రిలయన్స్ ‘భారం’ జనంపైనే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రిలయన్స్ ‘భారం’ జనంపైనే

రిలయన్స్ ‘భారం’ జనంపైనే

Written By news on Thursday, April 26, 2012 | 4/26/2012

జనంపై రూ. 1,630 కోట్ల భారం 
హైదరాబాద్, న్యూస్‌లైన్: మన రాష్ట్ర తీరంలో.. మన కృష్ణా - గోదావరి బేసిన్‌లో.. అపారమైన గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయి. ఈ గ్యాస్‌ను వెలికితీసే కాంట్రాక్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ దక్కించుకుంది. ఇక్కడి నుంచి వెలికి తీసే గ్యాస్‌లో.. మన రాష్ట్రంలోని గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లకు సరిపడా గ్యాస్‌ను సరఫరా చేయాలన్నది ఒప్పందం. కానీ.. కేజీ బేసిన్‌లో గ్యాస్ ఉత్పత్తి తగ్గిపోయిందని.. ఇస్తామని ఒప్పుకున్న ప్రకారం గ్యాస్ సరఫరా చేయలేమని.. రిలయన్స్ చేతులు దులుపుకుంది. రాష్ట్రంలోని విద్యుత్ ప్లాంట్లకు అవసరమైన గ్యాస్‌లో సగం కూడా సరఫరా చేయటం లేదు. దీంతో ఆయా విద్యుత్ ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి భారీగా పడిపోయింది. ఫలితం... మన విద్యుత్ అవసరాలను తీర్చుకునేందుకు రెట్టింపు ధర పెట్టి బయటి నుంచి విద్యుత్ కొనుగోవాల్సిన దుస్థితి. ఒక్కో యూనిట్ రూ. 1.85 ధరకే రాష్ట్రంలోని ప్లాంట్ల నుంచి విద్యుత్ సరఫరా అవుతోంటో.. బయట నుంచి యూనిట్‌కు సగటున రూ. 4.17 చొప్పున వెచ్చించాల్సి వస్తోంది. అంటే.. ఒక్కో యూనిట్‌కు అదనంగా రూ. 2.32 వ్యయం చేయాల్సి వస్తోంది. రాష్ట్రంలోని విద్యుత్ ప్లాంట్లకు రిలయన్స్ గ్యాస్ సరఫరా తగ్గించటం వల్ల ఏటా 7,028 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా తగ్గిపోయింది. ఇంత విద్యుత్‌ను బయట నుంచి కొనటానికి అదనంగా రూ. 1,630 కోట్ల భారం పడుతోంది. మరి ఈ భారాన్ని ఎవరు భరించాలి? ఇంకెవరు... పొరపాటు ఎవరిదైనా.. గ్రహపాటు మాత్రం ప్రజలదే కదా! ఆ అదనపు భారం మొత్తాన్నీ.. ఇంధన సర్దుబాటు చార్జీల పేరుతో జనం పైనే వడ్డిస్తున్నారు. అంటే.. ఇటీవల రూ. 4,500 కోట్ల మేర పెంచిన విద్యుత్ చార్జీల్లో రిలయన్స్ పుణ్యంతో పెరిగింది రూ. 1,630 కోట్లన్న మాట. ఇది ఎవరో అనామకులు కట్టిన లెక్క కాదు.. సాక్షాత్తూ విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) తేల్చిన లెక్క. అంతేకాదు.. వచ్చే ఐదేళ్ల కాలం పాటు రిలయన్స్ నుంచి గ్యాస్ సరఫరా పెరగదు.. రాష్ట్ర జనాభాపై చార్జీల భారం తగ్గదని కూడా డిస్కంలు తమ నివేదికలో స్పష్టం చేశాయి. పైగా.. ఏడాదికేడాది ఈ చార్జీల భారం పెరుగుతుందనే పేర్కొన్నాయి. అసలు రిలయన్స్ గ్యాస్ ఉత్పత్తిని, సరఫరాను తగ్గించటం వెనుక.. మున్ముందు గ్యాస్ ధరలను పెంచుకోవాలన్న వ్యూహం ఉన్నదన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. రిలయన్స్ నిర్వాకం వల్ల జనానికి ఇంత నష్టం జరుగుతున్నా.. ఆ సంస్థను ప్రశ్నించే ధైర్యం మాత్రం అటు కేంద్ర ప్రభుత్వం కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ చేయకపోవటం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో.. రిలయన్స్ వెనుక ఏ హస్తం ఉందో?! 

ఇదీ భారం లెక్క..! 

రాష్ట్రంలో గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్ల సామర్థ్యం 2,495 మెగావాట్లు. కేజీ బేసిన్‌లో రిలయన్స్ గ్యాస్ ఉత్పత్తిని తగ్గించటం వల్ల ఈ ప్లాంట్లకు కేవలం 48 శాతం ప్లాంటు లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్‌ఎఫ్)కు మాత్రమే గ్యాస్ సరఫరా అవుతోంది. ఫలితంగా ఆయా ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోయింది. మొత్తం 2,495 మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంట్లలో ఉత్పత్తి అవుతున్న విద్యుత్ కేవలం 1,197 మెగావాట్లు మాత్రమే. రిలయన్స్ గ్యాస్‌ను తగ్గించటం వల్ల ప్రతి ఏటా 7,028 మిలియన్ యూనిట్ల (ఎంయూ) విద్యుత్ లోటు ఏర్పడుతోందని డిస్కంలు అంచనా వేశాయి. వాస్తవానికి గ్యాస్ సరఫరా జరిగితే యూనిట్ విద్యుత్ కేవలం రూ. 1.85 ధరకే మనకు లభ్యమవుతుంది. గ్యాస్ సరఫరా లేకపోవటం వల్ల.. అవసరమైన విద్యుత్‌ను మార్కెట్ నుంచి యూనిట్‌కు సగటున రూ. 4.17 ధరకు కొనుగోలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) అనుమతి ఇచ్చింది. ఈ లెక్కన ఒక్కో యూనిట్‌కు అదనంగా రూ. 2.32 చొప్పున వెచ్చించాల్సి వస్తోంది. అంటే మొత్తం 7,082 ఎంయూలకు ఏటా అదనంగా రూ. 1,630 కోట్లు ఖర్చు అవుతోందని విద్యుత్ పంపిణీ సంస్థలు తేల్చాయి. ఈ అదనపు భారం మొత్తం.. విద్యుత్ చార్జీల పెంపు, ఇంధన సర్దుబాటు చార్జీల రూపంలో అంతిమంగా ప్రజలపైనే పడుతోంది. అంటే రిలయన్స్ షాక్ నేరుగా ప్రజలకే తాకుతోందన్నమాట. 

ఐదేళ్ల పాటు వెంటాడనున్న చార్జీల షాక్... 

రిలయన్స్ పాపం ఫలితం కేవలం ఒక్క ఏడాదితో తీరిపోయేది కాదు. రానున్న ఐదేళ్ల పాటు రాష్ట్ర ప్రజలను రిలయన్స్ షాక్ వెంటాడనుంది. వచ్చే ఐదేళ్ల పాటు కేజీ బేసిన్‌లో గ్యాస్ ఉత్పత్తిని పెంచే అవకాశం లేదని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వశాఖకు రిలయన్స్ తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో వచ్చే ఐదేళ్ల పాటు విద్యుత్ ప్లాంట్లకు గ్యాస్ తిప్పలు తప్పవని.. కొత్తగా గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లను నిర్మించవద్దని కూడా కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ గత నెలలో స్పష్టం చేసింది. అంటే.. రిలయన్స్ పుణ్యాన వచ్చే ఐదేళ్ల పాటు రాష్ట్రంలోని గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లలో సామర్థ్యం మేరకు విద్యుత్ ఉత్పత్తి జరిగే అవకాశం లేదు. కాబట్టి.. ఈ ఐదేళ్ల పాటూ మార్కెట్ నుంచి అదనపు ధర పెట్టి విద్యుత్ కొనుక్కోక తప్పదు. ప్రజలపై వేల కోట్ల రూపాయల భారం పడక తప్పదు. అంతేకాదు.. మార్కెట్‌లో విద్యుత్ ధర ప్రతి ఏటా పెరుగుతూనే ఉంటుంది. ఈ లెక్కన అదనపు విద్యుత్‌కు ఖర్చు చేసే మొత్తం ఏటేటా పెరుగుతూనే ఉంటుంది. అంటే.. రిలయన్స్ పాపం వల్ల రాష్ట్ర జనంపై ఈ ఏడాది రూ. 1,630 కోట్లుగా ఉన్న భారం.. ప్రతి ఏటా పెరుగుతూనే పోతుందన్నమాట. అంతేకాదు.. రాష్ట్రంలో ఇప్పుడు అమలవుతున్న విద్యుత్ కోతలన్నీ రిలయన్స్ ఖాతాలోనివే. రాబోయే రోజుల్లో ఈ కోతలు మరింత తీవ్రం కానున్నాయి.

గ్యాస్‌పై ‘మన హక్కు’కు దిక్కేదీ? 

రిలయన్స్ నిర్వాకం వల్ల పడుతున్న భారంపై డిస్కంలు రూపొందించిన ఈ నివేదికను కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖకు పంపనున్నట్టు సమాచారం. అయితే రిలయన్స్ వ్యవహారంపై నిలదీసి, రాష్ట్రానికి అన్యాయం జరగకుండా చేసేందుకు కేంద్ర పాలకులకు కానీ, రాష్ట్ర పాలకులకు కానీ ధైర్యం లేకపోవటం గమనార్హం. కేజీ బేసిన్ గ్యాస్ రాష్ట్ర హక్కు అని దివంగత నేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి నినదించారు. ఈ నినాదాన్ని ప్రస్తుత ప్రభుత్వాలు మూలన పడేశాయి. రాష్ట్ర ప్రజలపై అదనపు విద్యుత్ చార్జీల రూపంలో భారం మోపుతున్నాయి. ‘‘ఈ ఏడాది రూ. 4,500 కోట్ల మేర విద్యుత్ చార్జీలను ప్రభుత్వం పెంచింది. ఇందులో రిలయన్స్ వాటా రూ. 1,630 కోట్లు. అంటే గ్యాస్ ఉత్పత్తిని పెంచే విధంగా రిలయన్స్‌పై ఒత్తిడి తెచ్చి ఉంటే ప్రజలపై పడే భారం తగ్గేది. కానీ ప్రభుత్వం ఈ పని చేయకుండా ప్రజలపై మాత్రం భారం మోపింది’’ అని విద్యుత్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

మనకు ఇస్తోంది 6 ఎంసీఎండీల గ్యాసే... 

కేజీ బేసిన్‌లో ప్రతి ఏటా గ్యాస్ ఉత్పత్తిని పెంచుకుంటూ పోతామని మొదట్లో రిలయన్స్ పేర్కొంది. ఈ మేరకు ఏయే సంవత్సరాల్లో ఎంత మేరకు గ్యాస్‌ను ఉత్పత్తి చేస్తామనే లక్ష్యాలను కేంద్ర పెట్రోలియం మంత్రిత్వశాఖకు కూడా సమర్పించింది. రిలయన్స్ మొదట్లో చెప్పిన మేరకు 2012 నాటికి కేజీ బేసిన్‌లో రోజుకు 80 మిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాసు (ఎంసీఎండీ) ఉత్పత్తి చేయాల్సి ఉంది. కానీ.. ప్రస్తుతం రిలయన్స్ కేవలం 32 ఎంసీఎండీల గ్యాస్‌ను మాత్రమే ఉత్పత్తి చేస్తోంది. ఉత్పత్తి తగ్గిందన్న సాకుతో రాష్ట్రంలోని గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లకు గ్యాస్ సరఫరా తగ్గించి వేసింది. వాస్తవానికి ఈ ప్లాంట్లకు 10.2 ఎంసీఎండీల గ్యాస్‌ను రిలయన్స్ సరఫరా చేయాల్సి ఉంది. కానీ ప్రస్తుతం రోజుకు 32 ఎంసీఎండీల గ్యాస్‌ను ఉత్పత్తి చేస్తున్నామన్న రిలయన్స్.. రాష్ట్రంలోని విద్యుత్ ప్లాంట్లకు అందిస్తోంది కేవలం 6.1 ఎంసీఎండీల గ్యాస్ మాత్రమే. మిగతా గ్యాస్ అంతా గుజరాత్, ఉత్తరప్రదేశ్ తదితర ఉత్తరాది రాష్ట్రాలకు తరలిస్తోంది. అసలు.. గ్యాస్ ధరను పెంచుకునేందుకే రిలయన్స్ సంస్థ కేజీ బేసిన్‌లో ఉత్పత్తి తగ్గిపోయిందన్న నాటకం ఆడుతోందనే ఆరోపణలు బలంగా ఉన్నాయి కూడా. అయినప్పటికీ అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ పట్టించుకునే స్థితిలో లేవు.
Share this article :

0 comments: