దిల్‌కుశ, లోటస్‌పాండ్‌కు వెళ్లే రహదారులన్నీ మూసివేత - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » దిల్‌కుశ, లోటస్‌పాండ్‌కు వెళ్లే రహదారులన్నీ మూసివేత

దిల్‌కుశ, లోటస్‌పాండ్‌కు వెళ్లే రహదారులన్నీ మూసివేత

Written By news on Saturday, May 26, 2012 | 5/26/2012


ఇక్కట్ల పాలైన సామాన్య ప్రజానీకం
మక్తాలో అప్రకటిత కర్ఫ్యూ
ట్రాఫిక్‌ మళ్లించడంతో పిల్లలతోసహా మండుటెండలో ప్రజల అవస్థలు

హైదరాబాద్, న్యూస్‌లైన్: పోలీసుశాఖ అత్యుత్సాహంతో రాష్ట్ర రాజధాని ప్రజలు శుక్రవారం మండుటెండలో నానా అవస్థలు పడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీబీఐ విచారణకు హాజరైన నేపథ్యంలో హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో రోడ్డులో ఉన్న దిల్‌కుశ అతిథిగృహానికి వెళ్లే దారులన్నింటినీ మూసివేశారు. ఖైరతాబాద్ జంక్షన్, సోమాజిగూడ నుంచి రాజభవన్‌రోడ్డుకు వెళ్లే మార్గాలను శుక్రవారం ఉదయం నుంచే పూర్తిగా మూసివేశారు. రోడ్డుకు అడ్డంగా బారికేడ్లు, ఇనుప కంచెలను ఏర్పాటుచేశారు. ఉదయం ఎనిమిది గంటలకే మొత్తం రోడ్లన్నీ దిగ్బంధనం చేయడంతో ఆఫీసులకు వెళ్లేవారు ఆందోళనకు గురయ్యారు. జగన్‌మోహన్‌రెడ్డి నివాసమైన లోటస్‌పాండ్‌కు వెళ్లే దారులనూ తెల్లవారు జామునుంచే పూర్తిగా మూసివేశారు. ఆయా ప్రాంతాల్లో నివాసం ఉండేవారిని సైతం వెళ్లనీయకుండా చెక్‌పోస్టులు పెట్టారు. గుర్తింపు కార్డులున్నవారిని మాత్రమే అనుమతిస్తామని చెప్పడంతో ఆ ప్రాంతంలో నివాసముండేవారు పోలీసులతో పలుచోట్ల వాగ్వివాదానికి దిగారు. దిల్‌కుశ, లోటస్‌పాండ్ ప్రాంతాల్లో భారీస్థాయిలో బారికేడ్లు ఏర్పాటుచేయడమేగాక ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్(ఆర్‌ఏఎఫ్), సాయుధ పారా మిలటరీ బలగాలను మోహరించారు. అంతేగాక ట్రాఫిక్‌ను పూర్తిగా మళ్లించడంతో చంటి పిల్లలతోసహా మండుటెండలో కాలినడకన కిలోమీటర్ల వరకు సామాన్యులు కొందరు నడిచి వెళ్లాల్సి వచ్చింది. విధి నిర్వహణకోసం దిల్‌కుశ అతిథిగృహం వద్దకు వెళ్లే మీడియా ప్రతినిధులకూ ఇబ్బందులు తప్పలేదు. మీడియాకు సంబంధించిన గుర్తింపు కార్డులను చూపినప్పటికీ కొందరు ప్రతినిధులను పోలీసులు ఆ రోడ్డులోకి అనుమతించలేదు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సచివాలయం నుంచి క్యాంపు కార్యాలయానికి వెళ్లే సమయంలో పోలీసులు మరింత హడావుడి సృష్టించారు.


మక్తాలో అప్రకటిత కర్ఫ్యూ!: దిల్‌కుశ అతిథి గృహానికి ఎదురుగా రైల్వే ట్రాక్‌కు అవతలవైపున ఉన్న మక్తా ప్రాంతంలో పోలీసులు అప్రకటిత కర్ఫ్యూ విధించారు. దుకాణాలన్నింటినీ బలవంతంగా మూసివేయించారు. కనీసం టీ హోటళ్లను కూడా తెరవనీయలేదు. నిరంతరం పోలీసు వాహనాలు, సాయుధ పోలీసులతో ఆ ప్రాంతమంతా కర్ఫ్యూ వాతావరణాన్ని తలపించింది. ఆ ప్రాంతానికి చెందిన సాధారణ ప్రజలు తమ రోజువారీ పనుల నిమిత్తం వెళ్లేందుకు కూడా రోడ్డు మీదకు పోలీసులు రానివ్వలేదు. దీంతో ఆ ప్రాంతంలో నివసించేవారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దిల్‌కుశ అతిథి గృహం వద్ద మీడియా ప్రతినిధులు మంచినీళ్లకోసం మక్తా ప్రాంతానికి వెళితే... వారు తిరిగి రోడ్డుమీదకు రాకుండా అడ్డుకున్నారు. పలువురు మీడియా ప్రతినిధులు పోలీస్ కమిషనర్ అనురాగ్‌శర్మతో మాట్లాడిన తరువాత మాత్రమే దిల్‌కుశ వద్దకు వచ్చేందుకు అనుమతించారు.
Share this article :

0 comments: