విద్యుత్ కోతలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ శ్రేణుల ఆందోళన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » విద్యుత్ కోతలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ శ్రేణుల ఆందోళన

విద్యుత్ కోతలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ శ్రేణుల ఆందోళన

Written By news on Tuesday, March 5, 2013 | 3/05/2013

అనంతలో కదంతొక్కిన కార్యకర్తలు
తిరుపతిలో సబ్‌స్టేషన్ ఎదుట ధర్నా
కడపలో కలెక్టరేట్ ఎదుట ఆందోళన
కర్నూలులో కాగడాల ప్రదర్శన

సాక్షి నెట్‌వర్క్: కరెంటు కోతలపై ప్రజలు కన్నెర్ర చేశారు. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా సోమవారం ఆందోళనలు నిర్వహించారు. కలెక్టరేట్లు, విద్యుత్ సబ్‌స్టేషన్ల ఎదుట ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టారు. అనంతపురం జిల్లా కలెక్టరేట్ ఎదుట జరిగిన ధర్నాలో పార్టీ నేతలు మాట్లాడుతూ మహానేత వైఎస్సార్ అమలుచేసిన విధానాలను అమలుచేసిన గుజరాత్ అన్ని రంగాల్లో ముందంజలో ఉండగా, వాటిని రాష్ట్ర ప్రభుత్వం తుంగలో తొక్కడంతో అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. కరెంటు కోతల వల్ల కొన్ని పరిశ్రమలు మూతపడిపోగా, మరికొన్ని నష్టాల బాటన నడుస్తున్నాయన్నారు. వేలాదిమంది కార్మికులు ఉపాధి కోల్పోయి బతుకులు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ మాలగుండ్ల శంకరనారాయణ, సీఈసీ, సీజీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో పార్టీ జిల్లా కన్వీనర్ కె.నారాయణ స్వామి ఆధ్వర్యంలో బుచ్చినాయుడు కండ్రిగ విద్యుత్ సబ్ స్టేషన్‌ను ముట్టడించారు. చిత్తూరు రూరల్ మండలం బి నరసింగరాయనిపేట వద్ద ఏఎస్ మనోహర్ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళన సందర్భంగా పార్టీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. 

చంద్రగిరి క్లాక్‌టవర్ వద్ద చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో నిర్వహించారు. శ్రీకాళహస్తి మండలం తొండమనాడు, బంగారుపాళెం, పూతలపట్టు, నగరి, నిండ్ర, కార్వేటినగరంతోపాటు పలు ప్రాంతాల్లో సబ్‌స్టేషన్ల వద్ద ఆందోళన చేశారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, అసమర్థతపై నిప్పులు చెరిగారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేని కిరణ్‌కు సీఎం పదవిలో కొనసాగే అర్హత కోల్పోయారన్నారు. తక్షణమే పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ చేశారు. కడప జిల్లాలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మేయర్ పి.రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ విద్యుత్ కోతల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. 

గతంలో ఎండాకాలంలో కోతలు ఉండడం అందరూ చూశారని, వర్షాకాలం, చలికాలంలో కూడా కరెంటు కోతలు విధించిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కిందన్నారు. పరిశ్రమలకు నాలుగు రోజులు పవర్ హాలీడే ప్రకటించారని, దీనివల్ల పరిశ్రమల యజమానులు, బ్యాంకులకు రుణాలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎవరికీ ఉపయోగపడని ఈ ప్రభుత్వాన్ని, ఒకే నిమిషంలో పడగొట్టగల సంఖ్యాబలం ఉన్నప్పటికీ చంద్రబాబు ఆ పని చేయకుండా మీకోసం అంటూ ప్రజలకు మాయమాటలు చెబుతూ తిరుగుతున్నారని విరుచుకుపడ్డారు. కాగా, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడే ఈ ప్రజా కంటక ప్రభుత్వాన్ని నెత్తిన పెట్టుకుని కాపాడుతున్నారని పార్టీ జిల్లా కన్వీనర్ కె.సురేష్‌బాబు విమర్శించారు. కర్నూలు జిల్లాలో కలెక్టరేట్ ఎదుట ఉన్న గాంధీ విగ్రహం వద్ద కాగడాల ప్రదర్శనతోపాటు రాస్తారోకో నిర్వహించారు. అనంతరం సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి, కేంద్ర పాలక మండలి సభ్యుడు మూలింటి మారెప్ప, ఎస్వీ మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత పాల్గొన్నారు.
Share this article :

0 comments: