రాజీనామా లేఖ ‘రాయించిందెవరు’? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాజీనామా లేఖ ‘రాయించిందెవరు’?

రాజీనామా లేఖ ‘రాయించిందెవరు’?

Written By news on Friday, May 25, 2012 | 5/25/2012

మోపిదేవిని మధ్యాహ్నం 12.30కు అరెస్టు చేసిన సీబీఐ
ఆ తర్వాత మంత్రిని కలిసిన ఉండవల్లి, గిడుగు రుద్రరాజు
దిల్‌కుశలోని 10వ నంబర్ గదిలో గంట పాటు మంతనాలు
ముందే సిద్ధం చేసిన రాజీనామా లేఖపై మోపిదేవి సంతకం!
అరెస్టు అనంతరం కాంగ్రెస్ నేతలు భేటీ అవడంపై అనుమానాలు

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఎక్సైజ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ రాశారంటూ ప్రభుత్వ పెద్దలు విడుదల చేసిన ఆయన రాజీనామా లేఖపై సర్వత్రా అనుమానాలే వ్యక్తమవుతున్నాయి. సీఎం కిరణ్‌కు మంత్రి పంపారంటున్న ఆ లేఖ తయారీ వెనక పెద్ద కుట్రే జరిగిందని, మోపిదేవి భుజాల మీదుగా దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డిపై, ఆయన తనయుడు జగన్‌మోహన్‌రెడ్డిపై ఆరోపణలు సంధించే, అనుమానాలు రేకెత్తించేలా దాన్ని వ్యూహాత్మకంగా రూపొందించారని తెలుస్తోంది. ఆ మేరకు కాంగ్రెస్ నేతలు సదరు లేఖను ముందుగానే ‘పక్కాగా’ తయారు చేయించారంటున్నారు. మోపిదేవి విచారణకు సంబంధించి గురువారం ఉదయం నుంచీ జరిగిన పరిణామాలు, కాంగ్రెస్ పెద్దల డెరైక్షన్లో నడిచిన హైడ్రామా కూడా ఈ అనుమానాలను మరింతగా బలపరుస్తున్నాయి.

మోపిదేవిని విచారణ కోసం గురువారం దిల్‌కుశ అతిథి గృహానికి పిలిపించిన సీబీఐ, ఆయనను అరెస్టు చేసినట్టు మధ్యాహ్నం 12.30కు ప్రకటించింది. అప్పటిదాకా మంత్రి తన రాజీనామాపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. మంత్రి హోదాలోనే ఆయనను అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో ఆయనతో రాజీనామా ‘చేయించేందుకు’ తెర వెనుక భారీ తతంగమే సాగింది. మోపిదేవి అరెస్టును అధికారికంగా ప్రకటించాక, మధ్యాహ్నం మూడు గంటలప్పుడు కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు దిల్‌కుశకు చేరుకున్నారు. మంత్రి స్నేహితుడు రాజేంద్రప్రసాద్ కూడా వారి వెంట ఉన్నారు. సరిగ్గా వారు వచ్చే ముం దే సీబీఐ జాయింట్ డెరైక్టర్ లక్ష్మీనారాయణ దిల్‌కుశ నుంచి బయటికెళ్లారు! తర్వాత పై ముగ్గురూ 10వ నంబర్ గదిలోకి మోపిదేవిని పిలుచుకుని, దాదాపు గంట పాటు చర్చలు జరిపారు! తర్వాత అంతా కలిసి గది బయటికొచ్చారు. వెం టనే రాజేంద్ర ప్రసాద్ ఫైల్లోంచి రాజీనామా లేఖ తీశారు. ఉండవల్లి, గిడుగుల సమక్షంలోనే దానిపై మంత్రి సంతకాలు చేశారు. తర్వాత మోపిదేవిని సీబీఐ అధికారులు తీసుకెళ్లారు. కాసేపటికే ఉండవల్లి, గిడుగు, రాజేంద్రప్రసాద్ మీడియాతో మాట్లాడేందుకు నిరాకరిస్తూ ఒకే కారులో వెళ్లిపోయారు. నిజానికి సీబీఐ అరెస్టు చేసినట్టు ప్రకటించాక, వారి అదుపులో ఉన్న వ్యక్తిని బయటి వారెవరూ కలవడానికి అసలే వీల్లేదు.

దిల్‌కుశలో కొంత భాగాన్నే సీబీఐ వాడుకుంటోంది. మిగతాది వీఐపీల కోసం ఖాళీగా ఉంది. కానీ సీబీఐ విచారణ మొదలైనప్పటి నుంచీ వీఐపీలెవరూ దిల్‌కుశకు రావడం లేదు. ఉండవల్లి తదితరులు సీబీఐ పరిధిలో లేని గదిలోనే కూర్చున్నా, ఏకంగా సీబీఐ అదుపులో ఉన్న మోపిదేవినే అందులోకి పిలిపించుకున్నారు! అత్యంత రహస్యంగా విచారణ సాగించే ప్రాంతానికి కోర్టు అనుమతి వంటివేమీ లేకుండానే సీబీఐ కూడా అందుకు ‘అనుమతించింది’! పైగా ఈ తతంగమంతా బాహాటంగా, బయట దూరంగా వేచి ఉన్న మీడియా చూస్తుండగానే జరిగింది!!
రాజీనామా కోసం ఒత్తిళ్లు: దళిత వర్గానికి చెందిన శంకర్రావును మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసి అప్రతిష్ట పాలయ్యానని భావిస్తున్న కిరణ్, తాజాగా వెనుకబడిన తరగతులకు చెందిన మోపిదేవిని కూడా బర్తరఫ్ చేస్తే పార్టీలోనూ, బయటా తీవ్ర వ్యతిరేకత తప్పదని భయపడ్డట్టు సమాచారం. 

అందుకే ఆయనతోనే రాజీనామా చేయించేందుకు బుధవారం నుంచే తీవ్ర ప్రయత్నాలు చేశారు. రాజీనామా ఇవ్వాలని కిరణ్ స్వయంగా కోరగా, ఏ తప్పూ చేయనప్పుడు ఎందుకు చేయాలంటూ మోపిదేవి తీవ్రంగా స్పందించారు. దాంతోరకరకాల ప్రయోగాలకు తెర లేచింది. ఒక సందర్భంలో మోపిదేవికి బెదిరింపులు కూడా వచ్చినట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మద్యం సిండికేట్ల వ్యవహారాన్నీ ప్రస్తావించారంటున్నారు. అయినా రాజీనామాకు మోపిదేవి అంగీకరించలేదు. నిజానికి ఆయనను బుధవారమే అరెస్టు చేయాలని సీబీఐ భావించినా, కేవలం రాజీనామా లేఖ కోసమే గురువారానికి వాయిదా వేసుకుందని సమాచారం. కానీ ఆ విషయం ఎటూ తేలకపోవడంతో ఒక దశలో మోపిదేవిని బర్తరఫ్ చేయాలని కూడా పెద్దలు యోచించినట్టు తెలిసింది. కానీ అనంతర వ్యూహాల్లో భాగంగా ఉండవల్లి బృందం దిల్‌కుశకు వచ్చి, చర్చోపచర్చలు, భవిష్యత్తుపై విశ్లేషణల వంటివాటితో రాజీనామాకు మంత్రిని ఒప్పించారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. రాజీనామా ప్రసక్తే లేదని గురువారం మధ్యాహ్నం దాకా కరాఖండిగా చెప్పిన మోపిదేవి, ఉండవల్లి బృందంతో భేటీ అయిన వెంటనే తెలుగులో టైపు చేసిన రెండు పేజీల రాజీనామా పత్రాన్ని సీఎంకు పంపడం గమనార్హం! దాన్ని రాజేంద్రప్రసాద్ నేరుగా క్యాంపు కార్యాలయానికి వెళ్లి సీఎంకు ఇచ్చారు. మొత్తానికి ఉండవల్లి రాయబారం ఫలించిందని దీనిపై ఒక మంత్రి వ్యాఖ్యానించారు.

అంతా హైకమాండ్ డెరైక్షన్లోనే: మోపిదేవి రాజీనామా లేఖ తయారీ ఆద్యంతం కాంగ్రెస్ అధిష్టానం కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంలోనే సాగింది. సీఎం, బొత్సలతో తమ చర్చలను, ఢిల్లీ ఆదే శాలను ఉండవల్లి బృందం మోపిదేవికి తెలియజేసింది. పెద్దలు చెప్పినట్టుగా రాజీనామా చేస్తేనే మంచిదని హితవు పలికింది. లేఖలోని అంశాలు, వాటి ఉద్దేశాలను కూడా వివరించాక తాము తెచ్చిన కొన్ని పత్రాలపై మంత్రితో సంతకం చేయించారని తెలుస్తోంది.

నన్నెందుకు బలిచేస్తారు: నిజానికి రాజీనామా లేఖ సీఎంకు ముందే అంది ఉంటే, ఆ విషయాన్ని, అందులోని అంశాలను గురించి ఉదయం నుంచే ఓ వర్గం మీడియాకు లీకులు, ప్రసారాలు జోరుగా సాగేవి. కానీ ఆయన రాజీనామా చేసిన విషయం మధ్యాహ్నం దాకా తెర పైకే రాలేదు. బుధవారం రాత్రి దాకా సీబీఐ తనను విచారించడంతో తీవ్రంగా కలత చెందిన మోపిదేవి, నేరుగా సీఎంను కలిసి గంట పాటు వాగ్వాదానికి దిగారు. కిరణ్‌పై తీవ్ర అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ‘‘బీసీని గనుకనే తనను సీబీఐ కేసులో ఇరికించి ఇబ్బంది పెట్టజూస్తున్నారు. మత్స్య కార కుటుంబం నుంచి వచ్చిన తనకు ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ లేదనే ధీమాతోనే బలి పశువును చేస్తున్నారు. మద్యం సిండికేట్ల వ్యవహారంలోనూ నన్నే బలిపశువును చేయజూశారు. ఇప్పుడిలా వేధిస్తున్నారు. మీ రాజకీయ స్వార్థంకోసం మా జీవితాలతో ఆటలాడుకుంటారా? ఇది సబబా?’’ అంటూ నిలదీశారు. 

అయినా కూడా ముందుగా రాజీనామా చేస్తేనే మేలని కిరణ్ సలహా ఇవ్వగా మోపిదేవి ససేమిరా అన్నారు. తర్వాత తనను ఫోన్లో సంప్రదించిన కొందరు పార్టీ నేతలు, జర్నలిస్టులతో ఆయనే ఈ విషయం స్వయంగా చెప్పారు. కిరణ్ తీరును ఎండగట్టారు. బొత్సతో బుధవారం అర్ధరాత్రి దాకా చర్చించారు. తరవాత ఆయన సీఎంను కలవనేలేదు. గురువారం ఉదయం క్యాంపు కార్యాలయంలో కిరణ్‌తో బొత్స భేటీ అయ్యారు. ఉండవల్లి తదితరులు కూడా అక్కడికి వెళ్లారు. అప్పుడే రాజీనామా లేఖ కుట్రకు తెర లేచిందంటున్నారు. కిరణ్, బొత్స అక్కడినుంచే ఏఐసీసీ పెద్దలతో ఫోన్లో మాట్లాడా రు. అప్పటికే మోపిదేవి దిల్‌కుశలో విచారణకు హాజరయ్యారు. అప్పటిదాకా ప్రచారంలో కూడా లేని రాజీనామా లేఖ వ్యవహారం ఒక్కసారిగా బయటికొచ్చింది.

లేఖలోనూ కుట్రే: మోపిదేవిని బర్తరఫ్ చేయకుండా రాజీనామా లేఖ రాబట్టుకోవ డం ద్వారా మరో లక్ష్యాన్ని కూడా కిరణ్ ఆశించారన్న వాదన కూడా కాంగ్రెస్‌లో విని పిస్తోంది. వైఎస్ ఆదేశాల మేరకే సంబంధిత ఫైళ్లపై సంతకాలు చేశానని మోపిదేవితో చెప్పించడమే ఆయన లక్ష్యమంటున్నారు. అలాగని రాజీనామా లేఖలోనే రాస్తే, కేసు నుంచి బయట పడేందుకు వీలుంటుందని నచ్చజెప్పి ఒప్పించారంటున్నారు.
Share this article :

0 comments: