తి చేయలేకపోతున్నాయి. ఇవాళ ఈ విద్యుత్తు ప్రాజెక్టులు పని చేసినా.. మరోవైపు కేంద్రం నుంచి మనకు రావాల్సిన బొగ్గు, గ్యాస్, విద్యుత్తు వాటాలకు రాష్ట్ర ప్రభుత్వం ముందుగా అనుమతులు సాధించినా ఈ రోజు మనకు కరెంటు సంక్షోభం వచ్చి ఉండేదే కాదు. నాడు చంద్రబాబు నాయుడు అవినీతి.. నేడు కిరణ్‌కుమార్ రెడ్డి చేతగానితనం వల్లే రాష్ట్రం చీకట్లో కూరుకుపోయింది’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. అసాధారణమైన విద్యుత్తు కోతలు.. కరెంటు చార్జీల పెంపునకు నిరసనగా పార్టీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ కేంద్రంలో జరిగిన మహాధర్నాలో ఆమె పాల్గొన్నారు. మరోవైపు ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర చేస్తూ అటు వచ్చిన షర్మిల కూడా ఈ మహాధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయమ్మ ప్రసంగించారు. ఆమె ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే..

గ్యాస్ లభ్యత లేదని తెలిసీ, గ్యాస్ కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి కేటాయింపులూ లేవని తెలిసి కూడా చంద్రబాబు తన హయాంలో నాఫ్తా, గ్యాస్ ఆధారిత ప్రాజెక్టులను మంజూరు చేశారు. వాటిని మొదట మహామహులైన పారిశ్రామిక వేత్తలకు ఇస్తున్నట్టు ప్రకటించి ఆ తరువాత ఎంవీఎస్ మూర్తి లాంటి వాళ్లకు అప్పగించేలా పన్నాగం పన్ని అమలు చేసుకున్నారు. ఆ రోజున చంద్రబాబు తన వాళ్ల గురించి కాకుండా ప్రజల గురించి ఆలోచించి ఉంటే.. ఈ రోజు బొగ్గు ఆధారిత పరిశ్రమలు తెచ్చేవారు. ఇదే జరిగితే మనకు ఈ రోజు ఈ కరెంటు కష్టాలు ఉండేవి కాదు. మా మీద సీబీఐ విచారణ వేయించడం కోసం కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపిన చంద్రబాబు ఈ మినీ గెస్టేషన్ ప్రాజెక్టుల పేరు మీద ఆయన రాష్ట్ర ప్రజలకు, ఖజానాకు కలిగించిన నష్టం మీద సీబీఐ దర్యాప్తునకు అంగీకరించగలరా? బాబు తన వారి కోసం రాష్ట్ర విద్యుత్తు కేంద్రాలను డబ్బు చేసుకునే సరుకులుగా మార్చారు. ఎనిమిదేళ్లలో ఎనిమిది సార్లు విద్యుత్తు చార్జీలు పెంచిన ఘనత ఆయనది. తన మనుషుల చేత విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్లు అమ్మించడానికి విద్యుత్తు సంస్కరణలు అమల్లోకి తెచ్చారు. ఈ అక్రమాలపై సీబీఐ విచారణ కోరడానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నారా? రాష్ర్ట ప్రయోజనాలను నిలబెట్టడం కోసం ైవైఎస్సార్ బడ్జెట్ కేటాయింపుల్లో రూ. 6,000 కోట్ల వరకు విద్యుత్తు కొనుగోళ్ల కోసం వెచ్చిస్తే.. దాన్ని ఇప్పుడు చంద్రబాబు తప్పు పడుతున్నారు. ఈ పాలకులు రూ. 32 వేల కోట్ల విద్యుత్తు భారాన్ని ప్రజల మీద వేస్తే.. ఆయన ప్రభుత్వాన్ని విమర్శించడం లేదు.

ఇంతటి సంక్షోభం ఎప్పుడూ లేదు..

రాష్ట్రావతరణ జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంతటి విద్యుత్తు సంక్షోభాన్ని.. ఇంతలా పెరిగిన విద్యుత్తు చార్జీలను ఎప్పుడూ చూడలేదు. పరిశ్రమలకు వారానికి మూడు రోజుల చొప్పున నెలకు 12 రోజులు అధికారికంగానే విద్యుత్తు కోత పెడుతున్నారు. ఏప్రిల్ ఒకటి నుంచి వారానికి నాలుగు రోజుల పవర్ హాలిడే ప్రకటిస్తారని వింటున్నాం. అసాధారణ విద్యుత్తు కోతలతో 1.45 లక్షల కుటీరపరిశ్రమలు, వేలాదిగా ఇతర ఉత్పాదక పరిశ్రమలు మూతపడి పోయాయి. దాదాపు 25 లక్షల మంది యువకులు ఉపాధి కోల్పోయి రోడ్డు మీద పడ్డారు. ఇంకొన్ని పరిశ్రమలు పక్కరాష్ట్రాలకు తరలిపోతున్నాయి. చిన్నచిన్న పరిశ్రమల యాజమాన్యాలు కనీసం బ్యాంకు రుణాలు కూడా కట్టే పరిస్థితుల్లో లేవు. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకొని బ్యాంకు లోన్లను వాయిదా వేయించాల్సిన అవసరం ఉంది. పల్లెల వైపు చూస్తే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఏకధాటిగా 12 గంటలు విద్యుత్తు కోత అంటున్నారు. రాత్రిళ్లు కూడా ఒకటి, రెండు గంటల కంటే ఎక్కువగా ఉండటం లేదు. ఒక ఫ్యాన్, ఒక బల్బ్ ఉన్న వాళ్లకు వైఎస్సార్ ఉచిత విద్యుత్తు ఇచ్చారు. ఇప్పుడు అదే కుటుంబాలకు రూ. వేలల్లో బిల్లు వస్తోంది. అప్పులు తీర్చలేక రైతులు కిడ్నీలు అమ్ముకుంటున్నా ఈ ప్రభుత్వానికి పట్టడంలేదు.

ఇది ప్రభుత్వ పాపమా? ప్రకృతి వైపరీత్యమా?

గడచిన నాలుగేళ్లుగా బొగ్గు ఉత్పత్తికి, దాని డిమాండ్‌కు మధ్య అంతరం పెరిగిన విషయాన్ని ఈ ప్రభుత్వం గమనించి ఉంటే ప్రణాళిక ప్రకారం బొగ్గును దిగుమతి చేసుకునేది. గడచిన 15 ఏళ్ల కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే అందులో పదేళ్లుగా కృష్ణా నది జలాశయం సరిగా నిండకపోవడం వల్ల కరెంటు ఉత్పత్తి సరిగా చేయలేకపోతున్నాం. కనీసం వీటినైనా ప్రభుత్వం గుర్తించి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేకపోయింది. ఉత్తరాదిన, దక్షిణాదిన ఉన్న గ్రిడ్‌ల ద్వారా మనం కరెంటు తెచ్చుకోవాల్సి ఉంది. పాత గ్రిడ్‌లో 1,300 మెగావాట్ల కారిడార్ మాత్రమే ఉంది. స్థాయిని పెంచే కార్యక్రమం 2014లో మాత్రమే పూర్తయ్యే అవకాశముంది. అయినా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఈ ప్రభుత్వానికి ఎందుకు అనిపించలేదు? రబీ సీజన్‌లోనే కరెంటు ఎక్కువగా అవసరం పడుతుందని, అందుకోసం విద్యుత్తు కొనుగోలు చేయాలని ట్రాన్స్‌కో ప్రభుత్వాన్ని కోరింది. కానీ పాలకులు పట్టించుకోలేదు. గ్రిడ్‌ల నుంచి కర్ణాటక ప్రభుత్వం 800 మెగావాట్లు తీసుకుంది. మన రాష్ట్రానికి కేవలం 230 మెగావాట్ల విద్యుత్తు మాత్రమే తెచ్చుకోగలిగాం. దీన్ని ప్రభుత్వ చేతగాని తనం అనుకోవాలా? ప్రకృతి వైపరీత్యం అనుకోవాలా? కేంద్రం నుంచి ఎంత బొగ్గు, గ్యాస్, విద్యుత్ రావాలో వాటికి ఆ మేర ముందుగా అనుమతులు సాధించకపోవడం రాష్ట్ర ప్రభుత్వం చేసిన మహా అపరాధం కాదా?

ఇది చంద్రబాబు పాలన రెండో భాగం...

ఈ ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం మాదిరిగానే పనిచేస్తోంది. ఆరోజు కూడా రెండు, మూడు గంటల విద్యుత్తే ఇచ్చారు... ఈ రోజు కూడా అంతే ఇస్తున్నారు. విద్యుత్తు చార్జీలు దించాలని బషీర్‌బాగ్ వద్ద ఆందోళనలు చేస్తే.. కాల్పులు జరిపించి రైతుల్ని పొట్టనబెట్టుకున్నారు. పల్లెల్లో 18 గంటలు, 20 గంటలు కరెంటు లేని పరిస్థితి. అంత దుర్మార్గమైన రోజులను ప్రజలు మరచిపోలేరు. చంద్రబాబు అంతటి నీచుడు ముఖ్యమంత్రుల్లో మరొకరు లేరు. ఆయన ఇవాళ పాదయాత్రలు చేస్తూ తాను కూడా ఉచిత విద్యుత్తు ఇస్తానని, రుణమాఫీ చేస్తానని వాగ్దానాలు చేస్తున్నారు. నేను ఒక్క మాట అడుగుతున్నా.. బాబూ తొమ్మిదేళ్ల పరిపాలనలో ఒక్కరోజైనా రుణమాఫీ గురించి ఆలోచన చేశారా? వైఎస్సార్ అవినీతి బయటికి తీస్తే నాలుగింతలు రుణమాఫీ చేయవచ్చని చెప్తున్న చంద్రబాబూ.. వైఎస్సార్ అవినీతిపరుడని నీ గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పగలవా? సబ్సిడీలను ఎత్తివేసి ప్రజల రక్తం పిండుకున్న మనిషి, ప్రభుత్వ ఆసుపత్రుల్లో యూజర్ చార్జీలు వసూలు చేసిన రక్త పిపాసి చంద్రబాబు. ఈ రోజు కృష్ణా నీళ్లు రావడం లేదంటే ఎవరు కారణం.. నువ్వు కాదా? ఆ రోజు ఆల్మట్టి డ్యాం, నారాయణ్‌పూర్ డ్యాం, బాబ్లీ ప్రాజెక్టు.. ఇవన్నీ మీ కళ్ల ముందే పనులు ప్రారంభించి మీ కళ్లముందే పనులు పూర్తి చేశారు కదా..! నీకు గుర్తురావడం లేదా చంద్రబాబూ.. ఇప్పటికైనా మీ ప్రవర్తనలో మార్పు రాదా?

పేదలపైనే పెద్ద భారం...

‘‘ప్రస్తుతం కరెంటు చార్జీల వసూళ్ల కోసం అమల్లో ఉన్న టెలిస్కోపిక్ విధానాన్ని తీసివేసి.. 101 యూనిట్లకు పైన కరెంటు కాల్చిన వారికి 116 శాతం చార్జీలు, 501 యూనిట్లకు పైన కాల్చిన వారికి 37 శాతం చార్జీలు పెంచారు. ఈ లెక్కన ప్రభుత్వం ధనవంతులను వదిలేసి పేదల మీద పన్నుల భారం మోపుతోంది. 300 యూనిట్ల లోపు కరెంటు వినియోగించే వాళ్లకు ఒక్క యూనిట్‌కే రూ. 7 చార్జి పడుతుందట. 200 యూనిట్ల కంటే పైన వినియోగిస్తే రూ. 6.25 పైసలు పడుతుందట. 100 యూనిట్ల కరెంటు కాలిస్తే యూనిట్‌కు రూ. 5.65 పైసలు చార్జి పడుతుందట. ఎందుకు ఇలా పేద ప్రజలపై భారం మోపుతున్నారని ప్రభుత్వాన్ని అడిగితే.. ప్రాజెక్టుల్లో నీళ్లు లేవు.. గ్యాస్ లేదు.. బొగ్గు లేదని చెప్పి చేతులు దులుపుకుంటోంది. ఎండ పెరిగే కొద్దీ విద్యుత్తు వినియోగం పెరుగుతుంది, ఉత్పత్తి తగ్గిపోతుందని ఈ ప్రభుత్వానికి తెలియదా? వైఎస్సార్ ఉన్నప్పుడు ఏ ప్రాజెక్టు నుంచి ఎంత విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది? ఈ రోజుకు ఎంత వినియోగం అవుతుంది? అనే విషయాలు ప్రతి రోజూ పర్యవేక్షించేవారు. ఆ పని ఈ రోజు ఈ ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతోంది?’’ 
-వైఎస్ విజయమ్మ
Share this article :

0 comments: