ఇప్పుడెందుకు మాట మార్చావు? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఇప్పుడెందుకు మాట మార్చావు?

ఇప్పుడెందుకు మాట మార్చావు?

Written By news on Friday, July 12, 2013 | 7/12/2013

- జగన్ సంపాదన చట్టబద్ధమని చెప్పలేదా... ఇప్పుడెందుకు మాట మార్చావు? 
- ఉండవల్లిపై అంబటి ధ్వజం
- జగన్‌కు వ్యాపార సలహాలిచ్చేందుకు నువ్వు కడప వెళ్లింది నిజంకాదా?
- సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రా ఆస్తులపై చర్చకు సిద్ధమా?
- చంద్రబాబు, రామోజీల గురించి మాట్లాడటానికి ధైర్యం చాల్లేదా?
- వైఎస్‌ను మీ పార్టీ నేతలే నానా మాటలుఅంటుంటే నీ అభిమానం ఏమైంది? 

సాక్షి, హైదరాబాద్: వార్షిక నివేదిక వెల్లడి పేరుతో రాజమండ్రిలో సభ నిర్వహించిన ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిపై బురద జల్లి నమ్మక ద్రోహానికి పాల్పడ్డారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, సీఈసీ సభ్యుడు అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ఢిల్లీ ఏది ఆదేశిస్తే అది మాట్లాడిన ఉండవల్లి తన ప్రసంగంలో ఎక్కువభాగం జగన్‌నే లక్ష్యంగా చేసుకున్నారని తప్పుబట్టారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో అంబటి మాట్లాడుతూ... జగన్ ఆస్తులు చట్టబద్ధమైనవేనని గతంలో టీవీ ఇంటర్వ్యూ లో వెల్లడించిన అరుణ్‌కుమార్ బుధవారం రాజమండ్రిలో జరిగిన సభలో మాత్రం మాటమార్చి ఆయనపై ఆరోపణలు చేశారని మండిపడ్డారు. 

దీనికి సంబంధించి అప్పట్లో టీవీ-9 ఇంటర్వ్యూలో ఏం చెప్పారో, ఇప్పుడు రాజమండ్రి సభలో ఎలా మాట మార్చారో తెలియజేసే వీడియో క్లిప్పింగ్‌లను ప్రదర్శించారు.వీహెచ్, మధుయాష్కీలాంటి వారు జగన్‌ను విమర్శించినా తాము బాధపడలేదని, కానీ వైఎస్ ప్రాపకంతో రాజకీయాల్లో ఎదిగి, రెండుసార్లు పార్లమెంటు సభ్యునిగా ఎన్నికైన ఉండవల్లి అన్యాయంగా, అక్రమంగా జగన్‌ను విమర్శించడం బాధేసిందని చెప్పారు. మంత్రివర్గమంటే ముఖ్యమంత్రేనని, జీవోలపై మంత్రివర్గానికి ఉమ్మడి బాధ్యత లేదని అన్వయించడాన్ని తప్పుబట్టారు. జగన్‌పై ఇప్పుడు బురద జల్లుతున్న ఉండవల్లి వైఎస్ జీవించి ఉన్నప్పుడు ఆయనకు వ్యాపార సలహాలు ఇచ్చేందుకు స్వయంగా కడపకు వెళ్లింది నిజంకాదా? అని ప్రశ్నించారు. జగన్ ఆస్తులపై మాట్లాడుతున్న ఉండవల్లి సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రా ఆస్తులపై చర్చకు సిద్ధమా అని సవాలు విసిరారు. 

చంద్రబాబు, రామోజీలపై మాట్లాడరేం?
రాజకీయాల్లో ఉన్న వారు వ్యాపారాలు చేయకూడదంటున్న ఉండవల్లికి తమ పార్టీ ఎంపీలు చేస్తున్న వ్యాపారాలు గుర్తుకు రావా? అని అంబటి సూటిగా ప్రశ్నించారు. దర్యాప్తు జరుగుతున్న జగన్‌పై మాట్లాడుతున్న ఉండవల్లి, దర్యాప్తులు తప్పించుకుంటున్న చంద్రబాబుపై ఎందుకు మాట్లాడ్డం లేదని ప్రశ్నించారు. జగన్‌పై తీవ్రమైన విమర్శలు చేసి... చంద్రబాబు, మోడీ గురించి చెప్పాలనుకున్నా రైలుకు సమయం అయిపోతుందని ఉండవల్లి తప్పించుకుపోవడాన్ని తప్పుబట్టారు. ‘‘సమయం ఉండి ఉంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విప్ జారీ చేసి మరీ కాపాడినందుకు చంద్రబాబుకు జేజేలు పలికే వారా? లేదంటే చిల్లర వర్తకంలో విదేశీ పెట్టుబడులను అనుమతించే బిల్లుపై రాజ్యసభలో అండగా నిలిచి పరువు కాపాడినందుకు థ్యాంక్స్ చెప్పేవారా? మార్గదర్శి కేసులో మీ ప్రోగ్రెస్ రిపోర్టు ఏమైంది? రామోజీరావు మిమ్మల్ని బెదిరించారా? లేదంటే మీరే వారితో కుమ్మక్కయ్యారా? రామోజీ గురించి మాట్లాడితే మీ నాలుక కోసేస్తామని ఢిల్లీ పెద్దలు మిమ్మల్ని బెదిరించారా?’’ అని నిప్పులు చెరిగారు. వైఎస్ అనే బంగారుబాతును కోసుకు తింటున్నారని వ్యాఖ్యానించిన ఉండవల్లికి వైఎస్‌ను అవమానిస్తున్నది ఎవరో తెలియదా అని ప్రశ్నించారు. వీహెచ్, మధు యాష్కీ, జేడీ శీలం, సర్వే సత్యనారాయణ, హర్షకుమార్‌వంటి వారంతా వైఎస్‌ను నానా మాటలు అంటుంటే మీ అభిమానం ఏమైపోయింది? అని నిలదీశారు.

వైఎస్ మరణంపై రాష్ట్ర ప్రజలకు చాలా అనుమానాలున్నాయని తామంటే సోనియాగాంధీ కారణమని ఆయన అభిప్రాయాన్ని తమపై రుద్దటానికి ప్రయత్నించారని చెప్పారు. సీబీఐ చాలా పవిత్రమైన సంస్థ అని ఎపుడో వైఎస్ చెప్పిన దానిని ఉదహరిస్తున్న ఉండవల్లికి తాజాగా సీబీఐని పంజరంలో చిలుక అని సుప్రీంకోర్టు చెప్పింది వినిపించలేదా అని అంబటి ప్రశ్నించారు. సీఆర్‌పీసీ ప్రకారం ఒక నిందితుడిని 90 రోజుల కన్నా ఎక్కువగా జైల్లో ఉంచడానికి వీల్లేదు కదా? అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్న సీబీఐ వ్యవహారశైలి మీకు తప్పనిపించడంలేదా? అని అంబటి నిలదీశారు.
Share this article :

0 comments: