ఆరోగ్యశ్రీకి అంతిమ ఘడియలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆరోగ్యశ్రీకి అంతిమ ఘడియలు

ఆరోగ్యశ్రీకి అంతిమ ఘడియలు

Written By news on Monday, July 8, 2013 | 7/08/2013

లక్షల జీవితాల్లో వెలుగులు పంచిన పథకం చుట్టూ కమ్ముకున్న చీకట్లు

ఆరోగ్యశ్రీ.. ఈ పేరు వింటేనే కొండంత అండ.. దగ్గరే వైద్యుడు ఉన్నాడన్న ధైర్యం.. ఎంత పెద్ద జబ్బు వచ్చినా చికిత్స అందుతుందన్న భరోసా.. ఒక్కమాటలో చెప్పాలంటే ఆ పథకం నిరుపేద, మధ్యతరగతి వర్గాల పెద్ద డాక్టర్! చిన్నారి గుండెకు రంధ్రం పడినా.. అవ్వకు కిడ్నీ పాడైనా.. పెద్దాయనకు కీళ్లు అరిగినా.. కేన్సర్ బారిన పడినా.. యాక్సిడెంట్‌లో ప్రమాదానికి గురైనా.. ఒక్కటేమిటి ఏ రోగమొచ్చినా నేనున్నానని అక్కున చేర్చుకుంది ఆ పథకం!! పైసా ఖర్చు లేకుండానే ప్రాణాలు నిలిపింది. లక్షలు ఖర్చయ్యే ఆపరేషన్లు ఉచితంగా చేసింది. సంపన్నులు మాత్రమే వెళ్లగలిగే కార్పొరేట్ ఆసుపత్రుల్లోకి బీదాబిక్కీలను తీసుకువెళ్లింది. లక్షలాది మందికి కొత్త జీవితాలను ప్రసాదించింది. కానీ ఇదంతా గతం. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణంతో ఆరోగ్యశ్రీకి సంకెళ్లు పడ్డాయి. పేదల ఆశలు ఆంక్షల చట్రంలో బందీ అయిపోయాయి. వైఎస్ తర్వాత వచ్చిన ప్రభుత్వాల అడ్డగోలు నిబంధనలు.. అంతులేని నిర్లక్ష్యంతో ఇప్పుడు ఆ పథకం అంపశయ్యపైకి చేరింది. బడుగుల బాగోగులు పట్టని పాలకులు ఆ పథకం ఊపిరి తీస్తున్నారు. పథకం పరిధిని కుదిస్తూ ఏకంగా 133 రకాల జబ్బులను తొలగించారు. ఈ జబ్బులను ఎలాంటి సదుపాయాలు లేని ప్రభుత్వాసుపత్రుల పరిధిలోకి చేర్చారు. ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకొని కోటి ఆశలతో ఆసుపత్రులకు వెళ్తున్న నిరుపేదలకు నిరాశే ఎదురవుతోంది. ఏవేవో కారణాలను సాకుగా చూపుతూ ఆసుపత్రులు చికిత్సకు నిరాకరిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలంలోని సవరగొయిదిలో ఈ రెండు ఉదాహరణలు నాడు, నేడు ఆరోగ్యశ్రీ పథకం తీరుతెన్నులకు అద్దం పడుతున్నాయి.

గుండె రంధ్రం పూడింది..
ఈ ఫొటోలో ఉన్న బాలిక పేరు స్నేహిత. శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఏజెన్సీలో సవర గొయిది స్వగ్రామం. అత్యంత వెనుకబడిన తెగ అయిన పీటీజీ (ప్రిమిటివ్ ట్రైబ్ గ్రూప్)కి చెందిన కుటుంబం ఈ బాలికది. ఆమె తల్లిదండ్రులు మల్లయ్య, సుమంతిలు కూలీ నాలీ చేసుకుని బతుకుతు న్నారు. కలోగంజో తాగుతూ ఉన్నంత లో హాయిగా బతికేస్తున్న ఈ కుటుంబానికి సుమారు ఆరేళ్ల క్రితం పెద్ద కష్టమే వచ్చింది. చిన్నారి స్నేహిత మూడేళ్ల వయసులో తరచూ గుండెల్లో నొప్పితో బాధపడేది. డాక్టర్లకు చూపిస్తే గుండెలో రంధ్రం పడిందని నిర్ధారించారు. పెద్దాపరేషన్ చేయాలని, చాలా ఖర్చవుతుందని చెప్పారు. దాంతో ఆ కుటుంబం గుండెల్లో రాయి పడింది. అంత డబ్బు లేదు. అప్పు చేసే స్థాయీ లేదు. బిడ్డను బతికించుకోవడమెలాగో అర్థం కాక తల్లిదండ్రులు కుమిలిపోసాగారు. అదే సమయంలో దివంగత మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ ఆ కుటుంబం పాలిట ఆశా కిరణంగా మారింది. అంత పెద్ద కష్టం నుంచి వారిని గట్టెక్కించింది. ఆరోగ్యశ్రీ వైద్య శిబిరంలో పాపను చూపించగా పరీక్షలు చేసి ఆపరేషన్‌కు సిఫారసు చేశారు. 2007లో హైదరాబాద్‌లోని ఇన్నోవా ఆస్పత్రిలో శస్త్ర చికిత్స చేసి, పాపను కాపాడారు. 

వైఎస్ బతికించారు..: ‘‘మా బిడ్డను వైఎస్ బతికించినారు. బిడ్డ ఆరోగ్యంగా ఉందన్నా.. మాము సంతోసంగా ఉన్నామన్నా.. అంతా ఆయన దయే’’ అని స్నేహిత తల్లిదండ్రులు చెప్పుకొంటున్నారు. ‘‘గుండెలో కన్నం పడినాదని, బాగు సేయాలంటే సానా డబ్బులవుతాయని డాకటేర్లు సెప్పినప్పుడు.. ఇక కూతురు మాకు దక్కదనుకున్నాం. డబ్బుల్లేక ఆసలు ఒదిలేసుకున్నం. వైఎస్ ఆరోగ్యశ్రీ పెట్టి పాపకు పేనం పోసినాడు. ఇప్పుడు సిన్నది బడికి ఎల్తాంది. మూడో కలాసు సదువుతున్నాది. తోటి పిల్లలతో సంతోసంగా ఆడుకుంటున్నాది. ఆ ఆయ్య బతికున్నప్పుడే మాకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినారు. ఏమిచ్చి ఆ అయ్య రుణం తీర్సుకోగలం..’’ అని అంటున్నారు స్నేహిత తల్లిదండ్రులు.

గుండెకోత మిగిలింది..

ఈ పాప పేరు తెరిషా.. ఈమెది కూడా సీతంపేట మండలం గొయిది గ్రామమే. పీటీజీకి చెందిన నిరుపేద గిరిజన కుటుంబమే. తల్లిదండ్రులు సవర సింగయ్య, రాజమ్మ కూలీనాలీ చేసి కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. స్నేహితకు వచ్చిన కష్టమే.. వీరి పాపకూ వచ్చింది. తెరిషాకు రెండున్నరేళ్ల వయసులోనే గుండెలో రంధ్రం పడింది. ఆదుకునేందుకు ఆరోగ్యశ్రీ ఉన్నా వైఎస్ మరణానంతరం పాలకుల నిర్లక్ష్యంతో దానికే నీరసం ఆవహించింది. మూడేళ్ల క్రితం 2010లో సీతంపేటలో జరిగిన ఆరోగ్యశ్రీ వైద్య శిబిరంలో చూపించగా శస్త్రచికిత్సకు సిఫారసు చేశారు. దాంతో ఎంతో ఆశతో తల్లిదం డ్రులు తెరిషాను విశాఖ సెవెన్‌హిల్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే కుంటిసాకులతో ఆపరేషన్‌కు ఆస్పత్రి వర్గాలు నిరాకరించాయి. పాప వయసు రెండున్నరేళ్లే.. పైగా రక్తం కూడా సరిపోదు.. అంటూ తిప్పి పంపించారు. కొద్ది నెలల తర్వాత మళ్లీ తీసుకెళ్లినా అదే తిరస్కరణ ఎదురైంది. దూరాభారం, మాటిమాటికి విశాఖకు వెళ్లిరావడానికయ్యే ఖర్చులు కూడా భరించలేని స్థితిలో ఆ తల్లిదండ్రులు ఆశలు వదిలేసుకున్నారు. దేవుడి మీద భారం వేసి రోజులు గడుపుతున్నారు. ఈ విషయం కదిపితే చాలు కన్నీరుమున్నీరవుతున్నారు.

ఆరోగ్యశ్రీ ఆదుకోనేదు 
‘‘వైఎస్ ఉంటే మా కట్టం తీరేదేమో.. ఆయన దయతో మా ఊళ్లోనే ఒక పాప ఆరోగ్యం బాగుపడింది. అదే ఆశతో ఆస్పత్రికి ఎల్లినాం. కానీ వైఎస్ పోయిన తర్వాత అన్నీ మారిపోనాయి. మాబోటి వారిని ఆదరించేవారే నేరు. ఏవేవో సెప్పి రెండుసార్లు ఎనక్కి పంపేసినారు. బిడ్డ పరిస్థితి సూత్తే గుండె తరుక్కుపోతున్నాది. కల్లెదుటే నీరసంగా అయిపోతున్నాది. ఎప్పుడికప్పుడే గుండెలో నొప్పి అంటాది. ఏడుత్తాది. ఏం సేయాలో మాకు తోసదు. దాంతోపాటే ఏడుత్తాం. రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు మా ఊరి పిల్ల స్నేహితకు ఆపరేసన్ సేసినారు. ఇప్పుడు మా పాపకు రకతం లేదని సెయ్యనన్నారు. ఇదంతా మా తలరాత’’ అని విచారవదనంతో చెప్పారు సింగయ్య, రాజమ్మ.
- న్యూస్‌లైన్, సీతంపేట (శ్రీకాకుళం జిల్లా)
Share this article :

0 comments: