అల్లర్ల బాధితులకు నేనున్నానంటూ భరోసా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అల్లర్ల బాధితులకు నేనున్నానంటూ భరోసా

అల్లర్ల బాధితులకు నేనున్నానంటూ భరోసా

Written By ysrcongress on Tuesday, April 10, 2012 | 4/10/2012

అల్లర్ల బాధితులకు వైఎస్ జగన్ పరామర్శ
నాలుగు గంటలపాటు సంగారెడ్డిలో విస్తృత పర్యటన
అండగా ఉంటానని బాధితులకు భరోసా..
అడుగడుగునా జన నీరాజనం

అల్లర్ల బాధితులకు నేనున్నానంటూ భరోసా ఇచ్చేందుకు సోమవారం సంగారెడ్డికి విచ్చేసిన వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. సర్వం కోల్పోయి నిరాశా నిస్పృహలకు లోనైన బాధితులు జగన్ ఓదార్పుతో ఊరట చెందారు. ఎంతో ఓపికగా దాదాపు నాలుగు గంటలపాటు పట్టణంలో కలియతిరిగిన ఆయన... ఇక్కడి ప్రజలతో మమేకమై..వారి బాధలను స్వయంగా ఆలకించారు. నేనున్నానంటూ అందర్నీ ఓదార్చారు. బాధితులను వెంటనే ఆదుకోవాలని, ఇలాంటి ‘రాజకీయ దాడులను’ సహించేది లేదంటూ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. అంతకుముందు హైదరాబాద్‌నుంచి బయలుదేరిన జగన్‌కు అడుగడుగునా జనం నీరాజనాలు పలికారు.

సంగారెడ్డి/డివిజన్, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం నాటి సంగారెడ్డి పర్యటన ఆద్యంతం ఆసక్తిగా సాగింది. పట్టణంలో ఇటీవల జరిగిన అల్లర్లలో పలు దుకాణాలు, డబ్బాలు దహనమై వ్యాపారులు తీవ్రంగా నష్టపోగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వారిని పరామర్శించారు. షెడ్యూల్ ప్రకారం కేవలం గంటపాటు సాగాల్సిన ఆయన పర్యటన నాలుగు గంటలకు పైగా కొనసాగింది. మండుటెండను సైతం లెక్కచేయని జగన్ కాలినడకన పట్టణంలో కలియదిరిగారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పట్టణ ప్రజలు కూడా ఆయన వెంటే కదిలారు.

ఉదయం 11.45 గంటలకు సంగారెడ్డి చేరుకున్న ఆయన సాయంత్రం 4 గంటల వర కు బాధితులను ఏకధాటిగా పరామర్శించారు. మీది బజార్‌లోని వీరహనుమాన్ మందిర్ నుంచి పాతబస్టాండు మీదుగా గంజ్‌మైదాన్ వద్ద ఉన్న నుమానియా మజీద్ వరకు, అక్కడి నుంచి నాల్సాబ్‌గడ్డ మీదుగా మదీనా చౌరస్తా వరకు నాలుగు గంటలపాటు కాలినడకనే వెళ్లి దహనమైన ప్రతి దుకాణాన్ని సందర్శించారు. బాధితులతో ముఖాముఖిగా మాట్లాడారు. ‘మియా ఆప్‌కా నామ్ క్యాహై...యే కైసా హువా.. ఆప్‌కో నుఖ్‌సాన్ కిత్‌నా హువా..’అంటూ జగన్‌మోహన్‌రెడ్డి ఉర్దూలో బాధితులను పరామర్శించారు. సగం తెరుచుకున్న షెటర్ల కింద నుంచి దహనమైన దుకాణాల్లోకి ప్రవేశించిన జగన్.. జరిగిన నష్టాన్ని చూసి ఆవేదన వ్యక్తం చేశారు. దుమ్ము.. కాలిన ధూళి ఎగిసి పడుతున్నా ప్రతి దుకాణంలోనూ ఆయన బాధితులతో పదిహేను నుంచి 30 నిమిషాలపాటు మాట్లాడారు. ‘సార్ మీరే మాకు దిక్కు, సాయం చేయండి’ అంటూ బాధితులను జగన్ ఎదుట తమ గోడును వెల్లబోసుకున్నారు. తమను ఆదుకుంటామని చెప్పిన ప్రభుత్వం ఇంతవరకు పూర్తి స్థాయిలో పరిహారం ఇవ్వలేదని వారు వాపోయారు. ‘మంత్రులు సైతం మా గోడును పూర్తిగా వినలేదు’ అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 

ధైర్యాన్ని నింపిన పరామర్శలు..
‘మీరు అధైర్య పడకండి... మీకు న్యాయం జరిగేలా నేను చూస్తానంటూ’ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇవ్వడంతో బాధితులకు ఎక్కడలేని ధైర్యం వచ్చినట్టయింది. ఆయా దుకాణాల యజమానులతో మాట్లాడారు. ఆప్యాయంగా పలుకరించి పూర్తి వివరాలు తెలుసుకొని ప్రభుత్వం తరఫున న్యాయం జరిగేలా చూస్తానని భరోసా ఇచ్చారు. ‘వైఎస్సార్ సీపీ’ మీకు అండగా ఉంటుంద’ని హామీ ఇచ్చారు. బాధితులను పరామర్శించిన విధానంలోనూ పట్టణ వాసులు సంతృప్తిని వ్యక్తం చేశారు. అల్లర్లు జరిగిన తర్వాత అధికార, విపక్ష నేతలు ఎంతమంది వచ్చినా, జగన్‌లా పరామర్శించలేదని స్థానికులు మనసులోని మాటను బయటపెట్టారు. జగన్ ఓదార్పు మాటలు తమలో మనోధైర్యాన్ని నింపాయని బాధితులు ఆనందం వ్యక్తం చేశారు. కాలి బూడిదైన షాపుల్లోకి అడుగుపెట్టేందుకే మంత్రులు, ప్రతిపక్ష నేతలు వెనుకాడగా, జగన్ ఏకంగా కాలిపోయిన ఒక్కో షాపులోకి వెళ్లి పూర్తి స్థాయిలో జరిపిన పరిశీలన కూడా బాధితులకు ఆకట్టుకుంది. సంగారెడ్డికి తొలిసారిగా వచ్చినప్పటికీ జగన్ ఏ ఒక్కచోట కూడా రాజకీయ విమర్శలు చేయలేదు. బాధితులను పరామర్శించేందుకే పూర్తి సమయాన్ని కేటాయించారు. బాధితులకు ప్రభుత్వ చేయూతపై మాత్రమే జగన్ ప్రశ్నించారు.

ఘన స్వాగతం..
సంగారెడ్డికి వచ్చిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలు అడుగడుగునా నీరాజనం పలికారు. మొదట సంగారెడ్డి చౌరస్తా చేరుకున్న వైఎస్ జగన్‌కు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి వాహనంలో బయలుదేరిన జగన్‌కు రహదారి ఇరుపక్కలా రోడ్డు, భవనాలపై ఉన్న ప్రజలకు అభివాదం చేశారు. మంజీర నగర్ చౌరస్తా వద్ద లక్ష్మి, కాంతమ్మ అనే ఇద్దరు మహిళలు జగన్‌కు తిలకం దిద్ది హారతులు పట్టారు. అక్కడి నుంచి పాత బస్టాండు వైపు భారీ ర్యాలీ జగన్ బయలుదేరారు. మార్గమధ్యంలో అడుగడుగునా జగన్‌ను చూసేందుకు జనం ఆసక్తి కనబరిచారు.

స్కూల్ విద్యార్థులు సైతం జగన్‌కు చేయి ఊపు తూ అభివాదం చేశారు. పాతబస్టాండు చేరుకున్న జగన్‌కు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు చుట్టుముట్టారు. జగన్‌ను చూసేందుకు యువకులు పోటీపడ్డారు. పాతబస్టాండు ప్రాం తం రోడ్డుకిరువైపులా ప్రజలతో కిక్కిరిసిపోయింది. పోటెత్తిన జనంతోపాటు, కార్యకర్తలను నియంత్రించేందుకు పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. కాలినడకన నుమానియా మజీద్‌కు బయలుదేరిన జగన్ మార్గమధ్యంలో తనను కలిసిన యువకులు, బస్సులు, వాహనాలపై ఉన్న చిన్నారులు, మహిళలకు షేక్‌హ్యాండ్ ఇచ్చారు. భవనాలపై నిల్చుని తన రాకకోసం ఎదురు చూస్తున్న మహిళలకు జగన్ చేతులు ఊపుతూ అభివాదం చేశారు. నాల్సాబ్‌గడ్డ వద్ద బాధితులను పరామర్శించిన అనంతరం తన వద్దకు వచ్చిన మహిళలను ఆశీర్వదించటంతోపాటు చిన్నారులను షేక్ హ్యాండ్ ఇచ్చి సంతోషపరిచారు. 


నాల్సాబ్‌గడ్డలో ఓ చిన్నబాబు ‘జై జగన్, కాబోయే సీఎం జగన్’ అంటూ నినాదాలు చేస్తూ అందరి దృష్టి ఆకర్శించాడు. జగన్‌మోహన్‌రెడ్డి పలుకరించి కరచాలనం చేయటంతో సంతోష్ అనే చిన్నారి పట్టలేని సంతోషంలో మునిగిపోయాడు. పర్యటన సందర్భంగా ఓఎస్డీ కోటిరెడ్డి నేతృత్వంలో డీఎస్పీ వెంకటేశ్, సీఐ హరిశ్చంద్రారెడ్డి బందోబస్తును పర్యవేక్షించారు. పర్యటన ఆద్యంతం జగన్‌పై నిఘా వర్గాలు డేగ కన్నేశాయి
Share this article :

0 comments: