సునీల్‌రెడ్డికి బెయిల్ ఇవ్వండి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సునీల్‌రెడ్డికి బెయిల్ ఇవ్వండి

సునీల్‌రెడ్డికి బెయిల్ ఇవ్వండి

Written By news on Thursday, May 24, 2012 | 5/24/2012

- సీబీఐ అనుబంధ చార్జిషీట్‌ను కోర్టు తిరస్కరించింది
- సీబీఐ కోర్టులో సుశీల్‌కుమార్ వాదనలు
- నిర్ణయాన్ని 25కు వాయిదా వేసిన కోర్టు

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఎమ్మార్ కేసులో నిందితునిగా ఉన్న సునీల్‌రెడ్డి పాత్రకు సంబంధించి సీబీఐ సమర్పించిన అనుబంధ చార్జిషీట్‌ను కోర్టు తిరస్కరించిన నేపథ్యంలో... సునీల్‌రెడ్డికి బెయిల్ మంజూరు చేయాలని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సుశీల్‌కుమార్ సీబీఐ ప్రత్యేక కోర్టుకు విజ్ఞప్తి చేశారు. బెయిల్ కోసం సునీల్‌రెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి పుల్లయ్య బుధవారం విచారించారు. సునీల్‌రెడ్డిని జనవరి 24న అరెస్టు చేశారని, దాదాపు 120 రోజులుగా ఆయన జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారని సుశీల్‌కుమార్ తెలిపారు.

సునీల్‌రెడ్డికి బెయిల్ రాకుండా అడ్డుకునేందుకు.. ఏప్రిల్ 23కు 90 రోజులు ముగుస్తాయనే ఉద్దేశంతోనే సీబీఐ హడావుడిగా అనుబంధ చార్జిషీట్ దాఖలు చేసిందని చెప్పారు. అయితే అది తప్పుల తడకగా ఉందని గుర్తించిన కోర్టు తిరస్కరించిందని, అందువల్ల 90 రోజుల్లో సీబీఐ చార్జిషీట్ దాఖలు చేయనట్లుగానే భావించాలని నివేదించారు. 90 రోజుల్లో చార్జిషీట్ సమర్పించకపోతే నిందితునికి బెయిల్ మంజూరు చేయవచ్చంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కోర్టుకు సమర్పించారు. ఎమ్మార్ వ్యవహారంపై రాష్ట్ర విజిలెన్స్ విభాగం జరిపిన విచారణలో సునీల్‌రెడ్డి ప్రస్తావన లేదని, హైకోర్టు ఆదేశాలు, ఎఫ్‌ఐఆర్‌లో కూడా ఆయన పేరు లేదని పేర్కొన్నారు. 

అలాగే విల్లాల కొనుగోలుదారులెవరూ సునీల్‌కు డబ్బు ఇచ్చినట్లుగా చెప్పలేదని, స్టైలిష్ హోమ్స్ డెరైక్టర్, ఈ కేసులో సహ నిందితుడు తుమ్మల రంగారావు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా సునీల్‌ను అరెస్టు చేశారని నివేదించారు. ఆధారాలను మాయం చేస్తారని, సాక్షులను బెదిరిస్తారని సీబీఐ ఆరోపిస్తున్నా అందుకు తగ్గ ఆధారాలను చూపడం లేదని తెలిపారు. ఆధారాలను చూపకుండా చేసే ఆరోపణలను కోర్టు పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని సంజయ్‌చంద్ర కేసులో అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసిన విషయాన్ని ప్రస్తావించారు. సునీల్‌రెడ్డికి బెయిల్ మంజూరు చేసేందుకు కోర్టు ఎటువంటి షరతులు విధించినా పాటించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

కాగా దర్యాప్తు పూర్తి చేసి 90 రోజుల్లో చార్జిషీట్ దాఖలు చేశామని, కోర్టు దాన్ని విచారణకు స్వీకరించకపోయినా నిందితులకు బెయిల్ మంజూరు చేయరాదని సీబీఐ తరఫున డిప్యూటీ లీగల్ అడ్వయిజర్ బళ్లా రవీంద్రనాథ్ వాదనలు వినిపించారు. ఈ దశలో సుశీల్‌కుమార్ జోక్యం చేసుకొని ముంబైకి చెందిన ఆరు కంపెనీల నుంచి పెట్టుబడులు వచ్చాయని, పెట్టుబడులన్నీ చట్టబద్దంగానే జరిగాయని తెలిపారు. వీటిని నిరూపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ‘‘చార్జిషీట్‌ను విచారణకు స్వీకరించకపోయినా జ్యుడీషియల్ రిమాండ్ పొడిగించ వచ్చనేందుకు మీ దగ్గరేమైనా అత్యున్నత న్యాయస్థానాల తీర్పులు ఉన్నాయా’’ అని న్యాయమూర్తి సీబీఐ న్యాయవాదిని ప్రశ్నించారు. అవి సమర్పించేందుకు ఒక రోజు గడువు కావాలని ఆయన కోరడంతో న్యాయమూర్తి అనుమతించారు. తన నిర్ణయాన్ని ఈనెల 25కు వాయిదా వేశారు.
Share this article :

0 comments: