ఎన్నికల ప్రవర్తనా నియమావళి తక్షణం అమల్లోకి: భన్వర్‌లాల్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఎన్నికల ప్రవర్తనా నియమావళి తక్షణం అమల్లోకి: భన్వర్‌లాల్

ఎన్నికల ప్రవర్తనా నియమావళి తక్షణం అమల్లోకి: భన్వర్‌లాల్

Written By news on Wednesday, April 25, 2012 | 4/25/2012

కొత్త పథకాలు ప్రకటించొద్దు... టీవీలు, పత్రికల్లో ప్రభుత్వ ప్రకటనలు నిషేధం
సీఎం, మంత్రులు, ప్రజాప్రతినిధులు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనద్దు
కొత్తగా నిధుల మంజూరు ఉత్తర్వులు ఇవ్వొద్దు
ఇప్పటికే నిధులు మంజూరు చేసినప్పటికీ, పనులు ప్రారంభం కాకుంటే ఆపాల్సిందే
ఎన్నికల విధులతో సంబంధం ఉన్న అధికారులు, సిబ్బంది బదిలీలపై నిషేధం
మద్యం, డబ్బు పంపిణీని అరికడతాం
నేతలు, అభ్యర్థులు ఎక్కడా కులాలు, మతాల గురించి ప్రస్తావించకూడదు

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఉప ఎన్నికలు జరిగే పన్నెండు జిల్లాల్లో ప్రజాపథం కార్యక్రమాన్ని నిర్వహించకూడదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ స్పష్టం చేశారు. ఈ జిల్లాల్లో ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజాప్రతినిధులు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి వీల్లేదని చెప్పారు. రాష్ట్రంలోని ఒక లోక్‌సభ, 18 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించినందున తక్షణమే ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని ఆయన మంగళవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. ప్రజాపథం కార్యక్రమాన్ని అధికారులతో నిర్వహించడానికి అనుమతి కోసం ప్రభుత్వం లేఖ రాస్తే, దానిని ఎన్నికల సంఘానికి పంపిస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ‘‘ఎన్నికలు జరిగే జిల్లాల్లోని ఓటర్లను ప్రభావితం చేసే ఎలాంటి పనులూ చేపట్టడానికి వీల్లేదు. ప్రభుత్వం కొత్త పథకాలు ప్రవేశపెట్టడం, నిధుల మంజూరు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడానికి వీల్లేదు. ఒకవేళ నిధులు మంజూరు చేసినా.., పనులు ప్రారంభం కానిచోట వాటిని ప్రారంభించకూడదు. ప్రభుత్వం పథకాలను టీవీలు, పత్రికల్లో ప్రకటనల రూపంలో ఇవ్వకూడదు’’ అని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి విచక్షణాధికారం పేరిట రూ.100 కోట్లకుపైగా విడుదల చేశారని, జీవో నంబర్లు బ్లాక్ చేసి కొత్తగా అనంతపురం జిల్లాకు రూ.20 కోట్లకుపైగా విడుదల చేస్తున్నారని, ఈ నిధుల వినియోగానికి అనుమతిస్తారా అని ఓ విలేకరి ప్రశ్నించగా.. పనులు ప్రారంభించని పథకాలకు మంజూరు చేసిన నిధులను ఖర్చు చేయడానికి వీల్లేదని స్పష్టం చేశారు. వేసవిలో కొత్తగా మంచినీటి పథకాలు చేపట్టాలంటే ముందస్తు అనుమతి తీసుకోవాలన్నారు. రాష్ట్రస్థాయి నుంచి పోలింగ్ కేంద్రం స్థాయి వరకు ఎన్నికల విధులతో సంబంధం ఉన్న అధికారులు, సిబ్బందిని ఎవరినీ బదిలీ చేయడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఇప్పటి నుంచే పెయిడ్ న్యూస్, ఆర్టికల్స్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తామని చెప్పారు. ఉప ఎన్నికలకు సంబంధించిన సర్వేలను ప్రసారం చేయడం లేదా ప్రచురించడం నిషేధమని తెలిపారు. ఉప ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీని అరికట్టడానికి చర్యలు తీసుకుంటామన్నారు. మద్యం, డబ్బు పంపిణీ చేయకూడదని తాను పర్యటించిన అన్ని జిల్లాల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరానని, అందుకు వారు అంగీకరించారని చెప్పారు. గత ఉప ఎన్నికల్లో దొరికిన డబ్బుపై ఆదాయ పన్ను శాఖ విచారణ ఏ దశలో ఉందో త్వరలో సమీక్షిస్తామని అన్నారు. అదేవిధంగా రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థులు కులాలు, మతాల గురించి ఎక్కడా ప్రస్తావించకూడదని, ఇలా ప్రస్తావించడం ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధమని చెప్పారు. వచ్చేనెల 18వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందని ఆరోజు నుంచే నామినేషన్లు స్వీకరిస్తారని చెప్పారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు, నోటిఫికేషన్ జారీకి మధ్య ఇంత వ్యవధి పెట్టడానికి కారణం ఏమిటన్న ప్రశ్నకు ఆయన నేరుగా బదులివ్వకుండా అది ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయమని వివరించారు.

44 లక్షల ఓటర్లు...
రాష్ట్రంలోని ఒక లోక్‌సభ, 18 అసెంబ్లీ స్థానాల్లో జరిగే ఉప ఎన్నికల్లో 44 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోన్నట్లు భన్వర్‌లాల్ చెప్పారు. వీరిలో 21.60 లక్షల మంది పురుషులు, 22.41 లక్షల మహిళలు ఉన్నారని తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటానికి పది రోజుల ముందు వరకు కొత్తగా ఓటర్లు నమోదు చేసుకోవడానికి అనుమతినిస్తామని, వారంతా జాబితాలో చేరుతారని తెలిపారు. ఈ ఎన్నికల కోసం 5,405 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లా రిటర్నింగ్ అధికారులు కొత్త పోలింగ్ కేంద్రాలు, అనుబంధ కేంద్రాలకు ప్రతిపాదనలు పంపిస్తే, ఎన్నికల సంఘం అనుమతితో వాటని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఉప ఎన్నికల్లో అన్నిచోట్లా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలనే వినియోగిస్తామన్నారు.

వైఎస్సార్ సీపీకి కామన్ సింబల్‌పై ఈసీదే నిర్ణయం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు కామన్ సింబల్‌గా ‘ఫ్యాన్’ను కేటాయిస్తారా అని ఓ విలేకరి ప్రశ్నించగా.. దానిపై కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయిస్తుందని, ఇక్కడ నిర్ణయం తీసుకోలేమని చెప్పారు. ఎన్నికల గుర్తును ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు నిర్ణయిస్తారని అన్నారు. ఎన్నికల సంఘం కామన్ సింబల్‌కు అనుమతిస్తే.. అంతటా అదే గుర్తు కేటాయిస్తారని వివరించారు.
Share this article :

0 comments: