రెండేళ్లలో కొత్తగా ఒక్క పింఛను కూడా మంజూరు చేయలేదు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రెండేళ్లలో కొత్తగా ఒక్క పింఛను కూడా మంజూరు చేయలేదు

రెండేళ్లలో కొత్తగా ఒక్క పింఛను కూడా మంజూరు చేయలేదు

Written By news on Monday, July 8, 2013 | 7/08/2013


వృద్ధులు, వికలాంగులు, చేనేత కార్మికుల ఆవేదన
చనిపోయిన లబ్ధిదారుల స్థానంలో మంజూరుకూ సర్కారు ససేమిరా
పలుచోట్ల దరఖాస్తులు తీసుకునేందుకు నిరాకరిస్తున్న అధికారులు
రాష్ట్రవ్యాప్తంగా 8.5 లక్షల పెన్షన్లు ఖాళీ


సామాజిక భద్రత పింఛన్లకు అర్హులైనవారు లక్షలాదిమంది ఉన్నా ప్రభుత్వం వారి గోడు విన్పించుకోవడం లేదు. రెండేళ్లలో ఒక్కటంటే ఒక్క పింఛను కూడా కొత్తగా మంజూరు చేయలేదు.

2011 రచ్చబండలో 12 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే 6.5 లక్షల మంది మాత్రమే అర్హులని తేల్చిన ప్రభుత్వం, వారిలో ఒక్కరికి కూడా ఇప్పటివరకు పింఛను ఇవ్వలేదు.

సంతృప్త స్థాయిలో పింఛన్లు మంజూరు చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 71 లక్షల మందికి పైగా ప్రతి నెలా మొదటి తేదీనే వేతనం మాదిరి పెన్షన్ అందుకునేవారు.

లబ్ధిదారులు చనిపోవడంతో 8.5 లక్షల ఖాళీలు ఏర్పడ్డాయి. బాబు హయాంలో మాదిరిగా చనిపోయిన వారి స్థానంలోనైనా పింఛన్లు మంజూరు చేసేందుకు సర్కారు పూనుకోవడం లేదు.

అర్హులైన దరఖాస్తుదారులు కాళ్లరిగేలా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకున్న నాథుడే లేడు.

నేడు జననేత వైఎస్ 64వ జయంతి. జనరంజక పాలనతో ప్రజల హృదయాల్లో శాశ్వతంగా గూడు కట్టుకున్న రాజశేఖరరెడ్డి అర్ధంతరంగా కనుమరుగై అప్పుడే నాలుగేళ్లు కావస్తోంది. కానీ రమారమి ఆరేళ్లకు పైగా ఆయన అందించిన సంక్షేమ పాలన రాష్ట్ర చరిత్రలో ఎప్పటికీ మసకబారని తాజా జ్ఞాపకమే. దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా వైఎస్ ప్రవేశపెట్టిన వినూత్న పథకాలు కూడా అంతే నిత్యనూతనం. ప్రజలందరి అభ్యున్నతే లక్ష్యంగా చిత్తశుద్ధితో వాటిని సమర్థంగా అమలు చేసి చరిత్రలో నిలిచిపోయారాయన. కానీ వైఎస్ అకాల మరణంతో పాటే ఆ పథకాలకూ శాశ్వత గ్రహణం పట్టినట్టు కన్పిస్తోంది. వైఎస్ రాజశేఖరరెడ్డి పథకాలను యథాతథంగా కొనసాగిస్తున్నామంటూ నేటి పాలకులు హోరెత్తిస్తున్న ప్రచారం పూర్తిగా డొల్లేనని ఏ చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడు. ప్రతి పథకమూ గత మూడున్నరేళ్లుగా సర్కారీ ఆంక్షల సంకెళ్లలో చిక్కి శల్యమవుతోంది. ఒక్కో పథకానికీ పథకం ప్రకారం ప్రభుత్వం తూట్లు పొడుస్తూ వస్తోందనేందుకు నేడు రాష్ట్రంలో ఏ ఇంటిని కదిలించినా కోకొల్లలుగా కన్పించే నిదర్శనాలే సాక్షి. వైఎస్ హయాంలో సంక్షేమ ఫలాలను చవిచూసిన చోటే నేటి అస్తవ్యస్త పాలన ఫలితంగా పుట్టుకొచ్చిన సంక్షోభాన్ని పాఠకుల కళ్లకు కట్టేందుకు ‘సాక్షి’ నడుం కట్టింది. నాటి సంక్షేమపు వెలుగులు, నేటి అలక్ష్యపు క్రీనీడలపై రాష్ట్రం నలుమూలల నుంచీ ‘సాక్షి’ నెట్‌వర్క్ సేకరించిన కథనాలను నేటి నుంచి ‘వెలుగు నీడలు’ శీర్షికన వరుసగా అందిస్తున్నాం...


సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది వృద్ధులు, వికలాంగుల ఆవేదన, గోడు చెవులు మొద్దుబారిన రాష్ట్ర ప్రభుత్వానికి విన్పించడం లేదు. నర్సమ్మ, హన్మంతు, యాదగిరి లాంటి ఎందరో పింఛన్ల కోసం కాళ్లరిగేలా ఎమ్మార్వో, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. కనిపించిన వారికల్లా చేతులెత్తి మొక్కుతున్నారు. ఆదుకొమ్మంటూ వేడుకుంటున్నారు. అయినాసరే ఫలితం దక్కడం లేదు. ఎలాంటి ఆసరా లభించడం లేదు. ప్రభుత్వం నుంచి కనీస స్పందన కరువవడంతో అధికారులు సైతం విసిగిపోయారు. రాని పింఛన్లకు ఎందుకులే అనుకుంటున్నారేమో.. చివరకు దరఖాస్తులు తీసుకునేందుకు కూడా నిరాకరిస్తున్నారు. కొత్త పింఛన్ల మంజూరును పట్టించుకోని ప్రభుత్వం కనీసం లబ్ధిదారులు చనిపోవడంతో ఏర్పడిన ఖాళీలు భర్తీ చేసేందుకు కూడా పూనుకోవడం లేదు. దీంతో ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 8.32 లక్షలకు పైగా పెన్షన్ల ఖాళీలు మంజూరుకు నోచుకోకుండా మిగిలిపోయాయి.

వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో సంతృప్త స్థాయిలో పింఛన్లు మంజూరు చేశారు. అంతకుముందు చంద్రబాబునాయుడి పాలనలో అర్హులెవరైనా చనిపోతేనే కొత్తగా మరొకరికి పెన్షన్ మంజూరయ్యే దారుణమైన పరిస్థితి ఉండేది. కానీ వైఎస్ అర్హులందరికీ అడిగిందే తడవుగా పింఛను అందేలా చర్యలు తీసుకున్నారు. అంతేకాదు నామమాత్రంగా ఉన్న పింఛన్ల మొత్తాన్ని వృద్ధులకు రూ.200కు, వికలాంగులకు రూ.500కు పెంచారు. రాష్ట్రవ్యాప్తంగా 71 లక్షల మందికి పైగా పింఛనుదారులు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి నెల నెలా నగదు ప్రయోజనం అందుకునేవారు. ఇప్పుడా పరిస్థితి మారిపోయింది. పింఛనుదారులు చనిపోవడంతో రాష్ట్రంలో 8.32 లక్షలకు పైగా పెన్షన్ల ఖాళీలు ఏర్పడ్డాయి. దాదాపు రెండేళ్ల నుంచి ప్రభుత్వం ఒక్క కొత్త పెన్షన్‌ను కూడా ఇవ్వలేదు. ప్రతినెలా 25 వేల నుంచి 30 వేల మంది వరకు పెన్షన్లు తీసుకునే వృద్ధులు మరణిస్తున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ విధంగా చనిపోయిన వారి స్థానంలో కొత్త పెన్షన్లు మంజూరు చేసే పద్ధతిని చంద్రబాబు హయాంలో పాటించారు. కనీసం ఆ పద్ధతిని కూడా ఈ ప్రభుత్వం పాటించకపోవడం గమనార్హం. లబ్ధిదారులు మరణించినా కూడా కొత్త వారికి అవకాశం ఇవ్వడం లేదు. ఒక్క వృద్ధాప్య పింఛన్లలోనే 7.82 లక్షల ఖాళీలు ఏర్పడ్డాయి. అలాగే 65 వేల వికలాంగుల, 65 వేల కల్లుగీత కార్మికులు, 19 వేల చేనేత కార్మికుల పెన్షన్లు కూడా ఖాళీగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 2011లో నిర్వహించిన రెండో రచ్చబండ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 12 లక్షల మంది వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, చేనేత, కల్లుగీత కార్మికులు పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆరు విడతల వడపోత తరువాత వీరిలో 6.5 లక్షల మంది పెన్షన్లు పొందడానికి అర్హులని అధికారులు తేల్చారు.

కానీ రెండేళ్లవుతున్నా వీరిలో ఒక్కరికి కూడా పింఛను మంజూరు చేయలేదు. రెండో రచ్చబండ కార్యక్రమం తరువాత వచ్చిన దరఖాస్తులను అధికారులు కొన్నిచోట్ల తీసుకున్నా వాటిని చెత్తబుట్టలో వేయడం తప్ప.. ఆ దరఖాస్తులను కనీసం కంప్యూటర్లలో నమోదు చేయడం లేదు. రచ్చబండ సందర్భంగా అర్థం లేని నిబంధనలతో లక్షలాదిమందిని అనర్హులుగా తేల్చారు. మచ్చుకు కొన్ని జిల్లాలను పరిశీలిస్తే.. వరంగల్ జిల్లాలో రెండు విడతల్లో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో సామాజిక భద్రతా పింఛన్ల కోసం మొత్తం 1.31 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 40,405 దరఖాస్తులను మాత్రమే అర్హమైనవిగా తేల్చారు. మహబూబ్‌నగర్ జిల్లాలో నిర్వహించిన రచ్చబండ 2లో 60 వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. అందులో 37,603 మందిని మాత్రమే అర్హులుగా తేల్చారు. వీరంతా ఏడాదిన్నరగా పింఛన్ల కోసం పడిగాపులు కాస్తూనే ఉన్నారు.

నెల్లూరు జిల్లాలో ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేస్తోందని ఏళ్ల తరబడి ఆశగా ఎదురుచూస్తున్న దరఖాస్తుదారులకు నిరాశే మిగిలింది. 2011 అక్టోబర్ నుంచి ఇప్పటివరకు జిల్లాలో పింఛన్లు మంజూరు చేయలేదు. దరఖాస్తుదారులు వేల సంఖ్యలో ఉన్నారు. వైఎస్సార్ హయాంలో జిల్లాలో 2,30,734 మందికి పింఛన్లు మంజూరు చేశారు. ప్రస్తుతం 2,45,737 మందికి పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నప్పటికీ వాస్తవానికి వేల సంఖ్యలో లబ్ధిదారులకు వివిధ కారణాలతో మధ్యలో పింఛన్లు నిలిపివేయడంతో బాధితులు మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇదిలావుండగా 2011, 2012వ సంవత్సరాల్లో జరిగిన రచ్చబండ కార్యక్రమాల్లో పింఛన్ల కోసం 71,371 మంది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 36,115 మందిని అర్హులుగా గుర్తిం చారు. వీరంతా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు.

మంజూరైనా అందడం లేదు!
ఇలావుండగా మంజూరైన పెన్షన్ల సొమ్ము కూడా లబ్ధిదారులకు పూర్తిగా అందడం లేదు. లక్షల సంఖ్యలో లబ్ధిదారులకు పెన్షన్ అందకపోవడంతో ఆ సొమ్ము తిరిగి ఖజనాకు చేరుతోంది. కేంద్ర ప్రభుత్వం 85 సంవత్సరాల వయస్సు దాటిన వృద్ధులకు ప్రతి నెల రూ.500 పెన్షన్ మంజూరు చేస్తోంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.200 మాత్రమే చెల్లిస్తోంది. 200 రూపాయలున్న పెన్షన్లను కనీసం 400 రూపాయలు చేయాలని కేంద్రం ఎన్నిమార్లు చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పెడచెవిన పెడుతోంది. గత మే లెక్కలే తీసుకుంటే.. వృద్ధాప్య పింఛన్లు 35 లక్షల మందికి మంజూరు చేస్తే అందులో సిబ్బంది పెన్షన్ డబ్బులు ఇచ్చింది కేవలం 32.51 లక్షల మందికి మాత్రమే. మే లో మొత్తం ఐదు లక్షల మంది లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ కాకపోవడంతో ఆ నిధులు వెనక్కి వచ్చాయి. అధికారులు సక్రమంగా మంజూరైన పెన్షన్లను కూడా పంపిణీ చేయకపోవడం గమనార్హం.


గిదేం పభుత్వం.. నా భర్త చచ్చిపోయిండు.. నాకిప్పుడు 85 ఏండ్లు.. పింఛన్ కోసం రెండుమూడుసార్లు దరఖాస్తు చేసుకున్నా.. కనిపించిన సార్ల కాళ్లకు దండాలు పెట్టినా.. నాయకుల వద్దకు పోయినా.. ఎవర్ని అడుక్కున్నా పింఛన్ మాత్రం రాలేదు.
-బండారి నర్సమ్మ, బచ్చన్నపేట, వరంగల్ జిల్లా

రాజన్న ఉండగా ఒకటో తారీఖునే పింఛను పైసలు వచ్చేవి. ఎందుకో తెల్వదు. గిప్పుడు రెండు సంవత్సరాలుగా నాకు పింఛను లేదంటున్నారు. నేను వికలాంగుణ్ణి. పెద్ద డాక్టర్లు పరీక్షలు చేసి ఇచ్చిన పట్టా కాగితం కూడా ఉంది. గీ ప్రభుత్వం మాలాంటోళ్లకు అన్నాయం చేత్తాంది.
- మ్యాక యాదగిరి, బచ్చన్నపేట, వరంగల్ జిల్లా

ఉన్నట్టుండి నిలిపేశారు
నెల నెలా క్రమం తప్పకుండా వస్తున్న వృద్ధాప్య పింఛన్‌ను ఉన్నట్టుండి నిలిపేశారు. రెండేళ్లవుతోంది. నాతో పాటు మా గ్రామంలో 30 మందిమి ఇబ్బందులు పడుతున్నాం.
- హన్మంతు, చిన్నమందడి గ్రామం,
మహబూబ్‌నగర్ జిల్లా

కాళ్లరిగేలా తిరుగుతున్నా...
పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుని రెండేళ్లైంది. అధికారులు, ప్రజా ప్రతినిధుల చుట్టూ తిరిగీ తిరిగీ కాళ్లు నొప్పులొచ్చాయే తప్ప పింఛన్ మంజూరు కాలేదు.
- సి.లక్ష్మీనరసయ్య,
చీపినాపి, నెల్లూరు జిల్లా

పింఛన్ కోసం పడిగాపులు
రేషన్ కార్డు, పింఛను కోసం ఎన్నిమార్లు దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేదు. రేషన్ కార్డు లేక అవస్థ పడుతున్నా. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పేద ప్రజలకు భరోసా ఉండేది. ఆయన మరణించడంతో పేదలు ఇబ్బందులు పడుతున్నారు.
- చింతకాయల పెంచలమ్మ, కలువాయి, నెల్లూరు

పట్టించుకోవడం లేదు
నా భర్త మరణించి ఏడేళ్లు దాటింది. పింఛన్ కోసం కాళ్లరిగేలా తిరిగినా ఫలితం లేదు. అధికారులు, ప్రజా ప్రతినిధులకు దరఖాస్తులు చేసుకున్నా పట్టించుకోవడం లేదు.
- సి.మునెమ్మ,
బల్లవోలు, నెల్లూరు
Share this article :

0 comments: