అది ‘మాయాహస్తం’..! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అది ‘మాయాహస్తం’..!

అది ‘మాయాహస్తం’..!

Written By news on Tuesday, April 23, 2013 | 4/23/2013

వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు బాలినేని, గడికోట ధ్వజం

సాక్షి, హైదరాబాద్: అమ్మహస్తం పథకంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రచార ఆర్భాటం చేస్తోంది తప్ప.. పథకం ఆచరణలో ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి, కోఆర్డినేటర్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. ఈ పథకం పేరును అమ్మహస్తం కాకుండా మాయాహస్తం అని మార్చుకుంటే మంచిదని వారిద్దరూ సోమవారం సంయుక్తంగా విడుదల చేసిన ఒక ప్రకటనలో సలహా ఇచ్చారు. అమ్మహస్తం పథకం కింద రూ. 185కే 9 వస్తువులు పంపిణీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. ఇప్పటి వరకూ పది శాతం మందికి కూడా లబ్ధి చేకూర్చలేదని ఆరోపించారు. ఈ పథకం సబ్సిడీ కోసం వెచ్చించాల్సిన నిధులకూ, ప్రభుత్వం కేటాయించిన నిధులకూ మధ్య భారీ వ్యత్యాసం ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2.25 కోట్ల మంది తెల్లరేషన్ కార్డుదారులుంటే వీరందరికీ రూ. 110 చొప్పున ప్రతి నెలా సబ్సిడీ ఇవ్వడానికి రూ. 247 కోట్లు అవసరమవుతాయని, ఇలా ఏడాదికి రూ. 2764 కోట్లు కావాలని, అయితే ప్రభుత్వం రూ. 685 కోట్లు కేటాయించి చేతులు దులుపుకొందని దుయ్యబట్టారు.

దీనిని బట్టి చూస్తే ఈ పథకం ప్రవేశ పెట్టింది ప్రజలను మాయ (మభ్యపెట్టడానికి) చేయడానికే అని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనేక జిల్లాల్లో ఈ పథకం మొదలే కాలేదని, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సొంతజిల్లా చిత్తూరులో సైతం ఇప్పటివరకూ 5 శాతం మంది లబ్ధిదారులకు కూడా సరుకుల పంపిణీ జరగలేదని అన్నారు. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సరుకుల్లో నాణ్యత కొరవడిందని స్వయంగా మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి ఆరోపించడాన్ని బట్టి ఈ పథకం ఏ విధంగా అమలవుతోందో తెలుస్తోందన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎం అయ్యాక నిత్యావసరాల ధరలు 500 శాతం పెరిగాయని, అది చాలదన్నట్లు కరెంటు, ఆర్టీసీ చార్జీలను పెంచేశారని, వాటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఎంతో ఆర్భాటంగా చేపట్టిన పథకమే అమ్మహస్తమని చెప్పారు. గతంలో రేషన్ షాపుల ద్వారా సరఫరా చేసే సరుకులకు కోత పెట్టి వాటి స్థానంలో మరికొన్ని చేర్చి ప్రజలకు తామెంతో మేలు చేస్తున్నామని మాయ చేస్తున్నారని, తెల్లకార్డులకు ఇచ్చే కిలో చక్కెరను ప్రస్తుతం అర కిలోకు తగ్గించారని, 4 లీటర్ల కిరోసిన్‌ను 2 లీటర్లకు తగ్గించారని, అంతేకాక రేటు కూడా పెంచారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కోతలు, ధరల పెంపుపై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా పేదల పట్ల చిత్తశుద్ధి ఉంటే 2009 ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న విధంగా బియ్యం కోటాను పెంచాలని డిమాండ్ చేశారు. అమ్మహస్తం పథకం కింద సరఫరా చేస్తున్న సరుకుల సంచుల కొనుగోలులో కూడా అనేక అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ సంచుల కొనుగోలులో కోట్ల రూపాయలు చేతులు మారాయని, దీనిపై తక్షణం దర్యాప్తు జరిపి ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Share this article :

0 comments: