వైఎస్సార్ సీపీలోకి కూర జయపాల్‌రెడ్డి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్ సీపీలోకి కూర జయపాల్‌రెడ్డి

వైఎస్సార్ సీపీలోకి కూర జయపాల్‌రెడ్డి

Written By ysrcongress on Tuesday, April 10, 2012 | 4/10/2012

సిద్దిపేట నుంచి భారీ కాన్వాయ్‌తో హైదరాబాద్‌కు
పార్టీ తీర్థం పుచ్చుకోనున్న వెయ్యి మంది అనుచరులు
మరో ముగ్గురు ముఖ్యనేతల చేరికపై గోప్యత
అదే బాటలో మాజీ కౌన్సిలర్లు!

సిద్దిపేట, న్యూస్‌లైన్: మాజీ జడ్పీ వైస్ చైర్మన్, సిద్దిపేట నియోజకవర్గం టీఆర్‌ఎస్ నాయకుడు కూర జయపాల్‌రెడ్డి వైఎస్సార్ సీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. మంగళవారం వెయ్యి మంది అనుచరులు, భారీ కాన్వాయ్‌తో హైదరాబాద్‌కు బయల్దేరి వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. జయపాల్‌రెడ్డి మూడు దశాబ్దాలకుపైగా టీడీపీ, టీఆర్‌ఎస్ పార్టీల్లో కీలక పదవులు నిర్వహించారు. హైదరాబాద్‌కు వెళ్లే ముందు సిద్దిపేటలో భారీ వాహనాల ర్యాలీని నిర్వహించి ఉద యం 11 గంటల సమయంలో హైదరాబాద్‌కు తరలివెళ్లడానికి కార్యక్రమాన్ని రూపొందించుకున్నారు. నియోజకవర్గం లోని వివిధ గ్రామాల నుంచి ఆయన అనుచరులు పార్టీలో చేరేందుకు తరలివస్తున్నట్టు సమాచారం. జయపాల్‌రెడ్డితోపాటు నియోజకవర్గానికి చెందిన మరో ముగ్గురు ముఖ్య నాయకులు వైఎస్సార్ సీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే ఎవరెవరు చేరుతున్నారన్న విషయంపై గోప్యత నెలకొంది. వారి పేర్లను ముందే వెలువరిస్తే చేరికలను అడ్డుకునే ప్రయత్నం చేస్తారని గోప్యంగా ఉంచినట్టు సమాచారం.

రాజకీయ ప్రస్థానం..
చిన్నకోడూరు మండలం గోనెపల్లికి చెందిన జయపాల్‌రెడ్డి 1982 నుంచి 1985 వరకు గ్రామ సర్పంచ్‌గా పని చేశారు. అనంతరం చిన్నకోడూరు ఎంపీపీగా ఎన్నికయ్యారు. 1985 నుంచి 1990 వరకు జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. కేసీఆర్ ముఖ్య అనుచరుడిగా కొనసాగిన కూర జయపాల్‌రెడ్డి టీడీపీతోపాటు టీఆర్‌ఎస్‌లో వివిధ పదవులుచేపట్టారు. టీఆర్‌ఎస్ రాష్ట్ర ఉపాధ్య క్షుడిగా, సిద్దిపేట నియోజకవర్గ ఇన్‌చార్జిగా కూడా జయపాల్‌రెడ్డి పనిచేశారు. 

దశలవారీగా వైఎస్సార్ సీపీలోకి..
నియోజకవర్గంలోని వివిధ పార్టీల నుం చి వైఎస్సార్‌సీపీలోకి వలసలు ప్రారంభమయ్యాయి. వీరంతా దశలవారీగా చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. టీఆర్‌ఎస్‌లోని ద్వితీయ శ్రేణి నాయకు లు వైఎస్సార్ సీపీపైపు చూస్తున్నారు. సిద్దిపేట మున్సిపాలిటీకి చెందిన మాజీ కౌన్సిలర్లు కొందరు జగన్ నాయకత్వం లో పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్నట్టు తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికల నాటికి నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరింత బలం పుంజుకోగలదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Share this article :

0 comments: