బుద్ధి ‘భూమి’ లోనే ! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బుద్ధి ‘భూమి’ లోనే !

బుద్ధి ‘భూమి’ లోనే !

Written By news on Thursday, March 7, 2013 | 3/07/2013

* విశాఖ స్థలం వ్యవహారంలో కోర్టుకు తప్పుడు పత్రాలు
* జోనల్ డెవలప్‌మెంట్ ప్లాన్‌లో మార్పులు చేసి సమర్పణ
* దాన్ని నిజ పత్రంగా పేర్కొంటూ కోర్టుకు అందజేసిన రామోజీ
* ఒరిజినల్ ప్లాన్‌తో పోలిస్తే దాన్లో ఫోర్జరీ జరిగిందని స్పష్టమవుతోందన్న పిటిషనర్... ఆధారాలతో సహా కోర్టుకు సమర్పణ
* ప్రాథమిక సాక్ష్యాధారాలున్నాయని అభిప్రాయపడ్డ న్యాయస్థానం
* కుట్ర, ఫోర్జరీ కేసు నమోదు చేయాలంటూ పోలీసులకు ఆదేశాలు
* మే 6లోగా నివేదిక సమర్పించాలని సూచన 

నిత్యం నీతులు చెప్పే రాజగురివింద రామోజీరావు మరో నేరానికి పాల్పడ్డారు. విశాఖలో లీజు స్థలానికి సంబంధించి ఆయన ఫోర్జరీకి పాల్పడినట్లు కేసు నమోదయింది. ఈ కేసుకు సంబంధించి తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయని అభిప్రాయపడిన న్యాయస్థానం... ఆయనపైన, నలుగురు అధికారులపైన ఫోర్జరీ, కుట్ర తదితర కేసులు నమోదు చేయాల్సిందిగా విశాఖపట్నంలోని త్రీటౌన్ పోలీసులను ఆదేశించింది. అంతేకాక మే నెల 6లోగా నివేదిక అందజేయాలని సూచించింది. విశాఖలోని 4వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ న్యాయమూర్తి ఎన్.శ్రీనివాసరావు ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు. 

విశాఖలో లీజుకు తీసుకున్న ఓ స్థలాన్ని గడువు ముగిసినా తిరిగి యజమానులకు అప్పగించనందుకు రామోజీరావుపై ఇప్పటికే సివిల్ దావా నడుస్తోంది. అయితే దాన్లో కొంత స్థలాన్ని తనదిగా పేర్కొంటూ జిల్లా యంత్రాంగానికి అప్పగించి, బదులుగా ప్రభుత్వం ఇచ్చిన స్థలాన్ని తన పేరిట అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నందుకు క్రిమినల్ కేసును సైతం ఆయన ఎదుర్కొంటున్నారు. ఈ క్రిమినల్ కేసు విచారణలో భాగంగా కోర్టుకు కొన్ని ఫోర్జరీ పత్రాలు సమర్పించారంటూ స్థల యజమాని మంతెన ఆదిత్య వర్మ ఆధారాలు సమర్పించారు. కుట్ర, ఫోర్జరీ, మోసపూరిత చర్యల కింద (ఐపీసీ 120బి, 193, 196, 471, 465, 466 సెక్షన్ల కింద) కేసు నమోదు చేయాలని కోరటంతో న్యాయస్థానం ఆ దిశగా ఆదేశాలు జారీ చేసింది. 

1985లోనే స్థలం అప్పగింత...
1974లో విశాఖలో ఓ స్థలాన్ని మంతెన ఆదిత్యవర్మ నుంచి రామోజీరావు 33 ఏళ్ల లీజుకు తీసుకున్నారు. లీజు గడువు 2007 మార్చి 31న ముగియటంతో రెన్యువల్ చేయాలని రామోజీ కోరగా స్థల యజమాని ఆ రోజే తిరస్కరించారు. అయినా ఖాళీ చేయకపోవటంతో కేసు వేశారు. అయితే 1985లో ఈ స్థలానికి ఉత్తరం వైపున ఉన్న కొంత స్థలాన్ని రోడ్డు విస్తరణ నిమిత్తం ప్రభుత్వం కోరగా తాను అప్పగించానని, అందుకు బదులుగా తనకు అదే స్థలానికి వెనకవైపునున్న స్థలం కేటాయించాలని రామోజీ ఒక లేఖ ద్వారా కోరారు. 

దీనికి స్పందించిన ప్రభుత్వం 1986లో ఆ స్థలాన్ని ఆనుకుని వెనకవైపునున్న భాగాన్ని కేటాయించింది. దాన్ని రామోజీ తన కుమారుడి పేర రిజిస్టర్ చేయించుకున్నారు. లీజు స్థలాన్ని తన సొంతదిగా పేర్కొంటూ ప్రభుత్వానికి అప్పగించటం.. ప్రతిగా ఇచ్చిన స్థలాన్ని తన పేరిట రిజిస్టర్ చేసుకోవటం మోసపూరితం కావటంతో స్థల యజమాని క్రిమినల్ కేసు వేశారు.

కోర్టుకు ఫోర్జరీ పత్రాల సమర్పణ...
రోడ్డు విస్తరణ నిమిత్తం ప్రభుత్వానికి తాను స్థలం అప్పగించానని లిఖితపూర్వకంగా పేర్కొన్న రామోజీ.. దానికి సంబంధించి క్రిమినల్ కేసు దాఖలు కావటంతో దాన్ని తప్పించుకోవటానికి మరో ఎత్తు వేశారు. రోడ్డు కోసం తాను స్థలం అప్పగించటం, ప్రతిగా ప్రభుత్వం స్థలాన్ని తన పేరిట కేటాయించటం వంటివేవీ తనకు తెలియవని చెబుతూ... తాను స్థలం ఇవ్వకముందే ఆ ప్రాంతంలో రోడ్డు ఉందని వాదించటం మొదలుపెట్టారు. అలాంటపుడు తాను ప్రభుత్వానికి స్థలం ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వస్తుందని ఎదురు ప్రశ్నించే ప్రయత్నాలు చేశారు. ఇందుకోసం ఏకంగా విశాఖపట్నం జోనల్ డెవలప్‌మెంట్ ప్లాన్‌నే ఫోర్జరీ చేశారన్నది పిటిషనర్ ఆరోపణ. ‘‘అప్పటికే రోడ్డు ఉన్నట్టుగా విశాఖ జోనల్ డెవలప్‌మెంట్ ప్లాన్‌ను రామోజీ కోర్టుకు అందజేశారు. దాన్లో 1969 నాటికే అక్కడ 40 అడుగుల రోడ్డు ఉన్నట్లుగా స్పష్టంగా రాశారు. ఆ మ్యాప్‌ను అసలు ప్లాన్ తాలూకు నిజపత్రంగా పేర్కొంటూ.. అధికారుల సంతకాలతో సహా సమర్పించారు. కానీ ఒరిజినల్ మ్యాప్‌లో అలాంటిదేమీ లేదు’’ అని పిటిషనర్ తరఫు న్యాయవాదులు వి.వి.రవిప్రసాద్, పి.ఎ.కిషోర్‌లు కోర్టుకు తెలియజేశారు. 

విచారణలో భాగంగా ఒరిజినల్ మ్యాప్‌లను గతంలోనే కోర్టుకు సమర్పించారు. ఫోర్జరీ జరిగినట్టుగా చెబుతున్న మ్యాప్‌లపై సంతకాలు చేసిన అధికారులు సైతం కోర్టుకు హాజరయ్యారు. రామోజీ చెబితేనే తాము అలా రాశామని, ఒరిజినల్ మ్యాప్‌లలో అదేమీ లేదని కూడా కోర్టుకు చెప్పారు. దీన్నిబట్టి ఉద్దేశపూర్వకంగా తప్పుడు పత్రాలు సృష్టించి రామోజీ కోర్టుకు సమర్పించారని, ఫోర్జరీకి పాల్పడ్డారని పిటిషనర్ తరఫు లాయరు వాదించారు. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం... ఫోర్జరీ జరిగిందనటానికి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని, రామోజీపై కేసు నమోదు చేసి మే 6లోగా పూర్తి నివేదిక సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. 

అది 30 అడుగుల రోడ్డే..
నిజానికి రామోజీ 1969లోనే అక్కడ రోడ్డు ఉందంటూ సమర్పించిన డాక్యుమెంట్లో(ఫోర్జరీది?) దాన్ని 40 అడుగుల రోడ్డుగా పేర్కొన్నారు. నిజానికి అక్కడ అప్పటికి రోడ్డే లేదని, పెపైచ్చు 1985 విస్తరణ తరవాత కూడా ఇప్పటికీ అక్కడ ఉన్నది 30 అడుగుల రోడ్డేనని పిటిషనర్ చెబుతున్నారు. ఈ రోడ్డు వెడల్పు ఎంతన్నది బుధవారం ‘సాక్షి’ టీవీ ప్రతినిధి స్వయంగా టేపుతో కొలిచి మరీ లైవ్‌లో చూపించారు. అది 30 అడుగులకు కూడా కొంచెం తక్కువగానే ఉంది. మరి 40 అడుగుల రోడ్డుగా రామోజీ లిఖితపూర్వకంగా ఎందుకు పేర్కొన్నట్టు? నిత్యం హితవచనాలు వల్లిస్తూ... కోట్ల మంది పాఠకులను తన రాతలతో ప్రభావితం చేస్తున్న వ్యక్తి ఇలా కాస్త భూమి కోసం ఇన్ని తప్పులు ఎందుకు చేశారో... తప్పుడు పత్రాలతో కోర్టులను సైతం తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావటం లేదని కేసు గురించి తెలిసిన పలువురు విమర్శిస్తున్నారు.
Share this article :

0 comments: