వచ్చే ఎన్నికల్లో పొత్తులుండవు, అన్ని సీట్లలోనూ పోటీచేస్తాం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వచ్చే ఎన్నికల్లో పొత్తులుండవు, అన్ని సీట్లలోనూ పోటీచేస్తాం

వచ్చే ఎన్నికల్లో పొత్తులుండవు, అన్ని సీట్లలోనూ పోటీచేస్తాం

Written By news on Tuesday, July 9, 2013 | 7/09/2013

 ఎక్కడ చేసేదీ 2 రోజుల్లో ప్రకటన మైసూరారెడ్డి వెల్లడి 
- రీయింబర్స్‌మెంట్‌తో పేదవిద్యార్థులకు పెద్ద చదువులు
- వైఎస్ మరణం తర్వాత పథకానికి తూట్లు పొడుస్తున్నారు
- పథకాన్ని పరిరక్షించుకునేందుకు వైఎస్సార్సీపీ పోరాడుతోంది
- వచ్చే ఎన్నికల్లో పొత్తులుండవు, అన్ని సీట్లలోనూ పోటీచేస్తాం
- విభజనపై కాంగ్రెస్ ప్రతిపాదన ఏమిటో ముందు చెప్పాలి
- వచ్చే ఎన్నికల్లో పొత్తులుండవు, అన్ని సీట్లలోనూ పోటీచేస్తాం

సాక్షి, హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఒక మంచి ఆశయంతో ప్రవేశ పెట్టిన విద్యార్థుల ఫీజుల రీయింబర్స్‌మెంట్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం నీరు గారుస్తున్నందుకు నిరసనగా ఈ నెల 14, 15 తేదీల్లో వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ రెండు రోజుల నిరాహార దీక్షను చేపట్టనున్నారు. పార్టీ తీసుకున్న నిర్ణయం ప్రకారం ఆమె ఈ దీక్షను చేయనున్నారని పార్టీ కేంద్ర పాలక సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి వెల్లడించారు. దీక్ష ఎక్కడ చేసేదీ రెండు రోజుల్లో ప్రకటిస్తామన్నారు. రాష్ట్ర పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు పుత్తా ప్రతాపరెడ్డితో కలిసి ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 

డబ్బుకు పేదవారుండవచ్చు కానీ, చదువుకు పేదరికం అడ్డు కారాదనే ఉద్దేశంతో నిరుపేద విద్యార్థులకు పెద్ద చదువులు చెప్పించాలనే సంక ల్పంతో వైఎస్ ఈ పథకాన్ని ప్రవేశ పెట్టారని మైసూరా చెప్పారు. పేద విద్యార్థులు చదువుకోవడం రాష్ట్రానికి పెట్టుబడిలాంటిదని, ఓ రకంగా ఇది మానవ వనరులను సృష్టించుకోవడమే అవుతుందని వైఎస్ చెప్పేవారని గుర్తుచేశారు. ఈ పథకం వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన ఎంతోమంది విద్యార్థులు పెద్ద చదువులు చదువుకున్నారని తెలిపారు. కానీ వైఎస్ మరణం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తున్న ఈ పథకాన్ని పరిరక్షించుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ చాంపియన్‌లా పోరాడుతోందని చెప్పారు. మళ్లీ ఇప్పుడు విజయమ్మ దీక్షకు పూనుకుంటున్నారని తెలిపారు. 

ఆయా కళాశాలల్లో ఇంజనీరింగ్ తదితర ఉన్నత విద్యా కోర్సులకు రూ.35 వేల నుంచి 1.13 లక్షల మేరకు ఫీజును నిర్ధారించిన రాష్ట్ర ప్రభుత్వం అందులో తామిచ్చేది రూ.35 వేలేనని జీవో జారీ చేయడం ఘోరమైన విషయమని విమర్శించారు. ‘గత ఏడాదితో పోలిస్తే రూ.35వేలకంటే ఎక్కువ ఫీజున్న కాలేజీల సంఖ్య రెట్టింపైంది. ఈ 175 కాలేజీల్లో చేరే పేద విద్యార్థులకు ఎంత ర్యాంకు వచ్చినా అదనపు భారాన్ని మోయాల్సి ఉంటుంది. దీంతోపాటు అనేక కొత్త నిబంధనలు విధించింది. వైఎస్సార్ హయాంలో ఈ పథకం కింద సుమారు 27 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందితే సర్కారు కొత్త ఆంక్షల వల్ల మొత్తం ఫీజు రీయింబర్స్‌మెంట్ చాలా కొద్దిమందికే పరిమితం కానుంది’ అని చెప్పారు. ఇప్పుడు పరిమితులు విధిస్తున్న ప్రభుత్వం ఏదో ఒకరోజు ఈ పథకాన్ని రద్దు చేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పథకాన్ని ప్రారంభించినపుడు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం రూ.60 వేల కోట్లుగా ఉండేదని, ఇపుడది రూ.1.20 లక్షల కోట్లకు పెరిగిందని తెలిపారు. ఇంత ఆదాయం పెరిగిన నేపథ్యంలో పేద విద్యార్థులకు మరింత మేలు చేయాల్సింది పోయి నీరుగార్చే విధంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన చెప్పారు. 

ఎవరితోనూ పొత్తు ఉండదు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమతోనే ఉంటుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ చేసిన ప్రకటనను ప్రస్తావించగా ‘వారిది ఒన్ సైడ్ లవ్ (ఏకపక్షమైన ప్రేమ)’ మాత్రమేనని మైసూరా చెప్పారు. వైఎస్ పథకాలకు తూట్లు పొడుస్తుంటే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి జగన్‌మోహన్‌రెడ్డి కొత్త పార్టీ పెట్టారని, ప్రతిఫలంగా ఆయనను వేధించి కేసులు పెట్టి జైల్లో నిర్బంధించారని గుర్తుచేశారు. ప్రజాదరణ తమ పార్టీకి పెట్టుబడి అని, జగన్‌పై జనానికి అపారమైన ప్రేమాభిమానాలున్నాయి కనుక తాము ఒకరితో పొత్తు గురించి ఆలోచించాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు లేకుండా పోటీ చేస్తామని చెప్పారు.

విభజనపై ఉద్దేశపూర్వకంగానే లీకులు: రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ నిర్దిష్టమైన ప్రతిపాదన ఏమిటో చెప్పకుండా లీకుల పేరుతో వార్తలు రాయించి రాష్ట్ర ప్రజానీకాన్ని గందరగోళంలో పడేస్తోందని మైసూరా ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కాంగ్రెస్ అధిష్టానం విభజనపై రకరకాల వదంతులను పుట్టిస్తోందని, తద్వారా ఇతర పార్టీలకు ఇబ్బందులకు కలిగించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని విమర్శించారు. అందరికీ ఆమోదయోగ్యమైన విధంగా పరిష్కరించాలనేది తమ పార్టీ విధానమని ఆయన చెప్పారు. 

గతంలో వైఎస్సార్‌సీపీ దీక్షలు
- 2011 ఫిబ్రవరి 18 నుంచి 24 వరకు వారం రోజులపాటు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇందిరాపార్క్ వద్ద దీక్ష చేశారు. 
- 2012 జనవరి 4న అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నా నిర్వహించారు. జగన్ ఒంగోలు ధర్నాలో పాల్గొన్నారు.
- 2012 ఆగస్టు 13,14 తేదీల్లో వైఎస్ విజయమ్మ ఏలూరులో దీక్ష చేశారు.
- 2102 సెప్టెంబర్ 6,7 తేదీల్లో ఇందిరాపార్క్ వద్ద విజయమ్మ రెండురోజుల ఫీజు దీక్ష చేశారు.
Share this article :

0 comments: