మీ ఓటుతో తీర్పు చెప్పండి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మీ ఓటుతో తీర్పు చెప్పండి

మీ ఓటుతో తీర్పు చెప్పండి

Written By news on Monday, July 8, 2013 | 7/08/2013

మరో ప్రజాప్రస్థానంలో ప్రజలకు షర్మిల పిలుపు 
రానున్న ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్‌లకు బుద్ధి చెప్పండి
మీరు వేసే ప్రతి ఓటూ జగనన్న బయటకు రావడానికి బాటలు వేస్తుంది
జగనన్న సీఎం అయిన తర్వాత పథకాలన్నీ పక్కాగా అమలవుతాయి
వికలాంగులకు వెయ్యి రూపాయల పింఛన్ వస్తుంది
పిల్లలను చదివిస్తే అమ్మ ఖాతాలోకే డబ్బులు పడతాయి
ప్రతి పేద కుటుంబానికి నెలకు 30 కిలోల బియ్యం ఇస్తారు

మరో ప్రజాప్రస్థానం నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయి. మరికొన్ని నెలల్లో సాధారణ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఓటు మీ చేతిలో ఉన్న ఆయుధం. ఆ ఓటు ద్వారానే తీర్పు చెప్పండి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మీరు వేసే ప్రతి ఓటు జగనన్న బయటికి రావడానికి బాటలు వేస్తుంది. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు గట్టిగా బుద్ధి చెప్పి జగనన్నను ఆశీర్వదించిన రోజున, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను మీరు గెలిపించిన రోజున రాజన్న రాజ్యం మళ్లీ వస్తుంది..’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ఉద్ఘాటించారు. ‘‘నాకు వైఎస్సార్ మనసు తెలుసు.. జగనన్న మనసు తెలుసు. వెఎస్సార్‌లాగే జగనన్న కూడా మంచి మనసున్న నాయకుడు. నేను భరోసా ఇస్తున్నా.. జగనన్న త్వరలోనే బయటికి వస్తారు. మీకు అండగా నిలబడతారు’’ అని ప్రజలకు భరోసా ఇచ్చారు. ప్రజాసమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరికి, దానితో అంటకాగుతున్న చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా షర్మిల చేట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ఆదివారం విశాఖపట్నం జిల్లా భీమిలి, పెందుర్తి నియోజకవర్గాల్లో సాగింది.

పాదయాత్ర పొడవునా షర్మిలకు జనం హారతులు పట్టి ఆశీర్వదించారు. సింహాచలం గోశాల సమీపంలో 75 ఏళ్ల పాకన రోజారమణి చేతిలో హారతి పట్టుకొని ఎండలో షర్మిల కోసం ఎదురు చూస్తోంది. షర్మిల రాగానే హారతి ఇచ్చింది. ‘‘అమ్మా...! ఎండలో నడిచావు.. వానలో నడుస్తున్నావు. టీవీల్లో చూస్తున్నాను. నీ యాత్రలో నిజాయితీ ఉందమ్మా.. వృద్ధులకు, చంటి బిడ్డలకు మీరు పెడుతున్న ముద్దుల్లో స్వచ్ఛమైన ప్రేమ కనిపిస్తోంది. నా భర్త నేవీలో రిటైర్డ్ ఆఫీసర్, నా కొడుకు, కూతురు అమెరికాలో ఉంటున్నారు. నాకు రాజకీయాలు, రాజకీయ నేతలు తెలియరమ్మా..! నీ సంకల్పం గొప్పదమ్మా... జనం మీ వెంటే ఉన్నారు. అన్న బయటికి వస్తాడు’’ అంటూ షర్మిలను రోజారమణి ఆశీర్వదించింది. అక్కడ్నుంచి షర్మిల పెందుర్తి నియోజకవర్గంలోని వేపగుంట గ్రామానికి చేరుకున్నారు. వేపగుంటలో సోమినాయుడు అనే చేనేత కార్మికుడు కలిసి తన కష్టాలను చెప్పుకున్నాడు. అందుకు స్పందించిన షర్మిల.. రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత చేనేత సమస్యలు తప్పకుండా పరిష్కరిస్తారని భరోసా ఇచ్చారు. అప్పన్న అనే వికలాంగుడు కలిసి తమ సమస్యలు చెప్పాడు. ‘‘జగనన్న మీ గురించి ప్లీనరీలోనే చెప్పాడు. జగనన్న సీఎం అయిన తర్వాత మీ అందరికీ వడ్డీ లేకుండానే రుణాలు ఇస్తారు. మీ కాళ్ల మీద మీరు నిలబడేలా చేయూతనిస్తారు’’ అని చెప్పారు. విద్యార్థులు, వృద్ధులు, మహిళలతో కూడా షర్మిల మాట్లాడారు. ‘‘జగనన్న సీఎం అయ్యాక ఫీజు రీయింబర్స్‌మెంటు, ఆరోగ్యశ్రీ పథకాలు పక్కాగా అమలవుతాయి.

వృద్ధులకు, వితంతువులకు పింఛను రూ.700 అవుతుంది. వికలాంగులకైతే రూ.1,000 అవుతుంది. అక్కాచెల్లెళ్లు వాళ్ల పిల్లలను చదివించేటట్లు ప్రోత్సహించడం కోసం ఇద్దరు పిల్లలకు పదో తరగతి వరకు ఒక్కొక్కరికి రూ.500 చొప్పున ఏడాదికి రూ.6 వేలు తల్లి అకౌంట్లోనే పడుతుంది. ఇంటర్మీడియెట్ చదివితే రూ.8,400, డిగ్రీ చదివితే రూ.12,000 అమ్మ ఖాతాలోనే పడతాయి. అంతకంటే పెద్ద చదువులు చదివే వారికి ఫీజు రీయింబర్స్‌మెంటు పథకం ఉండనే ఉంది. రాష్ట్రంలో గుడిసె అనేదే లేకుండా నిరుపేదలందరికీ పక్కా ఇల్లు కట్టిస్తారు. వైఎస్సార్ హామీ ఇచ్చినట్టు ప్రతి పేద కుటుంబానికి నెలకు 30 కిలోల బియ్యం ఇస్తారు. ఆ రోజు వచ్చేంత వరకు మీరందరూ జగనన్నను ఆశీర్వదించాలని కోరుతున్నా..’’ అంటూ షర్మిల ముందుకు సాగారు.

16.7 కిలోమీటర్ల నడక..
ఆదివారం మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర విశాఖపట్నం జిల్లా తూర్పు నియోజకవర్గంలోని పైనాపిల్ కాలనీ నుంచి ప్రారంభమైంది. అక్కడ్నుంచి దారపాలెం మీదుగా భీమిలి నియోజకవర్గంలోని అడవివరం చేరుకుంది. తర్వాత సింహాచలం, గోశాల మీదుగా పెందుర్తి నియోజకవర్గంలోని వేపగుంట గ్రామానికి షర్మిల చేరుకున్నారు. ఇక్కడ పెద్దఎత్తున తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి కొద్దిసేపు మాట్లాడారు. అక్కడ్నుంచి సుజాతనగర్, పెందుర్తి జంక్షన్ మీదుగా సరిపల్లి గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి షర్మిల రాత్రి 8.00 గంటలకు చేరుకున్నారు. ఆదివారం మొత్తం 16.7 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటివరకు మొత్తం 2,695.6 కి.మీ. యాత్ర పూర్తైది. షర్మిల వెంట నడిచిన వారిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు వైవీ సుబ్బారెడ్డి, విశాఖ నగర కన్వీనర్, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త వంశీకృష్ణయాదవ్, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ, వివిధ నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు కోరాడ రాజబాబు, తిప్పల నాగిరెడ్డి, కోల గురువులు, జీవీ రవిరాజు, స్థానిక నాయకులు దాడి రత్నాకర్, కొయ్య ప్రసాదరెడ్డి తదితరులు ఉన్నారు. పాదయాత్రలో రోజూ నడుస్తున్న వారిలో తలశిల రఘురాం, వాసిరెడ్డి పద్మ, ఆర్కే, కాపు భారతి, డాక్టర్ హరికృష్ణ తదితరులున్నారు.

నేటి నుంచి విజయనగరంలో...
మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర సోమవారం విజయనగరం జిల్లాలోకి అడుగుపెట్టబోతోంది. పెందుర్తి నియోజకవర్గంలోని సరిపల్లి గ్రామంతో విశాఖ జిల్లాలో షర్మిల పాదయాత్ర పూర్తి అవుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం తెలిపారు. శృంగవరపుకోట నియోజకవర్గంలోని చింతలపాలెం గ్రామం మీదుగా షర్మిల విజయనగరం జిల్లాలోకి ప్రవేశిస్తారని వివరించారు. ఏస్‌కోట, గజపతినగరం, విజయనగరం, నెల్లిమర్ల, చీపురుపల్లి, బొబ్బిలి, పార్వతీపురం, కురుపాం నియోజకవర్గాల్లో 180 కిలోమీటర్ల మేర 13 రోజుల పాటు యాత్ర సాగుతుందని తెలిపారు. ఇప్పటివరకు 12 జిల్లాల్లో షర్మిల పాదయాత్ర కొనసాగింది.

నేడు రక్తదాన శిబిరం 
వైఎస్సార్ జయంతి సందర్భంగా సోమవారం సరిపల్లి శివారులోని షర్మిల బస చేసిన కేంద్రం వద్ద రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు తలశిల రఘురాం తెలిపారు. ఈ శిబిరాన్ని డాక్టర్ హరికృష్ణ పర్యవేక్షిస్తారని చె ప్పారు.

షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’
ఆదివారం యాత్ర ముగిసేనాటికి
రోజులు: 202
కిలోమీటర్లు: 2,695.6
Share this article :

0 comments: