వినాశకాలే విపరీత బుద్ధిః’ అన్నట్టుగా ఉంది యూపీఏ పనితీరు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వినాశకాలే విపరీత బుద్ధిః’ అన్నట్టుగా ఉంది యూపీఏ పనితీరు

వినాశకాలే విపరీత బుద్ధిః’ అన్నట్టుగా ఉంది యూపీఏ పనితీరు

Written By news on Thursday, April 26, 2012 | 4/26/2012

వినాశకాలే విపరీత బుద్ధిః’ అన్నట్టుగా ఉంది యూపీఏ పనితీరు. తన ఆమ్ ఆద్మీ నినాదం నమ్మి ఓట్లేసిన జనానికి వరసబెట్టి ఎడాపెడా ధరల వాతలు పెడుతూ వస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు డీజిల్‌పై గురిపెట్టింది. జాతి జన జీవన చక్రానికి కీలక ఆధారం అనదగ్గ డీజిల్‌పై నియంత్రణ ఎత్తేసి దాన్ని మార్కెట్ శక్తులకు వదిలిపెట్టాలని కేంద్రం చాన్నాళ్ల నుంచి తహతహలాడుతోంది. కానీ, జనం నుంచి ఎలాంటి స్పందన లభిస్తుందోనన్న భయంతో బలవంతాన అణచుకుంటోంది. ఇప్పుడు కూడా డీజిల్‌పై నియంత్రణ ఎత్తేస్తామని నిర్ద్వంద్వంగా ప్రకటించేంత సాహసం చేయలేదు. ‘మార్కెట్‌కు అనుగుణంగా డీజిల్ ధరలుండాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది’ అని జనంలోకి ఓ బాణం వదిలింది.

ఇంత కీలకమైన నిర్ణయంపై అన్ని కోణాలనుంచీ పరిశీలించి సవివరమైన ప్రకటన చేయడానికి బదులు ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం రూపంలో సరిపెట్టిన వైనం చూస్తే అర్థమయ్యేది అదే. దీనిపై ఎవరేమంటారో, ప్రజల ఆగ్రహావేశాలు ఏ స్థాయిలో ఉంటాయో చూసుకుని తాము కోరుకున్నది అమలు చేయాలన్న సంకల్పంతో పాలకులున్నారు. పెట్రో ధరలు పెంచుతున్న ప్రతిసారీ ముడి చమురు ధరలు అంతర్జాతీయ మార్కెట్‌లో భారీగా పెరుగుతున్న కారణంగానే అలా చేయకతప్పడంలేదని ఓ సంజాయిషీ ఇచ్చి చేతులు దులుపుకోవడం షరా మామూలైపోయింది.

పెంచదల్చు కున్నప్పుడల్లా తన ఆధ్వర్యంలోనే నడుస్తున్న ఇంధన సంస్థలతో ప్రకటనలు ఇప్పించడం, వాటి దూకుడును తానేదో ఆపుతున్నట్టు నటిస్తూ చివరకు సామాన్యుడి నడ్డి విరిగే నిర్ణయాలు తీసుకోవడం కేంద్రం ఈమధ్యకాలంలో అనుసరిస్తున్న బాణీ. నాలుగురోజులనాడు ఇంధన సంస్థలు చేసిన ప్రకటన అలాంటిదే. పెట్రో అమ్మకాల వల్ల రోజుకు రూ.49 కోట్ల నష్టం వస్తున్నదని, తమపై వేస్తున్న ఎక్సైజ్ సుంకాన్ని తొలగించకపోతే లీటర్ పెట్రోలును రూ.9 పెంచడానికి అనుమతించండని అవి కేంద్రాన్ని కోరాయి.

ఈలోగా డీజిల్‌పై నియంత్రణ ఎత్తేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించామని కేంద్రమంత్రి రాజ్యసభలో చల్లగా ప్రకటించి కలకలం రేపారు. పైగా ఈ సూత్రప్రాయ నిర్ణయం ఇప్పటిది కాదని, గత జూన్‌లో తీసుకున్నామని ఆయన చెప్పారు. అంటే, ధరల పెంపుపై ఒకపక్క ప్రజలు మానసికంగా సిద్ధం కావాలి... అదే సమయంలో ఆ నిర్ణయం కొత్తేదేమీ కాదు కదా అని కూడా అనుకోవాలన్నమాట. 

ధరలు పెంచిన ప్రతిసారీ అంతర్జాతీయ మార్కెట్‌వైపు వేలు చూపించే కేంద్రం... రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పెట్రో ఉత్పత్తులపై వేస్తున్న పన్నుల భారాన్ని దాచి పెడుతున్నది. ఈ రెండూ కలిసి పెట్రోలుపై 50 శాతంపైగా, డీజిల్‌పై 36 శాతం పన్నులు వేసి ప్రజల్ని నిలువుదోపిడీ చేస్తున్నాయి. మన రాష్ట్రమైతే పెట్రోలుపై 33 శాతం, డీజిల్‌పై 22.25 శాతం పన్నుల మోత మోగిస్తూ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది.

వీటికి తోడు వ్యాట్ రేటు 4 నుంచి 5 శాతానికి పెంచింది. వీటన్నిటి పర్యవసానంగా చమురు ధరలు అడ్డూ ఆపూ లేకుండా పెరుగుతున్నాయి. యూపీఏ అధికారంలోకొచ్చిన 2004లో డీజిల్ రేటు రూ.25.48 ఉండగా, అది ఇప్పుడు రూ.45కి పెరిగిపోయింది. ఇదే కాలంలో పెట్రోల్ రూ. 40 నుంచి రూ. 73కి పెరిగిపోయింది. పన్నులన్నీ పర్సంటేజీల రూపంలో ఉండటంతో ధర పెరిగినప్పుడల్లా ఠంచనుగా ఇవికూడా పెరిగిపోతున్నాయి. సంజాయిషీలతో జనాన్ని మోసగించే బదులు ఈ పన్నులను తగ్గించుకుంటే అటు చమురు సంస్థలకూ నొప్పి లేకుండా, ఇటు ప్రజలకూ భారం కాకుండా ఉంటుంది. 

కానీ, ఈ మార్గంలో ఆలోచించడానికి ప్రభుత్వాలు ససేమిరా అంటున్నాయి. చమురు సంస్థలు లక్షా 22వేల కోట్ల రూపాయల సబ్సిడీని భరిస్తున్నాయని, తాము రూ. 49,000 కోట్ల రాబడిని నష్టపోవడానికి సిద్ధపడుతున్నా ఆ సంస్థలపై ఎనలేని భారం పడుతున్నదని కేంద్రం ఆమధ్య ప్రకటించింది. అలాగైతే చమురు సంస్థలు తాజాగా కోరుతున్నట్టు ‘యాడ్ వలోరెమ్’ ఎక్సైజ్ సుంకం తొలగించడానికి కేంద్రం సిద్ధపడుతుందా? నిజానికి ఈ ఎక్సైజ్ సుంకంతోపాటు, వ్యాట్, ఆక్ట్రాయ్ వంటి పన్నులే చమురు ధరలో దాదాపు 25 శాతాన్ని ఆక్రమిస్తున్నాయి.

గత ఏడాదికి ఉన్న రూ. 52,000 కోట్ల రుణ భారం ఈ ఏడాది మార్చి 31కల్లా 80,000 కోట్లకు చేరుకుందని చమురు సంస్థలు చెబుతున్నాయి. ఈ రుణ భారం ప్రతి నెలా రూ. 4,000 -రూ. 5,000 కోట్లమధ్య పెరుగుతున్నదంటున్నాయి. పెట్రోలుకు లీటర్‌కు రూ. 8.04 చొప్పున, డీజిల్‌కు లీటర్‌కు రూ. 14.29 చొప్పున నష్టం వస్తున్నదని ఆ సంస్థలు లెక్కలు చూపిస్తున్నాయి. మరి ప్రభుత్వాలు ఏం చేయాలి? ఇప్పటికే అన్ని ధరలూ ఇబ్బడిముబ్బడిగా పెరిగి అష్టకష్టాలు పడుతున్న జనంపై మరింత భారం మోపడమా? 

నిజానికి డీజిల్ ధర 2009 ఏప్రిల్ 1నుంచి గత ఏడాది డిసెంబర్ వరకూ చూస్తే 23సార్లు సవరించారు. మొత్తంమీద చూస్తే దాని ధర లీటర్‌కు రూ. 11 పెరిగి, కేవలం రూ.1 మాత్రమే తగ్గింది. పెట్రోల్ ధర పెరిగినప్పుడు సామాన్యుడిపై పరోక్ష ప్రభావం ఉంటుందిగానీ, డీజిల్ విషయంలో అలా కాదు. 

అది మారుమూల గ్రామంలో ఉండే కుటుంబాన్ని సైతం నేరుగా తాకుతుంది. ఎందుకంటే, దేశంలో సరుకు రవాణా చాలాభాగం ట్రక్కుల ద్వారానే జరుగుతుంది. వ్యవసాయ అవసరాలన్నీ డీజిల్‌తో ముడిపడి ఉన్నాయి. అంటే, అటు నిత్యావసర సరుకుల ధరలుగానీ, ఇటు వ్యవసాయ ఉత్పత్తుల ధరలుగానీ డీజిల్ ధరపైనే ఆధారపడి ఉంటాయి. అంతేకాదు, ప్రజా రవాణా రంగమంతా డీజిల్ ఆధారంగానే కదులుతుంది.

ఒక్కసారి డీజిల్‌పై నియంత్రణ తొలగిస్తే సీసాలోంచి బయటికొచ్చిన భూతంలా ఊహించని స్థాయిలో పెను సమస్యలు చుట్టుముడతాయి. ఇప్పటికే రెండంకెలకు చేరుకున్న ద్రవ్యోల్బణం అడ్డూ ఆపూ లేకుండా పెరిగిపోతుంది. ఇన్ని ప్రమాదకర పర్యవసానాలుండే నిర్ణయాన్ని అంత అలవోకగా తీసుకోవడమంటే యూపీఏ తన మరణ శాసనాన్ని తానే లిఖించుకున్నట్టు లెక్క. ఇక దాన్ని రక్షించడం ఎవరి తరం?!
Share this article :

0 comments: